Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 22 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Mar-22

Chief Minister of Manipur: మణిపూర్‌ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?

N Biren Singh

మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నోంగ్‌తోంబమ్‌ బీరెన్‌ సింగ్‌(ఎన్‌.బీరేన్‌ సింగ్‌) రెండోసారి ప్రమాణం చేశారు. మార్చి 21న మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీరేన్‌తో రాష్ట్ర గవర్నర్‌ గణేశన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం విదితమే. బీజేపీకి 37.83% ఓట్లు, కాంగ్రెస్‌ 16.83% ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ విజయం సాధించారు. హీన్‌గాంగ్‌ నుంచి బరిలో దిగిన ఆయన.. కాంగ్రెస్‌ అభ్యర్థి శరత్‌ చంద్ర సింగ్‌పై 18 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. బీరెన్‌ తొలిసారి 2017, మార్చి 15న మణిపూర్‌ సీఎంగా ప్రమాణం చేశారు. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ 30.

మణిపూర్‌ ఎన్నికల ఫలితాలు ఇలా..

పార్టీ

2022

2017

కాంగ్రెస్

5

28

బీజేపీ

32

21

నాగా పీపుల్స్

5

4

నేషనల్‌ పీపుల్స్‌

7

4

జేడీయూ

6

కూకి అలయెన్స్

2

తృణమూల్

1

లోక్‌ జనశక్తి

1

స్వతంత్రులు

3

1

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేసిన నేత?
ఎప్పుడు : మార్చి 21
ఎవరు    : బీజేపీ నేత నోంగ్‌తోంబమ్‌ బీరెన్‌ సింగ్‌(ఎన్‌.బీరేన్‌ సింగ్‌)
ఎక్కడ    : రాజ్‌భవన్, ఇంఫాల్‌
ఎందుకు : తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో..

R&D Centre: కెమ్‌ వేద పరిశోధన కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?

KTR in USA

ప్రముఖ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ ‘కెమ్‌ వేద’ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.150 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌ నగరంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటనలో భాగంగా మార్చి 21న శాండియాగోలోని కెమ్‌ వేద కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను గురించి సంస్థ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సమక్షంలో  కెమ్‌ వేద కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ భీమారావు పారసెల్లి... హైదరాబాద్‌లో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యంత నైపుణ్యం కలిగిన 500 మంది హై స్కిల్డ్‌ నిపుణులకు పరిశోధన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా ‘కెమ్‌ వేద’కంపెనీకి పేరు ఉంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కంపెనీ?
ఎప్పుడు : మార్చి 21
ఎవరు    : ప్రముఖ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ కెమ్‌ వేద
ఎక్కడ    : హైదరాబాద్, తెలంగాణ
ఎందుకు : లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పరిశోధనల కోసం..

Chief Minister of Uttarakhand: ఉత్తరాఖండ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేత?

Pushkar Singh Dhami

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత పుష్కర్‌ సింగ్‌ ధామి(45) కొనసాగనున్నారు. మార్చి 21న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో మార్చి 23న ధామి ప్రమాణం చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం విదితమే. అయితే పుష్కర్‌ సింగ్‌ ధామి ఓటమిపాలయ్యారు. ఇక గోవా సీఎంగా కూడా ప్రమోద్‌ సావంత్‌ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. బీజేపీ శాసనసభాపక్షం(ఎల్‌పీ) సావంత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

రాజ్యసభకు హర్భజన్‌ 
మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యుడు కానున్నారు. ఆయనతో పాటు ఐదుగురిని ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ చేసింది. హర్భజన్, లవ్లీ వర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్‌ మిట్టల్, ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్‌ చద్ధా, ఐఐటీ ఢిల్లీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సందీప్‌ పాఠక్, పారిశ్రామికవేత్త సంజీవ్‌ అరోరా మార్చి 21న నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. 33 ఏళ్ల ఛద్దా రాజ్యసభలో అతి పిన్న వయస్కునిగా నిలుస్తారు.

Tennis: ఇండియన్‌వెల్స్‌ టోర్నీలో విజేతగా నిలిచిన ఆటగాడు?
Association of Tennis Professionals (ATP): ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నీ ఇండియన్‌వెల్స్‌-2022 టోర్నీలో అమెరికా యువ ఆటగాడు టేలర్‌ ఫ్రిట్జ్‌ విజేతగా నిలిచాడు. మార్చి 20న 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో అతను 6–3, 7–6 (7/5)తో స్పెయిన్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌పై సంచలన విజయం సాధించాడు. 2001 (ఆండ్రీ అగస్సీ) తర్వాత సొంతగడ్డపై ఈ టైటిల్‌ గెలిచిన తొలి అమెరికా ఆటగాడిగా ఫ్రిట్జ్‌ నిలిచాడు.

NSIL: న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌తో కీలక ఒప్పందం చేసుకున్న సంస్థ?

Dhruva and New Space india

అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో... కేంద్ర అంతరిక్ష విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’(ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష ఇంజనీరింగ్‌ పరిష్కారాల ఆవిష్కర్త ‘ధృవ స్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ మార్చి 17న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అంతరిక్ష రంగంలో తొలిసారి ప్రైవేటుగా వాణిజ్య ప్రయోగ సేవల్ని ‘ధృవ స్పేస్‌’అందించనుంది.

డీఎస్‌ఓడీ టెక్నాలజీ అభివృద్ధి..
స్పేస్‌క్రాఫ్ట్‌ ప్లాట్‌ఫారం, నియంత్రణ, సమాచార, విద్యుత్‌ వ్యవస్థలు, సోలార్‌ ప్యానెళ్లతో ఉపగ్రహ ప్రయోగ రంగంలో ‘ధృవ స్పేస్‌ ఆర్బిటల్‌ డిప్లాయర్స్‌’(డీఎస్‌ఓడీ) పేరిట ధృవ స్పేస్‌ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఉపగ్రహ వాహక నౌకల్లో భద్రతా ప్రమాణాలు, కచ్చితత్వం నెలకొల్పడంతో పాటుగా వాటిని మరింత సులువుగా ప్రయోగించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.

ఒప్పందానికి తొలిమెట్టు..
తాజా ఒప్పందం.. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ), స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)లో ధృవ తన డీఎస్‌ఓడీ సాంకేతికత ద్వారా ప్రయోగ సేవలు అందించడానికి ఇది తొలిమెట్టు. ఒప్పందం మేరకు ధృవ తొలుత ‘డీఎస్‌ఓడీ –1యు’ను పరీక్షించనున్నారు. మరో ఏడాది కాలంలో మరింత సామర్థ్యంతో కూడిన డీఎస్‌ఓడీ 3యు, 6యు, 12యు డిప్లాయర్స్‌ పనితీరునూ ‘ధృవ’ పరీక్షించనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కేంద్ర అంతరిక్ష విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’(ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు    : మార్చి 17
ఎవరు    :  హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష ఇంజనీరింగ్‌ పరిష్కారాల ఆవిష్కర్త ‘ధృవ స్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ 
ఎందుకు : పీఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎస్‌ఎల్‌వీలో ధృవ తన డీఎస్‌ఓడీ సాంకేతికత ద్వారా ప్రయోగ సేవలు అందించడానికి..

IFFCO: రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఇఫ్కో రెండో ప్లాంట్‌ ఏర్పాటు కానుంది?

IFFCO

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్‌ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దక్షిణాదిన బెంగళూరులో తొలి ప్లాంట్‌ నెలకొల్పిన భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) రెండో ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లాలో ప్లాంట్‌ను నెలకొల్పడంపై ప్రభుత్వంతో ఇఫ్కో సంప్రదింపులు జరుపుతోంది. రూ.250 కోట్లతో, కోటి లీటర్ల సామర్థ్యంతో ఏపీలో నానో యూరియా ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో ఇఫ్కో నిర్ణయించింది.

ఎందుకింత ఆదరణ..?
సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా దవ్ర రూపంలో ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో యూరియాకు విశేష ఆదరణ లభిస్తోంది. యూరియా బస్తాతో పోలిస్తే ధర తక్కువగా ఉండడం, మెరుగైన పనితీరు, ద్రవరూప యూరియా బాటిళ్లను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే వీలుండటం, రవాణా ఖర్చులు ఆదా కావడం దీనికి ప్రధాన కారణాలు. 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీ లీటర్ల ద్రవరూప నానో యూరియాను బాటిళ్లలో ఇఫ్కో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నానో యూరియా ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు  : మార్చి 16
ఎవరు : భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో)
ఎందుకు : నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : నానో యూరియా తయారీని పెంచేందుకు..

CEO of Telangana: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఎవరు నియమితులయ్యారు?

Vikas Raj IAS

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా వికాస్‌రాజ్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న ఉత్తర్వులు జారీచేసింది. 1992 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన వికాస్‌రాజ్‌ ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఇతర పోస్టుల్లో కొనసాగరాదని, అదనపు బాధ్యతల్లో సైతం ఉండరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వికాస్‌రాజ్‌ గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా నియామకం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు    : 1992 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన వికాస్‌రాజ్‌ 
ఎందుకు : కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు..

Reservoirs: వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన వ్యక్తి?

Rajendra Singh

పచ్చదనం, నేల, నీటి పరిరక్షణ (సాయిల్, వాటర్‌ కన్జర్వేషన్‌)కు.. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు దోహదపడుతున్న జీవో 111ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తే అది వినాశనానికి దారితీస్తుందని జల్‌ బారాదరి చైర్మన్, ‘వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోని అధిక భాగం ‘సిమెంట్‌ కాంక్రీట్‌ జంగిల్‌’గా మారిపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. జీవో 111ను ఎత్తేసి భారీ నిర్మాణాలకు అనుమతినిస్తే జంట జలాశయాలైన ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ పరిధిలోని ప్రాంతం అంతా బహుళ అంతస్తులు వెలసి.. అక్కడ కొత్తగా మరో పెద్ద కాంక్రీట్‌ అడవి ఏర్పడి వినాశనానికి దారితీస్తుందన్నారు. ఇప్పుడు ఆ జలాశయాల నీటిని వాడడం లేదంటూ జీవో 111ను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు చేసిన ప్రకటన ఎంతో ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

హిమాయత్‌ సాగర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?
ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలను హైదరాబాద్‌ ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చుటకు, 1908నాటి హైదరాబాద్‌ వరదలు వంటి వరదల బారి నుండి రక్షించుటకు నిర్మించారు. హైదరాబాద్‌ చివరి నిజాం అయిన ఉస్మాన్‌ అలీ ఖాన్‌ వీటిని నిర్మించారు. ఉస్మాన్‌ అలీ ఖాన్‌ కుమారుడు అయిన ‘హిమాయత్‌ అలీ ఖాన్‌’ పేరుతో ఈ హిమాయత్‌ సాగర్‌ జలాశయానికి ‘హిమాయత్‌ సాగర్‌‘ అని నామకరణం జరిగింది. అలాగే ఉస్మాన్‌ అలీ ఖాన్‌ పేరు మీదుగా ఉస్మాన్‌ సాగర్‌కు ఆ పేరు వచ్చింది. ఇవి రెడు జలాశయాలు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జీవో 111ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తే అది వినాశనానికి  దారితీస్తుంది
ఎప్పుడు : మార్చి 16
ఎవరు    : జల్‌ బారాదరి చైర్మన్, ‘వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ రాజేంద్రసింగ్‌ 
ఎందుకు : జీవో 111ను ఎత్తేసి భారీ నిర్మాణాలకు అనుమతినిస్తే జంట జలాశయాలైన ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ పరిధిలోని ప్రాంతం అంతా బహుళ అంతస్తులు వెలసి.. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని..

చైనాలో ఘోర విమాన ప్రమాదం

Plane Crash in China

చైనా దక్షిణ గ్వాంగ్జీ ఝువాంగ్‌ ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో వెళ్తున్న ఒక పాసింజర్‌ విమానం మార్చి 21న ఈ ప్రాంతంలో కుప్పకూలిందని అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రమాదంలో అంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌.. గ్వాంగ్జౌకు వెళ్లేందుకు కున్మింగ్‌ నుంచి స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1.10కి బయలుదేరింది. 2.52 కు గమ్యస్థానం చేరాల్సి ఉండగా వుఝు సమీపంలోని టెంగ్జియాన్‌ కౌంటీ ప్రాంతంలోకి రాగానే కొండను ఢీకొని కూలిపోయింది. ప్రమాదంపై బోయింగ్‌ స్పందించలేదు. చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌ తమ ఆధీనంలోని బోయింగ్‌ విమానాలన్నింటినీ నిలిపివేసింది. విమాన భద్రతలో చైనా ట్రాక్‌ రికార్డు గొప్పగా ఉంది. చైనాలో చివరిసారి 2010లో విమాన ప్రమాదం జరిగింది.

Padma Awards 2022: పద్మ పురస్కారాల ప్రదానం​​​​​​​

Padma Awards 2022
అవార్డులు స్వీకరిస్తున్న స్వామి శివానంద, దివంగత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కూతుళ్లు 

2022 సంవత్సరానికి 64 మందికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మార్చి 21న పద్మ పురస్కారాలను అందించారు. ఇందులో రెండు పద్మ విభూషణ్, 8 పద్మభూషణ్, 54 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తరఫున ఆయన కుమార్తెలు కృతిక రావత్, తరిణి రావత్, గీతాప్రెస్‌ అధినేత దివంగత రాధేశ్యామ్‌ ఖేమ్కా తరఫున ఆయన కుమారుడు కృష్ణ కుమార్‌ ఖేమ్కాలు పద్మ విభూషణ్‌ పురస్కారాలను స్వీకరించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఎండీ సైరస్‌ పూనావాలా, మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మెహర్షి, సచ్చిదానంద స్వామి తదితర ప్రముఖులు పద్మభూషణ్‌ పురస్కారాలను రాష్ట్రపతి కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి..
తెలుగు రాష్ట్రాల నుంచి మహా సహస్రావధాని డాక్టర్‌ గరికపాటి నరసింహారావు, డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణ రావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్‌ హసన్‌ సాహెబ్‌ (మరణానంతరం)లు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. 2022 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం మార్చి 28న జరుగనుంది.

మొత్తం 128 అవార్డులు..
ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు విడతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐలు ఉండగా, 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు.

పద్మ పురస్కారాలు–2022

పద్మ విభూషణ్‌ విజేతలు(4)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం/దేశం/యూటీ

1

జనరల్‌ బిపిన్‌ రావత్‌ (మరణానంతరం)

సివిల్‌ సర్వీసులు

ఉత్తరాఖండ్‌

2

రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం)

విద్య మరియు సాహిత్యం

ఉత్తర ప్రదేశ్‌

3

కల్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం)

ప్రజా వ్యవహారాలు

ఉత్తర ప్రదేశ్‌

4

ప్రభా ఆత్రే

కళలు

మహారాష్ట్ర

పద్మ భూషణ్‌ విజేతలు(17)

సంఖ్య

పేరు

రాష్ట్రం/దేశం/యూటీ

రంగం

1

గులాం నబీ ఆజాద్‌

ప్రజా వ్యవహారాలు

జమ్మూ, కశ్మీర్‌ 

2

విక్టర్‌ బెనర్జీ

కళలు

పశ్చిమ బెంగాల్‌

3

గుర్మీత్‌ బవ (మరణానంతరం)

కళలు

పంజాబ్‌

4

బుద్ధదేవ్‌ భట్టాచర్య

ప్రజా వ్యవహారాలు

పశ్చిమ బెంగాల్‌

5

నటరాజన్‌ చంద్రశేఖరన్‌

వాణిజ్యం, పరిశ్రమలు 

మహారాష్ట్ర

6

కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులు

వాణిజ్యం, పరిశ్రమలు

తెలంగాణ

7

మధుర్‌ జాఫ్రి

ఇతరములుపాకశాస్త్రం

అమెరికా

8

దేవేంద్ర ఝఝారియా

క్రీడలు

రాజస్థాన్‌

9

రషీద్‌ ఖాన్‌

కళలు

ఉత్తర ప్రదేశ్‌

10

రాజీవ్‌ మెహ్రిషి

సివిల్‌ సర్వీసులు

రాజస్థాన్‌

11

సత్య నాదేళ్ల

వాణిజ్యం, పరిశ్రమలు

అమెరికా

12

సుందర్‌ పిచాయ్‌

వాణిజ్యం, పరిశ్రమలు

అమెరికా

13

సైరస్‌ పూనావాలా

వాణిజ్యంపరిశ్రమలు

మహారాష్ట్ర

14

సంజయ రాజారాం (మరణానంతరం)

సైన్స్, ఇంజనీరింగ్‌

మెక్సికో

15

ప్రతిభా రే

విద్య, సాహిత్యం

ఒడిశా

16

స్వామి సచ్చిదానంద్‌

విద్య, సాహిత్యం

గుజరాత్‌

17

వశిష్ట త్రిపాఠి

విద్య, సాహిత్యం

ఉత్తర ప్రదేశ్‌

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 21 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Mar 2022 07:36PM

Photo Stories