Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 02 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Apr-2

India-Russia: ప్రధాని మోదీతో రష్యా మంత్రి లావ్రోవ్‌ ఎక్కడ భేటీ అయ్యారు?

PM Modi - Sergei Lavrov

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ సమావేశమయ్యారు. ఏప్రిల్‌ 1న న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీలో ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలను లావ్రోవ్‌.. మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌తో రష్యా శాంతి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌లో హింసాకాండకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని లావ్రోవ్‌కు మోదీ సూచించారు. ఉక్రెయిన్‌లో సంక్షోభానికి తెరపడాలని కోరుకుంటున్నామని, శాంతి యత్నాలకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

జైశంకర్‌తోనూ సమావేశం
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌తోనూ సెర్గీ లావ్రోవ్‌ సమావేశమయ్యరు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఇండో–పసిఫిక్, అసియాన్‌పైనా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై భారత ప్రభుత్వ ‘స్వతంత్ర’ వైఖరిని లావ్రోవ్‌ ప్రశంసించారు. రక్షణ రంగంలో భారత్‌తో పరస్పర సహకారానికి రష్యా కట్టుబడి ఉందని చెప్పారు. భారత్‌–రష్యా మధ్య రూపాయి, రూబుల్‌తో లావాదేవీలు జరగాలని.. డాలర్‌ ఆధారిత చెల్లింపులకు స్వస్తి పలకాలన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్‌ 01
ఎవరు    : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ 
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలు, ద్వైపాక్షిక సంబధాలు వంటి అంశాలపై చర్చించేందుకు..

PM Narendra Modi: పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు?

Pariksha Pe Charcha

న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఏప్రిల్‌ 1న కేంద్ర విద్యా శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్, లిటరసీ నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పరీక్షలంటే భయం వద్దేవద్దని విద్యార్థులకు ఆయన ఉద్బోధించారు. పరీక్షలకు ఒక పండుగలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాము నెరవేర్చుకోలేని కలలు, ఆకాంక్షలను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ‘‘పీ3 (ప్రో ప్లానెట్‌ పీపుల్‌) ఉద్యమ’ అవసరం ఎంతైనా ఉంది. ‘యూజ్‌ అండ్‌ త్రో’ సంస్కృతిని వదిలించుకోవాలి.’’ అని ప్రధాని పేర్కొన్నారు. విద్యారులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ అనే పుస్తకాన్ని మోదీ రచించిన విషయం విదితమే.

తుర్క్‌మెనిస్తాన్‌లో రాష్ట్రపతి పర్యటన
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడు రోజుల పర్యటనకు గాను ఏప్రిల్‌ 1న తుర్క్‌మెనిస్తాన్‌ చేరుకున్నారు. రాజధాని అస్ఘాబట్‌ విమానాశ్రయంలో అధ్యక్షుడు సెర్దార్‌ బెర్దిముహమెదోవ్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా అధ్యక్షుడు సెర్దార్‌తో కోవింద్‌ సమావేశమవుతారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై వారు చర్చలు జరుపుతారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రసంగం
ఎప్పుడు : ఏప్రిల్‌ 01
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : తల్కటోరా స్టేడియం, న్యూఢిల్లీ
ఎందుకు : విద్యారులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అవగాహన కల్పించేందుకు..​​​​​​​

Union Territory: చండీగఢ్‌ను తమకు బదలాయించాలని తీర్మానం చేసిన రాష్ట్రం?

Punjab Assembly

చండీగఢ్‌ను తక్షణమే తమ రాష్ట్రానికి బదలాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఏప్రిల్‌ 1న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న చండీగఢ్‌లో ఉమ్మడి ఆస్తులు, పరిపాలనాపరమైన విషయాల్లో సమతుల్యత పాటించకుండా కేంద్రం అడ్డుపడుతోందని సభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆరోపించారు. కేంద్ర సర్వీసుల నిబంధనలన్నీ చండీగఢ్‌ ఉద్యోగులకు వర్తిస్తాయంటూ హోం మంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటనతో రాజకీయ దుమారం రేగింది.

చండీగఢ్‌ ఉమ్మడి రాజధానే: ఖట్టర్‌ 
పంజాబ్‌ అసెంబ్లీ చేసిన తీర్మానంపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తీవ్రంగా స్పందించారు. చండీగఢ్‌ ఉమ్మడి రాజధానిగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. చండీగఢ్‌కు సంబంధించి కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయాలను ఆయన సమర్థించారు.

కేంద్రం తీసుకువచ్చిన తాజా నిబంధనల ప్రకారం..

  • చండీగఢ్‌ పరిపాలనా విభాగంతోపాటు భాక్రా బియాస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌(బీబీఎంబీ)లో పోస్టులను పంజాబ్, హరియాణాలకు చెందిన వారికి బదులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన, కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో నింపవచ్చు. 
  • చండీగఢ్‌ పరిపాలనావిభాగంలోని ఉద్యోగులకు కేంద్ర సివిల్‌ సర్వీసుల నిబంధనలు వర్తిస్తాయి.
  • చండీగఢ్‌ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు.
  • మహిళా ఉద్యోగులు తమ చిన్నారులను చూసుకునేందుకు ఇచ్చే లీవ్‌ ప్రస్తుతం ఉన్న ఏడాది నుంచి రెండేళ్లకు మార్పు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
చండీగఢ్‌ను తక్షణమే తమ రాష్ట్రానికి బదలాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసిన రాష్ట్ర అసెంబ్లీ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 01
ఎవరు    : పంజాబ్‌ అసెంబ్లీ 
ఎందుకు : చండీగఢ్‌లో ఉమ్మడి ఆస్తులు, పరిపాలనాపరమైన విషయాల్లో సమతుల్యత పాటించకుండా కేంద్రం అడ్డుపడుతోందని..

Tennis: ఆసియా–ఓసియానియా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

Sowjanya Bavisetti
సౌజన్య బవిశెట్టి

2022 బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా–ఓసియానియా మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌ క్రీడాకారిణి సౌజన్య బవిశెట్టికి చోటు లభించింది. ఆరు జట్లు బరిలోకి దిగనున్న ఈ టోర్నీ 2022, ఏప్రిల్‌ 12 నుంచి 18 వరకు టర్కీలోని అంటాల్య వేదికగా జరుగుతుంది. సానియా మీర్జా, అంకిత రైనా, రియా భాటియా, రుతుజా భోస్లే, సౌజన్యలతో కూడిన భారత జట్టు టాప్‌–2లో నిలిస్తే వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

కైనన్‌ షెనాయ్‌ ఏ క్రీడకి చెందినవాడు?
పెరూ రాజధాని లిమా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో పురుషుల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం లభించింది. హైదరాబాద్‌ షూటర్‌ కైనన్‌ షెనాయ్, శపథ్‌ భరద్వాజ్, మానవాదిత్య సింగ్‌ రాథోడ్‌లతో కూడిన భారత జట్టు ‘షూట్‌ ఆఫ్‌’లో 1–0తో దరూచి హుస్సేన్, సాండ్రో సాన్‌టిన్, జోస్‌ లుచైరిలతో కూడిన బ్రెజిల్‌ జట్టుపై గెలిచింది.

Andhra Pradesh: వైఎస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల ప్రధాన ఉద్దేశం?

Tallibidda Express

ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఎయిర్‌ కండిషన్డ్‌తోపాటు అధునాతన సౌకర్యాలతో కూడిన 500 ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను సిద్ధం చేసింది. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వేదికగా ఏప్రిల్‌ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవల ద్వారా ఏడాదికి సగటున దాదాపుగా నాలుగు లక్షల మంది లబ్దిపొందనున్నారు. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్‌ ట్రాకింగ్‌ సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రసవానంతరం తల్లికి ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద వివిధ అవసరాల కోసం రూ.5 వేలు చెల్లిస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
500 ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలు ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 01
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చేందుకు..

Human Genome Sequence: మనిషిలో సుమారు ఎన్ని వేల జీన్స్‌ ఉంటాయి?

Genome Sequence

Researchers Generate the First Complete, Gapless Sequence of a Human Genome: సంపూర్ణ మానవ జన్యు అనుక్రమణ (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌) పూర్తయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అనేక సంవత్సరాల పరిశోధన అనంతరం మానవుల పూర్తి జన్యు బ్లూప్రింట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. నిజానికి మానవ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ రెండు దశాబ్దాల క్రితమే దాదాపు పూర్తయినా, కొన్ని మిస్సింగ్‌ భాగాల అన్వేషణకు ఇంత సమయం పట్టింది. మొట్ట మొదటి పూర్తి స్థాయి మానవ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరిశోధనను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం మార్చి 31న జర్నల్‌సైన్స్‌లో ప్రచురించింది. పలువురు పరిశోధకులు టీ2టీ కన్సార్టియంగా ఏర్పడి మిస్సింగ్‌ జీనోమ్‌ను కనుగొన్నారు.

ముఖ్యాంశాలు..

  • గతంలో మిస్సైన దాదాపు 8 శాతం జీనోమ్‌ను సైతం విశ్లేషించి పూర్తి జీనోమ్‌ను తయారు చేశారు.
  • మనిషిని తయారు చేసే కొన్ని జన్యువులు ఇంతకాలం జీనోమ్‌ డార్క్‌మేటర్‌లో ఉన్నాయని, వీటిని ఇంతవరకు మిస్సయ్యామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డార్క్‌మేటర్‌లో ఉన్న జన్యువులను కనుగొనేందుకు క్రిప్టిక్‌ జెనిటిక్‌ లాంగ్వేజ్‌ ఉపయోగపడినట్లు తెలిపారు.
  • మానవ పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడంలో, జీవశాస్త్ర విశేషాల విశ్లేషణలో జీనోమ్‌ పూర్తి సీక్వెన్సింగ్‌ ఎంతగానో ఉపయోగపడనుంది.
  • వృద్ధాప్యం, నరాల బలహీనత వ్యాధులు, కాన్సర్, హృద్రోగాల్లాంటి పలు సమస్యలకు దీని ద్వారా పరిష్కారం లభించే మరిన్ని అవకాశాలు లభించాయి.

2000లో తొలి ప్రకటన..
తొలిసారి మానవ జీనోమ్‌ ముసాయిదాను వైట్‌హౌస్‌లో 2000 సంవత్సరంలో ప్రకటించారు. అంతర్జాతీయ ఫండింగ్‌తో నడిచే యూఎస్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థతో పాటు ప్రైవేట్‌ సంస్థ సెలెరా జీనోమిక్స్‌ సంస్థ కలిసి దీన్ని ప్రకటించాయి.

సుమారు 30వేల జీన్స్‌..
మానవ జీనోమ్‌ 310 డీఎన్‌ఏ సబ్‌యూనిట్లతో తయారై ఉంటుంది. అడినన్, సైటోసిన్, గ్వానైన్, థైమిన్‌ అనే బిల్డింగ్‌ బ్లాక్స్‌ వివిధ జతల్లో కూడడం ద్వారా డీఎన్‌ఏ నిర్మితిని ఏర్పరుస్తాయి. డీఎన్‌ఏ మానవ జీవనానికి అవసరమైన ప్రోటీన్ల ఉత్పత్తిని చేస్తుంది. మనిషిలో సుమారు 30వేల జీన్స్‌ ఉంటాయి. ఇవి 23 గ్రూపులుగా ఏర్పతాయి. వీటినే క్రోమోజోమ్స్‌ అంటారు. ప్రతి కణం కేంద్రకంలో ఈ క్రోమోజోమ్స్‌ ఉంటాయి.

USA: మిల్కెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ వార్షిక సదస్సులో ప్రసగించనున్న మంత్రి?

అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌లో ఉన్న బెవర్లీ హిల్టన్‌ వేదికగా ‘‘మిల్కెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ 25వ ప్రపంచ వార్షిక సదస్సు’’ను నిర్వహించనున్నారు. వివిధ రంగాలు, సరిహద్దులు, రాజకీయ గ్రూపులను అనుసంధానించాల్సిన ఆవసరాన్ని గుర్తుచేస్తూ ‘సెలబ్రేటింగ్‌ పవర్‌ ఆఫ్‌ కనెక్షన్‌’అనే అంశంపై సదస్సు జరగనుంది. ఆర్థిక, ప్రభుత్వ, ఆరోగ్యరం గాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రసంగించే ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి 3 వేల మందికిపైగా ప్రతి నిధులు వర్చువల్‌ విధానంలో హాజరవుతారు. 2022, మే 1 నుంచి 4 వరకు జరిగే ఈ సదస్సులో ప్రసంగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావుకు ఆహ్వానం అందింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న ప్రస్తుత సమయంలో ప్రపంచం పరివర్తన చెందాల్సిన తీరుపై వక్తలు ప్రసంగిస్తారని మిల్కెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ మైఖేల్‌ ఎల్‌ క్లౌడెన్‌ కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, మే 1 నుంచి 4 వరకు జరిగే మిల్కెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ 25వ ప్రపంచ వార్షిక సదస్సులో ప్రసగించనున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 01
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ    : బెవర్లీ హిల్టన్, లాస్‌ ఏంజెలిస్, అమెరికా
ఎందుకు : మిల్కెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ మైఖేల్‌ ఎల్‌ క్లౌడెన్‌ కేటీఆర్‌కు పంపిన ఆహ్వానం మేరకు..

FIFA World Cup 2022: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

FIFA 2022

అరబ్‌ దేశం ఖతర్‌ వేదికగా 2022, నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 18 వరకు జరిగే ఫిఫా ప్రపంచకప్‌–2022 టోర్నమెంట్‌ ‘డ్రా’ ఏప్రిల్‌ 1న విడుదలైంది. ఆతిథ్య దేశం ఖతర్, ఈక్వెడార్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభంకానుంది. తొలి రోజు నాలుగు మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఇప్పటికి 29 జట్లు అర్హత పొందగా... మిగతా మూడు జట్లు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల ద్వారా ఖరారవుతాయి. ప్లే ఆఫ్స్‌లో పోటీపడనున్న జట్లకూ ‘డ్రా’లో చోటు కల్పించారు. గ్రూప్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • గ్రూప్‌ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, నెదర్లాండ్స్, సెనెగల్‌. 
  • గ్రూప్‌ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, స్కాట్లాండ్‌ /వేల్స్‌/ఉక్రెయిన్‌. 
  • గ్రూప్‌ ‘సి’: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్‌. 
  • గ్రూప్‌ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ట్యునిషియా, యూఏఈ/ఆస్ట్రేలియా/ పెరూ. గ్రూప్‌ ‘ఇ’: స్పెయిన్, జర్మనీ, జపాన్, కోస్టారికా/న్యూజిలాండ్‌. 
  • గ్రూప్‌ ‘ఎఫ్‌’: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా. 
  • గ్రూప్‌ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్‌. 
  • గ్రూప్‌ ‘హెచ్‌’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, కొరియా.

జీఎస్‌ లక్ష్మి ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్‌లో ఏప్రిల్‌ 3న మహిళల వన్డే ప్రపంచకప్‌–2022 ఫైనల్‌కు భారత్‌కు చెందిన గండికోట సర్వ లక్ష్మి(జీఎస్‌ లక్ష్మి) మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన లక్ష్మి 2020లో యూఏఈలో జరిగిన పురుషుల ప్రపంచకప్‌ లీగ్‌–2 మ్యాచ్‌లకు కూడా మ్యాచ్‌ రిఫరీగా సేవలందించింది.​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 01 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

General Essay - International

Economic Crisis in Sri Lanka: పతనం అంచున శ్రీలంక ఆర్థిక వ్యవస్థ​​​​​​​​​​​

Economic Crisis in Sri Lanka: రావణుడి పాలనలో శ్రీలంక భోగభాగ్యాలతో తులతూగేదని చదివాం! కానీ ప్రస్తుత లంక పరిస్థితి మాత్రం ఆంజనేయుడు దహనం చేసిన తర్వాత లంక లాగా ఉంది. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి క్షీణించడంతో లంక ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. కరోనాతో ప్రారంభమైన ఆర్థిక కష్టాలు ఉక్రెయిన్‌ యుద్ధంతో చెప్పలేనంతగా పెరిగాయి. వీటిని దాటుకొని శ్రీలంక నిలబడుతుందా? లేక దివాలా తీస్తుందా? అని ఆర్థికవేత్తలు అనుమానపడుతున్నారు.

స్వాతంత్య్రానంతరం ఎన్నడూ చూడని మహా ఆర్థిక సంక్షోభం శ్రీలంకను చుట్టుముట్టింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు విదేశీ నిల్వలు అడుగంటి అల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదలతో  ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. విద్యార్థుల పరీక్షలు నిర్వహించేందుకు తగిన పేపర్లు లేవని ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేయడం, పెట్రోలు కోసం క్యూలో నిలబడి ఇద్దరు సామాన్య పౌరులు చనిపోవడం లంకలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ దుస్థితికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని సామాన్యుల నుంచి ప్రతిపక్షం దాకా ఆరోపిస్తున్నాయి. లంక విదేశీ మారక నిల్వల్లో క్షీణత 2020 ఆగస్టు నుంచే ఆరంభమైంది. 2021 నవంబర్‌లో ఈ నిల్వలు ప్రమాదకర హెచ్చరిక స్థాయి దిగువకు చేరాయి. జనవరి 2022లో శ్రీలంక విదేశీ నిల్వలు మరింత దిగజారి 230 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. నిల్వల తరుగుదలతో ప్రభుత్వం నిత్యావసరాల దిగుమతులు చేసుకోవడానికి, అప్పులు చెల్లించడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో త్వరలో లంక డిఫాల్ట్‌ (ఎగవేత) దేశంగా మారే ప్రమాదం ఉందన్న భయాలు పెరిగాయి. స్వతంత్రం వచ్చినప్పటినుంచి లంక విత్తలోటుతో సతమతమవుతూనే ఉంది.  2019లో ఈస్టర్‌ దాడుల ప్రభావం లంక టూరిజంపై పడి విదేశీ నిధుల రాక తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం కోవిడ్‌ లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. 2020 ఏప్రిల్, జూన్‌ కాలంలో కేంద్రబ్యాంకు విదేశీ నిధులను ఉపయోగించి 10 వేల కోట్ల డాలర్ల ప్రభుత్వ విదేశీ రుణాలను తీర్చింది. ఇలా ఉన్న నిధులు అప్పుల కింద చెల్లించాల్సిరావడం లంక పరిస్థితిని ఇక్కట్ల పాలు చేసింది.  

The Hunger Virus Multiplies: ఆకలి.. ప్రతి నిమిషానికి 11 మంది బలి!

అన్నిటికీ కొరతే
విదేశీ నిల్వల తరుగుదలకు ఇంధన ధరల పెరుగుదల తోడవడంతో దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఎక్కడ చూసినా నిత్యావసరాల కొరత కనిపిస్తోంది. వీటికి విద్యుత్‌ కోతలు, నీటి సరఫరా కోతలు తోడవుతున్నాయి. కిరాణా కొట్లు, పెట్రోల్‌ బంకులు, మెడికల్‌ షాపుల ముందు భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు. దేశంలో విదేశీ మారకం కొరత కారణంగా దిగుమతి దారులు బ్యాంకుల నుంచి ఎల్‌ఓసీ (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) పొందటం కష్టంగా మారింది. దీనివల్ల నౌకాశ్రయాల్లో కంటైనర్లు పేరుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన లేమితో పలు విద్యుత్‌ ప్లాంట్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల వ్యవసాయానికి ఉంచిన నీటిని వాడి విద్యుదుత్పాదన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని వల్ల తీవ్రమైన ఆహారకొరత ఎదురుకానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మా రంగంలో ఔషధాల కొరత తీవ్రతరమైందని లంక ఫార్మా ఓనర్ల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.  సంక్షోభ కారణంగా లంక రేటింగ్‌ను ఏజెన్సీలు మరింత డౌన్‌గ్రేడ్‌ చేసే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే ఇప్పట్లో దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్లు రావడం జరగకపోవచ్చని భయాలున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతర్గతంగా పలు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.  విత్తలోటుకు కారణమయ్యే లగ్జరీ వాహనాలు, రసాయన ఎరువులు, పసుపులాంటి ఆహార వస్తువుల దిగుమతిని నిషేధించింది.దేశీయ బ్యాంకులు కుదుర్చుకునే ఫార్వార్డ్‌ కాంట్రాక్టులపై కేంద్ర బ్యాంకు పరిమితులు విధించింది. విదేశీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల ఆకర్షణకు, చెల్లింపుల ప్రవాహం (రెమిటెన్స్‌ ఫ్లో– దేశంలోకి వచ్చే విదేశీ నిధులు) పెరుగుదలకు కీలక పాలసీలు ప్రకటించింది.  

Indian Constitution: రాజ్యాంగం నిర్మించడానికి పుట్టి, ఆ తరువాత కనుమరుగయ్యే..

విదేశీ సాయం
లంకకు సాయం చేయడం కోసం బంగ్లా, చైనాలు కరెన్సీ స్వాపింగ్‌(అసలును ఒక కరెన్సీలో, వడ్డీని మరో కరెన్సీలో చెల్లించే వెసులుబాటు) సదుపాయాన్ని పొడిగించాయి. దీంతో పాటు చైనా 70 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేసింది. ఇండియా సైతం 240 కోట్ల డాలర్ల విలువైన పలు రకాల సహాయాలు ప్రకటించింది. పాకిస్తాన్‌ సిమెంట్, బాస్మతీ రైస్, ఔషధాల సరఫరాకు ముందుకు వచ్చింది. ఖతార్‌ తదితర దేశాలు కూడా తగిన సహాయం ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్‌ సాయాన్ని అంగీకరించాలంటే పలు కఠిన షరతులను లంక అంగీకరించాల్సి వస్తుంది. బెయిల్‌ అవుట్‌ లేకుండానే తాము గట్టెక్కుతామని, పరిస్థితి త్వరలో చక్కబడుతుందని లంక ప్రభుత్వం, లంక కేంద్ర బ్యాంకు (సీబీఎస్‌ఎల్‌) ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై అటు ఆర్థికవేత్తలు, ఇటు ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. చైనా సాయం పేరిట దేశాన్ని కబళిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఐఎంఎఫ్‌ను సంప్రదిస్తామని ప్రకటించింది. 

కప్పు టీ రూ.100.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 280..

  • దేశంలో టోకు ద్రవ్యోల్బణం 15.1 శాతాన్ని, ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతాన్ని తాకాయి. ఇవి ఆసియాలోనే గరిష్టం. 
  • వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర గత అక్టోబర్‌లో 1500 రూపాయలుండగా, ప్రస్తుతం 3వేల రూపాయలకు దగ్గరలో ఉంది.  
  • పాల పౌడర్‌ ధరలు పెరగడంతో ప్రస్తుతం కప్పు టీ ధర రూ. 100కు చేరింది.
  • ఒక గుడ్డు ధర రూ.35కు చేరగా, కిలో చికెన్‌ రూ.1,000ని తాకింది.
  • లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 280ని దాటేసింది.  
  • లంక రూపాయి 30 శాతం క్షీణించి అమెరికా డాలర్‌తో మారకం 275కు చేరింది.

ఇదీ పరిస్థితి

  • 2021 నవంబర్‌నాటికి శ్రీలంక మొత్తం విదేశీ రుణాలు 3200 కోట్ల డాలర్లున్నాయి.  
  • శ్రీలంక 2021– 26 కాలంలో 2,900 కోట్ల డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. 
  • కరోనాకు ముందు లంక టూరిజం ఆదాయం 360 కోట్ల డాలర్లుండగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. 
  • లంకకు వచ్చే టూరిస్టుల్లో రష్యన్లు, ఉక్రేనియన్ల వాటా దాదాపు 25 శాతం. యుద్ధం కారణంగా వీరి రాక ఆగిపోయింది. 
  • లంక ఎగుమతుల్లో కీలకమైన తేయాకును దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా, ఉక్రేనియన్‌ కీలకం. 
  • కరోనాకు ముందు చైనా నుంచి లంకకు లక్షల్లో టూరిస్టులు వచ్చేవారు. కరోనా దెబ్బకు వీరంతా తగ్గిపోయారు.

Russia-Ukraine Conflict: ఈ యుద్ధం వెనుక ఏముంది?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Apr 2022 06:46PM

Photo Stories