Daily Current Affairs in Telugu: 2022, మార్చి 23 కరెంట్ అఫైర్స్
2021 World Air Quality Report: ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత రాజధాని నగరం ఏది?
ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత రాజధాని నగరంగా భారత రాజధాని నగరం ఢిల్లీ నిలిచింది. స్విట్జర్‌ల్యాండ్‌కి చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ మార్చి 22న విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్–2021లో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితా తయారీకి 117 దేశాల్లోని 6,475 నగరాల్లో వాయు నాణ్యత (పీఎం 2.5– పర్టిక్యులేట్ మాటర్ 2.5 స్థాయి)ను సంస్థ పరిశీలించింది. వాయుకాలుష్యం శ్వాసకోశ ఇబ్బందులు, అలెర్జీల నుంచి క్యాన్సర్ తదితరాలకు దారితీస్తుంది.
2021 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ – ముఖ్యమైన అంశాలు
- ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ నిలిచింది. అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉండటం వరుసగా ఇది నాలుగోసారి.
- కలుషిత రాజధానుల్లో ఢిల్లీ తర్వాత ఢాకా (బంగ్లాదేశ్), జమేనా (చాడ్ రిపబ్లిక్), దుషంబె (తజికిస్తాన్), మస్కట్ (ఒమన్) నిలిచాయి.
- అత్యంత అధమ వాయు నాణ్యత ఉన్న టాప్ 100లో 63 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నగరాలు ఉత్తరాదిన ఢిల్లీ పరిసరాల్లోనే ఉన్నాయి.
- భారత్‌లో ఒక్క నగరంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారిత వాయు నాణ్యత ప్రమాణాలు(క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు) లేవు.
- ఢిల్లీ పీఎం 2.5 స్థాయి క్రితంతో పోలిస్తే 14.6 శాతం పెరిగింది. ఢిల్లీ గాలిలో కాలుష్య స్థాయి క్యూబిక్ మీటర్‌కు 96.4 మైక్రోగ్రాములుగా నమోదైంది.
- భారత్ సరాసరి వార్షిక పీఎం 2.5 స్థాయి 2021లో క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రో గ్రాములకు చేరింది.
- కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో భారత్‌లో వాయునాణ్యత మెరుగైంది, కానీ 2021కల్లా వాయు నాణ్యత తిరిగి 2019 స్థాయికి పడిపోయింది.
- భారత్‌లో 48 శాతం నగరాల్లో వాయు నాణ్యత క్యూబిక్ మీటర్‌కు 50 మైక్రో గ్రాములను దాటింది.
ప్రపంచంలో అత్యంత కలుషిత నగరం భివాడీ
- ప్రపంచ టాప్ 15 కలుషిత నగరాల్లో పది నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. – ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా రాజస్తాన్‌లోని భివాడీ నగరం నిలిచింది. ఈ నగరంలో పీఎం 2.5 స్థాయి 106.2 మైక్రోగ్రామ్/క్యూబిక్ మీటర్‌గా నమోదైంది.
- భివాడీ తర్వాత స్థానాల్లో ఘజియాబాద్, చైనాకు చెందిన హోటాన్, ఢిల్లీ, జాన్‌పూర్, పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ నిలిచాయి.
- దేశాల వారీగా చూస్తే అత్యంత కాలుష్య దేశంగా పీఎం 2.5 స్థాయి 76.9 మైక్రోగ్రామ్/క్యూబిక్‌మీటర్‌తో బంగ్లాదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో చాడ్, పాకిస్తాన్, తజికిస్తాన్, భారత్ ఉన్నాయి.
నాలుగో స్థానంలో హైదరాబాద్
- భారత్‌లో అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది.
- హైదరాబాద్ నగరంలో పీఎం 2.5 స్థాయిలు 2020లో క్యూబిక్ మీటర్‌కు 34.7 మైక్రోగ్రామ్ ఉండగా, 2021కి 39.4కు పెరిగింది. పెరుగుతున్న వాహన విక్రయాలు కాలుష్య పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో అధికారిక లెక్కల ప్రకారం 60 లక్షల వాహనాలున్నాయి.
- ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కేవలం 3 శాతం నగరాలు మాత్రమే డబ్లు్యహెచ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా వాయునాణ్యతతో ఉన్నాయి. దేశాల వారీగా చూస్తే ఏ ఒక్క దేశంలో కూడా వాయు నాణ్యత నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : ఐక్యూ ఎయిర్ సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్–2021
ఎక్కడ : ప్రపంచ దేశ రాజధానుల్లో..
ఎందుకు : అత్యధిక కాలుష్యం వల్ల.. వాయు నాణ్యత క్షీణించడంతో..
Global House Price Index 2021: ఇళ్ల రేట్లలో భారత్‌కు ఎన్నో ర్యాంకు లభించింది?
Global House Price Index - Q3 2021: 2021, అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో గృహాల ధరలు 2.1 శాతం మేర పెరిగాయి. దీంతో అంతర్జాతీయంగా గృహాల ధరల పెరుగుదలకు సంబంధించిన జాబితాలో భారత్ 56వ ర్యాంకు నుంచి 51వ స్థానానికి ఎగబాకింది. ’గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ – క్యూ4 2021’ నివేదికలో నైట్ ఫ్రాంక్ సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. అధికారిక గణాంకాల ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలు, ప్రాంతాల్లో ఇళ్ల ధరల వివరాలను క్రోడీకరించి నైట్ ఫ్రాంక్ ఈ నివేదిక రూపొందించింది. 2020 క్యూ4లో భారత్ 56వ ర్యాంకులో ఉన్న విషయం విదితమే.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- వార్షిక ప్రాతిపదికన టర్కీలో గృహాల రేట్లు అత్యధికంగా 59.6 శాతం మేర పెరిగాయి. న్యూజిలాండ్ (22.6 శాతం), చెక్ రిపబ్లిక్ (22.1 శాతం), స్లొవేకియా (22.1 శాతం), ఆస్ట్రేలియా (21.8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- ఇక మలేషియా, మాల్టా, మొరాకో మార్కెట్లలో హౌసింగ్ ధరలు 0.7–6.3 శాతం మేర తగ్గాయి.
- డేటా ప్రకారం 56 దేశాలు, ప్రాంతాల్లో రేట్లు సగటున 10.3 శాతం మేర పెరిగాయి.
- అంతర్జాతీయంగా ప్రభుత్వాల విధానపరమైన చర్యల తోడ్పాటు తదితర అంశాలతో హౌసింగ్ ధరలు మెరుగుపడ్డాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయంగా గృహాల ధరల పెరుగుదలకు సంబంధించిన జాబితాలో భారత్ 51వ ర్యాంకు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ – క్యూ4 2021
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలు, ప్రాంతాల్లో..
Digital Marketing Agency: జర్మన్ సంస్థ ఒడిటీను చేయనున్న ఐటీ సంస్థ?
Infosys to acquire digital marketing agency Oddity: డిజిటల్ మార్కెటింగ్ జర్మన్ సంస్థ ఒడిటీను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్, కామర్స్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఒడిటీ కొనుగోలుకి 5 కోట్ల యూరోల(రూ. 419 కోట్లు)ను వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ విభాగంలో ఇన్ఫోసిస్‌కుగల వాంగ్‌డూడీలో ఒడిటీ భాగంకానున్నట్లు తెలియజేసింది. 2018లో యూఎస్ కంపెనీ వాంగ్‌డూడీను 7.5 కోట్ల డాలర్లకు ఇన్ఫోసిస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఓవరాల్ చాంపియన్ ఆంధ్రప్రదేశ్
భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సౌత్‌జోన్ ఇంటర్ రీజినల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ స్పోర్ట్స్ మీట్‌లో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో వంశీ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) టైటిల్ గెలుపొందగా... మహిళల సింగిల్స్‌లో ప్రతిమా కుమారి (ఆంధ్రప్రదేశ్) రన్నరప్‌గా నిలిచింది. పురుషుల డబుల్స్‌లో వంశీ రెడ్డి–చైతన్య (ఆంధ్రప్రదేశ్) జోడీ టైటిల్ నెగ్గింది. ఎఫ్‌సీఐ (రీజియన్) జనరల్ మేనేజర్ దీపక్ శర్మ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డిజిటల్ మార్కెటింగ్ జర్మన్ సంస్థ ఒడిటీను కొనుగోలు చేయనున్న ఐటీ సంస్థ?
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్
ఎందుకు : ఇన్ఫోసిస్, ఒడిటీ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు..
CM YS Jagan: రాష్ట్రంలోని ఏ జిల్లాలో పవర్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు కానుంది?
ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ విన్నర్ షేక్ సాదియా అల్మస్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మస్ మార్చి 22న అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2021, డిసెంబర్‌లో జరిగిన ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించిన ఆమెను ముఖ్యమంత్రి సత్కరించారు. అనంతరం అల్మస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు గుంటూరు జిల్లా, మంగళగిరిలో పవర్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారని చెప్పారు.
‘టికీ అటకిజా–ఏ, పంత్’ కవితా సంకలనాన్ని ఎవరు రచించారు?
ప్రముఖ కవి, ఒడిశా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ బి.జయసింగ్ రచించిన ‘టికీ అటకిజా–ఏ, పంత్ (కొంచెం వేచి ఉండండి, ఓ ట్రావెలర్)’ 8వ ఒడియా కవితల సంకలనం పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మార్చి 22న ఈ కార్యక్రమం జరిగింది. మృత్యువును ఆలింగనం చేసుకునే క్షణాన, దుఃఖాలు, వేదనలతో నిండిన సమకాలీన వాస్తవికతలో గత జ్ఞాపకాలను పునరుశ్చరణ చేసే కథానాయకుడి అనుభవం ఆధారంగా ఈ కవితలు రూపుదిద్దుకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో పవర్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ విన్నర్ షేక్ సాదియా అల్మస్
ఎక్కడ : మంగళగిరి, గుంటూరు జిల్లా
ఎందుకు : పవర్‌లిఫ్టింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు..
Telangana: క్వాల్కమ్ నూతన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?
సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల రంగంలో క్వాల్కమ్, గోల్ఫ్ బ్రాండ్‌లలో ‘కాల్‌అవే గోల్ఫ్’తోపాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలోని ఫిస్కర్ కంపెనీ తమ కార్యాలయాలను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో మార్చి 22న శాండియాగోలోని క్వాల్కమ్, కాల్‌అవే గోల్ఫ్, లాస్ ఏంజెలిస్‌లోని ఫిస్కర్ ప్రధాన కార్యాలయాల్లో ఆ సంస్థల ప్రతినిధులు సమావేశమై.. చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులు, మంత్రి కేటీఆర్ తెలిపిన వివరాల ప్రకారం...
- క్వాల్కమ్ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో 2022, అక్టోబర్ నాటికి ప్రారంభించనుంది. వచ్చే ఐదేళ్లలో దశలవారీగా రూ.3,904 కోట్లు పెట్టనుంది.
- ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో ఫిస్కర్ కంపెనీ భాగస్వామి కానుంది.
- కాల్‌అవే గోల్ఫ్ సంస్థ హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ ద్వారా ప్రాథమిక దశలో 300 మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌తో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్వాల్కమ్, కాల్‌అవే గోల్ఫ్, ఫిస్కర్ కంపెనీల కార్యాలయాలు ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కార్యకలాపాల విస్తరణలో భాగంగా..
Most Powerful Missiles: హైపర్ సోనిక్ మిసైల్ కింజల్ పరిధి ఎన్ని కిలోమీటర్లు?
Top Most Powerful Missiles in The World: ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా.. తాజాగా ఓ హైపర్ సోనిక్ మిసైల్ ‘కింజల్’ను ఆ దేశ సైనిక ఆయుధాగారంపై ప్రయోగించినట్టు ప్రకటించింది. కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల ఈ అత్యాధునిక క్షిపణిని తొలిసారి వాడామని రష్యా వెల్లడించింది. అంత అత్యాధునికంగా ఈ మిసైల్‌లో ఏం వాడారు, దీని ప్రత్యేకతలేంటి, ఏయే దేశాల దగ్గర ఇలాంటివి ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయా.. తెలుసుకుందాం.
ఏంటీ కింజల్ మిసైల్?
కింజల్ అంటే బాకు అని అర్థం. ఇది ఆకాశం నుంచి (ఎయిర్ లాంచ్డ్) ప్రయోగించే హైపర్ సోనిక్ మిసైల్. అణ్వాయుధాలను, సంప్రదాయ ఆయుధాలను 500 కిలోల వరకు మోసుకెళ్లగలదు. దీని వేగం మాక్ 10. అంటే ధ్వని వేగానికి 10 రెట్లు ఎక్కువ. ఇంకా సులువుగా చెప్పాలంటే గంటకు 12 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. తొలుత ప్రయోగించగానే గంటకు 4,900 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ తర్వాత మాక్ 10 వేగాన్ని చేరుకోగలదు. గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకొని వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. దీని పరిధి 1,500 కిలోమీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లు. 2018లోనే దీని గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.
కింజల్ ప్రత్యేకతలు
- పేరు: కేహెచ్ 47ఎం2 కింజల్
- వేగం: గంటకు 12 వేల కిలోమీటర్లకు పైనే
- పరిధి: 1,500 కిలోమీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లు
- ఎంత బరువును మోసుకెళ్లగలదు: 500 కిలోలు
- సంప్రదాయ, అణు బాంబులను ప్రయోగించవచ్చు
హైపర్ సోనిక్ మిసైల్ అంటే?
ధ్వని వేగం కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తే హైపర్ సోనిక్ అంటారు. ధ్వని వేగం గంటకు 1,234 కిలోమీటర్లు. మాక్ 5తో వెళ్లే మిసైళ్ల వేగం గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్లకు పైనే ఉంటుందన్నమాట. మామూలుగా మిసైళ్లను బాలిస్టిక్, క్రూయిజ్ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఈ హైపర్ సోనిక్ మిసైల్ క్రూయిజ్ మిసైళ్ల వర్గానికి చెందింది. హైపర్ సోనిక్ మిసైళ్లు లక్ష్యాన్ని ఛేదించే వరకు శక్తితోనే (ఇంధనం) నడుస్తుంటాయి. భూ వాతావరణంలోనే ఉంటూ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. పరావలయ మార్గంలో వెళ్లినా అవసరమైతే దిశను మార్చుకోవడం వీటి ప్రత్యేకత. ఇవి తక్కువ బరువునే మోసుకెళ్లగలవు.
‘హైపర్ సోనిక్’ ఎవరిదగ్గరున్నాయి?
హైపర్ సోనిక్ మిసైళ్లను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలను ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా, చైనా దగ్గర అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైళ్లున్నాయి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. రష్యా సాయంతో కలిసి ఇండియా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ను తయారు చేస్తోంది. సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగం (మాక్ 2 నుంచి 3)తో దూసుకెళ్లేవి. బ్రహ్మోస్ 2 హైపర్ సోనిక్ మిసైల్‌ను కూడా ఇండియా తయారు చేస్తోంది.
బాలిస్టిక్ మిసైల్ ఎలా పని చేస్తుంది?
బాలిస్టిక్ మిసైళ్లను రాకెట్ (ఇతర సాధనాల) సాయంతో పైకి తీసుకెళ్తారు. ఆ తర్వాత భూమ్యాకర్షణ ప్రేరణతో లక్ష్యం వైపు ఇవి దూసుకెళ్తాయి. పరావలయ (పారాబోలిక్) మార్గంలో ప్రయాణిస్తాయి. మొత్తంగా బాలిస్టిక్ క్షిపణులకు ప్రయోగించాక కొద్ది దూరం వరకే శక్తిని (ఇంధనం) అందిస్తారు. ఇవి ఎక్కువ బరువును మోసుకెళ్లగలవు. ముందే నిర్ణయించిన లక్ష్యాన్ని ఛేదిస్తాయి. ఒకసారి ప్రయోగించాక దిశను మార్చుకోవడం కష్టం. ఇండియా దగ్గర ఉన్న పృథ్వీ 1, పృథ్వీ 2, అగ్ని 1, అగ్ని 2, ధనుష్ బాలిస్టిక్ క్షిపణులే.
భారత్ ప్రయోగం సక్సెస్
మన దేశం హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ వెహికల్ (హెచ్‌ఎస్‌టీడీవీ) పరీక్షను 2021 ఏడాది విజయవంతంగా పరీక్షించింది. ఇందులో స్క్రామ్‌జెట్ ఇంజన్‌ను వాడింది. ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల హైపర్ సోనిక్ మిసైళ్ల తయారీకి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుంది.
World Water Day 2022 Theme: ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
ప్రతి నీటి చుక్కనూ పొదుపు చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో కొన్నేళ్లుగా నీటి సంరక్షణను ఉద్యమంలా కొనసాగిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. మార్చి 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నీటి పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించాలంటూ 1992లో రియో డి జనేరియోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణం మరియు అభివృద్ధి సదస్సు తీర్మానించింది. అలా 1993లో మొదటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో వరల్డ్ వాటర్ డేని నిర్వహించడం ఆనవాయితీ. 2022 ఏడాదికి సంబంధించి ’గ్రౌండ్ వాటర్: మేకింగ్ ది ఇన్విజిబుల్ విజిబుల్’ అనేది థీమ్. నానాటికి అదృశ్యమైన పోతున్న భూగర్భ జలాల్ని కాపాడుకోవడం అనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించు కోవాలని ఐక్యరాజ్యసమతి పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అంద జేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ నీటి దినోత్సవ నిర్వహణ
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : ప్రపంచ దేశాలు...
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా..
ఎందుకు : నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ..
Canada PM Justin Trudeau: కెనడా దేశ కరెన్సీ పేరు ఏమిటీ?
కెనడాలో జస్టిన్ ట్రూడో 2025 దాకా ప్రధాని పీఠంపై కొనసాగనున్నారు. అధికార లిబరల్ పార్టీ, విపక్ష న్యూ డెమొక్రటిక్ పార్టీ్ట(ఎన్‌డీపీ) మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అయితే దీనికి న్యూ డెమొక్రటిక్ పార్టీ అంగీకారం తెలపాల్సి ఉందని సమాచారం. 2021, సెప్టెంబర్‌లో జరిగిన కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని అధికార లిబరల్ పార్టీ 338 స్థానాలకుగాను 159 చోట్ల గెలిచింది. అయితే మెజారిటీ దక్కించుకోలేకపోయింది. దీంతో జగ్మీత్‌సింగ్ నేతృతృంలోని విపక్ష ఎన్‌డీపీ మద్దతు ట్రూడో ప్రభుత్వానికి అవసరమైంది. 2015లో 43 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా ట్రూడో రికార్డు సృష్టించారు.
కెనడా..
రాజధాని: ఒట్టోవా; కరెన్సీ: కెనడియన్ డాలర్
అధికార భాషలు: ఇంగ్లిష్, ఫ్రెంచ్
ప్రస్తుత ప్రధానమంత్రి: జస్టిన్ ట్రూడో
రష్యా గ్యాస్ వదులుకోలేం: జర్మనీ
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నా, ఆ దేశం నుంచి ఇంధన సరఫరాలను వదులుకోలేమని జర్మనీ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ వైఖరిలో ఏ మార్పూ లేదని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మార్చి 22న చెప్పారు. పలు యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌పై తమకంటే ఎక్కువగా ఆధారపడ్డాయన్నారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో దాదాపు సగం రష్యానే తీరుస్తున్న విషయం తెలిసిందే.
జర్మనీ..
రాజధాని: బెర్లిన్; కరెన్సీ: యూరో
అధికార భాష: జర్మన్
ప్రస్తుత అ«ధ్యక్షుడు: ఫ్రాంక్–వాల్టర్ స్టెయిన్‌మీర్
ప్రస్తుత చాన్సలర్: ఒలాఫ్ స్కోల్జ్
చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 22 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్