Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మే 05 కరెంట్‌ అఫైర్స్‌

current-affairs-telugu

Mission to Venus: శుక్రయాన్‌ మిషన్‌ను చేపట్టనున్న దేశం?

చంద్రయాన్, మంగళ్‌యాన్‌ పేరిట ఇప్పటికే చంద్రునిపైకి, మార్స్‌పైకి మిషన్లను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రోa) ఇక శుక్రయాన్‌పై దృష్టి పెట్టింది. వచ్చే రెండేళ్లలో శుక్ర గ్రహంపైకి శుక్రయాన్‌ మిషన్‌ను పంపనుంది. ఈ మిషన్‌ ద్వారా శుక్ర గ్రహ ఉపరితలంతో పాటు దాన్ని ఆవరించి ఉన్న సల్ఫ్యూరిక్‌ ఆమ్ల మేఘాలు తదితరాల గుట్టు విప్పాలని భావిస్తోంది. 2024 డిసెంబర్‌కల్లా మిషన్‌ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ మే 4న ప్రకటించారు. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం.. 

  • శుక్రుని ఉపరితలంపై చురుగ్గా ఉన్న అగ్ని పర్వతాల హాట్‌స్పాట్స్, లావా ప్రవాహాలు, అక్కడి వాతావరణం తదితరాలకు సంబంధించి మరింత సమాచారాన్ని శుక్రయాన్‌ ద్వారా రాబట్టనున్నారు.
  • ఇస్రోకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి తక్కువ సమయంలో శుక్రయాన్‌ మిషన్‌ తయారీ, ప్రయోగం సాధ్యమే
  • శుక్రయాన్‌లో వాడే సబ్‌ సర్ఫేస్‌ రాడార్‌ శుక్రుని ఉపరితలం నుంచి 100 మీటర్ల లోపలికి చొచ్చుకుపోయి పరీక్షలు జరుపుతుంది.

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
2024 డిసెంబర్‌కల్లా శుక్రయాన్‌ మిషన్‌ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఎప్పుడు : మే 04
ఎవరు    : ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌
ఎందుకు : శుక్ర గ్రహ ఉపరితలంతో పాటు దాన్ని ఆవరించి ఉన్న సల్ఫ్యూరిక్‌ ఆమ్ల మేఘాలు తదితరాల గుట్టు విప్పాలని..

India-Nordic Summit 2022: రెండో ఇండియా–నార్డిక్‌ సదస్సును ఎక్కడ నిర్వహించారు?

2nd India-Nordic Summit
కోపెన్‌హాగెన్‌లో భేటీ సంద్భంగా ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఐస్‌ల్యాండ్‌ ప్రధానులతో ప్రధాని మోదీ

డెన్మార్క్‌ రాజధాని నగరం కోపెన్‌హగెన్‌లో మే 4న రెండో ఇండియా–నార్డిక్‌ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు íఫిన్‌లాండ్‌ ప్రధాని సనా మారిన్, ఐస్‌ల్యాండ్‌ ప్రధాని కాట్రిన్‌ జాకబ్స్‌డాటిర్, స్వీడన్‌ ప్రధాని మాగ్డలినా ఆండర్సన్, నార్వే ప్రధాని జోనాస్‌ గాహ్ర్‌స్టోర్, డెన్మార్క్‌ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌లు పాల్గొన్నారు. సదస్సులో ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగతున్న సంక్షోభం, సామాన్య ప్రజల అగచాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సంస్కరణలు చేపట్టాలని కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోనూ సంస్కరణలు అవసరమన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని, అందుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నార్డిక్‌ దేశాల అధినేతలు ఉద్ఘాటించారు.

నార్డిక్‌ దేశాధినేతలతో వేర్వేరుగా సమావేశం
ప్రధాని మోదీ కోపెన్‌హగెన్‌ వేదికగా నార్వే, స్వీడన్, ఐస్‌లాండ్, ఫిన్‌ల్యాండ్‌ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్‌–ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్‌ దేశాల పెట్టుబడిదారులను ప్రధాని మోదీ ఈ సందర్భంగా కోరారు.

  • ప్రధాని మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్‌ గాహ్ర్‌స్టోర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తొలిభేటీ ఇదే కావడం విశేషం. బ్లూ ఎకానమీ, క్లీన్‌ ఎనర్జీ, స్పేస్‌ హెల్త్‌కేర్‌ తదితర కీలక అంశాలపై జోనాస్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్‌ చేశారు. భారత్‌ ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్‌ పాలసీలో నార్వే ఒక మూలస్తంభం అని కొనియాడారు.
  • స్వీడన్‌ ప్రధానమంత్రి మాగ్డలినా ఆండర్సన్, ఐస్‌ల్యాండ్‌ ప్రధానమంత్రి కాట్రిన్‌ జాకబ్స్‌డాటిర్, ఫిన్‌లాండ్‌ ప్రధానమంత్రి సనా మారిన్‌తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు దేశాల ప్రధానులతో సంతృప్తికరమైన చర్చలు జరిగినట్లు మోదీ వెల్లడించారు.

పారిస్‌లో మాక్రాన్‌తో భేటీ
ప్రధాని మోదీ మే 04న ఫ్రాన్స్‌ చేరుకున్నారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
రెండో ఇండియా–నార్డిక్‌ సదస్సు నిర్వహణ
ఎప్పుడు : మే 04
ఎవరు    : భారత ప్రధాని నరేంద్ర మోదీ, íఫిన్‌లాండ్‌ ప్రధాని సనా మారిన్, ఐస్‌ల్యాండ్‌ ప్రధాని కాట్రిన్‌ జాకబ్స్‌డాటిర్, స్వీడన్‌ ప్రధాని మాగ్డలినా ఆండర్సన్, నార్వే ప్రధాని జోనాస్‌ గాహ్ర్‌స్టోర్, డెన్మార్క్‌ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌
ఎక్కడ : కోపెన్‌హగెన్, డెన్మార్క్‌
ఎందుకు : ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతోపాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపేందుకు..​​​​​​​

Cricket: మహిళల టి20 క్రికెట్‌ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు?

Womens Criket
విన్నర్స్‌ ట్రోఫీతో సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి

దేశవాళీ మహిళల జాతీయ సీనియర్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌–2022లో ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు విజేతగా నిలిచింది. భారత స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధాన సారథ్యంలోని మహారాష్ట్ర జట్టుతో మే 04న గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఫైనల్లో స్నేహ్‌ రాణా కెప్టెన్సీలోని ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రైల్వేస్‌ జట్టు ఈ టైటిల్‌ను సాధించడం ఇది పదోసారి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది. అనంతరం రైల్వేస్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయం సాధించింది.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
దేశవాళీ మహిళల జాతీయ సీనియర్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌–2022లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : మే 04
ఎవరు    : రెల్వేస్‌ జట్టు
ఎక్కడ    : సూరత్, గుజరాత్‌
ఎందుకు : ఫైనల్లో స్నేహ్‌ రాణా కెప్టెన్సీలోని ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో భారత స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధాన సారథ్యంలోని మహారాష్ట్ర జట్టుపై విజయం సాధించినందున..

Dope Test: డోపింగ్‌ పరీక్షలో విఫలమైన భారత డిస్కస్‌ త్రోయర్‌?

Kamalpreet Kaur

భారత అగ్రశ్రేణి మహిళా డిస్కస్‌ త్రోయర్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌ డోపింగ్‌ పరీక్షలో విఫలమైంది. దాంతో అథ్లెటిక్స్‌ ఇంటెగ్రిటీ యూనిట్‌(ఏఐయూ) కమల్‌ప్రీత్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఆమెకు నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో నిషేధిత ఉత్ప్రేరకం స్టానోజొలాల్‌ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల కమల్‌ప్రీత్‌ 2021 ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో ఆరో స్థానంలో నిలిచింది. డిస్కస్‌ త్రోలో కమల్‌ప్రీత్‌ పేరిటే జాతీయ రికార్డు (65.06 మీటర్లు) ఉంది. ఏఐయూను ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌(ఐఏఏఎఫ్‌) స్థాపించింది.

స్విమ్మర్‌ అభిలాష్‌కు రజతం
కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌–2022లో హైదరాబాద్‌ స్విమ్మర్‌ చల్లగాని అభిలాష్‌ 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రజత పతకం సాధించాడు. ఈ గేమ్స్‌లో అభిలాష్‌ 4ని. 19.86 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థి అభిలాష్‌ జేఎన్‌టీయూ తరఫున పాల్గొన్నాడు.

Cricket: ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు?

Team India

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆధ్వర్యంలో 2021–2022 క్రికెట్‌ సీజన్‌ను భారత జట్టు టి20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించింది. మే 4తో 2021–2022 అంతర్జాతీయ క్రికెట్‌ సీజన్‌ కటాఫ్‌ తేదీ పూర్తయింది. గత ఏడాది కాలంలో టీమిండియా 17 టి20 మ్యాచ్‌లు ఆడి 13 విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసింది. 270 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. 265 పాయింట్లతో ఇంగ్లండ్‌ రెండో ర్యాంక్‌లో... 261 పాయింట్లతో పాకిస్తాన్‌ మూడో ర్యాంక్‌లో ఉన్నాయి.

టెస్టు ఫార్మాట్‌లో..
టెస్టు ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా 128 ర్యాంకింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 119 పాయింట్లతో భారత్‌ రెండో ర్యాంక్‌లో... 111 పాయింట్లతో న్యూజిలాండ్‌ మూడో ర్యాంక్‌లో నిలిచాయి.

వన్డే ఫార్మాట్‌లో..
వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ 125 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. 124 పాయింట్లతో ఇంగ్లండ్‌ రెండో ర్యాంక్‌లో... 107 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో ర్యాంక్‌లో... 105 పాయింట్లతో భారత్‌ నాలుగో ర్యాంక్‌లో... 104 పాయింట్లతో పాకిస్తాన్‌ ఐదో ర్యాంక్‌లో నిలిచాయి.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
2021–2022 క్రికెట్‌ సీజన్‌ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు? 
ఎప్పుడు : మే 04
ఎవరు    : భారత క్రికెట్‌ జట్టు
ఎందుకు : గత ఏడాది కాలంలో టీమిండియా 17 టి20 మ్యాచ్‌లు ఆడి 13 విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసి.. 270 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచినందున..

RBI MPC Highlights: కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును ఎంత శాతం పెంచారు?

కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పెంచింది. రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు మే 4న ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో రెపో రేటు 4 శాతం నుంచి 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్‌బీఐ పాలసీ రేటు పెంపు ఇది. ఈ ప్రభావంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఈఎంఐలు భారం కానున్నాయి. ఇక రివర్స్‌ రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా.. అంటే 3.35 శాతంగానే కొనసాగించింది.

గడచిన 11 పాలసీ సమావేశాల్లో..
కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. గడచిన 11 పాలసీ సమావేశాల్లో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్‌బీఐ కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తూ వచ్చింది.

తాజా పెంపుకు కారణం..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌సహా కమోడిటీ ధరల తీవ్రత, వ్యవస్థ నుంచి ఈజీ మనీ ఉపసంహరణలో భాగంగా అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు వంటి పలు అంశాలు ఆర్‌బీఐ తాజా నిర్ణయానికి కారణమయ్యాయి. అలాగే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితులు ఉత్పన్నం కావడం (ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలి) కూడా ఒక ప్రధాన కారణం. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో మే 2 నుంచి 4 వరకూ సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.4 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి.

అర శాతం పెరిగి 4.5 శాతానికి సీఆర్‌ఆర్‌..
రెపో రేటుతో బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని కూడా ఆర్‌బీఐ ఎంపీసీ 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. సీఆర్‌ఆర్‌ పెంపు వల్ల వ్యవస్థ నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వ్యవస్థ నుంచి వెనక్కు మళ్లుతాయన్నది అంచనా. కాగా ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) ఆర్‌బీఐ పాలసీ కమిటీ రెండవ ద్వైమాసిక ద్రవ్యపరపతి సమావేశం జూన్‌ 6వ తేదీ 8వ తేదీ మధ్య జరగనుంది.

రెపో, రివర్స్‌ రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
ఆర్‌బీఐ రెపో రేటు 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంపు
ఎప్పుడు : మే 05
ఎవరు : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌సహా కమోడిటీ ధరల తీవ్రత, రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితులు ఉత్పన్నం కావడం వంటి అంశాల కారణంగా..

RGIA: హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ హక్కులను దక్కించుకున్న సంస్థ?

Hyderabad Airport

రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమనాశ్రయం)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయ నిర్వహణ హక్కులను మరో 30 ఏళ్లపాటు జీఎంఆర్‌ గ్రూపునకు మంజూరు చేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయాన్ని ప్రకటించింది. 2008 మార్చి 23న హైదరాబాద్‌ విమానాశ్రయం ఆరంభమైంది. ఒప్పంద నిబంధనల మేరకు 2038 మార్చి 22 వరకు నిర్వహణ హక్కులు జీఎంఆర్‌ గ్రూపునకు ఉన్నాయి. తాజా నిర్ణయంతో 2068 మార్చి 22 వరకు నిర్వహణ హక్కులు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)కు లభించాయి. జీహెచ్‌ఐఏఎల్‌ అన్నది లిస్టెడ్‌ కంపెనీ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ సంస్థ.

ఫెడ్‌ రేటు అరశాతం పెంపు
ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తాజా సమీక్షలో వడ్డీ రేటును మరోసారి పెంచింది. ధరల కట్టడి లక్ష్యంగా 0.5 శాతం హెచ్చించింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 0.75–1 శాతానికి చేరాయి. గత సమీక్షలో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా 0.25 శాతమే పెంచింది.
క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమనాశ్రయం) నిర్వహణ హక్కులను దక్కించుకున్న సంస్థ?
ఎప్పుడు : మే 05
ఎవరు : జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)  
ఎక్కడ : శంషాబాద్, హైదరాబాద్‌
ఎందుకు : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు..​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 04 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

General Essay - International

​​​​​​Palm Oil Exports: పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?​​​​​​​

Palm Oil

దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న వంట నూనెల ధరలపై తీవ్ర ఆందోళనతో ఉన్న కేంద్రం ప్రభుత్వం వీటి ధరలను అందుబాటులోకి తెచ్చే మార్గాలపై అన్వేషణ చేస్తోంది. ముఖ్యంగా భారత్‌కు అతిపెద్ద పామాయిల్‌ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండోనేషియా ప్రకటించిన ఎగుమతులపై ఆకస్మిక నిషేధం ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా వంట నూనెల దిగుమతులపై విధించే సెస్‌ను తగ్గించాలని యోచిస్తోంది. మరోపక్క వంట నూనెల ప్రధాన ఎగుమతిదారులైన బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి దిగుమతులు పెంచేకునే మార్గాలను వెతుకుతోంది.

GK Important Dates Quiz: ఏటా ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని(World Thinking Day) ఏ రోజున పాటిస్తారు?

భారత్‌లో వంట నూనెల అవసరాల్లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. మొత్తంగా దిగుమతి అవుతున్న నూనెల్లో 50 శాతం పామాయిల్‌ ఉంటుండగా, దీనిలో ఇండోనేషియో వాటానే ఏకంగా 47 శాతానికి పైగా ఉంది. ఏటా ఇండోనేషియో నుంచి 8.8 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ భారత్‌కు ఎగుమతి అవుతోంది. అయితే అక్కడి ప్రభుత్వం స్థానిక మార్కెట్‌లలో ధరలను తగ్గించేందుకు వీలుగా ఏప్రిల్‌ 28 నుంచి ఎగుమతులపై నిషేధం విధించింది. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది. దీనికి తోడు ఇప్పటికే ఉక్రెయిన్‌–రష్యా యుధ్దం కారణంగా సన్‌ఫ్లవర్‌ నూనెల సరఫరా తగ్గింది. రష్యా నుంచి 60 శాతానికి పైగా సన్‌ఫ్లవర్‌ నూనె మన దేశానికి  ఎగుమతి అవుతుండగా, తూర్పు యూరప్‌లో వివాదం కారణంగా వీటి రవాణాలో వేగం తగ్గింది. యుధ్దం కొనసాగినంత కాలం నూనెల సరఫరాల్లో ఆటంకాలు తప్పేలా లేవు. ఈ కారణాల రీత్యా ఇప్పటికే గత ఫిబ్రవరిలో పామాయిల్‌ లీటర ధర రూ.120–130 వరకు ఉండగా.. అది ఇప్పుడు రూ.165–175కి చేరింది. ఈ ధర మరో 20 నుంచి 25 శాతానికి పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పామాయిల్‌ సరఫరా పెంచే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది.

Military Expenditure: మొట్టమొదటి సారిగా 2 లక్షల కోట్ల డాలర్ల గీత దాటి ఖర్చు

ఎగుమతులకు ప్రోత్సాహం..లభ్యత పెంచడం
పామాయిల్‌ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో తలెత్తిన తక్షణæ సంక్షోభాన్ని అధిగమించేలా దేశంలో తగినంత వంటనూనెల నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దేశంలో నెలకు సగటు పామాయిల్‌ వినియోగం 1–1.10 మిలియన్‌ టన్నుల మేర ఉండగా, ప్రస్తుతం దేశంలో 2.1 మిలియన్‌ టన్నుల మేర నిల్వలుండగా, మరో 1.2 మిలియన్‌ టన్నులు ఈ నెలాఖరుకు దేశానికి చేరుతాయని అంచనా వేసింది. అంటే మూడు నెలల అవసరాలకు సరిపడా నిల్వలున్నాయని అంటోంది. ఒకవేళ అప్పటికీ ఇండోనేషియా నిషేధం కొనసాగిన పక్షంలో అర్జెంటీనా, బ్రెజిల్, మలేషియా దేశాల నుంచి ఎగమతులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే వంట నూనెలపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయిల సెస్‌ను తగ్గించాలనే ఆలోచనలో ఉంది. నిజానికి గత నవంబర్‌లోనే ప్రభుత్వం పామాయిల్‌పై  సెస్‌ను 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించగా, సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ నూనెలపై 5 శాతానికి తగ్గించింది.. దీనిని మరో 5 శాతం తగ్గించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తిస్తున్న నేపథ్యంలో..  ఆకస్మిక ఎగుమతి నిషేధంపై ఇండోనేషియాతో భారత్‌ ద్వైపాక్షిక చర్చలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కీలక అధికారుల నుంచి సమాచారం అందుతోంది.​​​​​​​Gas Supply: ఏ దేశాలకు గ్యాస్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది?​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 May 2022 08:09PM

Photo Stories