Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 07 కరెంట్ అఫైర్స్
India vs England: అండర్–19 క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ విజేతగా నిలిచిన జట్టు?
2022 ఐసీసీ అండర్–19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. అంటిగ్వా వేదికగా ఫిబ్రవరి 5న జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించి, టైటిల్‌ను కైవసం చేసుకుంది. టైటిల్ పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కడపటి వార్తలందేసరికి 32 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత జట్టుకు యశ్ ధుల్ సారథ్యం వహించగా, ఇంగ్లండ్ జట్టుకు టామ్ ప్రెస్ట్ నేతృత్వం వహించాడు.
కోచ్ పదవికి లాంగర్ రాజీనామా
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి జస్టిన్ లాంగర్ రాజీనామా చేశాడు. 2022, జూన్‌తో లాంగర్ నాలుగేళ్ల ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో లాంగర్‌కు మరో ఆరు నెలలు మాత్రమే పొడిగింపు ఇస్తామని సీఏ తెలిపింది. దాంతో ఆగ్రహించిన లాంగర్ వెంటనే తాను హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. లాంగర్ శిక్షణలో ఆస్ట్రేలియా గత ఏడాది తొలిసారి టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 ఐసీసీ అండర్–19 క్రికెట్ ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : భారత్
ఎక్కడ : అంటిగ్వా
ఎందుకు : ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించినందున..
Tennis: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 టోర్నమెంట్?
దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్ టాటా ఓపెన్ మహారాష్ట్రలో భారత సీనియర్ స్టార్ రోహన్ బోపన్న, యువతార రామ్‌కుమార్ రామనాథన్ మెరిశారు. వీరిద్దరు జతగా బరిలోకి దిగి టాటా ఓపెన్ డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పూణె వేదికగా ఫిబ్రవరి 6న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 6–7 (10/12), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ లూక్ సావిల్లె–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై సంచలన విజయం సాధించి, టైటిల్ కైవసం చేసుకున్నారు. బోపన్న–రామ్ జంటకు 16,370 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 12 లక్షల 22 వేలు)లభించింది. 2022 ఏడాది బోపన్న–రామ్ జోడీకిది రెండో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. 2022, జనవరి నెలలో అడిలైడ్ ఓపెన్‌లోనూ బోపన్న–రామ్ జంట విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా బోపన్న కెరీర్‌లో ఇది 21వ డబుల్స్ టైటిల్‌కాగా రామ్ ఖాతాలో ఇది రెండో డబుల్స్ టైటిల్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్ టాటా ఓపెన్ మహారాష్ట్ర డబుల్స్ విభాగంలో టైటిల్ గెలిచిన జంట?
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : రోహన్ బోపన్న, రామ్‌కుమార్ రామనాథన్ జంట
ఎక్కడ : పూణె, మహారాష్ట్ర
ఎందుకు : ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 6–7 (10/12), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ లూక్ సావిల్లె–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించినందున..
BJP Senior Leader: ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికైన తొలి వ్యక్తి?
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ‘కరెంట్ జంగన్న’గా పేరొందిన చందుపట్ల జంగారెడ్డి (87) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 5న తుదిశ్వాస విడిచారు. హనుమకొండ జిల్లా, పరకాలలో 1935 నవంబర్ 18న జన్మించిన జంగారెడ్డి.. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి ఎదుగుతూ వచ్చారు. నాన్ ముల్కీ ఉద్యమం, గోవా విముక్తి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి 1965లో జన్ సంఘ్‌లో చేరిన ఆయన 1967లో జనసంఘ్ పార్టీ అభ్యర్థిగా పరకాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఉమ్మడి వరంగల్‌లో విద్యుత్ సమస్యను పరిష్కరించి.. ‘కరెంట్ జంగన్న‘గా ప్రాచుర్యం పొందారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో 13 నెలలు జైలు జీవితం గడిపారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 లో అదే సెగ్మెంట్ నుంచి మళ్లీ గెలిచారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి బీజేపీ ఎంపీ
1984 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ రెండు సీట్లే గెలిచింది. ఆ ఎన్నికల్లో హనుమకొండ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి పీవీ నరసింహారావుపై 54,198 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థిగా జంగారెడ్డి గెలుపొందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికైన తొలి వ్యక్తిగా జంగారెడ్డి నిలిచారు. అప్పుడు బీజేపీ తరఫున గెలిచిన మరో ఏకే పాటిల్. ఈయన గుజరాత్ రాష్ట్రం మహెశన్ నుంచి పోటీ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ‘కరెంట్ జంగన్న’గా పేరొందిన వ్యక్తి కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : చందుపట్ల జంగారెడ్డి (87)
ఎక్కడ : కిమ్స్ ఆస్పత్రి, హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా..
Statue of Equality: సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ఆవిష్కరించారు?
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, ముచ్చింతల్ గ్రామ పరిధిలోని శ్రీరామనగరం(హైదరాబాద్ సమీపం)లో నిర్వహిస్తున్న శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. శ్రీరామానుజాచార్యుల స్ఫూర్తిని ప్రపంచానికి చాటేందుకు శ్రీరామనగరంలోని భద్రవేది వద్ద నిర్మించిన 216 అడుగుల సమతామూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి, లోకాంకితం చేశారు. త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాల్లో దేశంలోనే పెద్దదైన రామానుజుల విరాట్‌మూర్తి వద్దకు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సందర్శకులను అనుమతించారు.
ప్రధాని ప్రసంగం..
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘‘రామానుజాచార్యులు అద్వైత, ద్వైత సిద్ధాంతాలను సమ్మిళితం చేసి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. తన బోధనల్లో కర్మ సిద్ధాంతాన్ని ఉత్తమ రీతిలో ప్రస్తావించడంతోపాటు స్వయంగా తన పూర్తి జీవితాన్ని అందుకోసమే సమర్పించారు. అంబేడ్కర్ వంటివారు రామానుజాచార్యుల బోధనల నుంచి నేర్చుకోవాలని అనేవారు. హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఏకత్వాన్ని.. రామానుజాచార్యుల ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ సమానత్వాన్ని బోధిస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు.
రూ.వెయ్యి కోట్ల అంచనాతో..
శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్దిని పురష్కరించుకుని సమతామూర్తి రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1,100 టన్నుల బరువు ఉండే 216 అడుగుల పంచలోహ విగ్రహంతోపాటు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.వెయ్యి కోట్ల అంచనాతో స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేశారు. 2014లో ఈ పనులకు చినజీయర్ స్వామి భూమిపూజ చేశారు. నిత్యం పూజలు అందుకునే విధంగా 120 కిలోల బంగారంతో మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు. రామానుజుల సహస్రాబ్ది వేడుకలను 2022, ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సమతామూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) విగ్రహావిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ముచ్చింతల్ గ్రామం, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
ఎందుకు : శ్రీరామానుజాచార్యుల స్ఫూర్తిని ప్రపంచానికి చాటేందుకు..
50th Anniversary Celebrations: ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
హైదరాబాద్‌లోని పటాన్‌చెరు కేంద్రంగా పనిచేస్తున్న ‘మెట్టప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ఏర్పాటై యాభై ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా.. ఫిబ్రవరి 5న సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వర్ణోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, మాట్లాడారు. ఇక్రిశాట్ 50 ఏళ్లుగా భారత్‌తోపాటు ఆఫ్రికా ఖండంలోని మెట్ట ప్రాంత, చిన్న, సన్నకారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు.. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తోందని మోదీ కొనియాడారు. ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కలిసికట్టుగా కృషిచేస్తే.. దేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం కష్టమేమీ కాదన్నారు. 1972 ఏడాదిలో ఇక్రిశాట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీని డైరెక్టర్ జనరల్‌గా జాక్వెలిన్ హ్యూగ్స్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెట్టప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) స్వర్ణోత్సవాలు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పటాన్‌చెరు, హైదరాబాద్
ఎందుకు : ఇక్రిశాట్ ఏర్పాటై యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా..
Asian Football Confederation: ఆసియా కప్ మహిళల ఫుట్‌బాల్ టోర్నీ విజేత?
2022 AFC Women's Asian Cup: ఆసియా కప్ మహిళల ఫుట్‌బాల్ టోర్నీ–2022లో చైనా జట్టు విజేతగా నిలిచింది. మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్లో చైనా పీఆర్ 3–2తో దక్షిణ కొరియాను ఓడించి, టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో 2006 తర్వాత మళ్లీ చైనా ఆసియా టైటిల్‌ను గెలిచినట్లయింది. ఆసియా చాంపియన్‌గా చైనా నిలువడం ఇది తొమ్మిదోసారి కావడం విశేషం. ఈ టోర్నీ ద్వారా చైనా, కొరియా, జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ 2023 ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత పొందాయి.
ప్రపంచంలోనే పెద్ద ఇగ్లూను ఎక్కడ ఏర్పాటు చేశారు?
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని గుల్మార్గ్ పట్టణం సమీపంలోని ఇగ్లూ (మంచు) కఫే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వెడల్పున్న ఈ కఫే 40 మందికి ఆతిథ్యమివ్వగలదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇగ్లూ కఫే అని ఓనర్ సయ్యద్ వసీం షా తెలిపారు. 10 టేబుళ్లతో 40 మంది కూచునేలా.. దీన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా కప్ మహిళల ఫుట్‌బాల్ టోర్నీ–2022లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : చైనా పీఆర్
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : ఫైనల్లో చైనా 3–2తో దక్షిణ కొరియాను ఓడించినందున..
Bharat Ratna: గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేరు
గాన కోకిల, సుమధుర గాయని, భారతరత్న లతా మంగేష్కర్(92) ఇక లేరు. కరోనా వైరస్ కారణంగా ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మొదలుకుని ప్రముఖులంతా లత మృతి పట్ల ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేశారు. రెండు రోజులూ త్రివర్ణ పతాకాన్ని సగం మేర అవనతం చేసి ఉంచుతారు.
13వ ఏటనే గాయనిగా..
1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో లత జన్మించారు. వయసులోనే సంగీత సాధన మొదలు పెట్టడంతో స్కూలు చదువు అంతగా సాగలేదు. 1942లో 13వ ఏట కితీ హసాల్ అనే మరాఠీ చిత్రంలో పాడటం ద్వారా గాయనిగా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అనితరసాధ్యమైన కంఠ మాధుర్యంతో దేశదేశాల అభిమానులను ఉర్రూతలూగించారు. 80 ఏళ్ల అద్భుత కెరీర్లో హిందీలోనే గాక తెలుగు, తమిళ్, కన్నడతో పాటు ఏకంగా 36 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి అలరించారు. 2012 అక్టోబర్లో చివరి పాట పాడారు.
2001లో భారతరత్న..
దేశ చరిత్రలో అత్యుత్తమ ప్లేబ్యాకర్ సింగర్‌గా నిలిచిన లతా మంగేష్కర్‌ను అనేక అవార్డులు వరించాయి. పలు ఫిల్మ్‌ఫేర్లు, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్, పద్మవిభూషణ్, 2001లో భారతరత్న అందుకున్నారు. ఆమె అవివాహితగానే ఉన్నారు.
తొలి భారత ఆర్టిస్టు..
లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో 1974లో లత సంగీత విభావరి నిర్వహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆర్టిస్టుగా రికార్డు సృష్టించారు. ఆమెకు అదే తొలి అంతర్జాతీయ ప్రదర్శన కూడా.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గాన కోకిల, సుమధుర గాయని, భారతరత్న కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : లతా మంగేష్కర్(92)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా..
Covid-19: స్పుత్నిక్ లైట్‌కు అత్యవసర వినియోగ అనుమతి
కరోనా మహమ్మారి నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన సింగిల్–డోసు స్పుత్నిక్ లైట్ టీకాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఫిబ్రవరి 6న ప్రకటించారు. స్పుత్నిక్–5 టీకా తరహాలోనే స్పుత్నిక్ లైట్ టీకా పని చేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.
దామోదర్ హోతా ఏ కళలో ప్రసిద్ధిడు?
ప్రముఖ ఒడిస్సీ శాస్త్రీయ సంగీతకారుడు దామోదర్ హోతా(87) ఫిబ్రవరి 5న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కన్నుమూశారు. వయసు మీదపడడంతో పలు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఒడిశాలోని, పూరి నగరంలో 1935, డిసెంబర్ 25న ఆయన జన్మించారు.
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 5 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్