Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 04 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Apr-4

PM Modi, PM Deuba: జయనగర్‌–కుర్తా రైల్వే లైన్‌ను ఏ రెండు దేశాల మధ్య ప్రారంభించారు?

PM Modi-PM Deuba

సరిహద్దు సమస్యను రాజకీయం చేయరాదని భారత్‌–నేపాల్‌ అంగీకారానికి వచ్చాయి. భారత్‌లో పర్యటిస్తున్న నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌ బా ఏప్రిల్‌ 2న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా.. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కూడా చర్చకు వచ్చింది. సమస్య పరిష్కారానికి ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని దేవ్‌ బా కోరారు. రెండు దేశాల సరిహద్దుల్లోని భారత భూభాగాలైన లింపియధురా, కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ నేపాల్‌ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను ప్రచురించడంపై 2020 నుంచి వివాదం నడుస్తోంది.

మోదీ–దేవ్‌ బా సమావేశం : ముఖ్యాంశాలు

 • బిహార్‌లోని జయ్‌నగర్‌ నుంచి నేపాల్‌లోని కుర్తా మధ్య బ్రాడ్‌గేజ్‌ మార్గంలో నడిచే తొలి ప్యాసింజర్‌ రైలును మోదీ, దేవ్‌బా వర్చువల్‌గా ప్రారంభించారు. విద్యుత్‌ సరఫరా లైన్‌ను, నేపాల్‌లో రూపే చెల్లింపుల వ్యవస్థను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు.
 • రైల్వేలు, విద్యుత్‌ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉద్దేశించిన నాలుగు ఒప్పందాలపైనా సంతకాలు చేశారు.
 • దేవ్‌ బా భారత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఐదోసారి పీఎం అయ్యాక ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
ఎప్పుడు  : ఏప్రిల్‌ 2
ఎవరు    : నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌ బా
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : జయనగర్‌–కుర్తా రీజియన్‌ రైల్వే లైన్‌ను ప్రారంభించడంతోపాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపేందుకు..

Economic Crisis in Sri Lanka: శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్‌ సరఫరా చేసిన దేశం?

Sri Lanka

ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్‌ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు ఏప్రిల్‌ 2న శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్‌ అందించిన నాలుగో డీజిల్‌ సాయం. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు భారత ప్రభుత్వం తెలిపింది.

ఆర్థిక అత్యవసర పరిస్థితి..
ఆహార కొరత, ధరల మంటను భరించలేక శ్రీలంకలో జనం వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. 2022, ఏప్రిల్‌ 1 నుంచి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

భారత గగనతలంలో పేలిపోయిన చైనా రాకెట్‌ పేరు?
చైనా 2021 ఫిబ్రవరిలో ప్రయోగించిన చాంగ్‌ జెంగ్‌ 5బీ రాకెట్‌ ఏప్రిల్‌ 2న భూ వాతావరణంలోకి ప్రవేశించి భారత గగనతలంలో పేలిపోయింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపించినట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు. చైనా సొంతంగా అంతరిక్షంలో ప్రయోగశాలను నిర్మిస్తోంది. అందుకు అవసరమైన పరికరాలు, సిబ్బందిని రాకెట్లలో పంపుతోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
శ్రీలంకకు మరో 40 వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ సరఫరా చేసిన దేశం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 2
ఎవరు    : భారత్‌
ఎందుకు : శ్రీలంక ప్రజలు.. ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్నందున..World Health Organization: ఎక్స్‌ఈ రీకాంబినెంట్‌ వేరియంట్‌ను ఎక్కడ గుర్తించారు?

కోవిడ్‌ కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. 2022, జనవరి 19న తొలుత యూకేలో గుర్తించిన ఈ కొత్త వేరియంట్‌కు ‘ఎక్స్‌ఈ రీకాంబినెంట్‌(బీఏ.1–బీఏ.2)’ అని పేరుపెట్టారు. ఇప్పటిదాకా వచ్చిన వేరియంట్ల కంటే ఎక్స్‌ఈ రీకాంబినెంట్‌ వ్యాప్తి అధికంగా ఉందని ఏప్రిల్‌ 2న డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో సబ్‌ వేరియంట్‌ (బీఏ.2) కంటే 10 శాతం ఎక్కువగా వ్యాపిస్తోందని పేర్కొంది. కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గించడం సరైంది కాదని తెలిపింది.

122 ఏళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు 
భారతదేశంలో 2022, మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ ఏప్రిల్‌ 2న తెలిపింది. మార్చి నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చురుకైన పశ్చిమ పవనాలు లేకపోవడం, అల్ప వర్షపాతమే ఇందుకు కారణమని విశ్లేషించింది. ‘దేశం మొత్తమ్మీద చూస్తే, 33.10 డిగ్రీల సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 2022లో నమోదైంది. గత 122 ఏళ్లలో ఇదే అత్యధికం’ అని ఐఎండీ పేర్కొంది. దేశంలో 2010 మార్చిలో 33.09 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది.

Political Crisis in Pakistan: పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు

పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకునేందుకు ఏప్రిల్‌ 3న జరిగిన జాతీయ అసెంబ్లీ కీలక సమావేశం అనూహ్య పరిణామాలకు వేదికైంది. స్పీకర్‌ అసద్‌ ఖైజర్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవచ్చన్న అనుమానంతో సమావేశం మొదలవగానే విపక్షాలు ఆయనపై అవిశ్వాస నోటీసు కూడా ఇచ్చాయి. దాంతో సమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం ఖాన్‌ సూరి, తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే సభను వాయిదా వేశారు. అనంతరం దేశాధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీని కలిసిన ఇమ్రాన్‌.. జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. అందుకు ఆయన ఆమోదముద్ర వేశారు.

పాకిస్తాన్‌ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ప్రధానీ పూర్తికాలం పాటు పదవిలో కొనసాగలేదు. షెడ్యూల్‌ ప్రకారం పాక్‌లో 2023 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇమ్రాన్‌ 2018 ఆగస్టు 18న దేశ 22వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

సుప్రీం విచారణ
డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ విపక్షాలు సుప్రీంకోర్టులో సంయుక్తంగా పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో ఏప్రిల్‌ 3న ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం ఉదంతంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ అసెంబ్లీ రద్దు విషయంలో అధ్యక్షుడు, ప్రధాని తీసుకున్న నిర్ణయాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్‌ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు 
ఎప్పుడు : ఏప్రిల్‌ 3
ఎవరు    : పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ 
ఎందుకు : పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సిఫార్సుల మేరకు..

Russia-Ukraine War: స్టార్‌స్ట్రీక్‌ మిసైల్‌ను ఏ దేశంలో తయారు చేశారు?

Russia Helicoptor

ఇంగ్లండ్‌లో తయారైన స్టార్‌స్ట్రీక్‌ మిసైల్‌ సాయంతో రష్యాకి చెందిన ఎంఐ–28ఎన్‌ హెలికాప్టర్‌ను లుహాన్స్‌క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ కూల్చేసింది. మిసైల్‌ ఢీకొట్టడంతో హెలికాప్టర్‌ రెండు ముక్కలై నేలకూలింది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా ఇప్పటిదాకా కనీసం 143 యుద్ధవిమానాలు, 131 హెలికాప్టర్లు, 625 ట్యాంకులు, 316 సైనిక వాహనాలను కోల్పోయినట్టు సమాచారం. ఇప్పటిదాకా 18 వేల మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్టు ఉక్రెయిన్‌ చెప్తోంది.

100 శాతం కచ్చితత్వంతో..
ద్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్‌ గైడెడ్‌ మిసైల్‌ సిస్టమ్‌ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్‌స్ట్రీక్‌ ప్రయోగంపై రష్యా మండిపడింది.

మహారాష్ట్రలో చైనా రాకెట్‌ శకలాలు..
నాగపూర్‌: అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించి, భారత గగనతలంలో పేలిపోయిన చైనా రాకెట్‌ ‘‘చాంగ్‌ జెంగ్‌ 5బీ’’ శకలాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా సిందేవాహీ తాలూకాలోని రెండు గ్రామాల్లో లభ్యమయ్యాయి. ఇవి లోహపు రింగు, సిలిండర్‌ ఆకారంలో ఉన్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్‌ 2న చైనా రాకెట్‌ శకలాలు పడుతున్న దృశ్యాలు కనిపించాయి.

Miami Open 2022: మయామి ఓపెన్‌ టోర్నీలో విజేతగా నిలిచిన క్రీడాకారిణి?

Iga Swiatek

మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ విజేతగా నిలిచింది. ఏప్రిల్‌ 2న అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామి గార్డెన్స్‌ నగరంలో జరిగిన ఫైనల్లో స్వియాటెక్‌ 6–4, 6–0తో మాజీ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా (జపాన్‌)పై నెగ్గి విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో స్వియాటెక్‌కిది వరుసగా మూడో ప్రీమియర్‌ టైటిల్‌ (ఖతర్‌ ఓపెన్, ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్, మయామి ఓపెన్‌) కావడం విశేషం. సెరెనా (అమెరికా–2013లో), వొజ్నియాకి (డెన్మార్క్‌–2010లో) తర్వాత ఒకే సీజన్‌లో వరుసగా మూడు డబ్ల్యూటీఏ–1000 టైటిల్స్‌ నెగ్గిన మూడో ప్లేయర్‌గా స్వియాటెక్‌ గుర్తింపు పొందింది.

కాంస్య పతకం సాధించిన జ్యోతిక శ్రీ
ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దండి జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్య పతకం గెలిచింది. కేరళలోని కాలికట్‌లో జరుగుతున్న ఈ మీట్‌లో జ్యోతిక శ్రీ 53.90 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచిన క్రీడాకారిణి
ఎప్పుడు : ఏప్రిల్‌ 2
ఎవరు    : పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ 
ఎక్కడ    : మయామి గార్డెన్స్, ఫ్లోరిడా రాష్ట్రం, అమెరికా
ఎందుకు : ఫైనల్లో స్వియాటెక్‌ 6–4, 6–0తో మాజీ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా (జపాన్‌)పై గెలిచినందున..

Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్‌–2022లో విజేతగా నిలిచిన జట్టు?

Women’s Cricket World Cup 2022

మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌–2022లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది. ఏప్రిల్‌ 3న న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 71 పరుగుల ఆధిక్యంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ ఘనవిజయం సాధించి ఏడోసారి విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీతెర్‌ నైట్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మెగ్‌ లానింగ్‌ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. టోర్నీ మొత్తంలో 509 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచిన  ఆసీస్‌ ఓపెనర్‌ అలీసా హీలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవార్డులు లభించాయి. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్‌ ఇంగ్లండ్‌కు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

విశేషాలు..

 • ఒకే ప్రపంచకప్‌ టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో (సెమీఫైనల్, ఫైనల్‌) సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌ అలీసా. గతంలో పురుషుల క్రికెట్‌లో పాంటింగ్‌ (ఆస్ట్రేలియా; 2003 ఫైనల్, 2011 క్వార్టర్‌ ఫైనల్‌), జయవర్ధనే (శ్రీలంక; 2007 సెమీఫైనల్, 2011 ఫైనల్‌) వేర్వేరు ప్రపంచకప్‌ టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశారు.
 • పురుషుల, మహిళల ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా అలీసా హీలీ రికార్డు సృష్టించింది. శ్రీలంకతో 2007 పురుషుల ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (149) స్కోరును అలీసా అధిగమించింది. అలీసా 170 వ్యక్తిగత స్కోరు చేసింది.
 • ఇప్పటివరకు 12 సార్లు మహిళల ప్రపంచకప్‌ టోర్నీలు జరగ్గా... ఫైనల్‌ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోరు(356) ఇదే.
 • ఆస్ట్రేలియా సాధించిన ప్రపంచకప్‌ టైటిల్స్‌ 7. గతంలో ఆసీస్‌ 1978, 1982, 1988, 1997, 2005, 2013లలో కూడా విజేతగా నిలిచింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌–2022లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 03
ఎవరు    : ఆస్ట్రేలియా మహిళల జట్టు
ఎక్కడ    : క్రైస్ట్‌చర్చ్, న్యూజిలాండ్‌
ఎందుకు : ఫైనల్లో ఆస్ట్రేలియా 71 పరుగుల ఆధిక్యంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ ఘనవిజయం సాధించినందున..

Grammy Awards 2022: గ్రామీ అవార్డుల విజేతల పూర్తి జాబితా

Grammy Awards

2022 సంవత్సరానికి 64వ గ్రామీ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏప్రిల్‌ 3వ తేదీ రాత్రి లాస్‌ వేగాస్‌లోని ఎమ్‌జీఎమ్‌ గ్రాండ్‌ గార్డెన్‌ ఏరీనా వేదికగా జరిగింది. లాస్‌ వేగాస్‌లో ఈ అవార్డుల వేడుకను నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ‘‘ది లేట్‌ షో విత్‌ స్టీఫెన్‌ కోల్బర్ట్‌’’ బ్యాండ్‌ లీడర్‌ అయిన జోన్‌ బటిస్టే అత్యధికంగా ఐదు అవార్డులను గెలుచుకున్నాడు. 19 ఏళ్ల పాప్‌ సంచలనం ఒలివియా రోడ్రిగో.. బెస్ట్‌ న్యూ ఆర్టిస్ట్‌తోపాటు బెస్ట్‌ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌ ట్రోఫీని గెలుచుకుంది. ఇంగ్లిష్‌ సంగీత పరిశ్రమలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ‘ది రికార్డింగ్‌ అకాడమీ‘ ఏటా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రదానం చేస్తోంది. గ్రామీ అవార్డులను మొదటిసారి 1959, మే 4న కాలిఫోర్నియాలో ఇచ్చారు.

2022 గ్రామీ విజేతలు వీరే..

 • రికార్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ : లీవ్‌ ద డోర్‌ ఓపెన్‌ (సిల్క్‌ సోనిక్‌)
 • సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ : లీవ్‌ ద డోర్‌ ఓపెన్‌ (సిల్క్‌ సోనిక్‌)
 • ఆల్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ :వుయ్‌ ఆర్‌ (జోన్‌ బటిస్టే)
 • బెస్ట్‌ న్యూ ఆర్టిస్ట్‌ : ఒలివియా రోడ్రిగో
 • బెస్ట్‌ పాప్‌ డుయో/గూప్‌ పర్ఫార్మెన్స్‌ : కిస్‌ మి మోర్‌ (డోజా క్యాట్‌ ఫీచరింగ్‌ ఎస్‌జడ్‌ఏ)
 • బెస్ట్‌ పాప్‌ సోలో పర్ఫార్మెన్స్‌ : డ్రైవర్స్‌ లైసెన్స్‌ (ఒలివియా రోడ్రిగో) 
 • బెస్ట్‌ కామెడీ ఆల్బమ్‌ : సిన్సియర్లీ లూయిస్‌ సీ.కే (లూయిస్‌ సీ.కే)
 • బెస్ట్‌ ట్రెడిషనల్‌ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌ : లవ్‌ ఫర్‌ సేల్‌(టోని బెన్నెట్, లేడీ గాగా)
 • బెస్ట్‌ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌ : సోర్‌ (ఒలివియా రోడ్రిగో)
 • బెస్ట్‌ రాక్‌ ఆల్బమ్‌ : మెడిసిన్‌ అట్‌ మిడ్‌నైట్‌ (ఫూ ఫైటర్స్‌)
 • బెస్ట్‌ రాక్‌ పర్ఫార్మెన్స్‌ : (మేకింగ్‌ ఏ ఫైర్‌) ఫూ ఫైటర్స్‌
 • బెస్ట్‌ మెటల్‌ పర్ఫార్మెన్స్‌ : (ది అలైన్‌) డ్రీమ్‌ థియెటర్‌
 • బెస్ట్‌ ర్యాప్‌ పర్ఫార్మెన్స్‌ : ఫ్యామిలీ టైస్‌ (బేబీ కీమ్‌ ఫీచరింగ్‌ కెండ్రిక్‌ ల్యామర్‌)
 • బెస్ట్‌ ర్యాప్‌ ఆల్బమ్‌ : కామ్‌ మి ఇఫ్‌ యూ గెట్‌ లాస్ట్‌ (టైలర్, ది క్రియేటర్‌)
 • బెస్ట్‌ కంట్రీ సోలో పర్ఫార్మెన్స్‌ : యూ షుడ్‌ ప్రాబబ్లీ లీవ్‌ (క్రిస్‌ స్టాప్లెటోన్‌)
 • బెస్ట్‌ ఆర్‌ అండ్‌ బీ ఆల్బమ్‌ : హియాక్స్‌ టేల్స్‌ (జాజ్‌మైన్‌ సుల్లీవాన్‌)
 • బెస్ట్‌ ఆర్‌ అండ్‌ బీ పర్ఫార్మెన్స్‌ : లీవ్‌ ద డోర్‌ ఓపెన్‌ (సిల్క్‌ సోనిక్‌)
 • బెస్ట్‌ కంట్రీ ఆల్బమ్‌ : స్టార్టింగ్‌ ఓవర్‌ (క్రిస్‌ స్టాప్లెటోన్‌)
 • బెస్ట్‌ డాన్స్‌/ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ : సబ్‌కాన్షియస్‌లీ (బ్లాక్‌ కాఫీ)
 • బెస్ట్‌ న్యూ ఏజ్‌ ఆల్బమ్‌ : డివైన్‌ టైడ్స్‌ (స్టీవర్ట్‌ కోపేల్యాండ్, రికి కేజ్‌)
 • బెస్ట్‌ బ్లూగ్రాస్‌ ఆల్బమ్‌ : మై బ్లూగ్రాస్‌ హార్ట్‌ (బేలా ఫ్లెక్‌)

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 02 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 Apr 2022 07:30PM

Photo Stories