Indian Constitution: రాజ్యాంగం నిర్మించడానికి పుట్టి, ఆ తరువాత కనుమరుగయ్యే..
అంబేడ్కర్ రాజ్యాంగ రచయిత కాదు. అంబేడ్కర్ మన రాజ్యాంగానికి తండ్రీ, కీలకమైన నిర్మాత కూడా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్! రచయిత కన్నా... తండ్రి, నిర్మాత గొప్పవారు. పార్లమెంటు వేరు. రాజ్యాంగ రచనా సభ వేరు. కేవలం రాజ్యాంగం నిర్మించడానికి పుట్టి, ఆ తరువాత కనుమరుగయ్యేది రాజ్యాంగ రచనా సభ.
1947, ఆగస్టు 29న అంటే మనకు స్వాతంత్య్రం వచ్చిన 14 రోజులకు రాజ్యాంగ రచనా సభ ఒక రచనా ఉప సంఘాన్ని రూపొందించింది. ప్రముఖ పరి పాలనాధికారి, న్యాయవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజ్యాంగ సభ సలహాదారు అయిన బీఎన్ రావ్ (కన్నడ) రూపొందించిన తొలి చిత్తుప్రతిని ఈ రచనా సంఘం పరిశీలించి రాజ్యాంగ సభ ముందు చర్చకు సమర్పించాలని... ఈ సంఘానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. ‘‘రాజ్యాంగ నిర్మాణం చేసిన ఘనత నాకు ఇచ్చారు, కానీ నిజంగా అది నాకు చెందదు. అందులో కొంత సర్ బీఎన్ రావ్‌కు చెందుతుంది. రాజ్యంగ సభకు ఆయన రాజ్యాంగ సలహాదారు. ఆయనే తొలి చిత్తు ప్రతి రూపొందించి మా డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలనకు సిద్ధం చేశారు’’ అని అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో చెప్పారు.
Russia-Ukraine War: ఏయే దేశాలు ఇతర దేశాలపై దురాక్రమణకు దిగాయో పరిశీలిస్తే..
అంబేడ్కర్ మహోన్నత విద్యావంతుడు. అటు ఆర్థిక శాస్త్రం, ఇటు న్యాయశాస్త్రం ఆపోశన పట్టిన వాడు. పాలనా వ్యవస్థల నిర్మాణం గురించి అధ్యయనం చేసిన వ్యక్తి. కనుక రాజ్యాంగ రచనా ఉప సంఘంలో ఉండాలని రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఈ సంఘంలో ఇతర సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, కేఎం మున్షీ, మహ్మద్ సాదుల్లా, బీఎల్ మిట్టర్ (వీరు అనారోగ్యంతో రాజీనామాచేస్తే ఎన్ మాధవరావు సభ్యులైనారు), డీపీ ఖైతాన్ (వీరు 1948లో మరణిస్తే టీటీ కృష్ణమాచార్య చేరారు). ఉప సంఘం సభ్యులు 1947 ఆగస్టు చివర తొలి సమా వేశంలో అంబేడ్కర్‌ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. గోపాలస్వామి అయ్యంగార్ రాజ్యవ్యవహారాల్లో తల మునకలై ఉన్నారు. సాదుల్లా, మాధవరావులకు డిల్లీ వాతావరణం సరిపడలేదు. పాలన, ఆయాదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనదేశంలో అప్పుడున్న ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ను విస్తరిస్తూ రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతిని న్యాయ, రాజ్యాంగ రంగాలలో నిపుణుడైన బెనెగల్ నర్సింగరావ్ రూపొందించారు. ఆ తరువాత అందులో సూత్రాలను పునర్నిర్మించడంలో కీలకమైన కృషి చేశారు. ఆయన కూడా తరువాత విదేశాల్లో ఉండిపోవడం వల్ల అందుబాటులో లేరు. ఒకరిద్దరి పాత్ర లేనే లేదు. మరి కొందరి పాత్ర స్వల్పం, మొత్తం భారం అంబేడ్కర్ పైన పడిందని టీటీ కృష్ణమాచారి చెప్పారు. అంబేడ్కర్ ఆ బాధ్యతను నిర్వహించి రాజ్యాంగ పిత అయ్యారు. మరికొన్ని ఉపసంఘాలు కూడా చాలా సహకరిం చాయి. కేంద్ర అధికారాల కమిటీకి నెహ్రూ, రాష్ట్రాల అధికారాల కమిటీకి నేతగా పటేల్, ప్రాథమిక హక్కుల కమిటీకి జేబీ కృపలానీ, ఇంకా అనేకానేక అంశాలపైన ఎన్నో ఉప సంఘాలు పనిని పంచుకున్నాయి. ప్రాథమిక హక్కుల కమిటీకి అంబేడ్కర్ ఇచ్చిన వివరమైన పత్రం చాలా కీలకమైంది. సభలో రాజనీతిజ్ఞులైన ప్రముఖులెందరో బాగా ఆలోచించి 7,635 సవరణలను ప్రతిపాదించారు. వాటిలో 2,473 సవరణలను చర్చించి ఆమోదించారు. మిగిలినవి చర్చించి తిరస్కరించారు. ప్రతి పదంపైనా, వాక్యంపైనా వివాదాలు వచ్చాయి. అన్నిటికీ అంబేడ్కర్ సమాధానం చెప్పారు. సరైనవనుకున్న వాటిని ఆమోదించారు. బీఎన్ రావ్ 243 ఆర్టికల్స్, 13 షెడ్యూళ్లతో రాజ్యాంగ చిత్తు ప్రతిని రూపొందిస్తే, అంబేడ్కర్ అధ్యక్షతన ఉన్న రచనా కమిటీ అనేక చర్చలు సవరణల తరువాత 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లతో పూర్తి చేసింది.
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్
డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ