Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 14th కరెంట్ అఫైర్స్
Chinese Troops: భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా ప్రయత్నం
‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్‌ట్సే ప్రాంతం వద్ద వాస్తవాదీన రేఖను దాటేందుకు, తద్వారా యథాతథ స్థితిని మార్చేందుకు డిసెంబర్ 9న చైనా సైన్యం ప్రయత్నించింది. వాటన్నింటినీ మన సైనికులు చాలా గట్టిగా తిప్పికొట్టారు. మన సైనిక కమాండర్లు సకాలంలో స్పందించడంతో చైనా సైన్యం తోక ముడిచింది’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. డిసెంబర్ 13న పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన వేర్వేరుగా ప్రకటన చేశారు. ‘‘ఈ ఘర్షణ ఇరు సైనికుల నడుమ భౌతిక పోరుకూ దారి తీసింది. మనవాళ్లు వీరోచితంగా పోరాడారు. మన భూభాగాల్లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను వమ్ము చేసి వారిని తరిమికొట్టారు’’ అని వివరించారు. ఈ ప్రయత్నంలో మనవైపు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదని, కొందరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారని స్పష్టం చేశారు.
‘ఈ ఘటన తర్వాత మన స్థానిక సైనిక కమాండర్, చైనా కమాండర్ మధ్య డిసెంబర్ 11న ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. దీనిపై మన ఆగ్రహాన్ని, అభ్యంతరాలను దౌత్య మార్గాల్లో కూడా చైనాకు తెలియజేశాం. ఇలాంటి దుందుడుకు చర్యలను పునరావృతం చేయొద్దని, సరిహద్దుల వెంబడి శాంతి, సామరస్యాలను కాపాడాలని గట్టిగా చెప్పాం’’ అని వెల్లడించారు. ‘‘మన భూభాగాన్ని ఆక్రమించేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా పూర్తిగా తిప్పికొట్టేందుకు, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం నిత్యం సన్నద్ధంగా ఉంది. సభకు ఈ మేరకు హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. అంతకుముందు తాజా పరిస్థితిపై సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమీక్ష జరిపారు.
Indian Railways: 2025–26 నాటికి వందేభారత్ రైళ్ల ఎగుమతి!
భారత సైనికులు అడ్డుకున్నందుకే.. తవాంగ్ రగడ: చైనా సైన్యం
‘గల్వాన్ లోయ’ చేదు అనుభవం నేపథ్యంలో తవాంగ్ రగడపై చైనా ప్రభుత్వ ఆచితూచి స్పందించగా సైన్యం మాత్రం తెంపరి వ్యాఖ్యలకు దిగింది! సరిహద్దుల వెంబడి పరిస్థితి నిలకడగా ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘భారత దళాలే అక్రమంగా ఎల్‌ఓసీ దాటాయి. చైనా వైపు డాంగ్‌జాంగ్ ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న మా సైనికులను అడ్డుకున్నాయి. అది డిసెంబర్ 9 రగడకు దారి తీసింది’’ అని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) వెస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి కల్నల్ లోంగ్ షోహువా ఆరోపించారు.
గల్వాన్ తరహా ఘర్షణ
• డిసెంబర్ 9 నాటి చైనా ఆక్రమణ యత్నం మరోసారి రెండేళ్లనాటి ‘గల్వాన్ లోయ’ ఉదంతాన్ని తలపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చైనా సైనికులు అచ్చం అప్పటి మాదిరిగానే ఇనుప ముళ్లతో కూడిన లావుపాటి ఆయుధాలు, కర్రల వంటివాటితో దాడికి దిగారు. అప్పట్లాగే పరిస్థితి మరోసారి బాహాబాహీకి కూడా దారితీసింది.
• తవాంగ్ పరిసరాల్లో యాంగ్‌ట్సే వద్ద 17 వేల అడుగుల పై చిలుకు ఎత్తున్న మంచు శిఖరాలపై పట్టు కోసం చైనా ఎప్పట్నుంచో ప్రయతి్నస్తోంది. అందులో భాగంగానే దాదాపు రెండేళ్ల అనంతరం మరోసారి మన భూభాగాల్లోకి సైలెంటుగా చొచ్చుకొచ్చేందుకు డిసెంబర్ 9న దొంగ ప్రయత్నం చేసింది.
• అయితే అక్కడ ఎటు చూసినా మన సైన్యం భారీగా మోహరించిన తీరుతో చైనా దళాలు అవాక్కైనట్టు సమాచారం. వాటి చొరబాటు యత్నాలను మనవాళ్లు దీటుగా అడ్డుకోవడమే గాక పూర్తిస్థాయిలో తరిమి కొట్టారు.
Nirmala Sitharaman: ‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్
• ఆ ప్రాంతంలో భారత సైన్యపు మోహరింపులు హై రిజల్యూషన్ కెమెరాలతో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి.
• 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద చైనా, భారత దళాల మధ్య జరిగిన భీకర పోరు జరగడం తెలిసిందే. దానివల్ల ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి.
• అప్పటినుంచి తూర్పు ప్రాంతంలో వాస్తవాదీన రేఖ వద్ద మోహరింపులను, యుద్ధ సన్నద్ధతను సైన్యం బాగా పెంచింది. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.
• ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న పెద్ద ఘర్షణ ఇదే. ఈ దురాక్రమణ యత్నంలో చైనా వైపు చాలామంది సైనికులు గాయపడ్డట్టు సమాచారం.
• 2012 అక్టోబర్లో కూడా యాంగ్‌ట్సే ప్రాంతంలోనే భారత, చైనా సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.
• కొంతకాలంగా ఈ ప్రాంతంలో చైనా డ్రోన్ల హడావుడి బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా రగడకు ముందే మన యుద్ధ విమానాలు తవాంగ్ పరిసరాల్లో గస్తీ కాయడం, డేగ కళ్లతో నిఘా వేయడం మొదలైంది.
• దాదాపు 3,500 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ పొడవునా పరిస్థితిపై, దళాల సన్నద్ధతపై త్రివిధ దళాధిపతులు సమీక్ష జరిపారు.
Bhupendra Patel: గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్
Amit Shah: అంగుళం కూడా వదలం.. అమిత్ షా
మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత భూభాగంలో ఎవరూ ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎలాంటి చొరబాట్లనూ అనుమతించబోమన్నారు. ‘లోక్‌సభలో కార్యకలాపాలను కాంగ్రెస్ పదేపదే అడ్డుకోవడానికి అసలు కారణం తవాంగ్ రగడ కాదు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు విదేశీ విరాళాల చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) గుర్తింపును కేంద్రం రద్దు చేయడమే!’’ అంటూ చురకలంటించారు. ‘‘సమాజ సేవ కోసమంటూ నమోదు చేసుకున్న ఆర్జీఎఫ్‌కు ఇండో–చైనా సంబంధాల అభివృద్ధి సంబంధిత అధ్యయనం పేరిట చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు అందాయి. అందుకే దాని గుర్తింపు రద్దు చేయాల్సి వచ్చింది. విపక్షాల గొడవ వల్ల ప్రశ్నోత్తరాలు తుడిచిపెట్టుకుపోయాయి. లేదంటే ఈ విషయాన్ని సభలోనే చెప్పేవాన్ని. బహుశా ఆర్జీఎఫ్ తన అధ్యయనం ముగించే ఉంటుంది. ఇంతకూ, 1962 చైనా యుద్ధంలో ఎన్ని వేల హెక్టార్ల భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందన్నది ఆ అధ్యయనంలో ఉందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. చైనాపై మోదీ ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. నిజానికి విదేశీ నాయకులతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఐరాస భద్రతా మండలిలో స్థానం చేజారిందంటూ ప్రత్యారోపణ చేశారు. ‘‘భద్రతా మండలిలో భారత్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎందుకు ‘త్యాగం’ చేశారు? కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్‌సింగ్ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తే చైనా అభ్యంతరపెట్టింది. ఆ రాష్ట్ర సీఎం దోర్జీ ఖండూకు వీసా నిరాకరించింది. జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ అక్కడి ప్రజలకు స్టేపుల్ వీసాలిచ్చింది. వీటన్నింటిపై కూడా ఆర్జీఎఫ్ అధ్యయనం చేసిందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ సారథ్యంలోని ఆర్జీఎఫ్‌కు ఉగ్రవాదులతో లింకుల ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ నుంచి కూడా రూ.50 లక్షలందాయని ఆరోపించారు.
Assembly Elections: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి బీజేపీ గెలుపు
Supreme Court Collegium: సుప్రీం జడ్జీలుగా ఐదుగురికి పదోన్నతి
పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం మరో ముందడుగు వేసింది. ఐదుగురు హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతకుముందు ఢిల్లీలో మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైంది. ఆ తర్వాత సంబంధిత జడ్జీల పేర్ల జాబితాను కేంద్రానికి పంపింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ పంకజ్ మిట్టల్, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, పట్నా హైకోర్టులో మరో జడ్జి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎంపికచేయాలంటూ కేంద్రానికి సిఫార్సుచేసింది. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. మరోవైపు, ఉత్తరాఖండ్ హైకోర్టులో జడ్జి జస్టిస్ సంజయకుమార్ మిశ్రాను జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు జడ్జి ఎన్ కోటీశ్వర్ సింగ్‌ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ను గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుచేసింది.
PM Narendra Modi: రూ.75 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
Kerala Assembly: గవర్నర్‌కు వర్సిటీల చాన్స్‌లర్ హోదా రద్దు
రాష్ట్రంలోని వర్సిటీలకు చాన్సెలర్‌గా గవర్నర్‌ను తొలగించడంతోపాటు ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్తను నియమించేందుకు ఉద్దేశించిన బిల్లును కేరళ అసెంబ్లీ డిసెంబర్ 13న ఆమోదించింది. అయితే, తమ ప్రతిపాదనలను బిల్లులో చేర్చలేదంటూ కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సభ నుంచి వాకౌట్ చేసింది. కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని గానీ, సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలను గానీ చాన్సలర్‌గా నియమించాలని యూడీఎఫ్ సూచించింది. చాన్సెలర్ ఎంపిక కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలంది.
Sukhvinder Singh: హిమాచల్ సీఎంగా సుఖ్వీందర్
New Zealand: యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం
ఆరోగ్యాన్ని హరించే పొగాకు వినియోగాన్ని అరికట్టడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం యువత ఇకపై సిగరెట్లు కొనడానికి వీల్లేదు. వారు సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం విధించారు. 2009 జనవరి 1న, ఆ తర్వాత జన్మించినవారంతా సిగరెట్లకు దూరంగా ఉండాలి. వారికి ఎవరైనా సిగరెట్లు విక్రయిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. కొత్త చట్టం వల్ల సిగరెట్లు కొనేవారి సంఖ్య ప్రతిఏటా తగ్గిపోతుందని, తద్వారా దేశం పొగాకు రహితంగా మారుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో సిగరెట్లు విక్రయించేందుకు అనుమతి ఉన్న రిటైలర్ల సంఖ్యను కొత్త చట్టం కింద 6,000 నుంచి 600కు కుదించింది. సిగరెట్లలో నికోటిన్ పరిమాణాన్ని తగ్గించింది. ఉపయోగించినవారిని భౌతికంగా అంతం చేసే సిగరెట్లను విక్రయించడానికి అనుమతించడంలో అర్థం లేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఆయేషా వెరాల్ చెప్పారు.
Alzheimer’s Disease: మతిమరుపు బాధితులకు ‘లెసానెమాబ్’
Nuclear Fusion Energy: అనంత శక్తిని ఒడిసిపట్టే.. దారి దొరికింది!
శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగంలో నభూతో అనదగ్గ అతి కీలక ముందడుగు! అంతర్జాతీయంగా ఇంధన రంగ ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేయగల పరిణామం!! మహా మహా శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అలుపెరగకుండా చేస్తూ వస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నియంత్రిత వాతావరణంలో కేంద్రక సంలీన ప్రక్రియను జరపడంలో సైంటిస్టులు తొలిసారిగా విజయవంతమయ్యారు. కాలిఫోర్నియాలోని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లేబొరేటరీ పరిశోధకులు చరిత్రలో తొలిసారిగా ఈ ఘనత సాధించారు. సంలీన ప్రక్రియలో అత్యంత కీలకమైన, పరిశోధకులంతా ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్న ‘నికర శక్తి లాభం’ సాధించి చూపించారు. సంలీన ప్రక్రియను ప్రారంభించేందుకు వెచ్చించాల్సిన శక్తి కంటే, ప్రక్రియ ద్వారా పుట్టుకొచ్చే శక్తి పరిమాణం ఎక్కువగా ఉండటాన్ని నికర శక్తి లాభంగా పిలుస్తారు. అమెరికా ఇంధన మంత్రి జెన్నిఫర్ గ్రాన్‌హోం డిసెంబర్ 13న ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. వైట్‌హౌస్ శాస్త్ర సలహాదారు ఆర్తీ ప్రభాకర్, పరిశోధకుల బృందంతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయమిది. మా పరిశోధకుల బృందం తమ కెరీర్లతో పాటు జీవితాలను కూడా అంకితం చేసి పాటుపడి ఎట్టకేలకు సాధించింది. ఇంతకాలంగా మనమందరం కలలుగన్న కేంద్రక సంలీన ప్రక్రియను నిజం చేసి చూపించింది. ఇది ఈ రంగంలో మరిన్ని గొప్ప ఆవిష్కరణలకు తెర తీయనుంది’’ అని చెప్పారు. ఈ పరిశోధన రక్షణ రంగంలో కనీవినీ ఎరగనంతటి విప్లవాత్మక మార్పులకు తెర తీయడమే గాక విద్యుచ్ఛక్తితో సహా భవిష్యత్తులో మానవాళి మొత్తానికీ సరిపడా స్వచ్ఛ ఇంధనాన్ని సునాయాసంగా తయారు చేసుకునేందుకు కూడా వీలు కల్పించగలదని అమెరికా ఇంధన శాఖ ఒక ప్రకటనలో ఆశాభావం వెలిబుచ్చింది. ఎంతకాలమైనా సహనం కోల్పోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి అద్భుతాలైనా సాధ్యమేననేందుకు ఈ ఫలితమే ఉదాహరణ అని ఆర్తీ అన్నారు.
Orion: క్షేమంగా భూమికి ఓరియాన్
ఏమిటీ కేంద్రక సంలీనం?
కేంద్రక సంలీనం అంటే రెండు చిన్న పరమాణువుల కేంద్రకాలు కలిసిపోయి, అంటే సంలీనం చెంది ఒకే పెద్ద కేంద్రకంగా ఏర్పడటం. అలా ఏర్పడ్డ సదరు కేంద్రకం తాలూకు ద్రవ్యరాశి ఆ రెండు పరమాణువుల కేంద్రక ద్రవ్య రాశి కంటే తక్కువగా ఉంటుంది. ఆ మిగులు ద్రవ్యరాశి అపార శక్తి రూపంలో విడుదలవుతుంది. ఇది జరగాలంటే అపారమైన శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. సూర్యునిలోనూ, ఇతర నక్షత్రాల్లోనూ ఉత్పన్నమయ్యే అనంత శక్తికి ఈ కేంద్రక సంలీనమే మూలం. వాటిలోని అపార ఉష్ణోగ్రతలు ఇందుకు వీలు కల్పిస్తాయి. హైడ్రోజన్ బాంబు తయారీ సూత్రం కూడా ఇదే. అదే అణు బాంబు తయారీలో దీనికి సరిగ్గా వ్యతిరేకంగా ఉండే కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను అనుసరిస్తారు. అందులో ఒకే అణువు తాలూకు కేంద్రకం చిన్న భాగాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో విపరీతమైన శక్తి పుట్టుకొస్తుంది.
Cosmic Violence: అరుదైన అంతరిక్ష దృగ్విషయం.. అంత్య దశలో ఉన్న నక్షత్రాన్ని..
తాజా ఆవిష్కరణ ప్రత్యేకత ఏమిటంటే...
సూర్యుడు, ఇతర తారల్లోనూ హైడ్రోజన్ బాంబు తయారీలోనూ కేంద్రక సంలీన చర్య అనియంత్రిత పద్ధతిలో జరుగుతుంది. ఈ చర్యలో రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం అణువుగా మారుతూ ఉంటాయి. దీన్ని గనక నియంత్రిత వాతావరణంలో జరపగలిగితే అపారమైన శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా భూమిపై మానవాళి మొత్తానికీ సరిపడా విద్యుత్తును నిరంతరంగా సరఫరా చేయొచ్చు! అది కూడా అతి చౌకగా, ఎలాంటి రేడియో ధార్మిక తదితర కాలుష్యానికీ తావు లేకుండా!! తాజాగా అమెరికా సైంటిస్టులు స్వల్ప పరిమాణంలోనే అయినా సరిగ్గా దాన్నే సాధించి చూపించారు. హైడ్రోజన్ ఐసోటోప్‌లైన డ్యుటీరియం, ట్రిటియంలను సంలీనం చెందించారు. ‘‘ఇతర సంలీనాలతో పోలిస్తే వీటి సంలీనానికి తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. పైగా చాలా ఎక్కువ శక్తి విడుదలవుతుంది’’ అని యూఎస్ ఇంధన శాఖ పేర్కొంది.
SARAS Radio Telescope: నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్!
ప్రయోజనాలు అనంతం!
కేంద్రక సంలీన ప్రక్రియను శాస్త్రవేత్తలు ఏనాడో అవగాహన చేసుకున్నారు. భూమిపై దీన్ని చేసి చూసేందుకు 1930ల నుంచే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటిపై పలు దేశాలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ‘‘ఇంధనపరంగా చూస్తే కేంద్రక సంలీనం తాలూకు ప్రయోజనాలు అనంతమనే చెప్పాలి. ఎందుకంటే అణు విద్యుదుత్పత్తికి అనుసరించే కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా విడులయ్యే రేడియోధార్మిక వ్యర్థాలకు సంలీనంలో అవకాశమే ఉండదు. కాబట్టి మానవాళి మొత్తానికీ అవసరమయ్యే స్వచ్ఛ ఇంధనాన్ని అపరిమితంగా, కారుచౌకగా అందించడం సాధ్యపడుతుంది’’ అని కాలిఫోర్నియా వర్సటీ ఇంధన విభాగ ప్రొఫెసర్ డేనియల్ కామెన్ వివరించారు. అయితే ఇది సాకారమయ్యేందుకు ఇంకా చాలా ఏళ్లు పట్టొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి: పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్ ప్రయోగం వివరాలు పొందండి
Bilkis Bano Case: బిల్కిస్ పిటిషన్‌పై విచారణకు జస్టిస్ బేలా త్రివేది విముఖత
బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో దోషులను శిక్షాకాలం ముగియక ముందే జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌బేలా ఎం.త్రివేది నిరాకరించారు. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడంతోపాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న జైలు నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం ముందుకువచ్చింది. అయితే, పిటిషన్‌పై విచారణకు జస్టిస్ బేలా ఎం.త్రివేది విముఖత వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలు వెల్లడించలేదు. పిటిషన్‌ను కొత్త ధర్మాసనం విచారణకు స్వీకరిస్తుందని కోర్టు తెలిపింది.
National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం