Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 24 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-March-24

Chief Minister of Uttarakhand: ఉత్తరాఖండ్‌ సీఎంగా ప్రమాణం చేసిన బీజేపీ నేత?

Pushkar Singh Dhami as cm of Uttrarakhand

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత పుష్కర్‌ సింగ్‌ ధామి మార్చి 23న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) గుర్మీత్‌ సింగ్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఖతిమా అసెంబ్లీ స్థానం నుంచి  ఓడినా బీజేపీ అధిష్టానం పుష్కర్‌నే సీఎంను చేసింది. పుష్కర్‌ సీఎంగా కొనసాగాలంటే మరో ఆరు నెలల్లో ఆయన శాసనసభకు ఎన్నికల కావాల్సి ఉంది. మార్చి 10న వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇలా..

పార్టీ

2022 ఎన్నికలు

2017 ఎన్నికలు

బీజేపీ

47

57

కాంగ్రెస్

19

11

స్వతంత్రులు

2

2

బీఎస్పీ

2

0

ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం నుంచి..
సరిహద్దు ప్రాంతమైన పిథోరాగఢ్‌లో 1975 సెప్టెంబర్‌ 16న పుష్కర్‌ జన్మించారు. మాజీ సైనికుడి కుమారుడైన ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. తొలుత రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో సభ్యుడిగా పనిచేశారు. పదేళ్లపాటు ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2002 నుంచి 2008 దాకా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2001–2002లో అప్పటి ముఖ్యమంత్రిగా భగత్‌సింగ్‌ కోషియారీ వద్ద ఓఎస్‌డీగా పనిచేశారు. 2012, 2017లో.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తొలిసారి 2021, జూలై 4న ప్రమాణ స్వీకారం చేశారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేసిన నేత?
ఎప్పుడు : మార్చి 23
ఎవరు    : బీజేపీ నేత పుష్కర్‌ సింగ్‌ ధామి
ఎక్కడ    : డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌
ఎందుకు : తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో.. 

Girls Education: బాలికా విద్యపై ఏ దేశంలో ఆంక్షలు విధించారు?

Girls Education

అఫ్గానిస్తాన్‌లో బాలికా విద్య విషయంలో తాలిబాన్‌ ప్రభుత్వం ఛాందసవాద వైఖరి ఏమాత్రం మారలేదు. ఆరో తరగతికి మించి బాలికలు విద్య అభ్యసించడానికి వీల్లేదని మార్చి 22న తాలిబాన్‌ ప్రభుత్వం మౌఖిక ఆదేశాలిచ్చింది. కొత్త విద్యా సంవత్సరం మొదలైన తొలిరోజే(మార్చి 23) పాఠశాల విద్యార్థినులు కొద్ది గంటల్లోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. హఠాత్తుగా బాలికా విద్యపై ఆంక్షలు విధించడానికి గల కారణాలను విద్యాశాఖ అధికార ప్రతినిధి అజీజ్‌ అహ్మద్‌ రియాన్‌ వెల్లడించలేదు. బాలికలను శాశ్వతంగా విద్యకు దూరం చేస్తామనేది తమ అభిమతం కాదని విదేశీ వ్యవహారాల ప్రతినిధి వహీదుల్లా హష్మీ చెప్పారు.

చెర్నోబిల్‌ అణు విద్యుత్కేంద్రం ఏ దేశంలో ఉంది?
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్కేంద్రంలోని కీలకమైన నూతన లేబొరేటరీని రష్యా సైన్యం ధ్వంసం చేసింది. రేడియోధార్మిక వ్యర్థాల మెరుగైన నిర్వహణతో పాటు పలు కీలకాంశాల్లో ఈ ల్యాబ్‌ది కీలక పాత్ర అని ఉక్రెయిన్‌ అణు నియంత్రణ సంస్థ తెలిపింది. రష్యా దాడిలో నేలమట్టమైన ల్యాబ్‌ను 2015లో  ఈయూ  సహకారంతో నిర్మించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బాలికా విద్యపై ఆంక్షలు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు    : తాలిబాన్‌ ప్రభుత్వం
ఎక్కడ   : అఫ్గానిస్తాన్‌

AIIMS Director: ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా ఎవరు ఉన్నారు?

AIIMS New Delhi

ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. మార్చి 25 నుంచి మరో మూడు నెలలు లేదా కొత్త డైరెక్టర్‌ నియమితులయ్యేవరకు(ఏది ముందు జరిగితే అది) పొడిగించాలని ఎయిమ్స్‌ ప్రెసిడెంట్‌ నిర్ణయించినట్లు మార్చి 23న ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. డైరెక్టర్‌ పదవికి 32మంది పోటీ పడుతున్నారు. వీరిలో ఐసీఎంఆర్‌ డీజీ బలరామ్‌ భార్గవ కూడా ఉన్నారు.

6 ఏళ్లలోపు పిల్లలకు మోడెర్నా టీకా!
తాము రూపొందించినలో డోస్‌ కోవిడ్‌ టీకా ఆరు సంవత్సరాల్లోపు పిల్లల్లో బాగా పనితీరు కనబరుస్తోందని మోడెర్నా మార్చి 23న ప్రకటించింది. నియంత్రణా సంస్థలు అంగీకరిస్తే పిల్లలకు టీకాలనిచ్చే ప్రక్రియ ఆరంభిస్తామని పేర్కొంది. త్వరలో యూఎస్, యూరప్‌ ఔషధ నియంత్రణా సంస్థలకు టీకా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని తెలిపింది. పెద్దలు కొంతమందిలో టీకా వల్ల ఎదురయ్యే ఇబ్బందులు చిన్నపిల్లల్లో కనిపించలేదని తెలిపింది.

కోవిడ్‌ ఆంక్షల ఎత్తివేత 
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో గత రెండేళ్లుగా అమల్లో ఉన్న కోవిడ్‌ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కరోనా కట్టడికి విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్టుగా  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం కరోనా వైరస్‌ కలకలం సృష్టించినప్పుడు 2020 మార్చి 24న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కోవిడ్‌ నిబంధనల్ని తెచ్చింది.

Retirement from Tennis: టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన వరల్డ్‌ నంబర్‌వన్‌?

Ashleigh Barty

Ashleigh Barty Announces Retirement from Tennis: మహిళల టెన్నిస్‌ వరల్డ్‌ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత యాష్లే బార్టీ టెన్నిస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మాజీ డబుల్స్‌ భాగస్వామి కేసీ డెలాక్వాకు మార్చి 23న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపై టెన్నిస్‌లో ఏదైనా సాధించాలనే తపన తనలో తగ్గిందని, అందుకు తగిన ప్రేరణ లభించకపోవడం కూడా రిటైర్మెంట్‌ కు కారణమని బార్టీ స్పష్టం చేసింది.

ఆస్ట్రేలియాకి చెందిన 25 ఏళ్ల బార్టీ గత రెండేళ్లకు పైగా (114 వారాలు) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2022, జనవరి 29న స్వదేశంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచి చరిత్ర సృష్టించిన బార్టీ ఆ తర్వాత మరే టోర్నీలోనూ బరిలోకి దిగలేదు. 2014లో కూడా ఒకసారి టెన్నిస్‌కు నిరవధిక విరామం ఇచ్చి క్రికెట్‌వైపు వెళ్లిన బార్టీ ఆ తర్వాత మళ్లీ రాకెట్‌ పట్టి ఆపై వరుస విజయాలు సాధించింది. 2008లో జస్టిన్‌ హెనిన్‌ (బెల్జియం) కూడా ఇదే తరహాలో వరల్డ్‌ నంబర్‌వన్‌గా ఉండగానే టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది.

నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌..

  • యాష్లే బార్టీ గెలిచిన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ 4. సింగిల్స్‌లో 2019 ఫ్రెంచ్‌ ఓపెన్, 2021 వింబుల్డన్, 2022 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌... డబుల్స్‌లో 2018 యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సాధించింది.
  • బార్టీ సాధించిన మొత్తం టైటిల్స్‌ 27. (సింగిల్స్‌లో 15, డబుల్స్‌లో 12)
  • తన ప్రొఫెషనల్‌ సింగిల్స్‌ కెరీర్‌లో బార్టీ గెలిచిన మ్యాచ్‌లు 305.  
  • 2,38,29,071 డాలర్లు (రూ. 182 కోట్లు) కెరీర్‌ మొత్తంలో బార్టీ గెలిచిన ప్రైజ్‌మనీ.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మహిళల టెన్నిస్‌ వరల్డ్‌ నంబర్‌వన్‌?
ఎప్పుడు : మార్చి 23
ఎవరు    : ఆస్ట్రేలియాకి చెందిన యాష్లే బార్టీ 
ఎందుకు : టెన్నిస్‌లో ఏదైనా సాధించాలనే తపన తనలో తగ్గిందని..

Hyderabad: ఎలైట్‌ ఫుట్‌బాల్‌ అకాడమీని ఏర్పాటు చేసిన ఐఎస్‌ఎల్‌ జట్టు?

Football

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఎనిమిదో సీజన్‌లో చాంపియన్‌గా అవతరించిన హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (హెచ్‌ఎఫ్‌సీ).. హైదరాబాద్‌ నగరంలో ప్రాథమిక స్థాయిలో ఫుట్‌బాల్‌ అభివృద్ధికి ముందుకు వచ్చింది. తాజాగా దీనికి సంబంధించి ‘గాడియమ్‌ స్కూల్‌’తో హెచ్‌ఎఫ్‌సీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లోని కొల్లూరులో ఉన్న ఈ పాఠశాలలో ‘ఎలైట్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ’ని హెచ్‌ఎఫ్‌సీ ఏర్పాటు చేసింది. ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి అకాడమీలో శిక్షణ ఇస్తారు.

మహేశ్వరికి రజత పతకం
ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్‌ మీట్‌లో తెలంగాణ అథ్లెట్‌ జి.మహేశ్వరి రజత పతకం సాధించింది. కేరళ రాజధాని నగరం తిరువనంతపురంలో మార్చి 23న జరిగిన ఈ మీట్‌లో మహేశ్వరి 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో 10 నిమిషాల 52.49 సెకన్లలో గమ్యానికి చేరింది. పారుల్‌ (ఉత్తరప్రదేశ్‌; 9ని:38.29 సెకన్లు) స్వర్ణ పతకాన్ని గెలిచింది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్‌ సాబ్లే (మహారాష్ట్ర; 8ని:16.21 సెకన్లు) కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎలైట్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 23
ఎవరు    : హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (హెచ్‌ఎఫ్‌సీ)
ఎక్కడ     : గాడియమ్‌ స్కూల్, కొల్లూరు, హైదరాబాద్‌
ఎందుకు : ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు..

India Sets Export Record: 2021–22 ఏడాదిలో దేశ ఎగుమతలు ఎంత శాతం పెరిగాయి?

India Exports one

India Achieves 400 Billion Dollars Goods Exports Target: దేశ చరిత్రలో మొదటిసారి ఎగుమతులు 400 బిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించాయి. ఈ విషయాన్ని మార్చి 23న కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.30 లక్షల కోట్లు) ఎగుమతులు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్రితం ఆర్థిక సంవత్సరం 2020–21తో పోలిస్తే 37 శాతం పెరిగి 400.8 బిలియన్‌ డాలర్లుగా మార్చి 22 నాటికి నమోదైనట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మరికొన్ని రోజుల్లో 10–12 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు నమోదు కావచ్చని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) సంతోష్‌ కుమార్‌ సారంగి తెలిపారు.

India Exports

వాణిజ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం..

  • దేశ ఎగుమతులు 2020–21లో 292 బిలియన్‌ డాలర్లు, 2018–19లో 330 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22లో మార్చి 21 నాటికి దిగుమతులు 589 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంటే 189 బిలియన్‌ డాలర్ల మేర వాణిజ్యలోటు ఏర్పడినట్టు తెలుస్తోంది.
  • భారతదేశ చరిత్రలో ఎగుమతులు 400 బిలియన్‌ డాలర్లను చేరుకోవడం ఇదే మొదటిసారి.
  • 2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రతి నెలా సగటున 33 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి.

అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం: ప్రధాని మోదీ
భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ మైలురాయిని అందుకోవడంలో ఇది కీలకమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 9 రోజులు మిగిలి ఉండగానే ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి 22 వరకు ఎగుమతులు 37 శాతం పెరిగి 400 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

రాష్ట్రాల సహకారంతో..
ట్విట్టర్‌లో ప్రధాని మోదీ.. ఎగుమతులకు సంబంధించిన గ్రాఫిక్స్‌ను పోస్ట్‌ చేశారు. రాష్ట్రాల భాగస్వామ్యం, జిల్లా అధికారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం, వివిధ ఎగుమతుల మండళ్లు, పరిశ్రమల మండళ్లు, భాస్వాములతో చురుగ్గా సంప్రదింపులు చేయడం వల్లే 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల మైలురాయిని చేరుకోవడం సాధ్యపడినట్టు గ్రాఫిక్స్‌ను పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రతి నెలా సగటున 33 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు సాధ్యమయ్యాయి.

Everyday Exports

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.30 లక్షల కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి.
ఎప్పుడు : మార్చి 23
ఎవరు    : కేంద్ర వాణిజ్య శాఖ
ఎందుకు : దేశ ఉత్పత్తుల పెరగడంతో..

Second Official Language: ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించిన రాష్ట్రం?

Urdu

మైనార్టీల సంక్షేమం, ఉర్దూ భాషాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ మార్చి 23న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లును, కొత్తగా మైనార్టీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీస్‌ కాంపోనెంట్‌ మరియు ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు మరియు వినియోగ చట్టం–2022 బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష మాట్లాడుతూ.. ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదని, నిఖార్సయిన భారతీయ భాష అని చెప్పారు. ఇక వినియోగ చట్టం–2022 బిల్లుతో వచ్చే 10 ఏళ్లలో అల్ప సంఖ్యాక వర్గాలకు భద్రత, సామాజిక హోదాతో పాటు సమధర్మాన్ని పాటించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఆర్థిక, విద్య, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లో ఆయా వర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

32.45 లక్షల మందికి మాతృభాషగా..
ఉర్దూకు రెండో అధికారిక భాషగా చట్టబద్ధత కల్పించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టయింది. రాష్ట్రంలో 32.45 లక్షల మందికి ఉర్దూ మాతృభాషగా ఉంది. ఉర్దూ మాట్లాడే ప్రజలు వైఎస్సార్‌ కడపలో 19 శాతం, గుంటూరులో 15.55 శాతం, చిత్తూరు 13.16 శాతం, అనంతపురంలో 12.91, కర్నూలు 11.55, కృష్ణాలో 8.42 శాతం, ప్రకాశంలో 5.65 శాతం, నెల్లూరులో 7.84 శాతం ఉన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ సుమరు రెండు శాతం ఉర్దూ మాట్లాడే ప్రజలున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీస్‌ కాంపోనెంట్‌ మరియు ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు మరియు వినియోగ చట్టం–2022 బిల్లులకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 23
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ
ఎందుకు : రాష్ట్రంలో ఉర్దూకు రెండో అధికారిక భాషగా చట్టబద్ధత కల్పించడంతోపాటు, మైనార్టీల సంక్షేమం కోసం..

IGGCARL: రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఆగ్రోఎకాలజీ సెంటర్‌ ఏర్పాటు కానుంది?

Farming

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో త్వరలో అంతర్జాతీయస్థాయి సేంద్రియ సాగు పరిశోధన కేంద్రం.. ఇండో జర్మన్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (ఐజీజీసీఏఆర్‌ఎల్‌) ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సమీర్‌ శర్మ తెలిపారు. సీఎస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రైతుల్లో సేంద్రియ సాగు పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించి, పరిశోధన ఫలితాలను అందించటానికి ఐజీజీసీఏఆర్‌ఎల్‌ దోహదపడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.48.50 కోట్లు, జర్మనీ రూ.174.2 కోట్లు అందిస్తాయి. జూన్‌ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  చేతుల మీదగా పులివెందులలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది.

23 శాతం పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు బానిసలు
దేశంలో 23.8 శాతం మంది పిల్లలు పడుకునే ముందు పడకపై ఫోన్‌ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్న చిన్నారుల్లో 37.15 శాతం మందిలో ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మార్చి 23న లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
త్వరలో ఇండో జర్మన్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (ఐజీజీసీఏఆర్‌ఎల్‌) ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 23
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సమీర్‌ శర్మ
ఎక్కడ    : పులివెందుల, వైఎస్సార్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : రైతుల్లో సేంద్రియ సాగు పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించి, పరిశోధన ఫలితాలను అందించటానికి..చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 24 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 24 Mar 2022 07:15PM

Photo Stories