Daily Current Affairs in Telugu: 2022, మార్చి 31 కరెంట్ అఫైర్స్
WTT Star Contender: భారతీయ క్రీడాకారిణి మనిక బత్రా ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
WTT Star Contender Doha 2022: ఖతర్ రాజధాని నగరం దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జంట కాంస్య పతకం సొంతం చేసుకుంది. మార్చి 30న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మనిక–అర్చన ద్వయం 8–11, 6–11, 7–11తో చెంగ్ ఐ చింగ్–లియు జున్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో మనిక–అర్చన తమ సర్వీస్‌లో ఏకంగా 16 పాయింట్లు కోల్పోయారు.
పుట్‌బాల్ ప్రపంచకప్–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
తన కెరీర్‌లో లోటుగా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించేందుకు పోర్చుగల్ కెప్టెన్, విఖ్యాత ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు మరో అవకాశం లభించింది. 2022 ఏడాది నవంబర్–డిసెంబర్‌లలో ఖతర్ వేదికగా జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌కు పోర్చుగల్ జట్టు అర్హత పొందింది. మార్చి 30న జరిగిన యూరోపియన్ జోన్ ప్లే ఆఫ్ ఫైనల్లో పోర్చుగల్ 2–0 గోల్స్ తేడాతో నార్త్ మెసెడోనియా జట్టును ఓడించి ప్రపంచకప్ బెర్త్ సొంతం చేసుకుంది. మొత్తం 32 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు 27 జట్లు అర్హత పొందాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో కాంస్యం గెలిచిన జోడీ?
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జంట
ఎక్కడ : దోహా, ఖతర్
ఎందుకు : మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మనిక–అర్చన ద్వయం 8–11, 6–11, 7–11తో చెంగ్ ఐ చింగ్–లియు జున్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైనందున..
Banking Deal: సిటీ ఇండియాను కొనుగొలు చేయనున్న దేశీ దిగ్గజం?
అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్‌కి చెందిన భారత రిటైల్ బ్యాంకింగ్ వ్యాపార విభాగం ‘‘సిటీబ్యాంక్ ఇండియా’’ను దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ. 12,325 కోట్లుగా ఉండనుందని యాక్సిస్ బ్యాంక్ మార్చి 30న వెల్లడించింది. 2023 ప్రథమార్ధంలో డీల్ పూర్తి కాగలదని పేర్కొంది. అనుసంధాన ప్రక్రియ 2024 సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ కొనుగోలుతో యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాల సంఖ్య 2.85 కోట్లకు, బర్గండీ (ప్రీమియం) కస్టమర్లు 2.3 లక్షల పైచిలుకు, కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరతాయి. డీల్ ప్రకారం .. విలీనం పూర్తయ్యేవరకూ కస్టమర్లకు సర్వీసులు అందించినందుకు గాను రూ. 1,500 కోట్ల వరకూ సిటీ బ్యాంక్‌కు యాక్సిస్ చెల్లించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో దీటుగా పోటీపడేందుకు యాక్సిస్ బ్యాంక్‌కు ఈ కొనుగోలు ఉపయోగపడనుంది.
శతాబ్దం క్రితం సిటీగ్రూప్ ఎంట్రీ..
సిటీగ్రూప్ 1902లో భారత్‌లో అడుగుపెట్టింది. 1985లో కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. సిటీ రిటైల్ ఖాతాల పరిమాణం రూ. 68,000 కోట్లుగా ఉంది. ఇందులో రిటైల్ రుణాల ఖాతాలు రూ. 28,000 కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సిటీగ్రూప్ లాభాల్లో భారత విభాగం వాటా 1.5 శాతం స్థాయిలో ఉంది.
తొలి మహిళా సీఈవో జేన్ ఫ్రేజర్ సారథ్యంలోని సిటీబ్యాంక్ అధిక రాబడులు అందించే ఆదాయ వనరులపై దృష్టి పెట్టే క్రమంలో 13 మార్కెట్లలో రిటైల్ వ్యాపారం నుంచి నిష్క్రమించాలని గతేడాది నిర్ణయించుకుంది. భారత మార్కెట్ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే సిటీగ్రూప్ తాజా డీల్ కుదుర్చుకుంది. సిటీబ్యాంక్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సిటీ ఇండియాను కొనుగొలు చేయనున్న దేశీ దిగ్గజం?
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్
ఎందుకు : ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో దీటుగా పోటీపడేందుకు..
Lok Sabha: అకౌంటెన్సీ వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరించే బిల్లుకు ఆమోదం
చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల ఇన్‌స్టిట్యూట్‌ల పనితీరును పునరుద్ధరించే– ‘‘చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ (సవరణ) బిల్లు’’కు లోక్‌సభ మార్చి 30న ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం.. సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ల (ఐసీఏఐ– ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసీఏఐ–ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసీఎస్‌ఐ– ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) క్రమశిక్షణా కమిటీలకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నాన్–చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), నాన్–కాస్ట్ అకౌంటెంట్, నాన్–కంపెనీ సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది.
చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్, 1949, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ యాక్ట్, 1959, కంపెనీ సెక్రటరీస్ యాక్ట్, 1980లను సవరించడానికి ప్రభుత్వం తాజా బిల్లును తెచ్చింది. ఈ సవరణలు ఇన్‌స్టిట్యూట్‌లను మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీగా మార్చుతాయని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ (సవరణ) బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ఐసీఏఐ, ఐసీఏఐ, ఐసీఎస్‌ఐలను మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీగా మార్చేందుకు..
Metaverse: స్పేస్‌టెక్ పాలసీని రూపొందించిన రాష్ట్రం?
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చేదిశగా ‘స్పేస్‌టెక్ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)’ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిని 2022, ఏప్రిల్ 18న వర్చువల్ ప్రపంచమైన ‘మెటావర్స్’వేదికగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలతో..
‘స్పేస్ టెక్’కు సంబంధించి 2021, సెప్టెంబర్‌లో కొత్త పాలసీ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదాను రాష్ట్ర ఐటీ విభాగం విడుదల చేసింది. స్పేస్ టెక్నాలజీపై పట్టున్న నిపుణులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, జాతీయ సంస్థలు, స్పేస్‌టెక్ పరిశ్రమ యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పాలసీకి తుదిరూపు దిద్దుతోంది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో అంతరిక్ష రంగ ఉత్పత్తులు, సేవలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భాగస్వామ్యాలు, వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్య శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది.
‘మెటావర్స్’వేదికగా..
- ఎమర్జింగ్ టెక్నాలజీలో ఆధునికమైనదిగా భావిస్తున్న ‘మెటావర్స్’ద్వారా ‘స్పేస్‌టెక్ పాలసీ’ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
- ప్రపంచాన్ని వర్చువల్ (మిథ్య)గా మన ముందుంచే టెక్నాలజీతో రూపొందినదే ‘మెటావర్స్’.
- కృత్రిమ మేథ (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), 3డీ ఇమేజింగ్, బ్లాక్‌చెయిన్ వంటి అత్యున్నత సాంకేతికతల కలయికతో మెటావర్స్‌ను రూపొందించారు.
- ఇందులో ఎవరైనా తమ ‘అవతార్’తో వర్చువల్ ప్రపంచంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని.. నేరుగా హాజరైన అనుభూతిని పొందవచ్చు.
- 2022, ఏప్రిల్ 18న ‘మెటావర్స్’వేదికగా జరిగే ‘స్పేస్ టెక్ పాలసీ’విడుదల కార్యక్రమంలో.. రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వర్చువల్‌గా తమ ‘అవతార్’లతో పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్పేస్‌టెక్ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)ని రూపొందించిన రాష్ట్రం?
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చేదిశగా..
Order of British Empire 2021: ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్‌ను అందుకున్న భారతీయుడు?
బ్రిటిష్ రెండో అత్యున్నత ర్యాంకింగ్ అవార్డు ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్–2021’ను హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ పి.రఘురామ్ అందుకున్నారు. ఇంగ్లండ్ రాజధాని లండన్ సమీపంలోని విండ్సర్ క్యాసిల్‌లో మార్చి 30న జరిగిన వేడుకలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ చార్లెస్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన ఘనత సాధించారు. భారత్‌లో రొమ్ము కేన్సర్ నుంచి సంరక్షణ, శస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం, యూకే–భారత్ మధ్య సత్సంబంధాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు రఘురామ్ ఈ అవార్డును పొందారు. రఘురామ్ అత్యంత చిన్నవయసులో 2015లో పద్మశ్రీని, 2016లో బీసీ రాయ్ నేషనల్ అవార్డును అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఎవరు ఉన్నారు?
ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ విభాగంలో విజయనగరం జిల్లా గరివిడి పశు వైద్యశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ పుచ్చకాయల గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2016–19 మధ్య చెన్నైలోని మద్రాసు వెటర్నరీ కళాశాలలో పెంపుడు కుక్కలలో కిడ్నీ సంబంధిత వ్యాధులు, అత్యాధునిక డయాలసిస్ చికిత్స (సీఆర్‌ఆర్‌టీ) పద్ధతులపై చేసిన పరిశోధనలకు గానూ రమేష్‌కు ఈ మెడల్ వచ్చింది. తమిళనాడు వెటర్నరీ అండ్ ఏనిమల్ సైన్సెస్ వర్సిటీ 22వ స్నాతకోత్సవం సందర్భంగా చెన్నైలో మార్చి 30న జరిగిన కార్యక్రమంలో రమేష్‌కు తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ గోల్డ్‌మెడల్ అందజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్–2021ను అందుకున్న భారతీయుడు?
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ పి.రఘురామ్
ఎక్కడ : విండ్సర్ క్యాసిల్, ఇంగ్లండ్
ఎందుకు : భారత్‌లో రొమ్ము కేన్సర్ నుంచి సంరక్షణ, శస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం, యూకే–భారత్ మధ్య సత్సంబంధాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు..
UNESCO: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న కట్టడం?
విజయనగర సామ్రాజ్యాధీశుల కళాతృష్ణకు నిదర్శనంగా నిలిచే అనంతపురం జిల్లాలోని లేపాక్షి మండంలో ఉన్న లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు సాధించింది. ఈ మేరకు మార్చి 28న ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్–UNESCO) ఒక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో క్రీస్తు పూర్వం నాటి రాతి బొమ్మలు (జియోగ్లిఫ్స్), మేఘాలయలోని సహజసిద్ధ రబ్బరు చెట్ల మూలాలతో నిర్మించిన వంతెనలు (లివింగ్ రూట్ బ్రిడ్జి) కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఇప్పటివరకు..
వారసత్వ సంపదను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ ఆధ్వర్యంలో ఇటీవల లేపాక్షి విశిష్టతపై ప్రత్యేక సంచికను రూపొందించి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర పురావస్తు శాఖకు పంపారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనల్లో తొలి ప్రయత్నంలోనే లేపాక్షికి స్థానం దక్కింది. మరో ఆరు నెలల్లో తుది జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో లేపాక్షిని యునెస్కో వారసత్వ గుర్తింపు ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 32 సాంస్కృతిక, చారిత్రక కట్టడాలు, ఏడు సహజ సిద్ధ ప్రదేశాలు, ఒకటి మిశ్రమ జాబితాలో వారసత్వ హోదాను పొందాయి.
కళా కౌశలానికి ప్రతీక..
- 16వ శతాబ్దంలో 70 స్తంభాలతో నిర్మించిన లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం విజయ నగర ప్రభువుల కళాతృష్ణ, నాటి సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.
- ఆలయంలోని 69 స్థంభాలు పైకప్పు భారాన్ని మోస్తుండగా ఒక స్థంభాన్ని మాత్రం గాలిలో వేలాడేలా ఏర్పాటు చేయడం విశేషం.
- నాట్య మండపం, మధ్యయుగం నాటి నిర్మాణ చాతుర్యంతో పురాతన శివాలయం, చక్కని ఎరుపు, నీలి, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు వర్ణాల్లోని కలంకారీ చిత్రాలు శ్రీకృష్ణదేవరాయల చిత్రలేఖన అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి.
- ముఖమండçపం పైకప్పులో చిత్రీకరించిన రామాయణ, మహాభారత పౌరాణిక గాథలు ఆకట్టుకుంటున్నాయి.
- అత్యద్భుత శిల్ప కళా సౌందర్యం.. ప్రపంచంలోనే పెద్దదైన ఏక శిలా నందీశ్వరుడు.. గాలిలో వేలాడే స్థంభం.. ఏడు పడగల భారీ నాగేంద్రుడు.. అడుగడుగునా భారతీయ సంస్కృతి ప్రతి బింబించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న పురాతన కట్టడం?
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం
ఎక్కడ : లేపాక్షి మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ముల్క్ హోల్డింగ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌ను ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తి ఈఎంసీ (ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్)లో రూ.1,500 కోట్ల పెట్టుబడితో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు ముల్క్ హోల్డింగ్స్ ముందుకొచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో మార్చి 29న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సంస్థ చైర్మన్ నవాబ్ షహతాజ్ షాజీ ముల్క్, వైస్ చైర్మన్ నవాబ్ అద్నాన్ ఉల్ ముల్క్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొప్పర్తి ఈఎంసీలో మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటుచేయనున్నట్లు వారు తెలిపారు. యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) హెడ్ క్వార్టర్‌గా ముల్క్ హోల్డింగ్స్.. యూరప్, అమెరికా, ఆఫ్రికా, భారత్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది.
ముల్క్ హోల్డింగ్స్ ఏర్పాటుచేసేవి ఇవే..
కొప్పర్తి ఈఎంసీలో అల్యూమినియం కాయిల్స్ తయారీ, కాయిల్ కోటింగ్‌కు ఉపయోగించే హై పెర్ఫామెన్స్ పెయింట్స్ తయారీ, అల్యూమినియం కాయిల్ కోటింగ్ ప్రొడక్షన్ లైన్స్, ఫిల్మ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, మినరల్ కోర్స్ ప్రొడక్షన్ లైన్స్, అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్స్, మెటల్ కాంపోజిట్ మెటీరియల్స్ ప్రొడక్షన్ లైన్స్‌ను ముల్క్ హోల్డింగ్స్ ఏర్పాటుచేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.1,500 కోట్ల పెట్టుబడితో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనున్న సంస్థ?
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : ముల్క్ హోల్డింగ్స్
ఎక్కడ : కొప్పర్తి ఈఎంసీ (ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్), వైఎస్సార్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అల్యూమినియం కాయిల్స్ తయారీ, కాయిల్ కోటింగ్‌కు ఉపయోగించే ఉత్పత్తుల తయారీ కోసం..
AGU Journal: ఎర్త్ కోర్ నుంచి ఏ వాయువు లీకవుతున్నట్లు కనుగొన్నారు?
భూమి అంతర్భాగం (ఎర్త్ కోర్) నుంచి హీలియం–3 వాయువు భారీగా లీకవుతున్నట్లు తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రతిఏటా దాదాపు 2 కిలోల హీలియం–3 వాయువు భూమి నుంచి లీకవుతోందని చెప్పారు. భూ లోపలి పొరల్లోని ఈ లీకేజీపై మరింత అధ్యయనం జరపాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లీకవుతున్న హీలియం వాయువు, భూమి పుట్టుకపై కొత్త ఆధారాలనిస్తోంది.
- హీలియం వాయువు నక్షత్రాల పుట్టుకకు కారణమైన నెబ్యులాలో ఎక్కువగా కనిపిస్తుంది. నెబ్యులా (నక్షత్ర ధూళి)లో హైడ్రోజన్, హీలియం అధికంగా ఉంటాయి. ఇవి క్రమంగా స్వీయ ఆకర్షణకు గురై ధూళి, వాయువులుగా మారతాయి. అనంతరం ఆయా అణువుల మధ్య మరింత ఆకర్షణ పెరిగి ఘనపదార్థ్ధాలుగా మారతాయి. ఘనపదార్థ్ధం సైజు పెరిగే కొద్దీ దాని గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి) పెరుగుతుంది.
- మరి భూమి కూడా ఇలాగే ఏర్పడి ఉంటే వాతావరణంలో భారీగా హీలియం ఉండాల్సిఉంటుంది. అయితే 400 కోట్ల సంవత్సరాల క్రితం ఏదో ఒక భారీ అంతరిక్ష శిల భూమిని ఢీకొట్టి ఉంటుందని, అప్పుడు భూవాతావరణంలో మరియు ఉపరితలంలో ఉన్న హీలియం అంతరిక్షంలోకి మాయమై ఉంటుందని సైంటిస్టులు వివరిస్తున్నారు.
సోలార్ నెబ్యులా నుంచి పుట్టుక
- భూ అంతర్భాగంలో హీలియం–3 వాయువు కనిపించడంతో భూమి సోలార్ నెబ్యులా నుంచి పుట్టిందనేందుకు బలమైన ఆధారంగా సైంటిస్టులు పేర్కొన్నారు. కోట్లాది సంవత్సరాల క్రితం భూ ఆవిర్భావం జరిగింది. కానీ అది ఎలా జరిగిందనే విషయమై పలు అంచనాలున్నాయి.
- తాజా ఆధారంతో బిగ్‌బ్యాంగ్ అనంతరం సూర్యుడి పుట్టుక సందర్భంగా భూమి కూడా ఆవిర్భవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హీలియం–3 వాయువు నిల్వలు ఇంకా భూమి అంతర్భాగంలో భారీగా ఉండొచ్చని భావిస్తున్నారు. తాజా పరిశోధన వివరాలను అమెరికన్ జియోఫిజికల్ యూనియన్(ఏజీయూ) జర్నల్‌లో ప్రచురించారు.
- హీలియం–3తో పాటు యురేనియం, థోరియం క్షీణతతో పలు మూలకాలు ఏర్పడి భూమి రూపుదిద్దుకొని ఉండొచ్చని పరిశోధనలో వెల్లడించారు.
- కేవలం ట్రిటియం అణువు రేడియోధార్మిక క్షీణత వల్ల మాత్రమే హీలియం–3 ఏర్పడుతుంది. నక్షత్ర ధూళిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
Celebrity Brand Valuation: భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచిన వ్యక్తి?
Celebrity Brand Valuation Report 2021: 2021 ఏడాదికి సంబంధించి భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకుముందు ఏడాది 2020తో పోలిస్తే కోహ్లీ సంపద తగ్గినా సెలబ్రిటీలందరితో పోలిస్తే బ్రాండ్ విలువ పరంగా ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 23.77 కోట్ల డాలర్లుండగా, 2021లో 18.57 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,400 కోట్లు) పరిమితమైంది. కన్సల్టెన్సీ సంస్థ డఫ్ అండ్ ఫెల్ఫస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితా ప్రకారం... కోహ్లీ తర్వాత స్థానాన్ని 15.83 కోట్ల డాలర్లతో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఆక్రమించారు. రణ్‌వీర్ తర్వాత 13.96 కోట్ల డాలర్లతో హిందీ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ నిలిచారు. ఒలింపిక్ విజేత పీవీ సింధు 2.2 కోట్ల డాలర్లతో 20వ స్థానం దక్కించుకున్నారు.
సెలబ్రిటీ |
ర్యాంక్ |
బ్రాండ్ విలువ(కోట్ల డాలర్లలో..) |
విరాట్ కోహ్లీ |
1 |
18.57 |
రణ్‌వీర్ సింగ్ |
2 |
15.83 |
అక్షయ్ కుమార్ |
3 |
13.96 |
ఆలియా భట్ |
4 |
6.81 |
ఎంఎస్ ధోనీ |
5 |
6.12 |
అమితాబ్ |
6 |
5.42 |
దీపికా పదుకోన్ |
7 |
5.16 |
సల్మాన్ ఖాన్ |
8 |
5.16 |
ఆయుష్మాన్ ఖురానా |
9 |
4.93 |
హృతిక్ రోషన్ |
10 |
4.85 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాదిలో అత్యంత విలువైన సెలబ్రిటీగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : కన్సల్టెన్సీ సంస్థ డఫ్ అండ్ ఫెల్ఫస్
ఎక్కడ : భారత్చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 31 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్