Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 5 కరెంట్‌ అఫైర్స్‌

M Jagadesh Kumar

University Grants Commission: యూజీసీ చైర్మన్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి?

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) చైర్మన్‌గా ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ నియమితులయ్యారు.  కమిషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ డిపి సింగ్‌ పదవీకాలం ముగియడంతో 2021, డిసెంబర్‌ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్‌ ఎంపికయ్యారు. దీంతో యూజీసీ చైర్మన్‌గా నియమితులైన  మూడో తెలుగు వ్యక్తిగా జగదీశ్‌ నిలిచారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. 1961లో డాక్టర్‌ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు జగదీశ్‌  నియమితులయ్యారు. 60 ఏళ్ల జగదీశ్‌ కుమార్‌ ప్రస్తుతం ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. యూజీసీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 

నల్లగొండ వాసి..

  • నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామానికి చెందిన జగదీశ్ కుమార్ డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్‌ డాక్టో్టరల్‌ రీసెర్చ్‌ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 
  • 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ టీచింగ్‌’ అందుకున్నారు. 
  • ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు.    
  • అనంతరం కేంద్ర ప్రభుత్వ  సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియమ్స్‌ పాలకమండలి చైర్మన్‌గా, నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) సభ్యునిగా ఉన్నారు. 
  • ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజనీరింగ్, ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, ది ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్స్‌ ఫెలో అందుకున్నారు.
  • సెమీకండక్టర్‌ డివైజ్‌ డిజైన్, మోడలింగ్‌ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్‌లాల్‌ వాధ్వా గోల్డ్‌ మెడల్‌ లభించింది. 
  • భారతదేశ ఎలక్ట్రానిక్స్‌ – సెమీకండక్టర్‌ అసోసియేషన్‌ అందించే మొట్టమొదటి ఐఎస్‌ఏ అండ్‌ వీఎస్‌ఐ టెక్నోమెంటర్‌ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) చైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి?
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు    : ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ 
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : యూజీసీ చైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ డిపి సింగ్‌ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో...

Winter Olympics 2022: స‌మ్మర్, వింటర్‌ ఒలింపిక్స్‌ రెండింటినీ నిర్వహించిన తొలి నగరం?

Winter Olympics 2022

చైనా రాజధాని నగరం బీజింగ్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌–2022 ఫిబ్రవరి 4న ప్రారంభమయ్యాయి. 2008 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నేషనల్‌ స్టేడియంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీంతో ఒలింపిక్స్, వింటర్‌ ఒలింపిక్స్‌ రెండింటినీ నిర్వహించిన తొలి నగరంగా బీజింగ్‌ ఘనత వహించింది. ఆరంభ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. భారత్‌ సహా పలు దేశాలు ‘దౌత్యపర బహిష్కరణ’ను ప్రకటించి కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. 2020లో గాల్వాన్‌ సరిహద్దుల్లో భారత్‌తో పోరులో గాయపడిన సైనికుడు ఖి ఫాబియోను రిలేలో టార్చ్‌ బేరర్‌గా పెట్టడంపై తమ అసంతృప్తిని ప్రదర్శిస్తూ భారత్‌ ‘డిప్లొమాటిక్‌ బాయ్‌కాట్‌’ను ప్రకటించింది. మానవ హక్కుల విషయంలో చైనా వ్యవహార శైలిని విమర్శిస్తూ పలు ఇతర దేశాలు కూడా ప్రారంభోత్సవానికి దూరమయ్యాయి.

ఒకే ఒక్కడు..
వింటర్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ఆరిఫ్‌ ఖాన్‌ అర్హత సాధించాడు. స్కీయింగ్‌లో స్లాలొమ్, జెయింట్‌ స్లాలొమ్‌ ఈవెంట్లలో అతను పోటీ పడుతున్నాడు. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన 31 ఏళ్ల ఆరిఫ్‌ ప్రారంభోత్సవ కార్య క్రమంలో భారత జాతీయ జెండాతో ముందుండగా ... భారత సహాయక సిబ్బందిలోని మరో ముగ్గురు కూడా ఆరిఫ్‌ వెంట నడిచారు. ఆరిఫ్‌ పాల్గొనే ఈవెంట్లు ఫిబ్రవరి 13, 16వ తేదీల్లో ఉన్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన ఈ క్రీడలు ముగియనున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
వింటర్‌ ఒలింపిక్స్‌–2022 ప్రారంభం
ఎప్పుడు  : ఫిబ్రవరి 4
ఎవరు    : చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో, ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 
ఎక్కడ    : బీజింగ్‌, చైనా

Innovation Centre: ఐఐటీ హైదరాబాద్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?

IIT H - Suzuki

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌(ఐఐటీ హైదరాబాద్‌)లో సుజుకీ ఇన్నోవేషన్‌ కేంద్రం ఏర్పాటు కానుంది. టెక్నాలజీ రిసెర్చ్‌ పార్క్‌లో దీనిని అందుబాటులోకి తెస్తారు. ఈ మేరకు సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్‌ఎమ్‌సీ), ఐఐటీ హైదరాబాద్‌ మధ్య మూడేళ్ల ఒప్పందం కుదిరింది. భారత్, జపాన్‌ మార్కెట్‌ కోసం ఆవిష్కరణలపై ఈ కేంద్రం దృష్టిసారిస్తుంది.

6.57 శాతంగా దేశ నిరుద్యోగ..
దేశంలో నిరుద్యోగ సమస్య క్రమంగా తగ్గుతోంది. 2022, జనవరిలో ఈ సమస్య 6.57 శాతంగా ఉంది. 2021 మార్చి తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ఈ విషయాన్ని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. ఒమిక్రాన్‌ కేసులు తగ్గుముఖం పట్టడం, నిబంధనలు సడలించడంతో మార్కెట్‌ తిరిగి పుంజుకుందని పేర్కొంది. సీఎంఐఈ తెలిపిన వివరాల ప్రకారం..

  • 2022, జనవరిలో నిరుద్యోగిత రేటు భారత్‌ పట్టణ ప్రాంతంలో 8.16 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 5.84 శాతంగా ఉంది. 
  • 2021, డిసెంబర్‌లో నిరుద్యోగ సమస్య 7.91 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో 9.30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 7.28 శాతంగా ఉంది. 
  • 2021 డిసెంబర్‌ నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 5.3 కోట్లుగా అంచనా.

సుహానా సైనీ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) యూత్‌ కంటెండర్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి సుహానా సైనీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్‌లో జనవరి 4న జరిగిన అండర్‌–19 బాలికల సింగిల్స్‌ సెమీఫైనల్లో సుహానా 11–9, 9–11, 10–12, 11–13తో ప్రపంచ నంబర్‌వన్‌ ఎలీనా జహారియా (రొమేనియా) చేతిలో ఓడింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌(ఐఐటీ హైదరాబాద్‌)తో ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు    : సుజుకీ మోటార్ కార్పొరేషన్
ఎందుకు : ఐఐటీ హైదరాబాద్‌లో సుజుకీ ఇన్నోవేషన్‌ కేంద్రం ఏర్పాటు కోసం..

ISRO: పీఎస్‌ఎల్‌వీ సీ–52 ద్వారా ఏ ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2022, ఏడాది ప్రథమార్థంలో పీఎస్‌ఎల్‌వీ సీ–52 ప్రయోగానికి, ద్వితీయార్థంలో చంద్రయాన్‌–3 ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. 2022, ఏడాదిలో 7 రాకెట్‌ ప్రయోగాలు చేయాలని, చంద్రయాన్‌–3, గగన్‌యాన్‌–1 ప్రయోగాలకు సంబంధించి 4 రాకెట్లను ప్రయోగాత్మకంగా చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. 2022 ఏడాది.. జనవరి 20, ఫిబ్రవరి 4న చేయాలనుకున్న పీఎస్‌ఎల్‌వీ సీ–52 ప్రయోగాన్ని.. 2022, ఫిబ్రవరి 14న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగంలో ఆర్‌ఐశాట్‌–1ఏ, ఐఎన్‌ఎస్‌–2డీ అనే 2 ఉపగ్రహాలను రోదసిలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
చంద్రయాన్‌–2లో నేర్చుకున్న పాఠాలు జాతీయస్థాయి నిపుణుల సూచనల ఆధారంగా చంద్రయాన్‌–3 ప్రాజెక్టుకు ఇస్రో సిద్ధమవుతోంది. చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు ఉద్దేశించిన చంద్రయాన్‌–2 ప్రయోగంలో ల్యాండర్, రోవర్‌ దించే ప్రయత్నంలో భాగంగా ఆఖరి 2 నిమిషాల్లో ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలాన్ని గుద్దుకుని విఫలమైన విషయం తెలిసిందే. అందుకే ఈసారి ల్యాండర్, రోవర్‌ను చంద్రయాన్‌–3 ప్రయోగంలో మరోమారు పంపించే ఏర్పాట్లను శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఇప్పటికే ల్యాండర్‌లకు సంబంధించి హార్డ్‌వేర్‌ రూపకల్పన పూర్తయిందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ బెంగళూరులో ప్రకటించారు.  చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని 2022, ఆగస్టులో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, ఫిబ్రవరి 14న, పీఎస్‌ఎల్‌వీ సీ–52 ప్రయోగం నిర్వహించేందుకు సన్నాహాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు    : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)  
ఎందుకు : ఆర్‌ఐశాట్‌–1ఏ, ఐఎన్‌ఎస్‌–2డీ అనే 2 ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు.. 

Attempt to Murder: జెడ్‌ కేటగిరీ భద్రతను తిరస్కరించిన నేత?

Asaduddin Owaisi

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్-ఏఐఎంఐఎం) (All India Majlis-E-Ittehadul Muslimeen-AIMIM) పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, జనవరి 3న ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్‌–ఘజియాబాద్‌ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. తనను లక్ష్యంగా చేసుకొని సాగించిన కాల్పుల ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్‌ ఒవైసీపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి వద్ద నుంచి పిస్తోల్‌ స్వాధీనం చేసుకున్నామని ఉత్తరప్రదేశ్‌ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు.

జెడ్‌ కేటగిరీ భద్రత వద్దు: ఒవైసీ
యూపీ కాల్పుల నేపథ్యంలో అసదుద్దీన్‌ ఒవైసీకి జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా ఆయన దాన్ని తిరస్కరించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జనవరి 4న లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  ‘‘నాకు జెడ్‌ కేటగిరీ రక్షణ వద్దు. ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నాకు నచ్చదు’’ అని పేర్కొన్నారు.  

జెడ్‌ కేటగిరీ అంటే...

  • ప్రధానికి రక్షణ కల్పించే ఎస్‌పీజీని పక్కన పెడితే జెడ్‌ ప్లస్‌ తర్వాత మన దేశంలో రెండో అత్యున్నత స్థాయి భద్రత జెడ్‌ కేటగిరీ 
  • అధిక ముప్పున్న నాయకులు, ప్రముఖులకు కేంద్రం ఈ భద్రత కల్పిస్తుంది 
  • సీఆర్పీఎఫ్‌ కమాండోలు 24 గంటల పాటూ రక్షణగా ఉంటారు 
  • 16 నుంచి 22 మంది షిఫ్టుల్లో పని చేస్తారు 
  • రోడ్డు ప్రయాణాల్లో ఒక ఎస్కార్ట్, మరో పైలట్‌ వాహనం సమకూరుస్తారు 
  • ఈ భద్రతకు నెలకు రూ.16 లక్షలకు పైగా ఖర్చవుతుంది

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జెడ్‌ కేటగిరీ భద్రతను తిరస్కరించిన నేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు    : ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ 
ఎందుకు : ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నచ్చదని..

Stefan Hartung: భారత్‌లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ?

BOSCH

ఆటోమోటివ్‌ రంగంలో అత్యాధునిక టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో  భారత్‌లో రానున్న ఐదేళ్లలో రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అంతర్జాతీయ తయారీ కంపెనీ రాబర్ట్ బాష్ జీఎంబీహెచ్(బాష్‌) చైర్మన్‌ డాక్టర్‌ స్టెఫాన్‌ హటుంగ్‌ తెలిపారు.  డిజిటల్‌ మొబిలిటీ రంగంలో పెట్టే రూ.వెయ్యికోట్లకు ఇది అదనమని ఆయన అన్నారు.  భారత్‌లో బాష్‌ సంస్థ ఏర్పాటై వందేళ్లు అయిన సందర్భంగా ఫిబ్రవరి 3న ఏర్పాటైన వర్చువల్‌ విలేకరుల సమావేశాన్ని ఉద్ధేశించి హటుంగ్‌ ఈ మేరకు మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్ల కార్ల సర్వీసింగ్‌ కోసం బాష్‌ మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని 2025 నాటికల్లా కనీసం వెయ్యి కొత్త సర్వీస్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయని ఆయన చెప్పారు. 1886, నవంబర్ 15న రాబర్ట్‌ బాష్‌ స్థాపించిన బాష్ కంపెనీ.. ప్రధాన కార్యాలయం జర్మనీలోని గెర్లింగన్ పట్టణంలో ఉంది. 1922లో కోల్‌కతా నగరం నుంచి భారత్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.

టాప్స్‌ కోర్‌ గ్రూప్‌లో చోటు దక్కించుకున్న టెన్నిస్‌ క్రీడాకారిణి?
టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌) కోర్‌ గ్రూప్‌లో సీనియర్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పేరును కూడా చేర్చారు. ఈ సీజన్‌ తర్వాత రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించిన సానియా... ఒలింపిక్స్‌ సన్నాహక అథ్లెట్లలో లేకున్నా కూడా 2022 ఏడాది ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకొని ఆమెకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో రోహన్న బోపన్న, రామ్‌కుమార్‌ రామనాథన్, అంకితా రైనాలకు కూడా చోటు దక్కింది.

రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది?
రంజీ ట్రోఫీ-2022 నిర్వహణకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఈ మేరకు జనవరి 3న షెడ్యూల్‌ను విడుదల చేసింది. ట్రోఫీలో భాగంగా 38 టీమ్‌లు పాల్గొంటుండగా, మొత్తం 57 మ్యాచ్‌లు జరుగుతాయి.  ఫిబ్రవరి 10నుంచి మార్చి 15 వరకు లీగ్‌ దశ పోటీలు జరుగుతాయి. అనంతరం ఐపీఎల్‌ ముగిసిన తర్వాత మే 30నుంచి జూన్‌ 26 మధ్య 7 నాకౌట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మొత్తం 62 రోజుల వ్యవధిలో 64 రంజీ మ్యాచ్‌లు జరిపేందుకు బోర్డు సన్నద్ధమైంది. రాజ్‌కోట్, కటక్, చెన్నై, అహ్మదాబాద్, త్రివేండ్రం, ఢిల్లీ, హరియాణా, గువహటి, కోల్‌కతాలను టోర్నీ వేదికలుగా ఖరారు చేశారు. కరోనా వ్యాప్తితో వరుసగా గత రెండేళ్లుగా టోర్నీ జరగలేదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రానున్న ఐదేళ్లలో రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ?
ఎప్పుడు  : ఫిబ్రవరి 3
ఎవరు    : అంతర్జాతీయ తయారీ కంపెనీ రాబర్ట్ బాష్ జీఎంబీహెచ్(బాష్‌)
ఎక్కడ    : భారత్
ఎందుకు : ఆటోమోటివ్‌ రంగంలో అత్యాధునిక టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో...

T20 World Cup: స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డుకు ఎంపికైన క్రికెటర్?

Daryl Mitchell

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌-2021’ అవార్డు న్యూజిలాండ్‌ ఆటగాడు డరైల్‌ మిచెల్‌కు లభించింది. 2021 టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో అతను కనబర్చిన క్రీడాస్ఫూర్తికి ఐసీసీ గుర్తింపునిచ్చింది. నాటి మ్యాచ్‌లో రషీద్‌ వేసిన 18వ ఓవర్‌ తొలి బంతిని నీషమ్‌ ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. సునాయాసంగా పరుగు వచ్చే అవకాశం ఉన్నా... నాన్‌ స్ట్రైకర్‌ డరైల్‌ మిచెల్‌ దానిని తిరస్కరించాడు. తాను బౌలర్‌ కు అడ్డుగా రావడం వల్లే రషీద్‌ దానిని రిటర్న్‌ లో సరిగా అందుకోలేకపోయాడని... అందుకే సింగిల్‌కు అవకాశం ఏర్పడిందని మిచెల్‌ భావించాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ పరుగు తీయడానికి నిరాకరించాడు.

తొలి భారత ఆటగాడు..
ఒలింపిక్‌ చాంపియన్, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ప్రతిష్టాత్మక ‘లారెస్‌’ అవార్డు కోసం పోటీ పడుతున్నాడు. 2021 ఏడాది అద్భుత ప్రదర్శనతో క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నీరజ్‌కు ‘వరల్డ్‌ బ్రేక్‌త్రూ ఆఫ్‌ ద ఇయర్‌’ కేటగిరీలో నామినేషన్‌ లభించింది. ఈ కేటగిరీలో తుది జాబితాకు నామినేట్‌ అయిన తొలి భారత ఆటగాడిగా నీరజ్‌ నిలిచాడు. టెన్నిస్‌ స్టార్లు డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా), ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌) తదితర మేటి క్రీడాకారులతో నీరజ్‌ తలపడుతున్నాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అవార్డుకు ఎంపికైన క్రికెటర్?
ఎప్పుడు  : ఫిబ్రవరి 2
ఎవరు    : న్యూజిలాండ్‌ ఆటగాడు డరైల్‌ మిచెల్‌ 
ఎందుకు : 2021 టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో మిచెల్‌.. అర్బుత క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందున..

Supreme Court Collegium: ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఎవరు ఉన్నారు?

Telangana Highcourt 650x400

తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులను నియమించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఫిబ్రవరి 1న కొలీజియం సమావేశమై ఈ మేరకు చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. న్యాయవాదులు కాసోజు సురేందర్, చాడ విజయభాస్కరరెడ్డి, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌.. జ్యుడీషియల్‌ అధికారులు జి.అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్‌రెడ్డి, డి.నాగార్జునలను తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది.  ప్రస్తుతం హైకోర్టులో ఆరుగురు మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తుండగా..  తాజా ఇద్దరు న్యాయవాదులు, మరో ఇద్దరు జిల్లా జడ్జిలకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన నేపథ్యంలో త్వరలో మహిళా జడ్జిల సంఖ్య 10కి చేరుకోనుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ఉన్నారు.

చాడ విజయభాస్కర్‌రెడ్డి..
1968, జూన్‌ 28న ఉమ్మడి మెదక్‌ జిల్లా దుబ్బాకలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1992, డిసెంబర్‌ 31న బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. జస్టిస్‌ వీవీఎస్‌ రావు దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1999లో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ), స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2006–09 మధ్య కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. 2010–15 మధ్య వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. 2014 నుంచి ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. 

సూరేపల్లి నంద..
1969, ఏప్రిల్‌ 4న జన్మించారు. 1993లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. 28 ఏళ్లుగా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు బార్‌ కౌన్సిల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందిస్తున్నారు. 1995–2001 వరకు స్టేట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ప్యానల్‌ అడ్వొకేట్‌గా, 2001–04 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సేవలందించారు. 2005–2016 హైకోర్టు లీగల్‌ సర్వీస్‌ కమిటీ మెంబర్‌గా సేవలు అందించారు. న్యాయవాదిని పెట్టుకోలేని కక్షిదారులకు న్యాయ సహాయం అందించడంపై పలు జిల్లాల్లో న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. 

జువ్వాడి శ్రీదేవి..
1972, ఆగస్టు 10న జన్మించారు. 1997లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 2004–08 వరకు నిర్మల్‌ జిల్లా కోర్టు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014–17 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా, 2018 నుంచి ఇప్పటి వరకు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తున్నారు.  

ముమ్మినేని సుధీర్‌కుమార్‌..
1969, మే 20న ఖమ్మం జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1994లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాది ఎంఆర్‌కే చౌదరి దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీసు కొనసాగిస్తున్నారు. 

కాసోజు సురేందర్‌...
1968లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించారు. 1992లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ పి.సీతాపతి వద్ద జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. 2005–2008 వరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు. హైకోర్టులో 2010 నుంచి ఇప్పటివరకు సీబీఐ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సేవలు అందిస్తున్నారు. 

మిర్జా సఫియుల్లాబేగ్‌..
మహబూబాబాద్‌లో జన్మించారు. 2002లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాది, తాత కేఎఫ్‌ బాబా దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. తర్వాత తండ్రి న్యాయవాది మిర్జా ఇమాముల్లా బేగ్, న్యాయవాది ఈ.ఉమామహేశ్వర్‌రావుల వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. 2014 నుంచి తెలంగాణ వక్ప్‌బోర్డు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందిస్తున్నారు. 

ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌..
1967, ఆగస్టు 18న జన్మించారు. 2005లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. రావ్‌ అండ్‌ కంపెనీ లాయర్స్‌ ఆఫీస్‌లో జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. ఈయన దివంగత పీవీ నర్సింహారావు మనమడు. 

జి.అనుపమ చక్రవర్తి...
1970లో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జన్మించారు. 1994లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం వ్యాట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

మాటూరి గిరిజ ప్రియదర్శిని..
1964, ఆగస్టు 30న విశాఖపట్నంలో జన్మించారు. 1995లో బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకొని విశాఖపట్నం జిల్లా కోర్టులో ఏడేళ్లు న్యాయవాదిగా పనిచేశారు. 2008లో జిల్లా జడ్జి పరీక్షలో ఎంపికై గుంటూరులో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.

సాంబశివరావు నాయుడు..
1962, ఆగస్టు 1న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారు. న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యి 1986లో ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ పిల్లా జానకి రామయ్య దగ్గర జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. 1991లో డిస్ట్రిక్ట్‌ మున్సిఫ్‌గా ఎంపికయ్యారు. తర్వాత సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఏసీబీ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. 

అలుగు సంతోష్‌రెడ్డి...
జగిత్యాల జిల్లా జొగన్‌పల్లిలో జన్మించారు. 1985లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. కరీంనగర్‌ జిల్లాలో ప్రాక్టీస్‌ చేశారు. 1991లో డిస్ట్రిక్‌ మున్సిఫ్‌గా ఎంపికయ్యారు. 2004లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. 2010లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి.. రాష్ట్ర విభజన తర్వాత 2017 వరకు కొనసాగారు. 2019లో తిరిగి న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులై విధులు నిర్వహిస్తున్నారు. 

డాక్టర్‌ డి.నాగార్జున..
వనపర్తి జిల్లాలో 1962, ఆగస్టు 15న జన్మించారు. 1986లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకొని వనపర్తి, మహబూబ్‌నగర్‌ కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. 1991లో డిస్ట్రిక్ట్‌ మున్సిఫ్‌గా ఎంపికయ్యారు. 2010లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2022–23

Economic Survey Highlights: భారత ఆర్థిక సర్వే : 2021–22

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Feb 2022 10:36PM

Photo Stories