Daily Current Affairs in Telugu: 2022, మార్చి 26 కరెంట్ అఫైర్స్
Badminton Association of India: బాయ్ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి?
భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. మార్చి 25న జరిగిన ‘బాయ్’ సాధారణ సర్వ సభ్య సమావేశంలో హిమంతను మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ బాయ్ ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా సంజయ్ మిశ్రా, కోశాధికారిగా హనుమాన్‌దాస్ లఖాని ఎన్నికయ్యారు. 2026 వరకు కొనసాగనున్న ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది సంయుక్త కార్యదర్శలు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. బాయ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. బీజేపీ సీనియర్ నేత, నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ హిమంత అస్సాం ముఖ్యమంత్రిగా 2021, మే 10న ప్రమాణస్వీకారం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి?
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
ఎక్కడ : న్యూఢిల్లీ
Indian Premier League 2022: డీవై పాటిల్ క్రీడా మైదానం ఏ రాష్ట్రంలో ఉంది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)–2022(ఐపీఎల్ 15వ సీజన్) మార్చి 26న ప్రారంభం కానుంది. ముంబై వేదికగా జరిగే తొలిరోజు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తలపడనున్నాయి. మే 29వ తేదీన ఫెనల్ మ్యాచ్ జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)వెల్లడించింది. ఈ టోర్నీని నాలుగు వేదికలకే పరిమితం చేశారు. ముంబైలోని వాంఖెడే స్టేడియం, బ్రబోర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాలతోపాటు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రేక్షకులను అన్ని మ్యాచ్‌లకు స్టేడియం సామర్థ్యంలో 25 శాతం చొప్పున మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ విజేత జట్టుకు లభించే మొత్తం ప్రైజ్‌మనీ రూ. 20 కోట్లు.
రెండు కొత్త జట్లు
లీగ్‌లో ఇప్పటి వరకు ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా ఐపీఎల్ 15వ సీజన్‌లో రెండు జట్టు కొత్తగా వచ్చాయి. ఆర్‌పీజీ గ్రూప్‌నకు చెందిన ‘లక్నో సూపర్ జెయింట్స్’... సీవీసీ క్యాపిటల్స్‌కు చెందిన ‘గుజరాత్ టైటాన్స్’ జట్లు ఈ లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ప్రతీ ఏటా 60 మ్యాచ్‌లు జరుగుతుండగా, కొత్త జట్ల రాకతో మరో 14 మ్యాచ్‌లు పెరిగి మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 74కు చేరింది.
గ్రూప్‌ల వివరాలు
గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్.
గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ ఎవరు?
2022 ఐపీఎల్ సీజన్‌లో బరిలో ఉన్న 10 జట్లలో ఎనిమిది జట్లకు భారత క్రికెటర్లు నాయకత్వం వహిస్తున్నారు. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్), శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్), హార్దిక్ పాండ్యా (గుజరాత్ జెయింట్స్), మయాంక్ అగర్వాల్ (పంజాబ్ కింగ్స్), సంజూ సామ్సన్ (రాజస్తాన్ రాయల్స్), రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఈ జాబితాలో ఉన్నారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ డు ప్లెసిస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు... న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌లుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)–2022(ఐపీఎల్ 15వ సీజన్) ప్రారంభం
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Jaishankar-Wang Yi: భారత్, చైనా విదేశాంగ మంత్రులు సమావేశం ఎక్కడ జరిగింది?
భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశమయ్యారు. మార్చి 25న న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీలో భారత్, చైనా సంబంధాలతో పాటుగా అంతర్జాతీయ అంశాలైన ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, అఫ్గానిస్తాన్ సంక్షోభం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుహృద్భావం నెలకొంటేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరణ జరుగుతుందని ఈ సమావేశంలో జై శంకర్ చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో సైనిక బలగాల ఉపసంహరణ పూర్తిగా జరిగి తీరాల్సిందేనని చైనాకు తేల్చి చెప్పారు. అది జరిగేంతవరకు ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేదన్నారు.
మూడు పాయింట్ల ఎజెండా
ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఈ సమావేశంలో వాంగ్ యీ మూడు పాయింట్ల ఎజెండా ప్రతిపాదించినట్టుగా చైనా అధికారికి న్యూస్ ఏజెన్సీ జిన్‌హువా వెల్లడించింది. దీర్ఘ కాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ద్వైపాక్షిక సంబంధాల బలోపేత, విన్ విన్ వైఖరితో ఒకరి గురించి మరొకరు ఆలోచించడం, పరస్పర సహకారంతో బహుముఖంగా సంబంధాల్లో పురోగతిని సాధించాలని వాంగ్ యీ ప్రతిపాదించినట్టుగా వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా వెంటనే దాడుల్ని నిలిపివేసి సంక్షోభ పరిష్కారానికి దౌత్య మార్గాల్లో కృషి చేయాలని భారత్, చైనాలు అంగీకరించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : భారత్, చైనా సంబంధాలతో పాటుగా అంతర్జాతీయ అంశాలైన ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, అఫ్గానిస్తాన్ సంక్షోభం వంటి అంశాలపై చర్చించేందుకు..
Russia-Ukraine War: అమెరికా, ఈయూ మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పంద ఉద్దేశం?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. గ్యాస్ సరఫరా కోసం రష్యాపై ఆధారపడకూడదని యూరోపియన్ యూనియన్(ఈయూ) నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య మార్చి 24న కీలక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. యూరప్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయూ ఉన్నతాధికారులతో కలిసి ఒప్పంద వివరాలను వెల్లడించారు. బెల్జియం రాజధాని నగరం బ్రసెల్స్ వేదికగా ఈ ఒప్పందం కుదిరింది. యూరప్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపుగా 40 శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఒప్పందం ప్రకారం..
- యూరప్ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్ అవసరాలను చాలావరకు అమెరికా, ఇతర దేశాలు తీరుస్తాయి.
- యూరప్‌కు అమెరికా, ఇతర దేశాలు వార్షిక గ్యాస్ ఎగుమతులను మరో 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేరకు పెంచాలి. దీన్ని మున్ముందు మరింత పెంచుతారు.
- శిలాజ ఇంధనాల వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలి.
కొత్త ఒప్పందాలు: జర్మనీ
బొగ్గు, గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటామని జర్మనీ ప్రకటించింది. ఇందుకోసం కొత్త సప్లయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబెక్ వెల్లడించారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో 45 శాతానికి పైగా రష్యానే తీరుస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికాతో కీలక వ్యూహాత్మక ఒప్పందం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : యూరోపియన్ యూనియన్(ఈయూ)
ఎక్కడ : బ్రసెల్స్, బెల్జియం
ఎందుకు : యూరప్ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్ అవసరాలను చాలావరకు అమెరికా తీర్చేందుకు..
Inter Continental Ballistic Missile: బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్–17ను పరీక్షించిన దేశం?
North Korea launches largest inter continental ballistic missile Hwasong-17: అతి పెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్–17ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా మార్చి 25న ప్రకటించింది. ఇది 67 నిమిషాల పాటు ప్రయాణించి 1,090 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తర కొరియా, జపాన్ మధ్య సముద్ర జలాల్లో లక్ష్యంపై పడిందని కొరియన్ సెంట్రల్ న్యూస్‌ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) వెల్లడించింది. 2022 ఏడాది ఉత్తర కొరియా ఇలాంటి పరీక్షలు జరపడం ఇది 12వసారి.
మారియుపోల్ నగరం ఏ దేశంలో ఉంది?
ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. మార్చి 16న ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌లో 1,300 మందికి పైగా తలదాచుకున్న ఓ థియేటర్ రష్యా బాంబు దాడిలో నేలమట్టమవడం తెలిసిందే. వారిలో కనీసం 300 మందికి పైగా దుర్మరణం పాలైనట్టు తాజాగా తేలింది. కీవ్ సమీపంలో ఉక్రెయిన్ దళాలకు ఇంధనం సరఫరా చేసే ఓ భారీ ఇంధనాగారాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా తాజాగా ప్రకటించింది.
చర్చల్లో పురోగతి: టర్కీ
రష్యా–ఉక్రెయిన్ మధ్య చర్చల్లో పురోగతి ఉందని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చెప్పారు. ‘‘నాటోలో చేర్చుకోవాలన్న డిమాండ్‌ను వదులుకునేందుకు, రష్యన్‌ను అధికార భాషగా స్వీకరించేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉంది.’’ అని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అతి పెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్–17ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : ఉత్తర కొరియా
ఎక్కడ : ఉత్తర కొరియా
ఎందుకు : ఉత్తర కొరియా సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు..
Chief Ministers of Uttar Pradesh: యూపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ నేత?
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని లక్నోలోని అటల్ బిహారి వాజపేయి ఏకనా స్టేడియంలో మార్చి 25న నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగితో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. యోగితో పాటుగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా, 52 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. యూపీలో కొత్తగా ఏర్పాటైన యోగి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
37 ఏళ్ల తర్వాత..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ విజయం సాధించింది. దీంతో రాష్ట్ర చరిత్రలో 37 ఏళ్ల తర్వాత అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి పార్టీగా రికార్డు సృష్టించింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన 202 సీట్ల మార్కును బీజేపీ దాటేసింది. 403 అసెంబ్లీ స్థానాలకుగాను 255 చోట్ల జయకేతనం ఎగరవేసింది.
యోగి బంపర్ మెజారిటీ..
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన యోగి గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి ఏకంగా 1.3 లక్షల పై చిలుకు ఓట్ల బంపర్ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పుడు ఆయన గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం అయ్యాక శాసనమండలికి ఎన్నికయ్యారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు |
||
పార్టీ |
2022 |
2017 |
బీజేపీ |
255 |
312 |
సమాజ్‌వాదీ |
111 |
47 |
బీఎస్పీ |
1 |
19 |
కాంగ్రెస్ |
2 |
7 |
అప్నాదళ్(ఎస్) |
12 |
9 |
ఎస్‌బీఎస్‌పీ |
6 |
4 |
ఆర్‌ఎల్‌డీ |
8 |
1 |
నిషాద్ పార్టీ |
6 |
1 |
ఇతరులు |
2 |
3 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేసిన నేత?
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్
ఎక్కడ : అటల్ బిహారి వాజపేయి ఏకనా స్టేడియం, లక్నో, ఉత్తరప్రదేశ్
ఎందుకు : తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో..
NITI Aayog: ఎగుమతుల సన్నద్ధత జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
Export Preparedness Index 2021(EPI 2021): నీతీ ఆయోగ్ రూపొందించిన ఎగుమతుల సన్నద్ధత జాబితా–2021లో గుజరాత్‌కు అగ్రస్థానం లభించింది. రాష్ట్రాల ఎగుమతి సామర్థ్యం, వాటి సంసిద్ధత ఆధారంగా ఈ జాబితా తయారు చేస్తారు. వరుసగా రెండో సంవత్సర కూడా గుజరాత్ ఇందులో టాప్‌లో నిలిచింది. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హరియాణ, యూపీ, ఎంపీ, పంజాబ్, ఏపీ, తెలంగాణ నిలిచాయి. లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, లడఖ్, మేఘాలయ చివరి స్థానాల్లో ఉన్నాయి.
ఎయిర్‌లిఫ్ట్ గ్లోబల్‌తో ఎయిర్‌బస్ జట్టు
ఎయిర్‌బస్ తాజాగా ఎయిర్‌లిఫ్ట్ గ్లోబల్‌తో చేతులు కలిపింది. భారత్‌లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ వైద్య సర్వీసులు (హెచ్‌ఈఎంఎస్), సంబంధిత ఎయిర్ అంబులెన్స్ సేవలను అభివృద్ధి చేసేందుకు వింగ్స్ ఇండియా–2022 సందర్భంగా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. విషమ పరిస్థితుల్లో ఉన్న పేషంట్లు, ప్రమాద బాధితులకు సత్వర వైద్యాన్ని అందుబాటులోకి తేవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడగలదని ఎయిర్‌బస్ తెలిపింది. ఒప్పందంలో భాగంగా ఎయిర్ అంబులెన్స్, అత్యవసర వైద్య సర్వీసులను అనుసంధానించేలా ఇరు సంస్థలు పైలట్ ప్రాజెక్టును రూపొందిస్తాయి.చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 25 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
General Essay - Science and technology
Russia-Ukraine War: రణరంగంలో రసాయనాయుధాలు!
యుద్ధం మొదలెట్టి రోజులు గడుస్తున్నా ఆశించిన ఫలితం రాకపోతే యుద్ధాన్ని ఆరంభించిన పక్షానికి చికాకు, అసహనం పెరుగుతాయి. దీంతో మరింత భయంకరమైన ఆయుధ ప్రయోగానికి దిగే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్‌పై దాడిలో విజయం కనుచూపుమేరలో కానరాకపోవడంతో రష్యా రసాయనాయుధాల ప్రయోగానికి దిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Economic Crisis in Sri Lanka: పతనం అంచున శ్రీలంక ఆర్థిక వ్యవస్థ
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలై నెల దాటింది. ఇంతవరకు చెప్పుకోదగ్గ విజయం రష్యాకు దక్కినట్లు కనిపించడం లేదు. దీంతో యుద్ధాన్ని ఎలా ముగించాలో అర్థం కాని పుతిన్ భయంకర జనహనన ఆయుధాలను ప్రయోగించవచ్చనే భయాలున్నాయి. రష్యా విజయం కోసం రసాయన ఆయుధాలు ప్రయోగించే అవకాశాలు అధికమని యూఎస్ అనుమానిస్తోంది. ఇందుకోసం ముందుగా ఉక్రెయిన్‌లో జీవ, రసాయన ఆయుధాలున్నాయని రష్యా ప్రచారం చేస్తోందని, రాబోయే రోజుల్లో ఉక్రెయిన్‌ను నిలవరించడానికనే సాకుతో రష్యా రసాయనాయుధాలు ప్రయోగించవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఈ నెల 21న సుమీ నగరంలోని ఒక రసాయన ప్లాంట్‌ను రష్యా పేల్చివేసింది. దీంతో అక్కడి వాతావరణంలోకి భారీగా అమ్మోనియా విడుదలై స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చింది. గతంలో పుతిన్ రసాయన ఆయుధాల ప్రయోగించిన దాఖలాలున్నాయని, అందువల్ల ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ తన సొంత పౌరులపై రసాయన దాడికి సన్నాహాలు చేస్తోందని అటుపక్క రష్యా విమర్శిస్తోంది. తమపై రసాయన ఆయుధ ప్రయోగ నేరారోపణ చేయడానికి ఉక్రెయిన్ ఈ దారుణానికి తలపడనుందని రష్యా రక్షణ మంత్రి ఆరోపించారు.
The Hunger Virus Multiplies: ఆకలి.. ప్రతి నిమిషానికి 11 మంది బలి!
రష్యా రూటే సెపరేటు
కెమికల్ ఆయుధాల ప్రయోగంలో రష్యాకుక ఘన చరిత్ర ఉంది. చాలా సంవత్సరాలుగా పలువురిని రష్యా ఈ ఆయుధాలు ఉపయోగించి పొట్టన పెట్టుకుందన్న ఆరోపణలున్నాయి. తాజాగా సిరియాలో పౌరులపై రసాయనాయుధాలను అధ్యక్షుడు బషర్ రష్యా సహకారంతో ప్రయోగించారని అమెరికా ఆరోపించింది. దీనిపై విచారణకు రష్యా అడ్డుపడుతోందని విమర్శించింది. అలాగే రష్యా ఏజెంట్ సెర్గీ స్కిరిపల్, ఆయన కుమార్తె యూలియాను లండన్‌లో ఈ ఆయుధాలతోనే రష్యా బలి తీసుకుందని విమర్శలున్నాయి. రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ సంస్థ గ్రు కు చెందిన ఇద్దరికి ఈ ఘటనతో సంబంధం ఉందని బ్రిటన్ ఆరోపించింది. 2020లో పుతిన్ చిరకాల విమర్శకుడు అలెక్సి నవల్నీపై విష ప్రయోగం జరిగింది. స్వదేశంలో ఒక విమాన ప్రయాణంలో ఆయన హఠాత్తుగా అస్వస్థుడయ్యాడు. అనంతరం ఆయన కోమాలోకి జారుకున్నారు. నరాల బలహీనతను కలిగించే కెమికల్ ఆయనపై ప్రయోగించినట్లు జర్మనీలో ఆయనపై జరిపిన పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే రష్యా త్వరలో ఉక్రెయిన్‌లో కెమికల్ వెపన్స్ వాడబోతుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరగవచ్చు?
నిజానికి రసాయనాయుధాలున్నాయన్న సాకుతో ఇతర దేశాలపై దాడులు చేసిన సంస్కృతి అమెరికాకే ఉంది. ఇరాక్ విషయంలో అమెరికా చేసిన ఘాతుకాన్ని ప్రపంచం మరిచిపోలేదు. నీవు నేర్పిన విద్యయే.. అన్నట్లు ప్రస్తుతం పుతిన్ అమెరికా చూపిన బాటలో పయనించే యోచనలో ఉన్నారు. రష్యా ఇలాంటి ఆయుధాలను వాడితే తాము తీవ్రంగా స్పందిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. నాటో సైతం ఇదే తరహా హెచ్చరిక చేసింది. రష్యా మాట వినకుండా వీటిని ప్రయోగిస్తే అప్పుడు తమ కూటమి నేరుగా యుద్ధంలో పాల్గొనాల్సివస్తుందని హెచ్చరించింది. ఒకపక్క దాడి మొదలై ఇన్ని రోజులైనా తగిన ఫలితం రాకపోవడం రష్యాను చికాకు పెడుతోంది. మరోవైపు రష్యా డిమాండ్లను ఉక్రెయిన్ అంగీకరించడంలేదు. ఇప్పటికే అంతర్జాతీయ వ్యతిరేకతను మూటకట్టుకున్న పుతిన్ రసాయనాయుధాల్లాంటి తొందరపాటు చర్యకు దిగకపోవచ్చ ని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగితే పుతిన్ మనసు మారే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.
Russia-Ukraine Conflict: ఈ యుద్ధం వెనుక ఏముంది?
రసాయనాలు– రకాలు
రసాయనాయుధాలను అవి కలిగించే ప్రభావాన్ని బట్టి పలు రకాలుగా వర్గీకరించారు.
1. చర్మంపై ప్రభావం చూపేవి (బ్లిస్టర్ ఏజెంట్స్): ఫాస్జీన్ ఆక్సైమ్, లెవిసైట్, మస్టర్డ్ గ్యాస్.
2. నరాలపై ప్రభావం చూపేవి (నెర్వ్ ఏజెంట్స్): టబున్, సరిన్, సొమన్, సైక్లో సరిన్.
3. రక్తంపై ప్రభావం చూపేవి (బ్లడ్ ఏజెంట్స్):
సైనోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ సైనేడ్.
4. శ్వాసపై ప్రభావం చూపేవి (చోకింగ్ ఏజెంట్స్): క్లోరోపిక్రిన్, క్లోరిన్, డైఫాస్జిన్.
అసలేంటీ ఆయుధాలు? రసాయనాయుధం అంటే?
నిజానికి ప్రతి ఆయుధంలో కెమికల్స్ ఉంటాయి. ఉదాహరణకు తుపాకీ బుల్లెట్లలో ఉండే గన్ పౌడర్ ఒక రసాయన పదార్ధమే! అయితే జీవులను ఒక్కమారుగా చంపగలిగే ప్రమాదకరమైన వాయువులు లేదా ద్రావకాల మిశ్రమాన్ని అచ్చంగా రసాయనాయుధమంటారు. ఒపీసీడబ్ల్యూ (ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్) ప్రకారం ప్రమాదకర రసాయనాలను కలిగిఉండేలా డిజైన్ చేసిన ఆయుధాలు, వస్తువులను రసాయనాయుధాలంటారు. ఉదాహరణకు అమ్మోనియా అధిక మోతాదులో విడుదలైతే అక్కడున్న మనుషులకు అంధత్వం, ఊపిరితిత్తుల విధ్వంసంతో పాటు మరణం కూడా సంభవించవచ్చు. తొలి ప్రపంచ యుద్ధ సమయంలోనే రసాయనాయుధాల వాడకం జరిగింది. ఆ యుద్ధంలో క్లోరిన్, ఫాస్జీన్, మస్టర్డ్ గ్యాస్‌ను ఇరుపక్షాలు వినియోగించాయి. కేవలం వీటివల్ల అప్పట్లో లక్ష మరణాలు సంభవించాయి. కాలం గడిచే కొద్దీ అత్యంత ప్రమాదకరమైన రసాయనాయుధాల తయారీ పెరిగింది. కోల్డ్‌వార్ సమయంలో యూ ఎస్, రష్యాలు ఇబ్బడిముబ్బడిగా వీటిని రూ పొందించాయి. తర్వాత కాలంలో పలు దేశాలు రహస్యంగా వీటి తయారీ, నిల్వ చేపట్టాయి.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్