Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 06 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Apr-6

Telangana: విప్రో లైటింగ్‌ పరిశ్రమను ఏ జిల్లాలో ప్రారంభించారు?

Wipro at HYD

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలోని ఎలక్ట్రానిక్‌ పార్కులో విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ పరిశ్రమ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 5న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా రెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఈ పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల పెట్టుబడితో విప్రో కంపెనీ పరిశ్రమను స్థాపించిందని చెప్పారు. కార్యక్రమంలో విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ పాల్గొన్నారు.

జీనోమ్‌ వ్యాలీలో ‘జాంప్‌ ఫార్మా’
సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం కర్కపట్లలోని జీనోమ్‌ వ్యాలీలో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జాంప్‌ ఫార్మాను కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాంప్‌ ఫార్మా గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ చైర్మన్‌ సుకంద్‌ జునేజా మాట్లాడుతూ.. కెనడా తర్వాత జీనోమ్‌ వ్యాలీలోనే అతిపెద్ద జాంప్‌ ఫార్మాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ పరిశ్రమ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 05
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ    : ఎలక్ట్రానిక్‌ పార్కు, కేసీ తండా, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

United Nations: ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి ప్రసంగించిన నేత?

Volodymyr Zelenskyy - UN

రష్యా సైన్యం తమ దేశంలో అత్యంత హేయమైన యుద్ధనేరాలకు పాల్పడిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లొదిమిర్‌ జెలెన్‌స్కీ ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఉద్దేశించి ఏప్రిల్‌ 5న ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. బుచాలో రష్యా దళాలు చేయని నేరం లేదని, దీనిపై విచారణ జరపాలని, ఇంతటి ఘోరాలకు ఆదేశాలిచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. బుచాలో రక్తమోడుతూ, కాలి బుగ్గిగా మారి కన్పించిన శవాల కుప్పలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు.

తీవ్రంగా ఖండిస్తున్నాం: భారత్‌
ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో పౌరులపై జరిగిన దారుణ హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారత్‌ ప్రకటించింది. దీనిపై అంతర్జాతీయ విచారణ జరగాలన్న డిమాండ్‌కు మద్దతు తెలిపింది. దౌత్యమే సమస్యకు పరిష్కారమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి పునరుద్ఘాటించారు.

బ్లింకెన్‌తో జై శంకర్‌ చర్చలు
ఉక్రెయిన్‌ పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఏప్రిల్‌ 5న ఫోన్‌ చర్చలు జరిపారు. పలు ద్వైపాక్షిక అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపారు.

Ministry of Finance: స్టాండప్‌ ఇండియా స్కీమ్‌ ప్రధాన ఉద్దేశం?

Stand Up India

క్షేత్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు, మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన కోసం ఉద్దేశించిన ‘‘స్టాండప్‌ ఇండియా స్కీమ్‌’’ కింద గత ఆరేళ్లలో రూ. 30,160 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఇప్పటిదాకా 1,33,995 ఖాతాదారులకు ఈ లోన్‌లు ఇచ్చినట్లు పథకం ప్రారంభించి ఆరేళ్లయిన సందర్భంగా ఏప్రిల్‌ 6న కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 1 లక్ష మందిపైగా మహిళా ప్రమోటర్లు ఈ స్కీముతో ప్రయోజనం పొందినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్‌టీ వర్గాలు, మహిళలు రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి వరకూ బ్యాంక్‌ రుణాలు పొందేందుకు స్టాండప్‌ ఇండియా స్కీమ్‌ ఉపయోగపడుతుంది. 2016, ఏప్రిల్‌ 5న ఈ పథకాన్ని ప్రారంభించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
‘‘స్టాండప్‌ ఇండియా స్కీమ్‌’’ కింద గత ఆరేళ్లలో రూ. 30,160 కోట్ల రుణాలు మంజూరయ్యాయి
ఎప్పుడు : ఏప్రిల్‌ 05
ఎవరు    : కేంద్ర ఆర్థిక శాఖ
ఎక్కడ    : దేశ వ్యాప్తంగా..
ఎందుకు : క్షేత్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు, మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన కోసం..

AP New Districts: రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన జిల్లాలు?

Rayalaseema - Sea

పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 13 నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కారమయ్యింది. నూతన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ వివరాలివీ..

రాయలసీమకు సముద్రం 

 • ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే తీర ప్రాంతం పరిమితం కాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు కూడా ఆ అవకాశం దక్కింది.
 • తాజాగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎనిమిది అవుతున్నాయి. ఇందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు.
 • సూళ్లూరుపేటతో పాటు సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది. 
 • మరోవైపు ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా నిలుస్తోంది.

రెండు గిరిజన జిల్లాల ఏర్పాటు

 • ఇప్పటిదాకా రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జిల్లాలు లేవు. జిల్లాల పునర్విభజన తర్వాత గిరిజనుల కోసం రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు.
 • పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్‌లో మన్యం జిల్లాగా ప్రకటించగా స్థానికుల వినతిమేరకు పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చారు. – విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలుండగా వీటికోసం సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీలు (ఐటీడీఏ) ఏర్పాటయ్యాయి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గిరిజనుల కోసం ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్‌ 05
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ    : ఆంధ్రప్రదేశ్‌ 
ఎందుకు : జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా..​​​​​​​

Andhra Pradesh New Districts: రాయచోటి కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు ఎవరి పేరును పెట్టారు?

Tallapaka Annamacharya

పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా ఏప్రిల్‌ 4న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 13 నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కారమయ్యింది. నూతన జిల్లాల పేర్లను పరిశీలిస్తే పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ వివరాలివీ..

ఆంధ్ర కేసరితో ఆరంభం..

 • 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, వైఎస్సార్‌ కడప జిల్లాలు ప్రముఖుల పేర్లతో ఉన్నాయి. జిల్లాల విభజనతో ఇది ఏడుకు పెరిగింది. 
 • స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తిస్తూ 1972లో తొలిసారిగా ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. 
 • ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు.
 • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు. 

అల్లూరి జిల్లా..

 • బ్రిటీషు వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా తాజా గిరిజన జిల్లా ఏర్పాటైంది. 
 • టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరుతో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటైంది. 
 • ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటయ్యాయి.

ఐదు అత్యధిక వర్షపాత జిల్లాలు..
కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా 1,400 మి.మీ సగటు వర్షపాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో తిరుపతి జిల్లా 1,300 మి.మీ, కోనసీమ జిల్లా 1,200 మి.మీ, పార్వతీపురం మన్యం 1150 మి.మీ, విశాఖపట్నం 1,100 మి.మీ వరకు ఉన్నట్లు అంచనా.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్‌ 04
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ    : ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా..

Stats of India: స్టాక్‌ మదుపరులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?

US Dollar

దేశంలో అత్యధిక స్టాక్‌ మదుపరులు ఉన్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.  దేశంలో మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 16.6 శాతం, గుజరాత్‌ 15.5 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్టాట్స్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు..

 • మదుపు కోసం స్టాక్‌ మార్కెట్ల తలుపుతట్టడంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. 
 • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభాలో 8.8 శాతం మంది బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ)లో మదుపుదారుగా నమోదయ్యారు.  అంటే ప్రతీ 100 మందిలో 8.8 శాతం మంది బీఎస్‌ఈ ద్వారా స్టాక్‌ మార్కెట్లో మదుపు చేస్తున్నారు. 
 • ఇదే సమయంలో తెలంగాణాలో 8.2 శాతం, కర్నాటకలో 8.7 శాతం, తమిళనాడులో 7.0 శాతం, పుదిచ్చేరిలో 6 శాతం ఉండగా కేరళలో 7 శాతంగా ఉంది.
 • దేశం మొత్తం మీద చూస్తే 7.4 శాతం మంది మాత్రమే స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి మాత్రం 8.8 శాతం మంది ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.
 • అయితే ఢిల్లీ 23.6 శాతంతో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 16.6 శాతం, గుజరాత్‌ 15.5 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఖాతాల సంఖ్య పరంగా చూస్తే..

 • దేశవ్యాప్తంగా బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంఖ్య 2022, మార్చి నాటికి 10 కోట్ల మార్కును అధిగమించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 47 లక్షల మంది స్టాక్‌ మార్కెట్లో ఖాతాలను కలిగి ఉన్నారు.
 • దేశం మొత్తం మీద 10 కోట్ల మంది ఖాతాలు కలిగి ఉన్నా అందులో 50 శాతం మంది అయిదు రాష్ట్రాల నుంచే ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 2.07 కోట్ల ఖాతాలు ఉండగా, ఆ తర్వాత గుజరాత్‌ 1.09 కోట్లు, ఉత్తరప్రదేశ్‌ 86 లక్షలు, కర్నాటక 58 లక్షలు, రాజస్థాన్‌ 56 లక్షలుగా ఉన్నాయి.
 • ఖాతాల సంఖ్య పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తొమ్మిదో స్థానంలో ఉంటే, 31 లక్షల ఖాతాలతో తెలంగాణ 12వ స్థానంలో ఉంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అత్యధిక స్టాక్‌ మదుపరులు ఉన్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది
ఎప్పుడు : ఏప్రిల్‌ 04
ఎవరు    : స్టాట్స్‌ ఆఫ్‌ ఇండియా 
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : ఢిల్లీ ప్రజల్లో  23.6 శాతం మంది స్టాక్‌ మదుపుదారుగా నమోదైనందున..

Invest India: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన సులభతర వాణిజ్య విధానం(ఈవోడీబీ)లో 2021 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఏప్రిల్‌ 6న ఇన్వెస్ట్‌ ఇండియా(నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలియేషన్‌ ఏజెన్సీ) వెల్లడించింది. ఇన్వెస్ట్‌ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం..

 • 2019 అక్టోబర్‌ నుంచి 2021 డిసెంబర్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌కు 451 అమెరికన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) వచ్చాయి. 
 • రాష్ట్రానికి 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండడంతోపాటు మెరుగైన రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు ఉండటం పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.
 • ఇక 2018–19 నాటికి ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా 11.02 శాతంగా నమోదైంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఇది కూడా ఒక కారణం. 
 • ఎగుమతుల సన్నద్ధత సూచి–2021, నేషనల్‌ లాజిస్టిక్స్‌ ఇండెక్స్‌–2021లో ఆంధ్రప్రదేశ్‌ 9వ ర్యాంకును సాధించింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 
సులభతర వాణిజ్య విధానం(ఈవోడీబీ)లో 2021 2021 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.  
ఎప్పుడు : ఏప్రిల్‌ 06
ఎవరు    : ఇన్వెస్ట్‌ ఇండియా
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : రాష్ట్రానికి 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండడంతోపాటు మెరుగైన రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు ఉన్నందున..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 05 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

General Essay - Bilateral

India-Nepal Relations: నేపాల్‌తో మళ్లీ సాన్నిహిత్యం

PM Modi- Nepal PM Deuba

భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా దేశంలో మూడు రోజులు పర్యటించారు. రెండేళ్ల క్రితం సరిహద్దుల విషయంలో వివాదం తలెత్తాక అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. వాటిని మళ్లీ సరిచేసుకోవడమే దేవ్‌బా తాజా పర్యటన ఆంతర్యం. నిరుడు జూలైలో అయిదోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దేవ్‌బా జరిపిన మొదటి విదేశీ పర్యటన ఇది. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు తలెత్తడం, అవి విభేదాలుగా పరిణమించడం వింతేమీ కాదు. శతాబ్దాలుగా భారత్, నేపాల్‌ దేశాల మధ్యా సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలున్నాయి. అందుకే అప్పుడప్పుడు పొరపొచ్చాలు ఏర్పడినా, మరో దేశం ఆ సమస్యలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూసినా ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు సంయమనం పాటించి లోటుపాట్లు సరిదిద్దుకుంటున్నాయి. తిరిగి ఒక్కటవుతున్నాయి. దేవ్‌బాకు ముందున్న ప్రధాని కేపీ ఓలి చైనా ప్రభావంతో మన దేశంతో తగాదాకు దిగారు. పర్యవసానంగా ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వచ్చిన దేవ్‌బా ఆ సంబంధాలను తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు కృషి చేశారు. దానిలో భాగంగానే ఆయన భారత్‌ పర్యటనకొచ్చారు. నేపాల్‌కు ఇది ఎన్నికల సంవత్సరం కూడా. కనుక రెండు దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం సమస్య ఆ ఎన్నికల్లో ప్రముఖంగా ప్రస్తావనకు రావడం ఖాయం. ఉత్తరాఖండ్‌లో భాగంగా ఉన్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్‌ ప్రాంతాలను నేపాల్‌ 2020లో తన మ్యాప్‌లో భాగంగా చూపింది. దానికి సంబంధించిన బిల్లుకు అక్కడి పార్లమెంటులో ఆమోద ముద్ర పడింది. రాబోయే ఎన్నికల్లో దేవ్‌బాను దెబ్బతీయడానికి మాజీ ప్రధాని ఓలి శర్మ, ఇతరులు గట్టిగానే ప్రయత్నిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఈ వివాద పరిష్కారానికి ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. బిహార్‌లోని జయనగర్‌ నుంచి నేపాల్‌లోని కుర్తా వరకూ నడిచే రైలుకు ఇరు దేశాల ప్రధానులు పచ్చజెండా ఊపారు. 35 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గంలో ఇరు దేశాల మధ్యా ప్రారంభమైన తొలి బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ ఇది. దీన్ని మరింత దూరం పొడిగించడానికి మన దేశం సాయపడ బోతోంది. అలాగే మన దేశం నిర్మించిన విద్యుత్‌ కారిడార్‌ను కూడా లాంఛనంగా దేవ్‌బాకు అప్పగించారు. ఈ కారిడార్‌ వల్ల అక్కడి ఈశాన్య ప్రాంత మారుమూల పల్లెలకు సైతం నేపాల్‌ విద్యుత్‌ సదుపాయం అందించగలుగుతుంది. ఇవిగాక నేపాల్‌లో విద్యుదు త్పత్తి ప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయడంతో సహా మరెన్నో ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి.

Economic Crisis in Sri Lanka: శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్‌ సరఫరా చేసిన దేశం?

మన దేశంతో నేపాల్‌ క్రమేపీ సన్నిహితమవుతున్న తీరును చైనా గమనిస్తూనే ఉంది. దేవ్‌బా మన దేశం రావడానికి మూడు రోజుల ముందు నేపాల్‌లో చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీ పర్యటించారు. ఒక్క మన దేశంతో మాత్రమే కాదు... అమెరికాతో కూడా నేపాల్‌ దగ్గరవుతుండటాన్ని దృష్టిలో ఉంచుకునే వాంగ్‌ యీ హుటాహుటీన ఈ పర్యటనకొచ్చారు. నేపాల్‌లో రోడ్లు, విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం ఒక సంస్థ ద్వారా తాను అందించదల్చుకున్న సాయం అంగీకారమో కాదో మార్చి 28 లోగా చెప్పాలని అమెరికా గడువు విధించింది. 50 కోట్ల డాలర్ల విలువైన ఆ గ్రాంటు స్వీకరించడానికి నేపాల్‌ కొంత సందేహించింది. అయితే దీన్ని అంగీకరించకపోతే నేపాల్‌తో తన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకుంటానని అమెరికా హెచ్చరించడంతో గడువుకు ఒక్కరోజు ముందు నేపాల్‌ పార్లమెంటు ఆ గ్రాంటు తీసుకోవడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో నేపాల్‌ ఓటువేసింది. దీనికి కూడా అమెరికా ఒత్తిడే కారణం. చిత్రమేమంటే ఈ రెండు అంశాల్లోనూ ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు సెంటర్, మాధవ్‌ నేపాల్‌ ఆధ్వర్యంలోని యూనిఫైడ్‌ సోషలిస్టులు ప్రభుత్వానికి మద్దతునిచ్చాయి. చైనాకు అత్యంత సన్నిహితమని ముద్ర ఉన్న మాజీ ప్రధాని శర్మ ఓలి నాయకత్వంలోని యూనిఫైడ్‌ మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ సైతం తటస్థంగా ఉండిపోయింది. ఈ పరిణామాలతోపాటు భారత్‌లో దేవ్‌బా పర్యటించడాన్ని కూడా చైనా జీర్ణించుకోలేకపోయింది. నెహ్రూ ఏలుబడిలో దక్షిణాసియా దేశాలతో మన సంబంధాలు సక్రమంగా ఉండటం లేదని నిపుణులు విమర్శించేవారు. ముఖ్యంగా నేపాల్‌తో సంబంధాల విషయంలో మనం పెద్దన్న పోకడలకు పోతే ఆ దేశం చైనాను ఆశ్రయించే అవకాశం ఉన్నదని హెచ్చరించేవారు. చిత్రమేమంటే అనంతరకాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు అంతంత మాత్రమే. అందువల్లే నేపాల్‌కు చైనా సన్నిహితం కాగలిగింది. వేలాదిమంది నేపాలీ విద్యార్థులకు తమ దేశంలోని విద్యాసంస్థల్లో చవగ్గా చదువుకునే అవకాశం కల్పించింది. నేపాల్‌లో మాండరిన్‌ భాష నేర్పించడానికి పలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటికైతే నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలు భారత్, అమెరికాలతో దేవ్‌బా ప్రభుత్వ సంబంధాలపై నోరెత్తడం లేదు. అయితే ఈ ఏడాది చివరిలో జరగబోయే ఎన్నికలనాటికి అమెరికా మాటెలా ఉన్నా భారత్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తాయి. కనుక సరిహద్దు అంశంలోనైనా, మరే ఇతర విషయంలోనైనా మన దేశం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో, సామరస్యపూర్వకంగా వ్యవహరించడం అవసరం. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి దేవ్‌బా తాజా పర్యటన దోహదపడితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగుపడతాయి.

AP New Districts : కొత్త జిల్లాలు.. వీటి చ‌రిత్ర..!

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 06 Apr 2022 07:43PM

Photo Stories