Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 29th కరెంట్ అఫైర్స్
Ramco Cements కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం జగన్
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఏర్పాటైన ‘రామ్‌కో సిమెంట్స్’ కర్మాగారాన్ని సెప్టెంబర్ 28న సీఎం జగన్ మోహన్ రెడ్డి బజర్ నొక్కి ప్రారంభించారు. అంతకు ముందు ఫ్యాక్టరీలోని పరికరాలు, టెక్నాలజీ, ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామ్‌కో ఇండస్ట్రీ వల్ల మన ప్రాంతానికి, మనకు మంచి జరుగుతుందన్నారు. మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో లైమ్ స్టోన్ మైన్స్ ఉన్నప్పటికీ గతంలో ఎలాంటి పరిశ్రమలు లేవని.. ప్రస్తుతం ఇక్కడ 2 మిలియన్ టన్నుల క్లింకర్, 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటైందన్నారు. తద్వారా 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుందని, ఇది తొలి దశ మాత్రమేనని.. రాబోయే రోజుల్లో యాజమాన్యం దీన్ని విస్తరిస్తుందని అన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన వసతులు వస్తాయని, సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ – సామాజిక బాధ్యత) వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరుగుతుందని తెలిపారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండాలని చట్టం చేయడం వల్ల మన పిల్లలకు మంచే జరుగుతుందని వివరించారు.
పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోందని, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా అడుగులు వేస్తూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తోందన్నారు. ఈ మధ్య కాలంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
FIFA PlUS లో సునీల్ ఛెత్రి జైత్రయాత్ర
భారతకెప్టెన్, స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో సాధించిన ఘనతలకు గుర్తింపుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రత్యేక వీడియోను రూపొందించింది. దీన్ని మూడు ఎపిసోడ్లుగా తమ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఫిఫా ప్లస్’లో ప్రసారం చేయనున్నట్లు ట్వీట్ చేసింది. ‘అందరికీ రొనాల్డో, మెస్సీలు తెలుసు. అలాగే మరో ఆటగాడి గురించి తెలుసుకోవాలి. అతడే సునీల్ ఛెత్రి! 38 ఏళ్ల భారత స్టార్ అత్యధిక గోల్స్ స్కోరర్లలో టాప్–3లో కొనసాగుతున్నాడు’ అని పేర్కొంది.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
2వ ర్యాంక్‌లోకి Surya Kumar Yadav
ఆ్రస్టేలియాతో జరిగిన టి20 సిరీస్‌లో రాణించిన భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సెప్టెంబర్ 28న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 801 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 799 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో... పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ 861 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నారు.
Time 100 Next లో ఆకాశ్ అంబానీ
ప్రతిష్టాత్మకమైన టైమ్100 నెక్ట్స్ జాబితాలో దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు, జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ (30) చోటు దక్కించుకున్నారు. బిజినెస్, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ తదితర రంగాల రూపురేఖలను మార్చగలిగే సామర్థ్యాలున్న 100 మంది వర్ధమాన నాయకులతో టైమ్ మ్యాగజైన్ దీన్ని రూపొందించింది. ఇందులో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తి ఆకాశ్ అంబానీయే. ఆయన కాకుండా భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త ఆమ్రపాలి గాన్ కూడా జాబితాలో ఉన్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 28th కరెంట్ అఫైర్స్
జూనియర్ అంబానీ 22 ఏళ్లకే కంపెనీ బోర్డు సభ్యుడిగా చేరారు. 42.6 కోట్ల మంది పైగా యూజర్లున్న జియోకి చైర్మన్‌గా ఇటీవల జూన్‌లోనే నియమితులయ్యారు. పారిశ్రామిక నేపథ్యం గల కుటుంబ వారసుడైన అంబానీ .. వ్యాపార పగ్గాలు చేపడతారన్న అంచనాలు సహజంగానే ఉన్నాయని, ఆయన కూడా కష్టించి పనిచేస్తున్నారని టైమ్ పేర్కొంది. ‘గూగుల్, ఫేస్‌బుక్ నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించడంలో ఆకాశ్ కీలకపాత్ర పోషించారు‘ అని వివరించింది.
Also read: Quiz of The Day (September 28, 2022): భారత జాతీయాదాయాన్ని గణించే సంస్థ?
మరోవైపు, అడల్ట్ కంటెంట్ క్రియేటర్ల సైట్ అయిన ’ఓన్లీఫ్యాన్స్’కి ఆమ్రపాలి గాన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2020 సెప్టెంబర్ లో చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా చేరిన ఆమ్రపాలి ఆ తర్వాత పదోన్నతి పొందారు. అమెరికన్ సింగర్ ఎస్‌జెడ్‌ఏ, నటి సిడ్నీ స్వీనీ, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు యా మోరాంట్, టెన్నిస్ ప్లేయర్ కార్లోక్ అల్కెరాజ్ తదితరులు కూడా ఈ లిస్టులో ఉన్నారు.
Also read: Tourism Awards : తెలంగాణ, ఏపీకి 4 జాతీయ పర్యాటక అవార్డులు
Durham University Study : తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆహారంపై ఇష్టం
కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలపై జిహ్వచాపల్యం ప్రదర్శిస్తారు. మరికొందరు వాటిని చూడగానే ఇబ్బందిగా మొహంపెడతారు. ఇలా ఆహారాన్ని ఇష్టపడడం లేదా పడకపోవడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుందని ఇంగ్లాండ్‌లోని డర్హాం యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తల్లి తీసుకొనే ఆహారం, వాటి రుచులకు గర్భంలోని శిశువులు చక్కగా స్పందిస్తున్నట్లు గమనించారు. 18–40 ఏళ్ల వయసున్న 100 మంది గర్భిణులకు 4డీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. 32, 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు రెండుసార్లు స్కానింగ్ చేశారు. 100 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. స్కానింగ్‌కు 20 నిమిషాల ముందు మొదటి గ్రూప్‌లోని గర్భిణులకు క్యారెట్‌ను, రెండో గ్రూప్‌లోని వారికి క్యాబేజీని 400 ఎంజీ మాత్రల రూపంలో ఇచ్చారు. మూడో గ్రూప్‌లోని గర్భిణులకు ఏమీ ఇవ్వలేదు. క్యారెట్ మాత్ర తీసుకున్న మహిళల గర్భంలోని శిశువుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. క్యాబేజీ మాత్ర తీసుకున్న వారి గర్భంలోని శిశువులు మాత్రం ఇష్టం లేదన్నట్లుగా ముఖం చిట్లించారు. మాత్రలేవీ తీసుకోనివారి గర్భంలోని శిశువుల్లో ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఈ అధ్యయనం వివరాలను సేజ్ జర్నల్‌లో ప్రచురించారు. గర్భిణి తీసుకొనే ఆహారం శిశువును కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెప్పారు. గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే జని్మంచిన బిడ్డలు చక్కటి ఆహారపు అలవాట్లు అలవర్చుకొంటారని తెలిపారు. గర్భస్థ శిశువలకు నిర్ధిష్ట ఆహారం పరిచయం చేస్తే భవిష్యత్తులో దానిపైవారు మక్కువ పెంచుకుంటారని సూచించారు.
Chief of Defence Staff గా చౌహాన్
దేశ రెండో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్ (61) నియమితులయ్యారు. రక్షణ శాఖ సెప్టెంబర్ 28న ఈ మేరకు ప్రకటించింది. ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా కొనసాగుతారని పేర్కొంది. జనరల్ హోదాలో చౌహాన్ బాధ్యతలు స్వీకరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరయ్యాక జనరల్‌గా పదోన్నతిపై తిరిగి విధుల్లో చేరనున్న తొలి సైనికాధికారి ఆయనే. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం నేపథ్యంలో 9 నెలలకు పైగా సీడీఎస్ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే.
1961లో జన్మించిన చౌహాన్ నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ అనంతరం 1981లో 11, గూర్ఖా రైఫిల్స్‌లో చేరారు. కశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో చొరబాట్ల నిరోధక కార్యకలాపాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవముంది. అంగోలాలో ఐరాస మిషన్‌లోనూ సేవలందించారు. 2019లో పుల్వామా ఉగ్ర దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వాయుసేన దాడుల సందర్భంగా మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఈ హోదాలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2021 మేలో తూర్పు ఆర్మీ కమాండర్‌గా రిటైరయ్యారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. చైనా వ్యవహారాలపై నిపుణుడిగా చౌహాన్‌కు పేరుంది. ప్రస్తుతం ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సారథ్యంలోని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్‌లో సైనిక సలహాదారుగా సేవలందిస్తున్నారు. త్రివిధ దళాలను మరింతగా సంఘటితపరిచి దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింపజేసే లక్ష్యంతో సీడీఎస్ పదవిని కేంద్రం తెరపైకి తెచ్చింది.
తొలి సీడీఎస్‌గా జనరల్ రావత్ 2020 జనవరి 1న బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. త్రివిధ దళాల చీఫ్‌గా రిటైరైన వారితో పాటు లెఫ్టినెంట్ జనరల్, ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్‌గా రిటైరైన వాళ్లకు కూడా సీడీఎస్ అయ్యేందుకు అర్హత కల్పిస్తూ జూన్‌లో నిబంధనలను మార్చారు.
Russia Vs Ukraine : ఆ ప్రాంతాలు త్వరలో విలీనం
ఉక్రెయిన్‌లోని డొనెట్స్‌క్, లెహాన్స్‌క్, జపోరిజియా, ఖెర్సన్ తదితర ఆక్రమిత ప్రాంతాలను లాంఛనంగా విలీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో రష్యా అధికారులు ఇప్పటికే రిఫరెండం నిర్వహించడం తెలిసిందే. జపోరిజియాలో 93 శాతం, ఖెర్సన్‌లో 87, లుహాన్స్‌క్‌లో 98, డొనెట్స్‌క్‌లో 99 శాతం విలీనానికి ఓటేసినట్టు వారు ప్రకటించారు. కాబట్టి ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవాల్సిందిగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరనున్నట్టు సెప్టెంబర్ 28న చెప్పారు. సైన్యంతో బెదిరించి బలవంతంగా విలీనానికి ఒప్పిస్తున్నట్టు విమర్శలు వినిపస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా బూటకమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇప్పటికే తూర్పారబడుతున్నాయి. లక్షలాది బలగాలను ఉక్రెయిన్‌లోకి తరలిస్తామని పుతిన్ ప్రకటించడం, అణ్వాయుధాల ప్రయోగానికీ వెనుదీయబోమని హెచ్చరించడం తెలిసిందే.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 26th కరెంట్ అఫైర్స్
Attorny General గా ఆర్.వెంకటరమణి
భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి పేరుని న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ మేరకు ట్వీట్ చేశారు. నియామకాన్ని నిర్ధారిస్తూ కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని లీగల్ అఫైర్స్ విభాగం సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పదవిలో వెంకటరమణి మూడు సంవత్సరాలపాటు కొనసాగుతారు. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. వేణుగోపాల్ స్థానంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, సొంత కారణాలతో రోహత్గీ ఆ ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించారు. వెంకటరమణి అక్టోబర్ ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. మోదీ తొలిసారిగా ప్రధాని అయినపుడు 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు రోహత్గీనే అటార్నీగా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగిశాక వేణుగోపాల్ సేవలందించారు.
Also read: PM కేర్స్ ట్రస్టీగా రతన్ టాటా
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP