Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 05 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-April-5

100m Hurdles: ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహిస్తున్నారు?​​​​​​​

Jyothi Yarraji

కేరళలోని కోజికోడ్‌ వేదికగా ఏప్రిల్‌ 2న ప్రారంభమైన 25వ‌ జాతీయ ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2022లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి యర్రాజి జ్యోతి పసిడితో మెరిసింది. ఏప్రిల్‌ 4న నిర్వహించిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. 13.08 సెకన్ల టైమింగ్‌తో ఆమె రేస్‌ను పూర్తి చేసింది. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో తెలంగాణ అథ్లెట్‌ జి. మహేశ్వరి కాంస్యం గెలుచుకుంది. 10 నిమిషాల 47.30 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసిన మహేశ్వరి మూడో స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌ 6వ తేదీ వరకు ఈ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నారు.

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ఎక్కడ ఉంది?
జాతీయ జూనియర్‌ బాలుర హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్‌  కైవసం చేసుకుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏప్రిల్‌ 4న జరిగిన ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌  35–30 తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022 జాతీయ ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 4
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి యర్రాజి జ్యోతి
ఎక్కడ    : కోజికోడ్, కేరళ
ఎందుకు : రేసును అందరికంటే ముందుగా 13.08 సెకన్ల టైమింగ్‌తో ముగించినందున..

Orleans Masters 2022: మిథున్‌ మంజునాథ్‌ ఏ క్రీడకు చెందినవాడు?

Mithun Manjunath

ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌–2022లో భారత ఆటగాడు మిథున్‌ మంజునాథ్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఏప్రిల్‌ 3న ఫ్రాన్స్‌లోని ఓర్లియాన్స్‌ నగరం వేదికగా జరిగిన ఫైనల్లో మంజునాథ్‌ 11–21, 19–21 తేడాతో నాలుగో సీడ్‌ తొమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాస్‌టేలర్‌ ఏ దేశానికి చెందినవాడు? 
న్యూజిలాండ్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రాస్‌ టేలర్‌కు ఏప్రిల్‌ 4న ఆ దేశ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. టేలర్‌ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ అయిన మూడో వన్డేలో కివీస్‌ 115 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఫలితంగా సిరీస్‌ను 3–0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌ నగరంలో ఈ సిరస్‌ను నిర్వహించారు.

రాస్‌ టేలర్‌ వన్డే రికార్డు: 236 వన్డేల్లో 47.55 సగటుతో టేలర్‌ 8607 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉండగా...అత్యుత్తమ స్కోరు 181 నాటౌట్‌.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌–2022లో రన్నరప్‌గా నిలిచిన భారత ఆటగాడు?
ఎప్పుడు  : ఏప్రిల్‌ 4
ఎవరు    : మిథున్‌ మంజునాథ్‌
ఎక్కడ    : ఓర్లియాన్స్, ఫ్రాన్స్‌
ఎందుకు : ఫైనల్లో మంజునాథ్‌ 11–21, 19–21 తేడాతో నాలుగో సీడ్‌ తొమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయినందున..

HDFC-HDFC Bank Merger: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కలవనున్న అతిపెద్ద గృహ రుణ కంపెనీ?

HDFC-HDFC Bank

ప్రైవేట్‌ రంగంలో నంబర్‌ వన్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో దేశీయంగా అతిపెద్ద గృహ రుణ కంపెనీ అయిన హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) విలీనం కానుంది. ఇది దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద విలీనంకాగా.. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మరింత భారీ రూపాన్ని సంతరించుకోనుంది. 42:25 నిష్పత్తిలో విలీనాన్ని చేపట్టనున్నట్లు ఏప్రిల్‌ 4న రెండు సంస్థలూ వెల్లడించాయి. అంటే హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ వాటాదారుల వద్దగల ప్రతీ 25 షేర్ల స్థానంలో 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు జారీ కానున్నాయి.

రెండు సంస్థలు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ డీల్‌ పూర్తయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పబ్లిక్‌ వాటాదారుల వాటా 100 శాతానికి చేరనుంది. దీనిలో ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ వాటాదారులకు 41 శాతం వాటా లభించనుంది. విలీనానికి ఆర్‌బీఐ తదితర నియంత్రణ సంస్థలనుంచి అనుమతులు లభించాల్సి ఉంది. అనుబంధ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సైతం విలీనంలో భాగంకానున్నాయి.

విలీనం తదుపరి
గృహ రుణ రంగంలోని అవకాశాలను మరింత సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు రెండు సంస్థలు విలీనానికి తెరతీశాయి. హెచ్‌డీఎఫ్‌సీ విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్తగా గృహ రుణ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోనుంది. కస్టమర్ల సంఖ్యను సైతం భారీగా పెంచుకోనుంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ మొత్తం రూ. 6.23 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ఇదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆస్తులు రూ. 19.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

ఎస్‌బీఐ తదుపరి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకోనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దేశీయంగా అతిపెద్ద బ్యాంకుల్లో రెండో ర్యాంకులో నిలవనున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తాజాగా పేర్కొంది. తొలి స్థానంలో పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) కొనసాగనున్నట్లు తెలియజేసింది. అయితే విలీన సంస్థ మరో ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ పరిమాణంకంటే రెట్టింపు స్థాయికి చేరనున్నట్లు వివరించింది.

కాగా, బ్యాంకింగ్‌ రంగంలో జరుగుతున్న రెండో రివర్స్‌ మెర్జర్‌ ఇది. ఇంతక్రితం ఐసీఐసీఐ లిమిటెడ్‌ సైతం ఐసీఐసీఐ బ్యాంకులో విలీనమైంది. 2001 అక్టోబర్‌లో అనుబంధ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకులో మాతృ సంస్థ ఐసీఐసీఐ లిమిటెడ్‌ కలిసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కలవనున్న అతిపెద్ద గృహ రుణ కంపెనీ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 4
ఎవరు    : హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) 
ఎందుకు : గృహ రుణ రంగంలోని అవకాశాలను మరింత సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు..​​​​​​​

Indian Oil Corporation: ఐవోసీతో ఒప్పందం చేసుకున్న సంస్థలు?

IOC

ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), ఇంజనీరింగ్, మౌలిక రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీ, పునరుత్పాదక ఇంధన రంగంలోని రెన్యూ పవర్‌.. గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్తంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుల అభివృద్ధికి గాను ఒప్పందంపై ఈ మూడు సంస్థలు సంతకాలు చేశాయి. ఐవోసీ–ఎల్‌అండ్‌టీ–రెన్యూపవర్‌.. ఐవోసీకి చెందిన మధుర, పానిపట్‌ రిఫైనరీల వద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయని సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఆ సంస్థలు పేర్కొన్నాయి.

మరోవైపు ఐవోసీ, ఎల్‌అండ్‌టీ విడిగా మరో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా అవి గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారు చేయనున్నాయి.

టెస్లా వ్యవస్థాపకుడు ఎవరు?
మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ 9.2 శాతం వాటాలు కొనుగోలు చేశారు. తద్వారా సంస్థలో అతి పెద్ద వాటాదారుగా మారారు. మార్చి 14న మస్క్‌ 7.35 కోట్ల షేర్లను దక్కించుకున్నట్లు ఏప్రిల్‌ 4న వెల్లడైంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ)తో ఒప్పందం చేసుకున్న సంస్థలు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 4
ఎవరు    : ఎల్‌అండ్‌టీ, రెన్యూ పవర్‌
ఎందుకు : గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు కోసం..

Financial Year 2021-22: భారత్‌ వాణిజ్య లోటు ఎన్ని బిలియన్‌ డాలర్లు?

ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు 2021–22 ఆర్థిక సంవత్సరం ఆందోళనకర స్థాయిలో నమోదైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూస్తే, ఏకంగా 88 శాతం పెరిగి 102.63 బిలియన్‌ డాలర్ల నుంచి 192.41 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారతదేశంలోకి వచ్చే మొత్తం విదేశీ మారకద్రవ్యం–దేశం నుంచి వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాస గణాంకాలను ప్రతిబింబించే  కరెంట్‌ అకౌంట్‌లో తీవ్ర లోటుకు (క్యాడ్‌) దారితీసే అంశమిది. భారత్‌ విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఏప్రిల్‌ 4న విడుదలైన గణాంకాలను పరిశీలిస్తే..

  • మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల విలువ 417.81 బిలియన్‌ డాలర్లు. దిగుమతులు 610.22 బిలియన్‌ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 192.41 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.
  • 2021–22 ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 28.55 శాతం పెరిగితే, దిగుమతులు 55 శాతం (394.44 బిలియన్‌ డాలర్ల నుంచి 610.22 బిలియన్‌ డాలర్లకు) ఎగశాయి. వాణిజ్యలోటు పెరుగుదల ఇదే కాలంలో 88 శాతంగా ఉంది.

Andhra Pradesh: రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పాటయ్యాయి?

CM Jagan

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నవశకం ఆవిష్కృతమయ్యింది. పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా 13 కొత్త జిల్లాలు అవతరించాయి. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కారమయ్యింది. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 4న తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాతో ఆరంభించి వరుసగా మిగతా జిల్లాలను సీఎం ప్రారంభించారు. అనంతరం 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. నూతన జిల్లాల ద్వారా కార్యాలయాల ఏర్పాటుతో పాటు వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు. కొత్త జిల్లాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పథకాలు పారదర్శకంగా అందాలని ఆకాంక్షించారు.

సీఎం ప్రసంగం–ముఖ్యాంశాలు

  • ఇవాళ్టి నుంచి 26 జిల్లాలతో మన రాష్ట్రం రూపు మారుతోంది. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
  • పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి... ఇవీ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు.
  • పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల సెంటిమెంట్, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాగ్గేయకారులను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల పేర్లను నిర్ణయించాం.
  • గతంలో ఉన్న జిల్లాల పేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం, రాజమహేంద్రవరం గత జిల్లాలకు ముఖ్య పట్టణాలుగా మారాయి.
  • గతంలో ఉన్న జిల్లా కేంద్రాలను యథాతథంగా కొనసాగిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలు ఈరోజు నుంచి కొలువుదీరుతున్నాయి.
  • 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఆవిర్భవిస్తే చివరిగా 1979 జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది.
  • తరువాత కొత్త జిల్లాలు ఏర్పాటు కాకపోవడంతో పరిపాలన సంస్కరణలు, వికేంద్రీకరణ విషయంలో బాగా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయాం. జిల్లాల సంఖ్య, రెవెన్యూ డివిజన్లు పెరగడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగి సమర్థంగా అమలవుతాయి.
  • దేశంలో 727 జిల్లాలు ఉండగా యూపీలో అత్యధికంగా 75, అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమైన ఏపీలో మాత్రం నిన్నటివరకు 13 జిల్లాలే ఉన్నాయి.
  • దేశంలో ఏ రాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత జనాభా లేదు. మహారాష్ట్రలో ఒక్కో జిల్లాలో సగటున 31 లక్షలు, తెలంగాణాలో 10.06 లక్షల మంది చొప్పున నివసిస్తున్నారు. కాగా మిజోరాంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53 వేల మందికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటయ్యాయి.
  • గతంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రధానంగా రెవెన్యూ మాత్రమే ఉండేది. ఇప్పుడు శాంతి భద్రతలు, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ట్రెజరీ, సోషల్‌ వెల్ఫేర్, వ్యవసాయం, పశుపాలన, ప్రా«థమిక విద్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్, సివిల్‌ సఫ్లైస్, కార్మిక చట్టాలు, విపత్తు నిర్వహణ, పంపిణీ విభాగం, ఎన్నికల నిర్వహణ కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఉన్నాయి.
  • కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, మిగిలినవి అన్నీ ఒకేచోటకి వస్తాయి. కనీసం 15 ఎకరాల విస్తీర్ణంలో అన్నీ ఒకేచోట ఏర్పాటు కాబోతున్నాయి. వీటిని ఇంటిగ్రేటెడ్‌గా ఏర్పాటు చేస్తే అన్ని కార్యాలయాలు ఒకే చోట కనిపిస్తాయి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 4
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా..

Andhra Pradesh: పౌర సేవలు పేరుతో ప్రారంభించిన నూతన పోర్టల్‌ ఉద్దేశం?

APIIC

సింగిల్‌ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) ఆన్‌లైన్‌ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఏపీఐఐసీని  పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్‌ ఏప్రిల్‌ 4న గుంటూరు జిల్లా, మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు. www. apindustries. gov. inకు ఏపీఐఐసీ సేవలు అనుసంధానించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తొలిదశలో 14 సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

స్కిల్డు ఫోర్సు కార్యక్రమం ఉద్దేశం?
దేశంలోని లక్ష మందికి పైగా విద్యార్థులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ కోసం ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. స్కిల్డు ఫోర్సు పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్‌ టెక్నాలజీ సంస్థ అయిన సిస్కో, మహాత్మా గాంధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌(ఎంజీఎన్‌సీఆర్‌ఈ), ఆరెస్‌బీ ట్రాన్స్‌మిషన్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ వంటి సంస్థల ద్వారా ఈ శిక్షణ ఇప్పించనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  
ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసిన ‘పౌర సేవలు’ వెబ్‌సైట్‌ ప్రారంభం
ఎప్పుడు  : ఏప్రిల్‌ 4
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ
ఎక్కడ    : ఏపీఐఐసీ కార్యాలయం, మంగళగిరి, గుంటూరు జిల్లా 
ఎందుకు : సింగిల్‌ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు..

Y-Hub: వై–హబ్‌ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించనున్న రాష్ట్రం?

Y-Hub

ప్రభుత్వ పాఠశాలతోపాటు ప్రైవేటు బడ్జెట్‌ స్కూళ్లకు చెందిన 6–10వ తరగతి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌–2021 ఫినాలే ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌ గోల్కొండలోని తారామతి–బారాదరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, టీచర్లు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. పిల్లల్లో సృజనాత్మకతకు పదును పెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా పిల్లలు, యువత కోసం ‘వై–హబ్‌’ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో అందుబాటులోకి రానున్న టీ–హబ్‌ 2.0 భవనంలో 10 వేల చ.అ. విస్తీర్ణంలో వై–హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
‘వై–హబ్‌’ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఏప్రిల్‌ 4
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు : సృజనాత్మకతకు పదును పెట్టేందుకు.. పిల్లలు, యువత కోసం..

Grammys Winners 2022: గ్రామీ పురస్కారం గెలుచుకున్న భారత సంతతి కళాకారులు?

Falguni Shah, Ricky Kej

సంగీత ప్రపంచంలో అత్యుత్తమమైన గ్రామీ పురస్కారాలు ఇద్దరు భారత సంతతి కళాకారులకు దక్కాయి. ముంబైలో జన్మించి, అమెరికాలో స్థిరపడిన ఫల్గుణీ షా(ఫలు)తోపాటు అమెరికాలో భారత సంతతికి చెందిన రిక్కీ కెజ్‌ గ్రామీ పురస్కారాలు అందుకున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ నగరంలో 2022 సంవత్సరానికి 64వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏప్రిల్‌ 3న నిర్వహించారు.

బెస్ట్‌ న్యూ ఏజ్‌ ఆల్బమ్‌..
పోలీసు డ్రమ్మర్‌ స్టీవార్ట్‌ కోప్‌లాండ్‌తో కలిసి రిక్కీ కెజ్‌ ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌ రూపొందించారు. వీరు బెస్ట్‌ న్యూ ఏజ్‌ ఆల్బమ్‌ కేటగిరీలో గ్రామీని స్వీకరించారు. రిక్కీ కెజ్‌ ఈ పురస్కారం అందుకోవడం ఇది రెండోసారి. స్టీవార్ట్‌కు ఇది ఆరో గ్రామీ. రిక్కీ కెజ్‌ 2015లో ‘విండ్స్‌ ఆఫ్‌ సంసార’ అనే ఆల్బమ్‌కుగాను తొలిసారి గ్రామీ పురస్కారం స్వీకరించారు. ఇక ‘ఏ కలర్‌ఫుల్‌ వరల్డ్‌’ అనే ఆల్బమ్‌ను రూపొందించిన ఫలు.. బెస్ట్‌ చిల్డ్రన్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ కేటగిరీలో గ్రామీ అవార్డు అందుకున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గ్రామీ పురస్కారం గెలుచుకున్న భారత సంతతి కళాకారులు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 3
ఎవరు    : ఫల్గుణీ షా(ఫలు), రిక్కీ కెజ్‌
ఎక్కడ    : లాస్‌ ఏంజెలెస్, అమెరికా
ఎందుకు : సంగీతంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 04 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Apr 2022 07:31PM

Photo Stories