Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మే 04 కరెంట్‌ అఫైర్స్‌

Current-Affairs-in-Telugu

India Ranks: వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌–2022లో భారత్‌ స్థానం?

world press freedom index

India ranks 150th in World Press Freedom Index: ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌–2022 ఎడిషన్‌ మే 3న విడుదలైంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం(వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే) సందర్భంగా విడుదలైన ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా..

  • ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడింది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి.
  • వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌–2021లో 142వ స్థానంలో ఉన్న భారత్‌ మరింత దిగజారి... వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌–2022లో 150వ స్థానానికి పడిపోయింది.
  • భారత్‌లో విధి నిర్వహణలో ఏడాదికి ముగ్గురు లేదా నలుగురు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారు.
  • ఈ సూచీలో 2016 నుంచి భారత్‌ స్థానం దిగజారుతూనే వస్తోంది.
  • భారత్‌లో లక్షకు పైగా వార్తా పత్రికలతోపాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్‌ చానళ్లు ఉన్నాయి.

వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌–2022

ర్యాంకు

దేశం

1

నార్వే

2

డెన్మార్క్

3

స్వీడెన్

4

ఎస్తోనియా

5

ఫిన్‌లాండ్‌

6

ఐర్లాండ్

7

పోర్చుగల్

8

కోస్టా రికా

9

లిథువేనియా

10

లిచెన్‌స్టెయిన్‌

24

యునైటెడ్‌ కింగ్‌డమ్‌

33

భూటాన్

42

అమెరికా

76

నేపాల్

138

యనైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌

146

శ్రీలంక

150

భారత్

156

అఫ్గనిస్తాన్

157

పాకిస్తాన్

162

బంగ్లాదేశ్

175

చైనా

176

మయన్మార్

180

ఉత్తర కొరియా

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌–2022లో 150వ స్థానం పొందిన దేశం?
ఎప్పుడు : మే 03
ఎవరు    : భారత్‌
ఎక్కడ    : ప్రపంచంలో..
ఎందుకు : దేశంలో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడినందున..

Char Dham Yatra: చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

Char Dham Yatra

ప్రసిద్ధ చార్‌ధామ్‌ యాత్ర మే 03న ఆరంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. గంగా, యమున విగ్రహాలను శీతాకాల విడుదుల నుంచి స్వస్థలాలకు తీసుకువచ్చారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి సతీసమేతంగా గంగోత్రిని సందర్శించారు. యాత్రలో భాగమైన కేదార్‌నాథ్‌ మే 6న, బద్రీనాధ్‌ మే 8న తెరుచుకుంటాయి. 2019 తర్వాత కరోనా నియంత్రణలు లేకుండా జరుగుతున్న ఈ యాత్రకు లక్షలాది భక్తులు వస్తారని అంచనా. అయితే దేవాలయాలను సందర్శించే భక్తులపై రోజువారీ పరిమితి విధించారు.

నాలుగు ఆలయాల సందర్శన..
చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్‌–నవంబర్‌ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్‌– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. ఈ నాలుగు ఆలయాలు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రసిద్ధ చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం
ఎప్పుడు : మే 03
ఎవరు    : ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం
ఎక్కడ    : ఉత్తరాఖండ్‌
ఎందుకు : చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను దర్శించేందుకు..​​​​​​​

PM Modi Europe visit: డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడెరిక్సన్‌తో ప్రధాని మోదీ ఎక్కడ సమావేశమయ్యారు?

PM Modi - Denmark PM

డెన్మార్క్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. మే 3న డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌ వేదికగా జరిగిన ఈ భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడం సహా అనేక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్‌ పర్యావరణ విధ్వంసకారి కాదని, భూ పరిరక్షణ యత్నాల్లో ముందంజలో ఉంటుందని చెప్పారు. ‘‘2070 నాటికి కర్బన ఉద్గారరహిత దేశంగా రూపొందేందుకు ప్రయత్నిస్తున్నాం. 2030 నాటికి దేశ ఇంధనావసరాల్లో 40 శాతం పునర్వినియోగ ఇంధన వనరుల ద్వారా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఫ్రెడెరిక్సన్‌కు వివరించారు. రష్యా, ఉక్రెయిన్‌ సంక్షోభానికి.. చర్చలతో తెరదించాలని వ్యాఖ్యానించారు.

రాణి మార్గరెథే 2తో సమావేశం..
ప్రధాని మోదీకి డెన్మార్క్‌లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని ఫ్రెడెరిక్సన్‌ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. డెనార్క్‌లో పర్యటించిడం ప్రధాని మోదీకి ఇదే తొలిసారి. మే 4న కూడా ఆయన డెన్మార్క్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డెన్మార్క్‌ రాణి మార్గరెథే 2తో సమావేశమవుతారు. అక్కడి భారతీయులతో కలిసి ఇండో డెన్మార్క్‌ రౌండ్‌టేబుల్‌ వ్యాపార సమావేశంలో పాల్గొంటారు. డెన్మార్క్‌లో 60కి పైగా భారత కంపెనీలున్నాయి. 16వేల దాకా ప్రవాస భారతీయులున్నారు.

ఇండో నార్డిక్‌ సమావేశం 
రెండో ఇండియా నార్డిక్‌ సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. నార్డిక్‌ దేశాలైన డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్, స్వీడన్, నార్వే ప్రధానులు ఈ సమావేశానికి హాజరవుతారు. 2018లో జరిగిన తొలి ఇండో నార్డిక్‌ సదస్సు అనంతరం పురోగతిని సమీక్షిస్తారు. ఆర్థిక రికవరీ, శీతోష్ణస్థితి మార్పు, టెక్నాలజీ, పునర్వినియోగ ఇంధన వనరులు, అంతర్జాతీయ భద్రత, ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఇండో నార్డిక్‌ సహకారం తదితరాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. నార్డిక్‌ ప్రధానులతో మోదీ విడిగా కూడా చర్చిస్తారు. నార్డిక్‌ దేశాలు, భారత్‌ మధ్య 2020–21లో 500 కోట్ల డాలర్లకు పైగా వాణిజ్యం జరిగింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     :
డెన్మార్క్‌ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌తో సమావేశం
ఎప్పుడు : మే 03
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : కోపెన్‌హాగన్, డెన్మార్క్‌
ఎందుకు : ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడం సహా అనేక అంశాలపై చర్చించేందుకు..

Weightlifting: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన క్రీడాకారిణి?

Gnaneswari Yadav, V Rithika
జ్ఞానేశ్వరి యాదవ్‌, వి.రితిక

గ్రీస్‌లోని హెరాక్లియోన్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో మే 3న భారత అమ్మాయిలు రెండు పతకాలు గెలిచారు. మహిళల 49 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్‌ రజతం... వి.రితిక కాంస్య పతకం సాధించారు. ఈ మెగా ఈవెంట్‌లో చత్తీస్‌గఢ్‌కు చెందిన 19 ఏళ్ల జ్ఞానేశ్వరి మొత్తం 156 కేజీలు (స్నాచ్‌లో 73+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 83) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. 18 ఏళ్ల రితిక 150 కేజీలు (స్నాచ్‌లో 69+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 81) బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, ఇండోనేసియాకు చెందిన విండీ కంతిక ఐసా 185 కేజీలు (స్నాచ్‌లో 83+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 102) బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

చైనా, ఉత్తర కొరియా, థాయ్‌లాండ్, రొమేనియా, బల్గేరియా తదితర దేశాలు ఈ టోర్నీకి దూరంగా ఉండగా... ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాను, రష్యాకు సహచరిస్తున్న బెలారస్‌ను ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగకుండా అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య నిషేధం విధించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     :
ప్రపంచ జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో భారత్‌కు రెండు పతకాలు
ఎప్పుడు : మే 03
ఎవరు    : జ్ఞానేశ్వరి యాదవ్‌(రజతం), వి.రితిక(కాంస్యం)
ఎక్కడ    : హెరాక్లియోన్, గ్రీస్‌
ఎందుకు : మహిళల 49 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి మొత్తం 156 కేజీలు (స్నాచ్‌లో 73+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 83) బరువెత్తి రెండో స్థానం, రితిక 150 కేజీలు (స్నాచ్‌లో 69+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 81) బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించినందున..

Cricket: మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీని ఎక్కడ నిర్వహించనున్నారు?

Women's T20 Challenge 2022

మహిళల టి20 చాలెంజ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌–2022 వేదిక మారింది. మూడు జట్లతో కూడిన ఈ టోర్నీ ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో కాకుండా మహారాష్ట్ర పుణేలో మే 23 నుంచి 28 వరకు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. కరోనా కారణంగా 2021 ఏడాది ఈ టోర్నీని నిర్వహించలేదు. గత నెలలో బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ లక్నోలో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించాడు. ఇప్పుడు ఈ టోర్నీ వేదికను లక్నో నుంచి పుణేకు మార్చారు.

మనిక బత్రా ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ మనిక బత్రా కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు చేరుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మహిళల సింగిల్స్‌లో 10 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్‌ను అందుకుంది. 2021 ఏడాది లాస్కో, బుడాపెస్ట్‌ ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ కంటెండర్‌ టోర్నీలలో మనిక సెమీఫైనల్‌ చేరుకొని కాంస్య పతకాలు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ 34వ ర్యాంక్‌లో, ఆచంట శరత్‌ కమల్‌ 37వ ర్యాంక్‌లో ఉన్నారు. హైదరాబాద్‌ ప్లేయర్‌ సూరావజ్జుల స్నేహిత్‌ 172 స్థానాలు ఎగబాకి 114వ ర్యాంక్‌లో నిలిచారు.

విండీస్‌ కొత్త కెప్టెన్‌గా పూరన్‌
వెస్టిండీస్‌ వన్డే, టి20 జట్లకు కొత్త కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ను నియమించారు. విండీస్‌ వన్డే, టి20 జట్లకు కెప్టెన్‌గా ఉన్న కీరన్‌ పొలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ఇటీవల ప్రకటించాడు. దాంతో పొలార్డ్‌ స్థానంలో పూరన్‌ను నియమించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     :
మహిళల టి20 చాలెంజ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌–2022 వేదిక మార్పు
ఎప్పుడు : మే 03
ఎవరు    : బీసీసీఐ
ఎక్కడ   : పుణే, మహారాష్ట్ర 

Exports: భారత్‌ నుంచి అత్యధిక ఎగుమతుల ఏ నెలలో నమోదయ్యాయి?

భారత్‌ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో కొత్త రికార్డు నెలకొల్పాయి. 24 శాతం పెరుగుదలతో (2021 ఇదే నెలతో పోల్చి) 38.19 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. భారత్‌ ఎగుమతులు ఒకే నెలలో ఈ స్థాయి విలువను నమోదుచేయడం ఇదే తొలిసారి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ మే 03న ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది.

భారీ వాణిజ్యలోటు..
ఇక సమీక్షా నెల్లో(2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌) దిగుమతుల విలువ కూడా 26.55 శాతం ఎగసి 58.26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 20.07 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం తొలి నెల్లో ఈ లోటు 15.29 బిలియన్‌ డాలర్లు. 

ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేతో పాటు ఎస్‌ఎల్‌పీపీ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. నూతన రాజ్యాంగ నిర్మాణానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ వేస్తామని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయినా ప్రతిపక్షం అవిశ్వాసానికే మొగ్గు చూపింది. ఎస్‌జేబీతో పాటు తమిళ పార్టీ టీఎన్‌పీ, రణిల విక్రమసింఘేకు చెందిన యూఎన్‌పీ సైతం అవిశ్వాసానికి ముందుకువచ్చాయి. ఎస్‌జేబీ తీర్మానం ఆమోదం పొందితే మహింద, ఆయన కేబినెట్‌ రాజీనామా చేయాల్సి ఉంటుంది.

Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యాధునిక క్యాన్సర్‌ ఆసుపత్రిను నిర్మించారు?

SVICCAR

అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో తిరుపతిలో నిర్మించిన ‘‘శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌(SVICCAR)’’ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక కార్పొరేట్‌ వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్‌ కేర్‌కు చిరునామాగా నిలిచే ఈ ఆసుపత్రిని రూ.190 కోట్ల వ్యయంతో 92 పడకలతో నిర్మించారు. దశలవారీగా పడకలను 300కు పెంచనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే 5వ తేదిన ఈ అత్యాధునిక క్యాన్సర్‌ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఈ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి టాటా సంస్థకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించాయి. టాటా ట్రస్టు చైర్మన్‌గా రతన్‌టాటా, అలమేలు చారిటబుల్‌ ఫౌండేషన్‌కు సీఈగా సంజయ్‌చోప్రా వ్యవహరిస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     :
శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌(SVICCAR) ఆసుపత్రి నిర్మాణం
ఎప్పుడు : మే 03
ఎవరు    : టాటా ట్రస్టు, అలమేలు చారిటబుల్‌ ఫౌండేషన్‌
ఎక్కడ    : తిరుపతి, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ప్రజలకు అత్యాధునిక కార్పొరేట్‌ వైద్య సేవలు అందించేందుకు..

Central Water Commission: దేశంలో ఏ నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం ఎక్కువ?

దేశంలో అతి పెద్ద నది గంగాపై నిర్మించిన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం కంటే కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 70.07 టీఎంసీలు అధికమని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. గంగా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తయితే అప్పుడు కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకంటే 53.29 టీఎంసీలు అధికంగా నిల్వ సామర్థ్యం ఉంటుందని పేర్కొంది. దేశంలో నదీ పరివాహక ప్రాంతాలలో(బేసిన్‌లో) ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యంపై సీడబ్ల్యూసీ ఇటీవల అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో ప్రధానాంశాలు ఇలా.. 

  • దేశంలోని అన్ని బేసిన్‌లలో పూర్తయిన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 9,104.55 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 1,651.42 టీఎంసీలు. మొత్తం ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 10,755.97 టీఎంసీలు.
  • హిమాలయ నదులకంటే ద్వీపకల్ప భారత్‌లో ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యమే 25% అధికం.
  • దేశంలో అతి పెద్ద నది అయిన గంగాపై  పూర్తయిన ప్రాజెక్టుల పూర్తి నిల్వ సామర్థ్యం 1,718.66 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 270.13 టీఎంసీలు. మొత్తం నిల్వ సామర్థ్యం 1,988.79 టీఎంసీలు.
  • దేశంలో రెండో అతిపెద్ద నది.. ద్వీపకల్పంలో అతి పెద్ద నది అయిన గోదావరిపై పూర్తయిన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 1,237.43 టీఎంసీలే.
  • దేశంలో మూడో పెద్ద నది.. కృష్ణా బేసిన్‌లో పూర్తయిన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 1,788.73 టీఎంసీలు. దేశంలో అత్యధిక నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఉన్నది కృష్ణా బేసినే. ప్రస్తుతం 146.77 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లో నిర్మాణంలో ఉన్నాయి.
  • హిమాలయ నది బ్రహ్మపుత్రపై నిర్మించిన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యంకంటే దుర్భిక్ష ప్రాంతంలోని పెన్నా నదిపై పూర్తయిన ప్రాజెక్టుల నీటి నిల్వ అధికంగా ఉంది. 

దేశంలోని ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లో జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం ఇదీ.. (టీఎంసీలలో)

 

నది పేరు

పూర్తయిన ప్రాజెక్టుల సామర్థ్యం

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం

మొత్తం

గంగా

1,718.66

270.13

1,988.79

కృష్ణా

1,788.73

146.77

1,935.50

గోదావరి

1,237.43

297.07

1,534.50

నర్మద

770.43

93.27

863.70

ఇండస్

572.91

3.54

576.45

మహానది

461.41

51.60

513.01

తాపి

322.68

55.03

377.71

కావేరి

320.77

0.53

321.30

మహి

177.18

5.30

182.48

పెన్నా

103.76

86.91

190.67

బ్రహ్మపుత్ర

60.68

28.08

88.76

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మే 03 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 May 2022 07:33PM

Photo Stories