Daily Current Affairs in Telugu: 2022, మార్చి 28 కరెంట్ అఫైర్స్
PMGKAY: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ఎప్పటి వరకు పొడిగించారు?
పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)’ పథకాన్ని మరో ఆరు నెలలు అంటే 2022, సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ మార్చి 26న నిర్ణయం తీసుకుంది. దీంతో 80 కోట్ల మంది లబ్ధి పొందుతారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
పీఎంజీకేఏవై–ముఖ్యాంశాలు
- కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో విధించిన లాక్‌డౌన్‌తో పేదల ఉపాధికి ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో 2020, ఏప్రిల్ నుంచి కేంద్రం ఈ ఉచిత రేషన్ పథకాన్ని ప్రారంభించింది.
- ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను అందిస్తున్నారు.
- కుటుంబంలోని ప్రతీ వ్యక్తికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం లేదా గోధుమలు, కుటుంబానికి కేజీ చొప్పున కందిపప్పు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022, సెప్టెంబర్ వరకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను అమలు చేయాలని నిర్ణయం
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా..
ఎందుకు : కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో విధించిన లాక్‌డౌన్‌తో పేదల ఉపాధికి ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో..
Uttarakhand: రాష్ట్ర అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే?
ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె, బీజేపీ ఎమ్మెల్యే రీతూ ఖండూరీ భూషణ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తదితరులు ఆమెను అభినందించారు. అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా రీతూ హయాంలోనే తీర్మానం చేసుకోగలమని విపక్ష సభ్యుడు ప్రీతమ్ సింగ్ అన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను 47 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే.
యూపీ ప్రతిపక్ష నేతగా ఎన్నికైన వ్యక్తి?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎన్నికయ్యారు. సమాజ్‌వాదీ శాసనసభాపక్ష నాయకుడిగా అఖిలేశ్ యాదవ్‌ను మార్చి 26న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగాను.. 255 చోట్ల బీజేపీ జయకేతనం ఎగరవేసింది. 111 స్థానాల్లో గెలుపొందిన సమాజ్‌వాదీ పార్టీ.. బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికైన మహిళ?
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె, బీజేపీ ఎమ్మెల్యే రీతూ ఖండూరీ భూషణ్
Men's Doubles Title: భారత క్రీడాకారుడు సాకేత్ మైనేని ఏ క్రీడలో ప్రసిద్ధుడు?
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్ సాధించాడు. న్యూఢిల్లీ వేదికగా మార్చి 26న జరిగిన ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట 6–4, 6–2తో విష్ణువర్ధన్–అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్) జోడీపై నెగ్గింది. సాకేత్ కెరీర్‌లో ఇది 27వ డబుల్స్ టైటిల్.
వెన్నం జ్యోతి సురేఖ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది. జమ్మూలో జరిగిన ఈ టోర్నీలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ విజయవాడ ఆర్చర్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో 146–143తో ప్రియా గుర్జర్ (రాజస్తాన్)పై గెలిచింది. ర్యాంకింగ్ రౌండ్‌లో సురేఖ 720 పాయింట్లకుగాను 699 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
56వ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహించారు?
నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమా వేదికగా మార్చి 26న నిర్వహించిన 56వ జాతీయ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ హరీశ్ ముల్లు అండర్–16 బాలుర 2 కిలోమీటర్ల రేసులో కాంస్య పతకం నెగ్గాడు. విజయనగరం జిల్లాకు చెందిన హరీశ్ 6 నిమిషాల 6 సెకన్లలో గమ్యానికి చేరాడు. అమన్ (హరియాణా; 6 నిమిషాలు) స్వర్ణం, ప్రియాన్షు (ఉత్తరాఖండ్; 6ని:3 సెకన్లు) రజతం సాధించారు.
UNEP Report: ప్రపంచంలో అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న మొదటి నగరం?
ప్రపంచంలో అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న నగరాల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన శబ్ద తీవ్రత కేవలం 55 డెసిబుల్స్(డీబీ) కాగా ఢాకాలో ఇది ఏకంగా 119 ఉంది. ఢాకా తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ పట్టణం 114 డెసిబుల్స్‌తో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో శబ్ద కాలుష్యం తీవ్రతను వెల్లడిస్తూ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌ఈపీ) తాజాగా విడుదల చేసిన ఆన్యువల్ ఫ్రాంటియర్ రిపోర్ట్–2022(Annual Frontier Report-2022)లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
యూఎన్‌ఈపీ నివేదికలోని ముఖ్యాంశాలు..
- శబ్ద కాలుష్యం బెడద దక్షిణాసియాలోనే అధికంగా ఉంది. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లో పరిమితికి మించి నమోదవుతోంది.
- డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం శబ్ద తీవ్రత నివాస ప్రాంతాల్లో 55 డీబీ, వాణిజ్య ప్రాంతాల్లో 70 డీబీ దాకా ఉండొచ్చు. అంతకు మించిన శబ్దాన్ని ఎక్కువ సేపు వింటే వినికిడి శక్తి పోయే ప్రమాదముంది.
- శబ్ద కాలుష్యం మనుషుల భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- న్యూయార్క్‌లో ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించే వారిలో ప్రతి 10 మందిలో 9 మంది శబ్ద కాలుష్యానికి గురవుతున్నారు. హాంకాంగ్‌లో ప్రతి ఐదుగురిలో ఇద్దరిది ఇదే పరిస్థితి.
- యూరప్‌లో అతిపెద్ద నగరాల పౌరుల్లో సగం మంది శబ్ద కాలుష్య బాధితులే.
- ట్రాఫిక్ రణగొణ ధ్వనుల కారణంగా కొన్ని సిటీల్లో పక్షులు తమ కూత సమయాన్ని కూడా మార్చుకుంటున్నట్లు నిపుణులు గుర్తించారు.
అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న మొదటి 15 నగరాలు |
|
నగరం |
శబ్దం(డెసిబుల్స్) |
ఢాకా (బంగ్లాదేశ్) |
119 |
మొరాదాబాద్ (భారత్) |
114 |
ఇస్లామాబాద్ (పాకిస్తాన్) |
105 |
రాజ్‌షాహీ (బంగ్లాదేశ్) |
103 |
హోచిమిన్ (వియత్నాం) |
103 |
ఇబాదన్ (నైజీరియా) |
101 |
కుపోండోల్ (నేపాల్) |
100 |
అల్జీర్స్ (అల్జీరియా) |
100 |
బ్యాంకాక్ (థాయ్‌లాండ్) |
99 |
న్యూయార్క్ (అమెరికా) |
95 |
డెమాస్కస్ (సిరియా) |
94 |
మనీలా (ఫిలిప్పీన్స్) |
92 |
హాంకాంగ్ (చైనా) |
89 |
కోల్‌కతా (ఇండియా) |
89 |
అసన్‌సోల్ (ఇండియా) |
89 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న నగరాల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మొదటి స్థానంలో ఉంది.
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌ఈపీ)
ఎక్కడ : ప్రపంచంలో..
Badminton: స్విస్ ఓపెన్‌లో చాంపియన్‌గా అవతరించిన క్రీడాకారిణి?
స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్–2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు విజేతగా అవతరించింది. 2021 ఏడాది కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన 26 ఏళ్ల సింధు ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి తొలిసారి స్విస్ ఓపెన్ విజేతగా నిలిచింది. స్విట్జర్‌ల్యాండ్‌లోని బాసెల్ నగరం వేదికగా మార్చి 27న జరిగిన మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–16, 21–8తో ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. విజేతగా నిలిచిన సింధుకు 13,500 డాలర్ల (రూ. 10 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2022 ఏడాది సింధుకిది రెండో టైటిల్. గత జనవరిలో ఆమె సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది.
నాలుగో భారత ప్లేయర్..
స్విస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా సింధు నిలిచింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2011, 2012) రెండుసార్లు టైటిల్ నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ (2015), హెచ్‌ఎస్ ప్రణయ్ (2016) విజేతగా నిలిచారు.
రన్నరప్‌గా ప్రణయ్..
స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్, 2016 చాంపియన్ హెచ్‌ఎస్ ప్రణయ్ రన్నరప్‌గా నిలిచాడు. కేరళకు చెందిన ప్రణయ్ ఫైనల్లో 12–21, 18–21తో 2018 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్–2022 మహిళల సింగిల్స్‌లో చాంపియన్‌గా అవతరించిన క్రీడాకారిణి?
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు
ఎక్కడ : బాసెల్, స్విట్జర్‌ల్యాండ్
ఎందుకు : మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–16, 21–8తో ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)పై గెలిచినందున..
Banking Sector: రాష్ట్రంలో తొలి డిజిటల్ జిల్లాగా అవతరించిన జిల్లా ఏది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాంకింగ్ రంగంలో పూర్తిస్థాయి తొలి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ జిల్లా రికార్డు సృష్టించింది. వైఎస్సార్ జిల్లాలోని ప్రతి బ్యాంకు ఖాతాదారుడు అందుబాటులో ఉన్న డిజిటల్ లావాదేవీల్లో కనీసం ఏదో ఒకదాన్ని వినియోగించడం ద్వారా ఈ రికార్డు నమోదైంది. దేశంలో నగదు లావాదేవీలు తగ్గించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దశలవారీగా ఎంపిక చేసిన జిల్లాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశలో వైఎస్సార్ జిల్లా ఎంపికైంది. ఈ కార్యక్రమం కింద ఆ జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకు ఖాతాదారుడిని కనీసం ఏటీఎం కార్డు లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌ల్లో ఏదో ఒకదాన్ని వినియోగించేలా ప్రోత్సహించారు.
రెండో దశలో శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలను పూర్తి స్థాయి డిజిటల్ జిల్లాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాంకింగ్ రంగంలో పూర్తిస్థాయి తొలి డిజిటల్ జిల్లాగా అవతరించిన జిల్లా ఏది?
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : వైఎస్సార్ జిల్లా
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : వైఎస్సార్ జిల్లాలోని ప్రతి బ్యాంకు ఖాతాదారుడు అందుబాటులో ఉన్న డిజిటల్ లావాదేవీల్లో కనీసం ఏదో ఒకదాన్ని వినియోగించడం ద్వారా..
Haryana: ఇంటర్నేషనల్ లైఫ్ సేవర్ అవార్డుకు ఎంపికైన వ్యక్తి?
రక్తదానంపై చైతన్య పరిచినందుకుగాను యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు రాంబాబుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ లైఫ్ సేవర్ అవార్డు లభించింది. మార్చి 26న హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాంబాబుకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ అవార్డును ప్రదానం చేశారు. రక్త కొరతను తీర్చేందుకు 2021, మార్చి 23న హరియాణ కర్నాల్‌కు చెందిన నిఫా అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన రక్తదాన క్యాంప్‌ను ఏపీలో రాంబాబు చేపట్టారు. రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి మెగా డొనేషన్ క్యాంప్ ద్వారా ఒక్క రోజులోనే 1.27 లక్షల రక్త యూనిట్లను దేశవ్యాప్తంగా సేకరించినట్లు రాంబాబు తెలిపారు.
ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్ చైర్‌పర్సన్‌గా శుభ్రా..
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో) హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్‌గా శుభ్రా మహేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉమా చిగురుపాటి ఉన్నారు. సుమారు రెండు దశాబ్దాల పైగా చార్టర్డ్ అకౌంటెంట్‌గా అనుభవమున్న శుభ్రా .. ప్రస్తుతం బ్లూస్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టరుగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ మొదలైన వాటితో పాటు 300 పైచిలుకు కార్పొరేట్ సంస్థలకు ఆమె సీఏగా సేవలు అందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు రాంబాబుకు ఇంటర్నేషనల్ లైఫ్ సేవర్ అవార్డు ప్రదానం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
ఎక్కడ : కర్నాల్, హరియాణా
ఎందుకు : రక్తదానంపై చైతన్య పరిచినందుకుగాను..
Telangana: యూఎస్‌పీ ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానించడం లక్ష్యంగా సాగిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అమెరికా పర్యటన మార్చి 27న ముగిసింది. చివరిరోజు అమెరికా లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో కేటీఆర్ విజయం సాధించారు. ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ రూ.1,750 కోట్లు, స్లేబ్యాక్ ఫార్మా రూ. 1,500 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా(యూఎస్‌పీ) వెల్లడించింది.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్‌ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్ , అవ్రా లేబొరేటరీస్‌లో మెజార్టీ వాటాలు కొనేందుకు రూ. 1,750 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అడ్వెంట్ ఇంటర్నేషనల్ నిర్ణయించింది. ఇక న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ.. హైదరాబాద్ ఫార్మా రంగంలో రాబోయే మూడేళ్లలో సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. సీజీఎంపీ ల్యాబ్‌తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని కేటీఆర్‌తో భేటీ తర్వాత సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్‌సింగ్ ప్రకటించారు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఫార్మాలో స్లేబ్యాక్ రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపిన సంస్థ?
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : అమెరికా సంస్థ.. యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా(యూఎస్‌పీ)
ఎక్కడ : హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ
ఎందుకు : ఫార్మా రంగంలో పరిశోధనల కోసం..
Visakhapatnam: దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
South Coast Railway zone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చి 25న రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ మేరకు బదులిచ్చారు. ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్ (విశాఖ రైల్వే జోన్)కు డీపీఆర్ సమర్పించాక కొత్త రైల్వేజోన్, రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటుకు పరిధి, ఇతర అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఈ అంశాలను పరిశీలించడానికి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేశాం.’ అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. కొత్త రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకోసం 2020–21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 26 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్