Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 30 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Mar-30

Chief Minister of Goa: గోవా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత?

Pramod Sawant

గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. బాంబోలిమ్‌ నగరంలోని ఒక స్టేడియంలో మార్చి 28న జరిగిన కార్యక్రమంలో సావంత్‌ చేత గోవా గవర్నర్‌ పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో సావంత్‌ బల పరీక్షలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది.

గోవా అసెంబ్లీ స్పీకర్‌గానూ..
1973, ఏప్రిల్‌ 24న గోవాలో జన్మించిన ప్రమోద్‌ సావంత్‌ మహారాష్ట్రలోని కోల్హాపూర్‌ ఆయుర్వేద వైద్య విద్యనభ్యసించి కొంతకాలం వైద్యుడిగా పనిచేశారు. ఆరెస్సెస్‌లో పనిచేసిన ఆయన బీజేపీలో యువజన నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఉత్తర గోవాలోని సంఖాలిమ్‌ నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా 2022 ఏడాది ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోవా అసెంబ్లీ స్పీకర్‌గా 2017, మార్చి 22 నుంచి 2019, మార్చి 18 వరకు పనిచేశారు. 2019, మార్చి 19న తొలిసారి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఇటీవల గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 20 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. జీఎఫ్‌పీతో కూడిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూటమి 12 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

గోవా ఎన్నికల ఫలితాలు (మొత్తం సీట్లు 40)

పార్టీ

సంవత్సరం

 

2022

2017

బీజేపీ

20

13

కాంగ్రెస్

11

17

ఆమ్‌ ఆద్మీ పార్టీ

2

0

ఎంజీపీ

2

3

తృణమూల్

1

0

ఎన్సీపీ

0

1

జీఎఫ్‌పీ

1

3

ఇతరులు

3

3

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం 
ఎప్పుడు  : మార్చి 28
ఎవరు    : బీజేపీ నేత ప్రమోద్‌ సావంత్‌
ఎక్కడ    : బాంబోలిమ్, గోవా
ఎందుకు : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 20 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో..

BRBNMPL: నోట్ల తయారీ ఇంక్‌ యూనిట్‌ ‘వర్ణిక’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?​​​​​​​

former CAG Vinod Rai

కర్ణాటక రాష్ట్రం మైసూరులో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌) ఏర్పాటు చేసిన ఇంక్‌ తయారీ యూనిట్‌–  ‘వర్ణిక’ను మార్చి 28న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ జాతికి అంకింతం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్ణికతో  నోట్ల తయారీ వ్యవస్థలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించినట్లైందన్నారు. దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి గణనీయంగా తగ్గనుందని తెలిపారు. సమీప భవిష్యత్తులో నోట్ల తయారీలో 100 శాతం స్వయం సమృద్ధిని సాధించేందుకు నిరంతర (సుశిక్షత మానవ వనరులు, ప్రక్రియ, సాంకేతికత, సామర్థ్యం పరంగా) పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు.

ఎల్‌డీసీకి శంకుస్థాపన..
మైసూరులో బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌ లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఎల్‌డీసీ)కు కూడా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శంకుస్థాపన చేశారు. దేశంలోని కరెన్సీ ఉత్పత్తి, ఈ విభాగంలో  మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎల్‌డీసీ ఏర్పాటు ఎంతో కీలకమవుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ కేంద్రం గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా ఆవిర్భవించనుందని కూడా తెలిపారు.

వర్ణిక ప్రత్యేకతలు..

  • ఆర్‌బీఐ నియంత్రణలోని బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌ నోట్ల భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించి వర్ణికను ఏర్పాటు చేసింది. 
  • ఈ యూనిట్‌ వార్షిక ఇంక్‌ తయారీ సామర్థ్యం 1,500 మెట్రిక్‌ టన్నులు. 
  • కలర్‌ షిఫ్ట్‌ ఇంటాగ్లియో ఇంక్‌ (సీఎస్‌ఐఐ)ని కూడా వర్ణిక తయారు చేస్తుంది.
  • భారతదేశంలోని బ్యాంక్‌ నోట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ల పూర్తి అవసరాలను తీరుస్తుంది. దీని ఫలితంగా బ్యాంక్‌ నోట్‌ ఇంక్‌ ఉత్పత్తిలో వ్యయాలు తగ్గుతాయి.  సామర్థ్యం మెరుగుపడుతుంది. తద్వారా ఈ విషయంలో దేశం ఎంతో స్వయం సమృద్ధి సాధించినట్లయ్యింది.  
  • ఈ యూనిట్‌ ఏర్పాటు  ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ చొరవకు ఊతమిస్తోందని, నోట్ల ప్రింటింగ్‌ ఇంక్‌ను అవసరమైన పరిమాణంలో దేశీయంగానే ఉత్పత్తి చేయడానికి ఈ యూనిట్‌ ఊతం ఇస్తుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌) ఏర్పాటు చేసిన ఇంక్‌ తయారీ యూనిట్‌–  ‘వర్ణిక’ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 28
ఎవరు    : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ 
ఎక్కడ    : మైసూరు, కర్ణాటక
ఎందుకు : భారతదేశంలోని బ్యాంక్‌ నోట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ల పూర్తి అవసరాలను తీర్చేందుకు..​​​​​​​

Comptroller and Auditor General of India: కల్యాణ్‌ జువెల్లర్స్‌ చైర్మన్‌గా నియమితులైన మాజీ కాగ్‌?

former CAG Vinod Rai

ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్‌ జువెల్లర్స్‌ ఇండియా.. చైర్మన్, స్వతంత్ర నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వినోద్‌ రాయ్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని మార్చి 29న కల్యాణ్‌ జువెల్లర్స్‌ వెల్లడించింది. నియంత్రణ సంస్థ, షేర్‌హోల్డర్ల ఆమోదానికి లోబడి ఈ నియామకం ఉంటుందని పేర్కొంది. టీఎస్‌ కల్యాణరామన్‌ ఇకపైనా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారని వివరించింది. కల్యాణ్‌ జువెల్లర్స్‌ ప్రధాన కార్యాలయం కేరళలోని త్రిస్సూర్‌లో ఉంది.

పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత..
ఐక్యరాజ్యసమితి ఎక్స్‌టర్నల్‌ ఆడిటర్ల కమిటీకి చైర్మన్‌గా కూడా వినోద్‌ రాయ్‌ గతంలో వ్యవహరించారు. అలాగే కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల్లోనూ వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశీయంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటైన బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. దేశానికి అందించిన సేవలకు గాను ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

అసోచామ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి వ్యక్తి?
అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (అసోచామ్‌) ప్రెసిడెంట్‌గా రెన్యూ పవర్‌ ఫౌండర్‌ చైర్మన్, సీఈవో సుమంత్‌ సిన్హా బాధ్యతలు చేపట్టారు. ఆత్మనిర్భర్‌ సాధన దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అసోచామ్‌ నూతన సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ నియమితులయ్యారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్‌ జువెల్లర్స్‌ ఇండియా చైర్మన్‌గా నియమితులైన మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)? 
ఎప్పుడు : మార్చి 28
ఎవరు    : వినోద్‌ రాయ్‌
ఎక్కడ    : త్రిస్సూర్, కేరళ
ఎందుకు : కల్యాణ్‌ జువెల్లర్స్‌ సంస్థ, వినోద్‌ రాయ్‌ మధ్య కుదిరిన అంగీకారం మేరకు..

Ministry of Finance: భారత ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది?

Liabilities

భారత ప్రభుత్వ రుణ భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) డిసెంబర్‌ త్రైమాసికం ముగిసే నాటికి అంతక్రితం త్రైమాసికంతో (సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌) పోల్చితే 2.15 శాతం పెరిగి రూ.128.41 లక్షల కోట్లకు చేరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ రుణ నిర్వహణ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది.  గణాంకాల ప్రకారం,  ఈ విలువలు రెండు త్రైమాసికాల్లో రూ.1,25,71,747 కోట్ల నుంచి రూ.1,28,41,996 కోట్లకు ఎగశాయి. మొత్తం రుణాల్లో (కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి చెల్లించాల్సిన) పబ్లిక్‌ డెట్‌ వాటా ఈ కాలంలో 91.15 శాతం నుంచి 91.60 శాతానికి ఎగసింది. 

Yadadri Temple: యాదాద్రి నరసింహస్వామి ఆలయం ఏ జిల్లాలో ఉంది?

తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరి గుట్ట మండలంలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుతోపాటు మంత్రులు, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో యాదాద్రికి తరలివచ్చి నారసింహుడి సేవలో పాల్గొన్నారు. 

Chess: ఢిల్లీ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన ఆటగాడు?​​​​​​​

Arjun Erigaisi

భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో మార్చి 29న ముగిసిన ఢిల్లీ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ–2022లో భారత యువతార, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ చాంపియన్‌గా అవతరించాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరతకోటి మూడో స్థానాన్ని దక్కించుకోగా... తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ డి.గుకేశ్‌ రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత 10 రౌండ్ల తర్వాత అర్జున్, గుకేశ్, హర్ష భరతకోటి 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. అర్జున్‌కు ‘టాప్‌’ ర్యాంక్‌ ఖాయమవ్వగా ... గుకేశ్‌కు రెండో స్థానం, హర్షకు మూడో స్థానం లభించాయి. విజేతగా నిలిచిన అర్జున్‌కు రూ. 4 లక్షలు ... రన్నరప్‌ గుకేశ్‌కు రూ. 3 లక్షల 50 వేలు.. మూడో స్థానం పొందిన హర్షకు రూ. 3 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. వరంగల్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్‌ ఇటీవల జాతీయ సీనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఢిల్లీ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ–2022లో చాంపియన్‌గా నిలిచిన ఆటగాడు?
ఎప్పుడు  : మార్చి 28
ఎవరు    : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : మెరుగైన స్కోరుతో అగ్రస్థానంలో నిలిచినందున..

Formula 1 Race: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్‌ డ్రైవర్‌?​​​​​​​

Max Verstappen

2022 ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌ రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా మార్చి 28న జరిగిన ఈ రేసులో.. 50 ల్యాప్‌ల ప్రధాన రేసును 24 ఏళ్ల వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 19.293 సెకన్లలో పూర్తి చేసి తన కెరీర్‌లో 21వ విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీ డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ రెండో స్థానంలో నిలువగా... కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఏప్రిల్‌ 10న జరుగుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్‌ డ్రైవర్‌? 
ఎప్పుడు : మార్చి 28
ఎవరు    : ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌
ఎక్కడ    : జెద్దా, సౌదీ అరేబియా
ఎందుకు : 50 ల్యాప్‌ల ప్రధాన రేసును 24 ఏళ్ల వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 19.293 సెకన్లలో పూర్తి చేసినందున..

Oscars Winners 2022: 94వ అకాడమీ అవార్డుల పూర్తి జాబితా

Oscars 2022

2021 సంవత్సరానికిగాను ఆస్కార్‌ అవార్డులను అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సెన్సైస్‌ (Academy of Motion Picture Arts and Sciences-AMPAS) 2022, మార్చి 28న ప్రదానం చేసింది. అమెరికాలో లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 94వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకున్నారు. కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా (2020, 2021) పెద్దగా సందడి లేకుండా జరిగిన ఆస్కార్‌ అవార్డుల వేడుక ఈసారి కోలాహలంగా జరిగింది.

ముఖ్యాంశాలు..

  • ఉత్తమ చిత్రంగా ‘కోడా’ అవార్డును గెలుచుకోగా, ఉత్తమ నటుడిగా ‘కింగ్‌ రిచర్డ్స్‌’ సినిమాకి విల్‌ స్మిత్‌ , ఉత్తమ దర్శకురాలిగా ‘ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’కి జెయిన్‌ కాంపియన్‌ ఆస్కార్‌ను అందుకున్నారు.
  • నామినేట్‌ అయిన మూడు విభాగాల్లోనూ (బెస్ట్‌ పిక్చర్, బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌) ‘కోడా’ చిత్రం అవార్డులను దక్కించుకుంది.
  • 12 ఆస్కార్‌ నామినేషన్స్‌ను దక్కించుకున్న ‘ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’ కేవలం ఒకే ఒక్క (బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీ) అవార్డుతో సరిపెట్టుకుంది.
  • పది నామినేషన్లు దక్కించుకున్న ‘డ్యూన్‌’ చిత్రం ఆరు ఆస్కార్‌ అవార్డులను చేజిక్కించుకుంది.
  • మరోవైపు బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌గా జపాన్‌ ఫిల్మ్‌ ‘డ్రైవ్‌ మై కార్‌’ నిలిచింది.
  • ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో భారత్‌ నుంచి రింటూ థామస్‌ దర్శకత్వం వహించిన ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ నామినేషన్‌ దక్కించుకున్నా ఆస్కార్‌ తేలేక పోయింది. ఈ విభాగంలో ‘సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌’ అవార్డు దక్కించుకుంది.
  • అవార్డు వేడుక నిడివి తగ్గించే క్రమంలో ముందు ప్రకటించినట్లుగానే ఎనిమిది విభాగాలకు(మానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్, ఫిల్మ్‌ ఎడిటింగ్, లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్, మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టయిల్, ఒరిజినల్‌ స్కోర్, ప్రొడక్షన్‌ డిజైన్‌ అండ్‌ సౌండ్‌)చెందిన అవార్డులను ముందే అందజేసి, లైవ్‌ టెలికాస్ట్‌లో చూపించారు.

​​​​​​​94 ఆస్కార్‌ విజేతల జాబితా

  • ఉత్తమ చిత్రం – చైల్డ్‌ ఆఫ్‌ డెఫ్‌ అడల్ట్స్‌ (కోడా)
  • ఉత్తమ నటుడు – విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)
  • ఉత్తమ నటి –  జెస్సికా చేస్టన్‌ (ద ఐస్‌ ఆఫ్‌ టామీ ఫే)
  • ఉత్తమ దర్శకురాలు – జెయిన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ద డాగ్‌)
  • ఉత్తమ సహాయ నటి – అరియానా దిబోస్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)
  • ఉత్తమ సహాయ నటుడు – ట్రాయ్‌ కోట్సర్‌ (కోడా)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ – గ్రెగ్‌ ఫ్రెజర్‌ (డ్యూన్‌)
  • బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ – నో టైమ్‌ టు డై
  • బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌– సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌
  • బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే– కోడా  (సియాన్‌ హెడెర్‌)
  • బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే – బెల్‌ఫాస్ట్‌ (కెన్నత్‌ బ్రానా)
  • బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – జెన్నీ బీవన్‌ (క్రూయెల్లా)
  • బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ – డ్రైవ్‌ మై కార్‌ (జపాన్‌)
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ – ఎన్‌కాంటో
  • బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ – హన్స్‌ జిమ్మర్‌ (డ్యూన్‌)
  • బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – డ్యూన్‌ (పాల్‌ లాంబర్ట్, ట్రిస్టన్‌ మైల్స్, బ్రియన్‌ కానర్, గెర్డ్‌ నెఫ్‌జర్‌)
  • బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌ – జో వాకర్‌ (డ్యూన్‌)
  • బెస్ట్‌ సౌండ్‌ – డ్యూన్‌ (మాక్‌ రూత్, మార్క్‌ మాంగిని, థియో గ్రీన్, డగ్‌ హెంఫిల్, రాన్‌ బార్ట్‌లెట్‌)
  • బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ – డ్యూన్‌ (ప్రొడక్షన్‌ డిజైన్‌– పాట్రైస్‌ వెర్మట్, సెట్‌ డెకరేషన్‌– జుజానా సిపోస్‌)
  • బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌ – ద ఐస్‌ ఆఫ్‌ ది టామీ ఫే (లిండా డౌడ్స్, స్టెఫనీ ఇన్‌గ్రామ్, జస్టిన్‌ రాలే)
  • బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం: ది లాంగ్‌ గుడ్‌ బై
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: ది విండ్‌షీల్డ్‌ పైపర్‌
  • బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: ద క్వీన్‌ ఆఫ్‌ బాస్కెట్‌బాల్‌

Padma Awards 2022: పద్మ అవార్డుల ప్రదానోత్సవం​​​​​​​

Kovind with Krishna Ella and Suchitra Ella
పద్మభూషణ్‌ అందుకుంటున్న కృష్ణ ఎల్ల దంపతులు 

2022 ఏడాది పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం మార్చి 28న రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో జరిగింది. మార్చి 21న తొలి విడతలో 54 మందికి అవార్డులు ఇవ్వగా.. మార్చి 28న 74 మందికి పురస్కారాలు అందజేశారు. అందులో నలుగురు తెలుగువారు ఉన్నారు. భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్ల ఇద్దరికి సంయుక్తంగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందజేశారు. కూచిపూడి నాట్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డి, కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్య కూడా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు.

మొత్తం 128 అవార్డులు..
ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు విడతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐలు ఉండగా, 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురు..

  • తెలుగు రాష్ట్రాల నుంచి 2022 ఏడాది ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఉన్నారు.
  • పద్మ భూషణ్‌ అవార్డుకు తెలంగాణ నుంచి భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు)లను పద్మశ్రీ వరించింది.  
  • ఆంధ్రప్రదేశ్‌ నుంచి గోసవీడు షేక్‌ హాసన్‌ (కళలు) (మరణానంతరం), డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం), గరికపాటి నరసింహారావు (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించింది. 

పద్మ పురస్కారాలు–2022

పద్మ విభూషణ్‌ విజేతలు(4)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం/దేశం/యూటీ

1

జనరల్‌ బిపిన్‌ రావత్‌ (మరణానంతరం)

సివిల్‌ సర్వీసులు

ఉత్తరాఖండ్‌

2

రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం)

విద్య మరియు సాహిత్యం

ఉత్తర ప్రదేశ్‌

3

కల్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం)

ప్రజా వ్యవహారాలు

ఉత్తర ప్రదేశ్‌

4

ప్రభా ఆత్రే

కళలు

మహారాష్ట్ర

పద్మ భూషణ్‌ విజేతలు(17)

సంఖ్య

పేరు

రాష్ట్రం/దేశం/యూటీ

రంగం

1

గులాం నబీ ఆజాద్‌

ప్రజా వ్యవహారాలు

జమ్మూ, కశ్మీర్‌ 

2

విక్టర్‌ బెనర్జీ

కళలు

పశ్చిమ బెంగాల్‌

3

గుర్మీత్‌ బవ (మరణానంతరం)

కళలు

పంజాబ్‌

4

బుద్ధదేవ్‌ భట్టాచర్య

ప్రజా వ్యవహారాలు

పశ్చిమ బెంగాల్‌

5

నటరాజన్‌ చంద్రశేఖరన్‌

వాణిజ్యం, పరిశ్రమలు 

మహారాష్ట్ర

6

కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులు

వాణిజ్యం, పరిశ్రమలు

తెలంగాణ

7

మధుర్‌ జాఫ్రి

ఇతరములుపాకశాస్త్రం

అమెరికా

8

దేవేంద్ర ఝఝారియా

క్రీడలు

రాజస్థాన్‌

9

రషీద్‌ ఖాన్‌

కళలు

ఉత్తర ప్రదేశ్‌

10

రాజీవ్‌ మెహ్రిషి

సివిల్‌ సర్వీసులు

రాజస్థాన్‌

11

సత్య నాదేళ్ల

వాణిజ్యం, పరిశ్రమలు

అమెరికా

12

సుందర్‌ పిచాయ్‌

వాణిజ్యం, పరిశ్రమలు

అమెరికా

13

సైరస్‌ పూనావాలా

వాణిజ్యంపరిశ్రమలు

మహారాష్ట్ర

14

సంజయ రాజారాం (మరణానంతరం)

సైన్స్, ఇంజనీరింగ్‌

మెక్సికో

15

ప్రతిభా రే

విద్య, సాహిత్యం

ఒడిశా

16

స్వామి సచ్చిదానంద్‌

విద్య, సాహిత్యం

గుజరాత్‌

17

వశిష్ట త్రిపాఠి

విద్య, సాహిత్యం

ఉత్తర ప్రదేశ్‌

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, మార్చి 28 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

General Eassy - Polity

​​​​​​​​​​​​​​Fundamental Rights: అడిగే హక్కు ప్రాణ హక్కు కన్నా గొప్పదా అంటే..?

1215లో మెగ్నా కార్టా అనే హక్కుల ప్రకటన ఉద్యమం ప్రారంభం అయినప్పుడు మొట్టమొదట అడిగిన హక్కు ‘అడిగే హక్కు’. దాన్ని ‘రైట్‌ టు పిటిషన్‌’ అంటారు. అడిగే హక్కు ప్రాణ హక్కు కన్నా గొప్పదా అంటే సమాధానం... అవును. అడిగే హక్కు ఒక్కటి ఇస్తే అందులో ప్రాణ హక్కు అడుగుతాం, అభివృద్ధి హక్కు అడుగుతాం. ఇంకేం కావాలన్నా అడగవచ్చు. ఆ అడిగే హక్కు ఇప్పుడు భావప్రకటనా స్వాతంత్య్రం.‘‘నాకు తెలుసుకునే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, అంతరాత్మ చెప్పినట్టు వాదించే స్వేచ్ఛ ఇవ్వు. అదే అన్నిటికన్నా గొప్ప స్వేచ్ఛ’’ అంటాడు మిల్టన్‌.

Economic Crisis in Sri Lanka: పతనం అంచున శ్రీలంక ఆర్థిక వ్యవస్థ

అభిప్రాయాలు, ఆలోచనలు అందరికీ ఉంటాయి. కనుక చెప్పే హక్కు సహజమైన హక్కే. చెప్పిందే చెప్పినా ఫరవాలేదు, చెబుతూ పోవడమే కర్తవ్యం. చెప్పకుండా నోరుమూసుకుని కూర్చుంటే అన్ని అన్యాయాలను ఆమోదించినట్టే! మౌనం అర్ధాంగీకారం అంటారు. కాదు. మౌనం సంపూర్ణాంగీకారం...

ఉక్రెయిన్‌పై రష్యా దౌర్జన్య యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానం ప్రతిపాదించినపుడు ఎన్నడూ లేని సమైక్యత పాటించిన మనమూ, మన ఇరుగు పొరుగూ... పాకిస్తాన్, చైనా; మరో 32 దేశాలు తటస్థంగా ఉన్నాయి. దాని అర్థం రష్యా మానవ హనన సమరాన్ని సంపూర్ణంగా సమర్థించినట్టే. ఇది దురదృష్టకరం. కనీసం ఇకనైనా యుద్ధాన్ని ఆపాలని అడిగి... ధర్మం, న్యాయం పాటిస్తే బాగుండేది. మానవత్వపు విలువల వలువలను దుశ్శాసనులు ఊడదీస్తుంటే భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు మౌనం పాటించడాన్ని తటస్థవైఖరి అంటారా ఎవరైనా? తటస్థ వైఖరి వల్ల ఎవరికి లాభమో వారిని సమర్థించినట్టే. మౌనం కూడా ఒక వ్యాఖ్యానమే, భావవ్యక్తీకరణే.

Russia-Ukraine Conflict: ఈ యుద్ధం వెనుక ఏముంది?

ఐక్యరాజ్యసమితి 1948 మానవ హక్కుల ప్రకటన ఆర్టికల్‌ 19లో భావవ్యక్తీకరణ సహజ హక్కును గుర్తించింది. ప్రతి వ్యక్తీ అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కూ, వ్యక్తం చేసే హక్కూ కలిగి ఉంటాడు. ఉండాలి. మనిషికి ప్రతివాడి గురించీ తీర్పులు ఇవ్వడం అలవాటు. సోషల్‌ మీడియాలో బాధ్యతారహితమైన తీర్పులు ఇస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. వీటి వల్ల ఈ స్వేచ్ఛకే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. 

అంబేడ్కర్‌ తన ఆలోచనా స్వేచ్ఛనూ, అనుభవాల నుంచి నేర్చుకున్న అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛనూ విరివిగా వాడుకున్నారు. లాహోర్‌ తీర్మానం (1940)లో ముస్లింలీగ్‌ పాకిస్తాన్‌ వేర్పాటును డిమాండ్‌ చేసిన తరువాత అంబేడ్కర్‌ 400 పేజీలలో ‘థాట్స్‌ ఆన్‌ పాకిస్తాన్‌’ అనే పుస్తకం రాశారు. అందులో పాకిస్తాన్‌ అనే బీజం పుట్టుక, వికాసం గురించి విశ్లేషించారు. హిందువులు పాకిస్తాన్‌ను ముస్లింలకు ఇవ్వాలని వాదించారు. పంజాబ్, బెంగాల్‌ ప్రదేశాలను హిందూ ముస్లిం నివాసాలను బట్టి పునర్విభజించాలని సూచించారు. ఒక దశాబ్దం పాటు ఈ ఆలోచనలు అనేక చర్చలకు దారితీశాయి. ముస్లిం లీగ్, కాంగ్రెస్‌ల మధ్య చర్చలకు అంబేడ్కర్‌ ఆలోచనలు ప్రాతిపదిక అయినాయి. చివరకు భారతదేశ విభజన తప్పలేదు.

అభిప్రాయ ప్రకటన హక్కులో ఎవ్వరి జోక్యం లేకుండా అభిప్రాయాలను కలిగి ఉండడం, ప్రాదేశిక హద్దులకు అతీతంగా ఏ మాధ్యమం ద్వారానైనా సమాచారాన్నీ, అభిప్రాయాలనూ అడిగి, స్వీకరించి, బోధించే స్వాతంత్య్రం ఈ హక్కులో ఉంటాయని ఆర్టికల్‌ 19 వివరిస్తుంది. 

సహజ హక్కు అంటే ప్రజలందరికీ ఉండాలి. కానీ మన రాజ్యాంగం పౌరులకు మాత్రమే ఈ హక్కు పరిమితం చేసింది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం తను పౌరుడినని రుజువు చేసుకోలేకపోతే ఆ భారతీయుడు కోల్పోయే తొలి ప్రధానమైన హక్కు ఇదే. (చదవండి: అకడమిక్‌ బ్యాంకు క్రెడిట్‌.. విద్యార్థికి మేలే గానీ...)

Indian Constitution: రాజ్యాంగం నిర్మించడానికి పుట్టి, ఆ తరువాత కనుమరుగయ్యే..

​​​​​​​ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన... వ్యక్తులందరికీ ఈ స్వేచ్ఛ ఉండాలనీ, అనేక మాధ్యమాలు ఉండవచ్చుననీ, ఈ స్వేచ్ఛకు దేశాల సరిహద్దులు ఉండవనీ, ఇందులో సమాచార హక్కు, ఇతరుల నుంచి సమాచారం పొంది ఇతరులకు పంచే హక్కు కూడా ఉంటాయనీ; ఇతరుల అభిప్రాయాలు కోరి, విని, స్వీకరించి, ఇతరులతో పంచుకునే హక్కు కూడా ఉంటుందనీ వివరించింది. అభిప్రాయ స్వేచ్ఛకు చాలా విస్తృతి ఉన్నది. మన రాజ్యాంగంలో ఈ హక్కుపై చాలా పరిమితులు ఉన్నాయి. మొదటి పరిమితి కేవలం పౌరులకే ఇవ్వడం. ఇందులో సమాచార హక్కు కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాలలో చెప్పింది. 2005 దాకా దాన్ని పట్టించుకోలేదు.

విభిన్న స్థాయుల్లో శాస్త్రీయ పరిశోధన చేసేందుకు, ప్రచురించేందుకు తగిన స్వేచ్ఛ ఉండాలి. దాన్ని శాస్త్రీయ స్వేచ్ఛ అంటారు. 1766లో పత్రికా స్వేచ్ఛ చట్టాన్ని స్వీడన్‌ అమలు చేసింది. ఇదే సమాచార హక్కును కూడా 1766లోనే ఇచ్చింది. 

The Hunger Virus Multiplies: ఆకలి.. ప్రతి నిమిషానికి 11 మంది బలి!

1947 ఆగస్టు 15న మనదేశం స్వతంత్రం సంపాదించింది. కానీ చాలాకాలం డొమినియన్‌గా ఉండింది. భారతీయ జన గణ మన తంత్రం అప్పటికి ఆవిర్భవించలేదు. స్వతంత్రం గణతంత్రంతోనే సంపూర్ణమవుతుంది. గణతంత్రం లేకపోతే సొంత తంత్రమేదీ ఉండదు. స్వతంత్రం కూడా ఉండదు. చెదురు మదురుగా ఉన్న జనం సాధికారిక పాలకులుగా నాయకత్వం స్వీకరించడానికి కొన్ని వ్యవస్థలు ఉండాలి. విధానాలు ఏర్పడాలి. ప్రక్రియ ఉండాలి. పద్ధతులు ఏర్పడాలి. అప్పుడు జనతంత్రం గణతంత్రంగా పరిణమిస్తుంది. నిర్ణీత గణతంత్ర విధానాల సమగ్ర నిర్మాణం ద్వారా మాత్రమే మనం స్వతంత్రం కాపాడుకోగలం.

 Sridhar​​​​​​​

వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌
డీన్, స్కూల్‌ ఆఫ్‌ లా, మహీంద్రా యూనివర్సిటీ

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Mar 2022 06:59PM

Photo Stories