Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 01 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Apr-1

Supreme Court: జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రారంభించిన ఫాస్టర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్దేశం?

FASTER Software

న్యాయ ఆదేశాలు జాప్యం కాకుండా వేగంగా కక్షిదారులకు చేరడానికి రూపొందించిన ఫాస్ట్, సెక్యూర్డ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డ్స్‌(ఫాస్టర్‌) సాఫ్ట్‌వేర్‌ను మార్చి 31న న్యూఢిల్లీలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రారంభించారు. అనతరం జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. ఫాస్టర్‌ వ్యవస్థ నిమిత్తం దేశవ్యాప్తంగా 1887 ఈ–మెయిల్‌ ఐడీలు సృష్టించారని, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఫాస్టర్‌ సెల్‌ ప్రారంభించారని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్‌ మోడ్‌ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేందుకు ఉపయోగపడే ఫాస్టర్‌ సాఫ్ట్‌వేర్‌ను నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) రూపొందించింది.

2021, జూలై 16న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆగ్రా సెంట్రల్‌ జైలులో నిందితుల్ని మూడు రోజుల తర్వాత కూడా విడుదల చేయలేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. న్యాయ ఆదేశాలు త్వరగా చేరకపోవడం వల్ల దోషుల విడుదలలో జాప్యాన్ని గ్రహించిన సీజేఐ జస్టిస్‌ రమణ ఈ సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు సూచనలు చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఫాస్ట్, సెక్యూర్డ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డ్స్‌(ఫాస్టర్‌) సాఫ్ట్‌వేర్‌ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 31
ఎవరు    : సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ 
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్‌ మోడ్‌ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేందుకు..

 AFSPA: సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ?

AFSPA

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్‌లోని పలు జిల్లాల్లో వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ)–1958ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు. అస్సాంలో 23 జిల్లాలు, మరో జిల్లాలో కొన్ని ప్రాంతాలు, మణిపూర్‌లో 6 జిల్లాలు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో), నాగాలాండ్‌లో 7 జిల్లాలకు(15 పోలీసు స్టేషన్ల పరిధిలో) ఈ చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మార్చి 31న ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నాగాలాండ్, అస్సాం, మణిపూర్‌లో ఏఎఫ్‌ఎస్‌పీఏ పరిధిలోని ప్రాంతాల సంఖ్యను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీని నేతృత్వంలోని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. 2022, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇది యథాతథంగా కొనసాగుతుందన్నారు.

ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుకు ఆమోదం
2021, డిసెంబర్‌లో నాగాలాండ్‌లో సైనికుల దాడిలో 14 మంది సాధారణ ప్రజలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజల వినతి మేరకు ఏఎఫ్‌ఎస్‌పీఏను ఎత్తివేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు తాజా నిర్ణయం తీసుకుంది.

ఏమిటీ చట్టం?

  • తీవ్రవాదాన్ని అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే ధ్యేయంగా ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను 1958 సెప్టెంబర్‌ 11 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. 
  • ఈ చట్టం ప్రకారం సైనిక దళాలకు కొన్ని అధికారాలు దక్కాయి. ముందస్తుగా వారంట్‌ ఇవ్వకుండానే ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. సోదాలు నిర్వహించవచ్చు. ఎవరినైనా కాల్చి చంపినా అరెస్టు, విచారణ నుంచి ప్రత్యేక రక్షణ ఉంటుంది. 
  • ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ  డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి.
  • ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త ఇరోంచాను షర్మిళ 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష కొనసాగించారు. 2015లో త్రిపురలో, 2018లో మేఘాలయాలో ఈ  చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ)–1958ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : మార్చి 31
ఎవరు    : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా
ఎక్కడ    : ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్‌లోని పలు జిల్లాల్లో..
ఎందుకు : ప్రజల ఆకాంక్ష మేరకు..

Unintended Pregnancy: వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌ను విడుదల చేసిన సంస్థ?

Pregnancy

ప్రపంచవ్యాప్తంగా ఏటా దాలుస్తున్న గర్భాల్లో దాదాపు సగం వరకు అంటే..12.1 కోట్ల గర్భాలు అవాంఛితాలేనని ఐక్యరాజ్యసమితికి చెందిన పాపులేషన్‌ ఫండ్‌(యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌) తెలిపింది. తీవ్రమైన ఈ సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ మేరకు మార్చి 30న వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌–2022 విడుదల చేసింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • అవాంఛిత గర్భం దాల్చిన వారిలో 60 శాతం వరకు అబార్షన్‌ చేయించుకుంటున్నారు. ఇందులో సుమారు 45 శాతం సురక్షితం కాని అబార్షన్లు కాగా, అబార్షన్ల సమయంలో 5 శాతం –13 శాతం వరకు మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
  • 1990–2019 మధ్య 15–49 ఏళ్ల గ్రూపులో ప్రతి వెయ్యి మంది మహిళల్లో అవాంఛిత గర్భాలు 79 నుంచి 64కు తగ్గటం కొంత ఊరట కలిగించే విషయం. అయితే, గత 30 ఏళ్లలో అవాంఛిత గర్భం దాల్చిన మహిళల సంఖ్య 13 శాతం మేర పెరిగింది. జనాభా పెరుగుదలే ఇందుకు కారణం
  • ప్రపంచవ్యాప్తంగా 25.7 కోట్ల మంది గర్భం వద్దనుకునే మహిళలు సురక్షితమైన, ఆధునిక గర్భ నిరోధక సాధనాలను వాడటం లేదు
  • మొత్తంగా 47 దేశాలకు చెందిన లైంగిక చర్యలో చురుకుగా పాల్గొనే మహిళల్లో 40 శాతం మంది ఎలాంటి గర్భనిరోధక పద్ధతులను పాటించడం లేదు
  • సంతాన సామర్థ్యం ఉన్న 64 దేశాల్లోని మహిళలపై చేపట్టిన సర్వేలో..23 శాతం మంది సెక్స్‌కు అభ్యంతరం చెప్పలేకపోతున్నారు. 
  • తమ ఆరోగ్యం గురించి 24 శాతం మంది, గర్భనిరోధకాల వాడకం విషయంలో 8 శాతం మంది సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. 
  • మొత్తమ్మీద 57 శాతం మంది మహిళలు మాత్రమే తమ లైంగిక, సంతాన సంబంధ విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు.

Spying: ఏ దేశ దౌత్యవేత్తలను బెల్జియం, నెదర్లాండ్స్‌ బహిష్కరించాయి?

Russia Flag
Russia Flag

గూఢచర్యం ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు బెల్జియం, నెదర్లాండ్స్‌ మార్చి 29న ప్రకటించాయి. 21 మంది రష్యా దౌత్యవేత్తలను రెండు వారాల్లోగా దేశం వీడాలని బెల్జియం ఆదేశించింది. నెదర్లాండ్స్‌ కూడా 17 మంది రష్యా దౌత్యాధికారులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొంది. వీరంతా నిజానికి నిఘా అధికారులని ఆరోపించింది.

నెదర్లాండ్స్‌..
రాజధాని:
ఆమ్‌స్టర్‌డామ్‌; కరెన్సీ: యూరో

బెల్జియం..
రాజధాని:
బ్రస్సెల్స్‌; కరెన్సీ: యూరో

ఐరాస హెలికాప్టర్‌ కూల్చివేత
కాంగోలో వేర్పాటువాదులు తెగించారు. ఎనిమిది మంది ఐక్యరాజ్య సమితి శాంతిదూతలు, పర్యవేక్షకులను తీసుకెళ్తున్న ఒక హెలికాప్టర్‌ను వేర్పాటువాదులు కూల్చేశారు. మార్చి 28న కాంగో తూర్పుప్రాంతంలో ఎం23 రెబల్స్‌ గ్రూప్‌ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, హెలికాప్టర్‌ జాడ, ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని కాంగో సైన్యం ప్రకటించింది. ఖనిజ సంపదతో నిండిన తూర్పు కాంగోపై పట్టు కోసం చాలా వేర్పాటువాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

ఒంటరి మహిళలకు విమానంలోకి నో ఎంట్రీ
అఫ్గానిస్తాన్‌లో మహిళలపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. మగ తోడు లేకుండా వారు ఒంటరిగా విమానాల్లో ప్రయాణించడానికి వీల్లేదని తాలిబన్లు తాజాగా హుకుం జారీ చేశారు. మార్చి 25న కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఒంటరి మహిళలను విమానమెక్కేందుకు అనుమతించలేదు.

దివయినా వార్తా పత్రిక దేశానికి చెందినది?
శ్రీలంక విదేశీమారక నిల్వలు అత్యంత కనిష్ట స్థాయిలకు దిగజారుతున్నాయి. కనీసం వార్తా పత్రికల ప్రచురణకు న్యూస్‌ ప్రింట్‌ కూడా కొనలేని దుస్థితి! దాంతో రెండు ప్రధాన పత్రికలు ది ఐలాండ్‌ (ఇంగ్లిష్‌), దివయినా (సింహళీ) ప్రచురణను నిలిపేశాయి. ఐలాండ్‌ ఈ–పేపర్‌కు పరిమితమైంది. దేశంలో నిత్యావసరాల ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. లంకకు బిలియన్‌ డాలర్ల సాయానికి భారత్‌ ముందుకొచ్చింది.

వన్నియార్లకు రిజర్వేషన్లు కుదరదు: సుప్రీంకోర్టు

తమిళనాడులోని వన్నియార్లను (వన్నియకుల క్షత్రియులు) ప్రత్యేకంగా గుర్తించేందుకు గణనీయమైన ప్రమాణాలు లేవని మార్చి 31న సుప్రీంకోర్టు వెల్లడించింది. అందువల్ల వీరికి మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌(ఎంబీసీ)ల్లో కేటాయించిన 10.5 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీరికి రిజర్వేషన్‌ ఇవ్వాలన్న సిఫార్సుకు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికన తీసుకున్నారని జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవైతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కోర్టు తీర్పు ఇలా...

  • ఎంబీసీల్లోని 115 కులాల్లో వీరిని ప్రత్యేకంగా చూసేందుకు కావాల్సిన ఆధారాలు లేవు. అందువల్ల వీరికి రిజర్వేషన్లు కల్పిస్తూ 2021లో చేసిన చట్టం ఆర్టికిల్‌ 14, 15, 16కు వ్యతిరేకం.
  • వన్నియార్లకు ప్రత్యేక రిజర్వేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని తమిళనాడు హైకోర్టు గతేడాది ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తున్నాం.
  • అంతర్గత రిజర్వేషన్లకు కులం ఒక కారణం కావచ్చు కానీ అదొక్కటే కారణం కాకూడదు.
  • ఎంబీసీ, డీఎన్‌సీలకు కేటాయించిన 20 శాతం రిజర్వేషన్లలో అంతర్గతంగా వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్‌ కేటాయించడం ఇతర వర్గాలను దెబ్బతీస్తుంది.
  • ఇప్పటికే ఈ కోటా కింద జరిపిన నియామకాలపై తాజా తీర్పు ప్రభావం ఉండదు.

Pakistan: అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని ఎవరు?

పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని కచ్చితంగా ఎదుర్కొంటానని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌(69) సంకేతాలిచ్చారు. ఆయన మార్చి 31న దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ ఫలితంతో సంబంధం లేకుండా బలీయమైన శక్తిగా తిరిగి వస్తానని చెప్పారు. తమ విధానాలు అమెరికాకు, యూరప్‌కు, భారత్‌కు వ్యతిరేకం కాదని అన్నారు. భారత్‌–పాక్‌ మధ్య ఉన్న అతిపెద్ద వివాదం కశ్మీర్‌ అంశమేనని తెలిపారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాతే భారత్‌కు పాక్‌ వ్యతిరేకంగా మారిందన్నారు.

అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని
342 మంది సభ్యులున్న పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్‌)లో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మెజారిటీని కొల్పొయారు. అవిశ్వాస తీర్మాన పరీక్షలో ఇమ్రాన్‌ ఖాన్‌ నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, తమకు 175 మంది ఎంపీలు మద్దతిస్తున్నారని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. పాకిస్తాన్‌ చరిత్రలో ఇప్పటిదాకా ఇద్దరు ప్రధానమంత్రులు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఎవరూ ఈ తీర్మానంలో ఓడిపోలేదు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో పాక్‌ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ ఖాన్‌ రికార్డుకెక్కారు. మరోవైపు పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌) సెషన్‌ ఏప్రిల్‌ 3కి వాయిదా పడింది.

FedEx: ఫెడ్‌ఎక్స్‌ సీఈవోగా నియమితులైన భారతీయ అమెరికన్‌?

Raj Subramaniam

కొరియర్‌ సేవల్లో ఉన్న యూఎస్‌ దిగ్గజం ఫెడ్‌ఎక్స్‌ నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో)గా భారతీయ అమెరికన్‌ రాజ్‌  సుబ్రమణ్యం నియమితులయ్యారు. చైర్మన్, సీఈవోగా ఉన్న ఫ్రెడరిక్‌ డబ్ల్యూ స్మిత్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారని మార్చి 29న సంస్థ వెల్లడించింది. 2022 జూన్‌ 1న స్మిత్‌ ఈ పదవి నుంచి వైదొలగనున్నారు. సుబ్రమణ్యం ప్రస్తుతం చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. 1991 ఏడాదిలో ఫెడ్‌ఎక్స్‌లో చేరిన సుబ్రమణ్యం 2020లో బోర్డులో చేరారు. ఫెడ్‌ఎక్స్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్, సీవోవో బాధ్యతలకు ముందు ఆయన ఫెడ్‌ఎక్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రెసిడెంట్, సీఈవోగా పనిచేశారు. స్మిత్‌ 1971లో ఫెడ్‌ఎక్స్‌ స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో 6,00,000పైగా ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఉన్న మెంఫిస్‌ నగరంలో ఫెడ్‌ఎక్స్‌ ప్రధాన కార్యాలయం ఉంది. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
యూఎస్‌ దిగ్గజం ఫెడ్‌ఎక్స్‌ నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో)గా నియమితులైన వ్యక్తి?  
ఎప్పుడు : మార్చి 31
ఎవరు    : భారతీయ అమెరికన్‌ రాజ్‌  సుబ్రమణ్యం
ఎక్కడ    : మెంఫిస్‌ నగరం, టెన్నెస్సీ, అమెరికా

IndiGo New CFO: ఇండిగో సీఎఫ్‌వోగా ఎవరు నియమితులయ్యారు?

Indigo

ఇండిగో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా గౌరవ్‌ నేగి నియమితులయ్యారు. తన పదవికి రాజీనామా చేసిన జితేన్‌ చోప్రా స్థానంలో నేగీ నియామకం జరిగిందని మార్చి 29న వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. నేగీ గత 2021, డిసెంబర్‌ 1వ తేదీన ఇండిగో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌– హెడ్‌ ( గవర్నెన్స్, రిస్క్‌ అండ్‌ కంప్లయన్స్‌– జీఆర్‌సీ)గా చేరారు. మరోవైపు ఎయిర్‌లైన్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్‌ రాహుల్‌ భాటియాను.. 2022, ఫిబ్రవరి 4 నుండి ఐదేళ్లపాటు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఇండిగో నియమించింది. దాదాపు 53 శాతం దేశీయ ప్రయాణీకుల మార్కెట్‌ వాటాతో, ఇండిగో భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఇండిగో ప్రధాన కార్యాలయం ఉంది.

భారత్‌ వృద్ధిపై యుద్ధం ఎఫెక్ట్‌ 0.8 శాతం
భారత్‌ ఎకానమీపై రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉందని దేశీయ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఏప్రిల్‌ 1తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను 0.8 శాతం (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో క్రితం 7.8 శాతం అంచనాలు 7.2 శాతానికి తగ్గాయి. ఈ మేరకు మార్చి 29న ఒక నివేదికను విడుదల చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండిగో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా ఎవరు నియమితులయ్యారు?
ఎప్పుడు : మార్చి 29
ఎవరు    : గౌరవ్‌ నేగి
ఎక్కడ    : గురుగ్రామ్, హరియాణ
ఎందుకు : ఇప్పటివరకు ఇండిగో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా ఉన్న జితేన్‌ చోప్రా.. తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో..​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 31 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 01 Apr 2022 06:36PM

Photo Stories