Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 25 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Mar-25th

India capability center: ప్రాట్‌ అండ్‌ విట్నీ కేపబిలిటీ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించనున్నారు?

Pratt & Whitney

విమాన ఇంజిన్ల తయారీ దిగ్గజం ప్రాట్‌ అండ్‌ విట్నీ తాజాగా బెంగళూరులో ’ఇండియా కేపబిలిటీ సెంటర్‌’ (ఐసీసీ)ని ఏర్పాటు చేస్తోంది. ఇది 2022, ఏప్రిల్‌ నెల నుంచి అందుబాటులోకి రానుంది. తమ సరఫరా వ్యవస్థకు అవసరమైన సేవలను అందించేందుకు ఇది ఈ సెంటర్‌ ఉపయోగపడగలదని కంపెనీ భారత విభాగం హెడ్‌ అస్మితా సేఠి చెప్పారు. భారత్‌లో తాము ఈ తరహా సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని మార్చి 24న హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అస్మితా చెప్పారు.

డె హావిలాండ్‌తో ఫ్లైబిగ్‌ జట్టు
ఉడాన్‌ పథకం కింద దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతీయ రూట్లలో విమాన సర్వీసులు అందించే ఫ్లైబిగ్‌ సంస్థ తాజాగా 10 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం వింగ్స్‌ ఇండియా 2022 ఏవియేషన్‌ షో సందర్భంగా డె హావిలాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆఫ్‌ కెనడా సంస్థతో ఆసక్తి వ్యక్తీకరణ పత్రానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ వేదికగా మార్చి 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వింగ్స్‌ ఇండియా 2022 ఏవియేషన్‌ షోను నిర్వహిస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
త్వరలో ఇండియా కేపబిలిటీ సెంటర్‌ (ఐసీసీ)ని ప్రారంభిస్తాం
ఎప్పుడు : మార్చి 24
ఎవరు    : విమాన ఇంజిన్ల తయారీ దిగ్గజం ప్రాట్‌ అండ్‌ విట్నీ
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ప్రాట్‌ అండ్‌ విట్నీ.. సరఫరా వ్యవస్థకు అవసరమైన సేవలను అందించేందుకు..

UNCTAD: ఐరాస అంచనాల ప్రకారం.. భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత?

India GDP

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం 2022లో భారత్‌పై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్‌సీటీఏడీ) మార్చి 24న విడుదల చేసిన తన తాజా నివేదికలో పేర్కొంది. 2022పై ఇంతక్రితం 6.7 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను తాజాగా 4.6 శాతానికి (2 శాతానికి పైగా) తగ్గించింది. ఇంధన సరఫరాలపై సమస్యలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరపతి విధానాలు, వెరసి ఆర్థిక అనిస్థితిని దేశం ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి రేటు అంచనాను ఒక శాతం అంటే 3.6 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ఐరాస నివేదికలోని ముఖ్యాంశాలు..

  • 2022 ఏడాదిలో రష్యా తీవ్ర మాంద్యాన్ని చవిచూసే పరిస్థితి ఉంది. పశ్చిమ ఐరోపా అలాగే మధ్య, దక్షిణ, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో వృద్ధిలో గణనీయమైన మందగమనం ఉంటుంది.
  • రష్యా వృద్ధి 2.3 శాతం నుండి మైనస్‌ 7.3 శాతానికి క్షీణించింది.
  • అమెరికా వృద్ధి అంచనా మూడు శాతం నుండి 2.4 శాతానికి, చైనా వృద్ధి 5.7 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గిస్తున్నాం.
  • ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా పలు అభివృద్ధి చెందిన దేశాలు ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేసే వీలుంది. ఆయా అంశాలు బడ్జెట్‌ వ్యయాల కోతలకూ దారితీయవచ్చు.  
  • కోవిడ్‌–19తో అసలే తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ప్రపంచ ఎకానమీకి ఇప్పుడు యుద్ధం మరింత ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితి నెలకొంది.
  • పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యంత పేదలపై దుర్బలమైన తక్షణ ప్రభావం చూపుతాయి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022 ఏడాదికి సంబంధించి భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాలు.. 6.7 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : మార్చి 24
ఎవరు    : ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్‌సీటీఏడీ) 
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం 2022లో భారత్‌పై తీవ్రంగా ఉంటుందని..

Dun & Bradstreet: డీఅండ్‌బీ సలహా బోర్డులో చేరిన ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌?

Rajnish Kumar

బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌.. డేటా, అనలిటిక్స్‌ సంస్థ డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీఅండ్‌బీ) సలహా బోర్డు (అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాలు)లో చేరారు. ఈ మేరకు డీఅండ్‌బీ సంస్థ మార్చి 24న ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాంకింగ్‌లో విశేష అనుభవం ఉన్న రజనీష్‌.. ప్రస్తుతం హెచ్‌ఎస్‌బీసీ ఆసియా పసిఫిక్, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, హీరో మోటోకార్ప్, భారత్‌ పే బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు. డీఅండ్‌బీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, జాక్సన్‌విల్లే నగరంలో ఉంది.

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్య సాధన దిశలో..
‘‘డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ భారతదేశంలో టెక్నాలజీ–ఆధారిత ఫైనాన్స్, రిస్క్, కంప్లైయన్స్, డేటా, మార్కెటింగ్‌ సొల్యూషన్‌ల ద్వారా లఘు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) సాధికారతకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. రజ్‌నీష్‌ కుమార్‌ డిజిటల్‌ ఇండియా మిషన్‌లో విశేష అనుభవం పొందారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్య సాధన దిశలో మేము అయన మార్గదర్శకత్వం, దార్శనికత కోసం ఎదురుచూస్తున్నాము’’అని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా) అవినాష్‌ గుప్తా అన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీఅండ్‌బీ) సలహా బోర్డులో చేరిన వ్యక్తి?
ఎప్పుడు : మార్చి 24
ఎవరు    : బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌
ఎందుకు : భారతదేశంలో ఎంఎస్‌ఎంఈల సాధికారతకు సంబంధించి డీఅండ్‌బీకు మార్గదర్శకత్వం వహించడానికి..

Indian Premier League: చెన్నై సూపర్‌ కింగ్స్‌ నూతన కెప్టెన్‌గా నియమితులైన ఆటగాడు?

MS Dhoni, Ravindra Jadeja

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌(ïసీఎస్‌కే) జట్టు కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్‌ ధోని తప్పుకున్నాడు. ధోని స్థానంలో మరో సీనియర్‌ రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది. జట్టులో సభ్యుడిగానే ఉంటూ ధోని మార్గనిర్దేశనం  చేయనున్నాడు. ఈ మేరకు మార్చి 24న ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన ప్రకారం.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా తొలి సారి నాయకుడిగా టీమ్‌ను నడిపించనున్నాడు. ధోని, రైనా (5 మ్యాచ్‌లు) తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరించనున్న మూడో ఆటగాడు జడేజా.

సత్యన్‌–మనిక జోడీకి రజతం
డబ్ల్యూటీటీ కంటెండర్‌ దోహా 2022 టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత ద్వయం జి.సత్యన్‌–మనిక బాత్రా రజత పతకం సాధించింది. ఖతర్‌ రాజధాని దోహాలో మార్చి 24న జరిగిన ఫైనల్లో సత్యన్‌–మనిక జోడి 4–11, 5–11, 3–11 తేడాతో టాప్‌ సీడ్‌ లిన్‌ యున్‌ జు – చెంగ్‌ ఐ చింగ్‌ (చైనా) చేతిలో పరాజయంపాలైంది. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్లో ఓడిన మరో భారత ప్యాడ్లర్‌ ఆచంట శరత్‌కమల్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ నూతన కెప్టెన్‌గా నియమితులైన ఆటగాడు?
ఎప్పుడు : మార్చి 24
ఎవరు    : రవీంద్ర జడేజా
ఎందుకు : సీఎస్‌కే జట్టు కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్‌ ధోని తప్పుకున్న నేపథ్యంలో..

AC Manufacturing Unit: రాష్ట్రంలోని ఏ జిల్లాలో డైకిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు కానుంది?

Daikin India

దేశంలోనే అతిపెద్ద ఏసీ తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు జపాన్‌కు చెందిన శీతలీకరణ ఉత్పత్తుల తయారీ సంస్థ డైకిన్‌ ప్రకటించింది. చిత్తూరు జిల్లా, తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో 100 ఎకరాల్లో ఈ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మార్చి 24న డైకిన్‌ ఇండియా రీజనల్‌ డైరెక్టర్‌ ఎన్‌.కె.రావు తెలిపారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని నిమ్రాలో ఉన్న రెండు యూనిట్లకు కలిపి ఏడాదికి 15 లక్షల ఏసీల తయారీ సామర్థ్యం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే యూనిట్లో ఏడాదికి 10 లక్షల ఏసీలు తయారవుతాయని తెలిపారు. ఇందుకోసం తొలి దశలో రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మరో 12 నెలల్లో ఈ యూనిట్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల వినియోగంతోపాటు మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసేలా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచ టీబీ దినోత్సవాన్ని ఎప్పడు నిర్వహిస్తారు?
క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణ, నివారణ కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2021కి ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర క్షయ వ్యాధి నియంత్రణ విభాగం జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా మార్చి 24న ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్షుక్‌ మాండవీయా చేతులమీదుగా రాష్ట్ర టీబీ నివారణ విభాగం సంయుక్త సంచాలకులు డాక్టర్‌ తాళ్లూరు రమేష్‌ ఈ అవార్డు అందుకున్నారు. ప్రతి ఏటా మార్చి 24వ తేదీన ప్రపంచ టీబీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశంలోనే అతిపెద్ద ఏసీ తయారీ యూనిట్‌ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 24
ఎవరు    : జపాన్‌కు చెందిన శీతలీకరణ ఉత్పత్తుల తయారీ సంస్థ డైకిన్‌
ఎక్కడ    : శ్రీసిటీ, తిరుపతి సమీపం, చిత్తూరు జిల్లా

Tilapia Fish: తెలంగాణలో ఫిష్‌ కల్చర్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్న సంస్థ?

KTR and Fishin Representative
ఫిష్‌ఇన్‌ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌ రంజన్‌

తిలాపియా చేపల ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి కంపెనీ ‘ఫిష్‌ ఇన్‌’.. తెలంగాణ మత్స్య రంగంలో వేయి కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో సుమారు 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు మార్చి 24న ఫిష్‌ ఇన్‌ కంపెనీ చైర్మన్, సీఈఓ మనీష్‌ కుమార్‌తో భేటీ అయ్యారు. రూ.వేయి కోట్ల పెట్టుబడితో తెలంగాణలో సమీకృత మంచినీటి చేపల పెంపకం వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్‌ ఫ్రెష్‌వాటర్‌ ఫిష్‌ కల్చర్‌ సిస్టమ్‌)ను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మనీష్‌ ప్రకటించారు.

ఫిష్‌ ఇన్‌ సీఈఓ మనీష్‌ తెలిపిన వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్‌ మానేరు రిజర్వాయర్‌ వద్ద ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్‌ ఇన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. చేపల ఉత్పత్తిలో హేచరీలు, దాణా తయారీ, కేజ్‌ కల్చర్, ఫిష్‌ ప్రాసెసింగ్, ఎగుమతులు వంటి విభాగాల్లో ‘ఫిష్‌ ఇన్‌’కార్యకలాపాలు కొనసాగుతాయి.

హైదరాబాద్‌లో ‘కన్‌ఫ్లూయెంట్‌’యూనిట్‌..
వైద్య ఉపకరణాల తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ‘కన్‌ఫ్లూయెంట్‌ మెడికల్‌’హైదరాబాద్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. శాన్‌హోలో కేటీఆర్‌తో భేటీ అనంతరం సంస్థ అధ్యక్షుడు, సీఈవో డీన్‌ షావర్‌ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తెలంగాణ మత్స్య రంగంలో వేయి కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించిన కంపెనీ?
ఎప్పుడు : మార్చి 24
ఎవరు    : ఫిష్‌ ఇన్‌
ఎందుకు : తెలంగాణలో సమీకృత మంచినీటి చేపల పెంపకం వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్‌ ఫ్రెష్‌వాటర్‌ ఫిష్‌ కల్చర్‌ సిస్టమ్‌)ను అభివృద్ధి చేసేందుకు..

Russia-Ukraine War: జీ7, నాటో చర్చలకు ఆథిత్యం ఇస్తోన్న నగరం?

రష్యా, ఉక్రెయిన్‌ సంక్షోభ నేపథ్యంలో కీలక సమావేశాలకు బెల్జియం రాజధాని నగరం బ్రస్సెల్స్‌ వేదికైంది. మార్చి 24వ తేదీ నుంచి నగరంలో నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో), గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌(జీ7), యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మరింత భద్రత కల్పించాలని నాటో చీఫ్‌ స్లోల్టెన్‌బర్గ్‌ అగ్రదేశాధినేతలకు సూచించారు. ఈ మూడు సదస్సుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాల్గొంటున్నారు. మరోవైపు నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం: కొన్ని అంశాలు.. 

  • రష్యా పార్లమెంట్‌ సభ్యులు, రష్యన్‌ బంగారు నిల్వలపై అమెరికా ఆంక్షలు విధించింది.
  • రష్యాకు చెందిన ఒక యుద్ధ నౌకను ముంచేశామని ఉక్రెయిన్‌ ప్రకటించగా, ఇజియం నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. దేశంలో చాలా చోట్ల రష్యాదళాలకు ఉక్రెయిన్‌ బలగాల నుంచి ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది.
  • ఉక్రెయిన్‌ అధ్యక్షడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి మేరకు మరింత సాయం అందిస్తామని పాశ్చాత్య దేశాలు ప్రకటించాయి. ఉక్రెయిన్‌కు మరో 50 కోట్ల యూరోల సాయం అందిస్తామని యూరోపియన్‌ యూనియన్‌ ప్రకటించింది.

భద్రతామండలిలో రష్యాకు చుక్కెదురు
ఉక్రెయిన్‌లో మానవీయ సహకారంపై రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం భద్రతామండలిలో తిరస్కారం పొందింది. తీర్మానం ఆమోదం పొందేందుకు 15 సభ్యదేశాల్లో 9 దేశాల అంగీకారం అవసరం కాగా చైనా తీర్మానానికి మద్దతు పలికింది. రష్యా, చైనా మినహా ఇతర 13 సభ్యదేశాలు తీర్మానానికి దూరంగా ఉన్నాయి. దీంతో ఉక్రెయిన్‌పై దాడికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో రష్యా వైఫల్యం బయటపడినట్లయింది. ఉక్రెయిన్‌లో సంక్షోభానికి రష్యా ఆక్రమణే కారణమని ఉక్రెయిన్‌ రూపొందించిన తీర్మానానికి సాధారణ అసెంబ్లీలో భారీ మద్దతు లభించింది. ఉక్రెయిన్‌ తీర్మానానికి భారత్‌ దూరంగా ఉంది.

కలకలానికి నెల!
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభమై నెల రోజులైంది. ఇప్పటివరకు ఈ సంక్షోభ కారణంగా వేలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడమే లక్ష్యంగా దాడి చేస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌లో నియో నాజీ జాతీయవాదులు పెరిగారని, వీరిని అదుపు చేయడమే తమ లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ మిలటరీ, మౌలిక సదుపాయాలపై మిస్సైల్‌ దాడులకు ఆదేశించారు.

  • యుద్ధం ఆరంభం: ఫిబ్రవరి 24, 2022
  • ఉక్రెయిన్‌ను వీడిన శరణార్థులు: 35 లక్షలు 
  • నిరాశ్రయులైనవారు: కోటిమంది. 
  • ఉక్రెయిన్‌ ఆర్థిక నష్టం: సుమారు రూ. 8 లక్షల కోట్లు 
  • ఉక్రెయిన్‌ వైపు మరణాలు: 691 మంది పౌరులు. గాయపడిన వారు: 1,143 మంది (ఐరాస లెక్కల ప్రకారం) 
  • రష్యా వైపు మరణాలు: 15,800 మంది సైనికులు (ఉక్రెయిన్‌ రక్షణశాఖ గణాంకాలు).

మార్స్‌ మిషన్‌ నిలిపివేత
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యాతో చేపట్టదలిచిన సంయుక్త మార్స్‌ మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ప్రకటించింది. 2022 ఏడాదిలో ఇరు పక్షాలు కలిసి కుజగ్రహ యాత్రను చేపట్టాల్సిఉంది. కేవలం ఎక్సోమార్స్‌ మిషన్‌ మాత్రమే కాకుండా పలు ఇతర ప్రాజెక్టుల్లో రష్యా స్పేస్‌ ఏజెన్సీ రోస్కోమాస్‌తో బంధాలను తెంచుకుంటున్నట్లు యూరోపియన్‌ ఏజెన్సీ తెలిపింది.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 24 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

General Essay - International

Economic Crisis in Sri Lanka: పతనం అంచున శ్రీలంక ఆర్థిక వ్యవస్థ

Sri Lanka

 

Economic Crisis in Sri Lanka: రావణుడి పాలనలో శ్రీలంక భోగభాగ్యాలతో తులతూగేదని చదివాం! కానీ ప్రస్తుత లంక పరిస్థితి మాత్రం ఆంజనేయుడు దహనం చేసిన తర్వాత లంక లాగా ఉంది. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి క్షీణించడంతో లంక ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. కరోనాతో ప్రారంభమైన ఆర్థిక కష్టాలు ఉక్రెయిన్‌ యుద్ధంతో చెప్పలేనంతగా పెరిగాయి. వీటిని దాటుకొని శ్రీలంక నిలబడుతుందా? లేక దివాలా తీస్తుందా? అని ఆర్థికవేత్తలు అనుమానపడుతున్నారు.

స్వాతంత్య్రానంతరం ఎన్నడూ చూడని మహా ఆర్థిక సంక్షోభం శ్రీలంకను చుట్టుముట్టింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు విదేశీ నిల్వలు అడుగంటి అల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదలతో  ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. విద్యార్థుల పరీక్షలు నిర్వహించేందుకు తగిన పేపర్లు లేవని ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేయడం, పెట్రోలు కోసం క్యూలో నిలబడి ఇద్దరు సామాన్య పౌరులు చనిపోవడం లంకలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ దుస్థితికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని సామాన్యుల నుంచి ప్రతిపక్షం దాకా ఆరోపిస్తున్నాయి. లంక విదేశీ మారక నిల్వల్లో క్షీణత 2020 ఆగస్టు నుంచే ఆరంభమైంది. 2021 నవంబర్‌లో ఈ నిల్వలు ప్రమాదకర హెచ్చరిక స్థాయి దిగువకు చేరాయి. జనవరి 2022లో శ్రీలంక విదేశీ నిల్వలు మరింత దిగజారి 230 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. నిల్వల తరుగుదలతో ప్రభుత్వం నిత్యావసరాల దిగుమతులు చేసుకోవడానికి, అప్పులు చెల్లించడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో త్వరలో లంక డిఫాల్ట్‌ (ఎగవేత) దేశంగా మారే ప్రమాదం ఉందన్న భయాలు పెరిగాయి. స్వతంత్రం వచ్చినప్పటినుంచి లంక విత్తలోటుతో సతమతమవుతూనే ఉంది.  2019లో ఈస్టర్‌ దాడుల ప్రభావం లంక టూరిజంపై పడి విదేశీ నిధుల రాక తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం కోవిడ్‌ లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. 2020 ఏప్రిల్, జూన్‌ కాలంలో కేంద్రబ్యాంకు విదేశీ నిధులను ఉపయోగించి 10 వేల కోట్ల డాలర్ల ప్రభుత్వ విదేశీ రుణాలను తీర్చింది. ఇలా ఉన్న నిధులు అప్పుల కింద చెల్లించాల్సిరావడం లంక పరిస్థితిని ఇక్కట్ల పాలు చేసింది.  

The Hunger Virus Multiplies: ఆకలి.. ప్రతి నిమిషానికి 11 మంది బలి!

అన్నిటికీ కొరతే
విదేశీ నిల్వల తరుగుదలకు ఇంధన ధరల పెరుగుదల తోడవడంతో దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఎక్కడ చూసినా నిత్యావసరాల కొరత కనిపిస్తోంది. వీటికి విద్యుత్‌ కోతలు, నీటి సరఫరా కోతలు తోడవుతున్నాయి. కిరాణా కొట్లు, పెట్రోల్‌ బంకులు, మెడికల్‌ షాపుల ముందు భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు. దేశంలో విదేశీ మారకం కొరత కారణంగా దిగుమతి దారులు బ్యాంకుల నుంచి ఎల్‌ఓసీ (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) పొందటం కష్టంగా మారింది. దీనివల్ల నౌకాశ్రయాల్లో కంటైనర్లు పేరుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన లేమితో పలు విద్యుత్‌ ప్లాంట్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల వ్యవసాయానికి ఉంచిన నీటిని వాడి విద్యుదుత్పాదన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని వల్ల తీవ్రమైన ఆహారకొరత ఎదురుకానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మా రంగంలో ఔషధాల కొరత తీవ్రతరమైందని లంక ఫార్మా ఓనర్ల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.  సంక్షోభ కారణంగా లంక రేటింగ్‌ను ఏజెన్సీలు మరింత డౌన్‌గ్రేడ్‌ చేసే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే ఇప్పట్లో దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్లు రావడం జరగకపోవచ్చని భయాలున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతర్గతంగా పలు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.  విత్తలోటుకు కారణమయ్యే లగ్జరీ వాహనాలు, రసాయన ఎరువులు, పసుపులాంటి ఆహార వస్తువుల దిగుమతిని నిషేధించింది.దేశీయ బ్యాంకులు కుదుర్చుకునే ఫార్వార్డ్‌ కాంట్రాక్టులపై కేంద్ర బ్యాంకు పరిమితులు విధించింది. విదేశీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల ఆకర్షణకు, చెల్లింపుల ప్రవాహం (రెమిటెన్స్‌ ఫ్లో– దేశంలోకి వచ్చే విదేశీ నిధులు) పెరుగుదలకు కీలక పాలసీలు ప్రకటించింది.  

Indian Constitution: రాజ్యాంగం నిర్మించడానికి పుట్టి, ఆ తరువాత కనుమరుగయ్యే..

విదేశీ సాయం
లంకకు సాయం చేయడం కోసం బంగ్లా, చైనాలు కరెన్సీ స్వాపింగ్‌(అసలును ఒక కరెన్సీలో, వడ్డీని మరో కరెన్సీలో చెల్లించే వెసులుబాటు) సదుపాయాన్ని పొడిగించాయి. దీంతో పాటు చైనా 70 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేసింది. ఇండియా సైతం 240 కోట్ల డాలర్ల విలువైన పలు రకాల సహాయాలు ప్రకటించింది. పాకిస్తాన్‌ సిమెంట్, బాస్మతీ రైస్, ఔషధాల సరఫరాకు ముందుకు వచ్చింది. ఖతార్‌ తదితర దేశాలు కూడా తగిన సహాయం ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్‌ సాయాన్ని అంగీకరించాలంటే పలు కఠిన షరతులను లంక అంగీకరించాల్సి వస్తుంది. బెయిల్‌ అవుట్‌ లేకుండానే తాము గట్టెక్కుతామని, పరిస్థితి త్వరలో చక్కబడుతుందని లంక ప్రభుత్వం, లంక కేంద్ర బ్యాంకు (సీబీఎస్‌ఎల్‌) ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై అటు ఆర్థికవేత్తలు, ఇటు ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. చైనా సాయం పేరిట దేశాన్ని కబళిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఐఎంఎఫ్‌ను సంప్రదిస్తామని ప్రకటించింది. 

కప్పు టీ రూ.100.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 280..

  • దేశంలో టోకు ద్రవ్యోల్బణం 15.1 శాతాన్ని, ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతాన్ని తాకాయి. ఇవి ఆసియాలోనే గరిష్టం. 
  • వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర గత అక్టోబర్‌లో 1500 రూపాయలుండగా, ప్రస్తుతం 3వేల రూపాయలకు దగ్గరలో ఉంది.  
  • పాల పౌడర్‌ ధరలు పెరగడంతో ప్రస్తుతం కప్పు టీ ధర రూ. 100కు చేరింది.
  • ఒక గుడ్డు ధర రూ.35కు చేరగా, కిలో చికెన్‌ రూ.1,000ని తాకింది.
  • లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 280ని దాటేసింది.  
  • లంక రూపాయి 30 శాతం క్షీణించి అమెరికా డాలర్‌తో మారకం 275కు చేరింది.

ఇదీ పరిస్థితి

  • 2021 నవంబర్‌నాటికి శ్రీలంక మొత్తం విదేశీ రుణాలు 3200 కోట్ల డాలర్లున్నాయి.  
  • శ్రీలంక 2021– 26 కాలంలో 2,900 కోట్ల డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. 
  • కరోనాకు ముందు లంక టూరిజం ఆదాయం 360 కోట్ల డాలర్లుండగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. 
  • లంకకు వచ్చే టూరిస్టుల్లో రష్యన్లు, ఉక్రేనియన్ల వాటా దాదాపు 25 శాతం. యుద్ధం కారణంగా వీరి రాక ఆగిపోయింది. 
  • లంక ఎగుమతుల్లో కీలకమైన తేయాకును దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా, ఉక్రేనియన్‌ కీలకం. 
  • కరోనాకు ముందు చైనా నుంచి లంకకు లక్షల్లో టూరిస్టులు వచ్చేవారు. కరోనా దెబ్బకు వీరంతా తగ్గిపోయారు.

Russia-Ukraine Conflict: ఈ యుద్ధం వెనుక ఏముంది?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 25 Mar 2022 07:34PM

Photo Stories