Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మే 03 కరెంట్‌ అఫైర్స్‌

daily-current-affairs-telug

PM Modi Europe visit: జర్మనీ చాన్సలర్‌ షొల్జ్‌తో ప్రధాని మోదీ ఎక్కడ సమావేశమయ్యారు?

PM Modi - Olaf Scholz

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్‌ పర్యటన ప్రారంభమయ్యింది. ఆయన మే 2న జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌కు చేరుకున్నారు. మోదీకి జర్మనీ చాన్సలర్‌ ఒలాఫ్‌ షొల్జ్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ, షొల్జ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్‌–జర్మనీ నడుమ వ్యాపార–వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 2021 డిసెంబర్‌లో జర్మనీ చాన్సలర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన షొల్జ్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం ఇదే మొదటిసారి. వ్యూహాత్మక, స్థానిక  అంతర్జాతీయ పరిణామాలను సమీక్షించారు.

అటవీ విస్తీర్ణం పెంపుకు సహకారం..
మోదీ, షొల్జ్‌ భేటీ సందర్భంగా భారత్‌–జర్మనీ మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఆ వివరాలు ఇలా..

 • పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవటానికి సంబంధించిన సంయుక్త ప్రకటనపై భారత్, జర్మనీలు సంతకాలు చేశాయి. అటవీ విస్తీర్ణం పెంపులో సహకారానికి ఉద్దేశించిన ఈ అవగాహనపై రెండు దేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు వర్చువల్‌ విధానంలో ఆమోదం తెలిపారు. 
 • 2030 నాటికి సాధించాల్సిన పర్యావరణ లక్ష్యాల కోసం భారత్‌కు సుమారు రూ.80,430 కోట్ల(1000 కోట్ల యూరోలు) మేర సహాయాన్ని అదనంగా అందజేయనున్నట్లు జర్మనీ తెలిపింది. ఈ మొత్తాల్లో 50 శాతం నిధులను పునరుత్పాదక ఇంధనాలకు కేటాయిస్తారు.
 • వ్యవసాయ–పర్యావరణం, ప్రకృతి వనరుల సుస్థిర నిర్వహణకు సంబంధించి  సుమారు రూ.2412 కోట్ల(30 కోట్ల యూరోలు) మేర రుణాలను రాయితీతో భారత్‌కు అందించే ఒప్పందంపైనా ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

ఆరో ఐజీసీలో..

 • ప్రతినిధుల స్థాయి చర్చల్లోనూ మోదీ, షొల్జ్‌ పాల్గొన్నారు. ఈ చర్చల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా భాగస్వాములయ్యారు.
 • తర్వాత ఆరో భారత్‌–జర్మనీ ఇంటర్‌–గవర్నమెంటల్‌ కన్సల్టేషన్స్‌(ఐజీసీ)లో మోదీ, షొల్జ్‌ పాలుపంచుకున్నారు. భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్‌.జైశంకర్, అజిత్‌ దోవల్‌ సైతం హాజరయ్యారు. రెండు దేశాల మధ్య ప్రత్యేకమైన సంబంధ బాంధవ్యాలకు ఈ భేటీ నిదర్శనమని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్‌ చేసింది.
 • భారత్‌–జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆరో ఐజీసీ బలోపేతం చేస్తాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

జీ–7 సదస్సు ఏ దేశంలో జరగనుంది?
భారత్‌ ఎల్లప్పుడూ శాంతిపక్షమే వహిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంలో విజేతలెవరూ ఉండరన్నారు. యుద్ధంలో మునిగినవారికి నష్టం తప్ప లాభం ఉండదన్నారు. బెర్లిన్‌లో జర్మనీ చాన్సలర్‌ షొల్జ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. జర్మనీ వేదికగా జూన్‌ 26 నుంచి 28 వరకు జరగబోయే జీ7 సదస్సు–2022కు మోదీని ఆహ్వానించానని షొల్‌ చెప్పారు.

జర్మనీ విదేశాంగ మంత్రితో జై శంకర్‌ భేటీ
భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మే 2న బెర్లిన్‌లో జర్మనీ విదేశాంగ మంత్రి బెయిర్‌బాక్‌తో విడిగా సమావేశమయ్యారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఇండో–పసిఫిక్‌ పరిణామాలతోపాటు భారత్‌–జర్మనీ మధ్య ద్వైపాకిక్ష సహకారంపై చర్చించారు.

ప్రధాని మోదీ జర్మనీలో ఎన్నిసార్లు పర్యటించారు?
ప్రధాని మోదీకి బెర్లిన్‌లో బ్రాండెన్‌బర్గ్‌ గేట్‌ వద్ద భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. వందేమాతరం, భారత్‌ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. జర్మనీలో 2.03 లక్షల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలు ఉన్నట్లు అంచనా. నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వా త జర్మనీలో పర్యటించడం ఇది ఐదోసారి. గతంలో 2015 ఏప్రిల్, 2017 మే, 2017 జూలై, 2018 ఏప్రిల్‌లో జర్మనీలో పర్యటించారు. ప్రధాని మోదీ మే 3న డెన్మార్క్‌లో, మే 4న ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. అనంతరం భారత్‌కు చేరుకుంటారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జర్మనీ చాన్సలర్‌ ఒలాఫ్‌ షొల్జ్‌ సమావేశం
ఎప్పుడు : మే 02
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : బెర్లిన్, జర్మనీ
ఎందుకు : భారత్‌–జర్మనీ నడుమ వ్యాపార–వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు..

Centre for Monitoring Indian Economy: దేశంలో అత్యధిక నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం?

india-unemployment-rate

నిరుద్యోగిత రేటు 2022 ఏడాది ఏప్రిల్‌లో 7.83 శాతానికి పెరిగిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. దేశీయంగా డిమాండ్‌ తగ్గుదల, పెరుగుతున్న ధరలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం ఉద్యోగావకాశాలను దెబ్బతీశాయంది. ‘‘నిరుద్యోగిత హరియాణాలో అత్యధికంగా 34.5 శాతం, రాజస్తాన్‌లో 28.8 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో 2022, మార్చిలో 8.28 శాతం నుంచి ఏప్రిల్‌లో 9.222 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 7.29 శాతం నుంచి 7.18 శాతానికి తగ్గింది’’ అని తెలిపింది.

ఇంటివద్దకే రేషన్‌ సరుకుల పంపిణీ చేయనున్న రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ పొందిన ‘ఇంటివద్దకే రేషన్‌ సరుకుల పంపిణీ’ పథకాన్ని పంజాబ్‌ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మే 2న రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌ నిర్ణయం మేరకు రాష్ట్రంలో 2022, అక్టోబర్‌ 1 నుంచి గోధుమ పిండితోపాటు ఇతర సరుకులను హోం డెలివరీ చేయనున్నారు. మొబైల్‌ ఫెయిర్‌ ప్రైస్‌ షాప్స్‌(ఎంపీఎస్‌)గా పిలిచే రవాణా వాహనాల్లో రేషన్‌ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేస్తారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
హరియాణాలో అత్యధికంగా 34.5 శాతం నిరుద్యోగిత ఉంది 
ఎప్పుడు : మే 02
ఎవరు    : సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ)
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : దేశీయంగా డిమాండ్‌ తగ్గుదల, పెరుగుతున్న ధరలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం ఉద్యోగావకాశాలను దెబ్బతీయడంతో..​​​​​​​

World Championship: వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తొలి భారత ప్లేయర్‌?

Harshada Sharad Garud

గ్రీస్‌లోని హెరాక్లియోన్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో మహారాష్ట్రలోని పుణేకి చెందిన హర్షద శరద్‌ గరుడ్‌ మహిళల 45 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో పసిడి పతకం సాధించిన తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా 18 ఏళ్ల హర్షద గుర్తింపు పొందింది. ఈ ఈవెంట్‌లో స్నాచ్‌లో 70 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తిన హర్షద ఓవరాల్‌గా 153 కేజీలతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచి.. స్వర్ణం కైవసం చేసుకుంది. కాన్సు బెక్టాస్‌ (టర్కీ–150 కేజీలు) రజతం... హిన్కు లుమినిత (మాల్డోవా–149 కేజీలు) కాంస్యం నెగ్గారు. గతంలో భారత్‌ తరఫున ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి (2013 లో), జిలీ దలబెహెరా  (2018లో) కాంస్యాలు... అచింత (2021లో) రజతం సాధించారు.  హర్షద 2020 ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో స్వర్ణం, ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచ జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో స్వర్ణం నెగ్గిన తొలి భారత ప్లేయర్‌?  
ఎప్పుడు : మే 02
ఎవరు    : హర్షద శరద్‌ గరుడ్‌ 
ఎక్కడ    : హెరాక్లియోన్, గ్రీస్‌
ఎందుకు : స్నాచ్‌లో 70 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తిన హర్షద ఓవరాల్‌గా 153 కేజీలతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచినందున..

Chess: చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్న ఆటగాడు?

Viswanathan Anand
విశ్వనాథన్‌ ఆనంద్‌

భారత్‌ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక 44వ చెస్‌ ఒలింపియాడ్‌–2022లో పాల్గొనే భారత జట్లను మే 2న అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) ప్రకటించింది. ఆతిథ్య జట్టుగా వేర్వేరు విభాగాల్లో రెండేసి చొప్పున జట్లను ఆడించే వెసులుబాటు ఉండటంతో ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి 20 మందితో మొత్తం నాలుగు జట్లను ఎంపిక చేశారు. రష్యాలో యుద్ధం కారణంగా భారత్‌కు టోర్నీ వేదిక మారగా... చెన్నైలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు ఒలింపియాడ్‌ను నిర్వహిస్తారు.

మెంటార్‌గా విశ్వనాథన్‌.. 
రెండు వారాల పాటు జరిగే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ తరఫున ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తెలంగాణకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగైసి బరిలోకి దిగనున్నారు. చెస్‌ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈసారి భారత జట్టుకు ‘మెంటార్‌’ హోదాలో మార్గనిర్దేశనం చేయనున్నాడు.

భారత జట్ల వివరాలు 
ఓపెన్‌: 

భారత్‌ ‘ఎ’: పెంటేల హరికృష్ణ, శశికిరణ్, విదిత్, అర్జున్, ఎస్‌ఎల్‌ నారాయణన్‌. 
భారత్‌ ‘బి’: నిహాల్‌ సరీన్, దొమ్మరాజు గుకేశ్, ఆధిబన్, ప్రజ్ఞానంద, రౌనక్‌ సాధ్వాని.

మహిళలు: 
భారత్‌ ‘ఎ’: హంపి, హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి. 
భారత్‌ ‘బి’: పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్‌ గోమ్స్, వంతిక, దివ్య దేశ్‌ముఖ్‌.

2014 ఒలింపియాడ్‌లో భారత జట్టు కాంస్యం గెలవగా... కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన 2022 ఏడాది టోర్నీలో రష్యాతో భారత్‌ సంయుక్త విజేతగా నిలిచింది. 2021 ఏడాది టోర్నీలో మహిళల విభాగంలో భారత జట్టుకు కాంస్యం లభించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
44వ చెస్‌ ఒలింపియాడ్‌–2022లో చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్న ఆటగాడు?  
ఎప్పుడు  : మే 02
ఎవరు    : విశ్వనాథన్‌ ఆనంద్‌
ఎక్కడ    : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) నిర్ణయం మేరకు..

Adviser to PM Modi: ప్రధాని సలహాదారుగా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?

Tarun Kapoor

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మే 2న ఉత్తర్వులు జారీ చేసింది. 1987 ఐఏఎస్‌ బ్యాచ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌) అధికారి అయిన కపూర్‌.. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా 2021, నవంబరు 30న పదవీ విరమణ చేశారు. మరోవైపు 1994వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులు హరిరంజన్‌ రావు, అతీశ్‌ చంద్ర పీఎంవోలో అదనపు కార్యదర్శులుగా నియమితులయ్యారు.

పాకిస్తాన్‌కు రూ.61వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన దేశం?
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా రూ.61వేల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ బృందం ఇటీవల సౌదీ వెళ్లి జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు ‘ది న్యూస్‌’ వెల్లడించింది.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా నియామకం
ఎప్పుడు : మే 02
ఎవరు    : కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌  
ఎందుకు : కేంద్ర ప్రభుత్వ మేరకు..

Health Cloud: తొలి ఇంటిగ్రేటెడ్‌ వైద్య పరికరాల తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటైంది?

Health Cloud

వైద్య రంగం అవసరాలను తీర్చేందుకు, గ్రామీణ ప్రాంతాల ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సౌకర్యాల కొరత తీర్చేందుకు విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ (ఏఎంటీజెడ్‌)లో ‘హెల్త్‌ క్లౌడ్‌’ ఏర్పాటైంది. రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ (ఏఎంటీజెడ్‌) భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన హెల్త్‌ క్లౌడ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇన్నొవేషన్‌ హబ్‌ హెడ్‌ లూయీస్‌ అగెర్స్‌నాప్‌ మే 2న ప్రారంభించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ డివైజ్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌ ఇదే.  రైల్‌టెల్‌ సీఎండీ పునీత్‌ చావ్లా మాట్లాడుతూ.. వైద్య రంగంలో అధునాతన సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ హబ్‌ దోహదపడుతుందని చెప్పారు.

హెల్త్‌ క్లౌడ్‌ విశేషాలు..

 • వైద్య రంగం అవసరాలను తీర్చే ప్రత్యేక డేటా సెంటర్‌గా దీన్ని తీర్చిదిద్దారు.
 • అధునాతన డిజిటల్‌ వైద్య సేవలైన ఈఎంఆర్‌ఏ, రేడియాలజీ ఇమేజిం గ్‌ సర్వీసెస్, హెల్త్‌ డిజిటల్‌ డేటా ఫిడ్యుషియరీ వంటి సేవలను ఇది అభివృద్ధి చేస్తుంది. 
 • స్టార్టప్‌ కంపెనీలకు ఇంక్యుబేషన్‌ సెంటర్‌గానూ పనిచేస్తుంది. 
 • టెలి కన్సల్టేషన్‌ ద్వారా పూర్తి వైద్య సేవలతో మొబైల్‌ కంటైనర్‌ హాస్పిటల్‌ను అభివృద్ధి చేశారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని రైల్‌టెల్‌ అందించింది.
 • మొబైల్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులతో మందులను అందించే మెడికల్‌ ఏటీఏం కూడా ఇందులో ఉంది.

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ డివైజ్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌ ‘హెల్త్‌ క్లౌడ్‌ ప్రారంభం
ఎప్పుడు : మే 02
ఎవరు    : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇన్నొవేషన్‌ హబ్‌ హెడ్‌ లూయీస్‌ అగెర్స్‌నాప్‌
ఎక్కడ    : ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ (ఏఎంటీజెడ్‌), విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : వైద్య రంగం అవసరాలను తీర్చేందుకు, గ్రామీణ ప్రాంతాల ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సౌకర్యాల కొరత తీర్చేందుకు..

Telangana: రాష్ట్రంలోని ఏ జిల్లాలో రేడియంట్‌ యూనిట్‌ ఏర్పాటైంది?

KT Rama Rao, Radiant Appliances

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్‌ పరిధిలోని రావిర్యాల ఫ్యాబ్‌సిటీ (ఈ–సిటీ)లో రేడియంట్‌ అప్లియెన్సెస్‌ సంస్థ రూ.100 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ మే 2న ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రేడియంట్‌ అప్లియెన్సెస్‌ దేశంలో పెద్దఎత్తున ఎల్‌ఈడీ టీవీలను ఉత్పత్తి చేస్తోందన్నారు.

రూ.200 కోట్లతో పీ అండ్‌ జీ డిటర్జెంట్‌ యూనిట్‌ 
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో ఉన్న ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ (పీ అండ్‌ జీ) పరిశ్రమలో సుమారు రూ.200 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్విడ్‌ డిటర్జెంట్‌ యూనిట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. విద్యారంగం అభివృద్ధికి పీ అండ్‌ జీ అనుబంధ సంస్థ ‘పీ అండ్‌ జీ శిక్ష’చేస్తున్న కృషి ఎనలేనిదని మంత్రి పేర్కొన్నారు.

పార్లే ఇండియాతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి సముద్ర తీరప్రాంతాన్ని రక్షించేలా అమెరికాకు చెందిన పార్లే ఇండియాతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతంలో ఏటా ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్‌ చేయనున్నట్లు పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ ఫౌండర్‌ సైరిల్‌ గట్చ్‌ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 500 పార్లే ఎయిర్‌ స్టేషన్లు, 10 ఎకో ఇన్నోవేషన్‌ హబ్స్‌ ఏర్పాటుతోపాటు 20 వేల మంది సముద్రపు వారియర్స్‌ను నియమిస్తామని వివరించారు.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
రేడియంట్‌ అప్లియెన్సెస్‌ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ప్రారంభం
ఎప్పుడు : మే 02
ఎవరు    : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇన్నొవేషన్‌ హబ్‌ హెడ్‌ లూయీస్‌ అగెర్స్‌నాప్‌
ఎక్కడ    : రావిర్యాల ఫ్యాబ్‌సిటీ (ఈ–సిటీ), తుక్కుగూడ మున్సిపల్‌ పరిధి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఎందుకు : ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ కోసం..​​​​​​​డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌
​​​​​​​

General Essay - International

Military Expenditure: మొట్టమొదటి సారిగా 2 లక్షల కోట్ల డాలర్ల గీత దాటి ఖర్చు​​​​​​​​​​​​​​​​​​​​​

Military

‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌’ (సిప్రీ) ప్రకారం, 2021లో రెండు లక్షల నూట పదమూడు కోట్ల డాలర్లను (162 లక్షల కోట్ల రూపాయలు) మిలిటరీ కోసం ప్రపంచ దేశాలు ఖర్చు చేశాయని తేలింది.  ప్రపంచ దేశాలు మొట్టమొదటి సారిగా 2 లక్షల కోట్ల డాలర్ల గీతను దాటి  ఖర్చు చేయటం ఇదే తొలిసారి. కరోనా మహమ్మారి, మూత బడుతున్న పరిశ్రమలు, పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న ఆదాయాలు... ఇవేవీ ఈ ఖర్చుకు అడ్డుకాలేదు. ఉక్రెయిన్‌– రష్యా యుద్ధ బూచితో ఈ సంవత్సర మిలిటరీ వ్యయం 2.5 నుండి 3 లక్షల కోట్ల డాలర్లకు పెరిగినా ఆశ్యర్యం లేదు. అమెరికా, చైనా, భారత్, యూకే, రష్యా కలిసి మొత్తం ఖర్చులో 62 శాతాన్ని చేశాయి. 80,100 కోట్ల డాలర్లతో అమెరికా మొత్తం మిలిటరీ వ్యయంలో 38 శాతం వెచ్చించి బంగారు పతకాన్ని పొంది, శాంతి కబుర్లు చెప్పటం మాత్రం మానలేదు. నాటో దేశాల ఖర్చూ రాను రాను పెరుగుతోంది.

Report on Food Crises: ఆహార సంక్షోభం ముంగిట్లో..

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు ఆస్టిన్, బ్లింకెన్‌లు వచ్చి... ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగదనీ, రష్యా మొత్తం బలహీనపడేవరకూ యుద్ధం కొనసాగుతుందనీ, అప్పటివరకూ ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉంటామనీ సెలవిచ్చారు. యుద్ధం ఇప్పటికే 52 లక్షల మంది పౌరులను  శరణార్థులుగా మార్చింది. యుద్ధం వల్ల ఎంత ప్రాణ, ధన నష్టం జరిగినా వీరికి చీమైనా కుట్టదు. రష్యా వ్యవస్థల్ని ధ్వంసం చేయటం ద్వారా వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా... ఆయుధాల్ని సురక్షితంగా అమ్ముకొంటూ ఏకధృవ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది వీరిద్దరి ఆకాంక్ష. ఇప్పటి వరకూ పంపిన ఆయుధాలు చాలవన్నట్లు అమెరికా హోం శాఖ 6.5 కోట్ల డాలర్ల ఆయుధాలను పంపించటానికి ఆమోద ముద్ర వేసింది. కీవ్‌కు వచ్చిన బ్లింకెన్, ఆస్టిన్‌లు అదనంగా 32.2 కోట్ల డాలర్ల ఆయుధాలను ఇస్తామన్నారు.  అసలే చితికిపోయి ఉన్న ఉక్రెయిన్‌కు ఈ సహాయమంతా అప్పు రూపమనే విషయం అందరికీ తెలుస్తూనే ఉంది. 

Hubble Space Telescope: జోవియన్‌ గ్రహాలు అని ఏ గ్రహాలను పిలుస్తారు?

యుద్ధాలన్నా, మిలిటరీ ఖర్చులు పెంచటమన్నా ప్రపంచ ఆయుధ కర్మాగారాలకు పండుగే. పెద్దపెద్ద ఆయుధ కర్మాగారాలు 2020 సంవత్సరంలో కోవిడ్‌ను కూడా లెక్కచేయక 53,100 కోట్ల డాలర్ల ఆయుధాల వ్యాపారం చేసినట్లు సిప్రీ తెలిపింది. 2019తో పోలిస్తే ఇది సుమారు 1.3 శాతం ఎక్కువ. ఇదే సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.1 శాతం సంపదను కోల్పోయింది. ప్రపంచ అతిపెద్ద 100 ఆయుధ కర్మాగారాల్లో అమెరికాకు చెందిన 41 కంపెనీలు 54 శాతం ప్రపంచ ఆయుధ అమ్మకాలతో 28,500 కోట్ల డాలర్లు సంపాదించాయి. కనుకనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు శాంతి చర్చలకు ముందుకు వస్తున్నా... అమెరికా ఆయుధ కంపెనీల ప్రతినిధులైన బైడెన్, బ్లింకెన్, ఆస్టిన్‌లు చర్చలకు దూరమంటున్నారు. యుద్ధం ఎంతకాలం ముందుకు సాగితే, అమెరికాకు అంత లాభం. 

India-Nepal Relations: పొరపొచ్చాలు ఏర్పడినా, ఎప్పటికప్పుడు..

యుద్ధాలు, ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యానికి ఆటంకా లయితే... మానవాళికి అందాల్సిన వస్తు సేవలు అందక ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఉద్రిక్తతల నడుమ  కూడా వాణిజ్యం ఆగదని చెప్పడానికి భారత్‌–చైనా, జర్మనీ–రష్యా  సంబంధాలు చక్కటి ఉదాహరణలు. గల్వాన్‌ ఉద్రిక్తతల తర్వాత  చైనా కస్టమ్స్‌ విభాగం నివేదిక ప్రకారం... 2021–22లలో చైనాకు భారతదేశం ఎగుమతులు కొంచెం పెరిగి 2,646 కోట్ల డాలర్లకు చేరగా, చైనా నుండి మన దిగుమతులు 10,347 కోట్ల డాలర్లకు పెరి గాయి. దీనితో మన వాణిజ్య లోటు 7,700 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక్కడ ఆత్మనిర్భర భారత్‌ పని చేయలేదు. మరొక ఉదాహరణగా జర్మనీ. యథేచ్ఛగా రష్యాపై ఆంక్షలు విధిస్తూనే రష్యా నుంచి గ్యాసు, ముడి చమురు దిగుమతులను మాత్రం ఆపలేదు.  ప్రపంచ దేశాలు మిలిటరీ ఖర్చులు తగ్గించి  మానవాళి మనుగడకు కావల్సిన పరిశ్రమల్ని, విద్యాలయాలు, స్కూళ్లను, ఆసుపత్రులను నెలకొల్పడం ద్వారా ప్రపంచ ప్రధాన సమస్యల పరిష్కారాలకు కృషి చేయాలి. నూతన అలీనోద్యమ సారథిగా భారతదేశం ఈ దిశగా ప్రపంచ దేశాల్ని నడిపించటానికి చొరవ తీసుకోవాలి.

​​​​​​​Buddiga Jamindar

వ్యాసకర్త: బుడ్డిగ జమీందార్‌
అసోసియేట్‌ ప్రొఫెసర్, కేఎల్‌ యూనివర్సిటీ
మొబైల్‌: 9849491969

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 May 2022 07:58PM

Photo Stories