Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 28th కరెంట్ అఫైర్స్
Tourism Awards : తెలంగాణ, ఏపీకి 4 జాతీయ పర్యాటక అవార్డులు
పర్యాటక సమగ్ర అభివృద్ధిలో ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జాతీయ పర్యాటక అవార్డుల(2018–19) ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి అవార్డులు అందించారు. తెలంగాణ 4, ఆంధ్రప్రదేశ్ 4 అవార్డులను కైవసం చేసుకున్నాయి.
పర్యాటక, ఆతిథ్య రంగాల బలోపేతం..
దేశీయ పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం చిత్తుశుద్ధితో కృషిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. న్యూ ఇండియా విజన్ నినాదంతో త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పన, పర్యాటక పరిశ్రమను వృద్ధి చేయడం, పర్యాటకానికి అనుబంధంగా ఉన్న రంగాలను ప్రోత్సహించడం, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం.. వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also read: World Tourism Day : థీమ్ - రీ థింకింగ్ టూరిజం
తెలంగాణకు అవార్డులు
1) పర్యాటక సమగ్ర అభివృద్ధిలో మూడో ఉత్తమ రాష్ట్రం
2) బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా సికింద్రాబాద్
3) హైదరాబాద్‌లోని అపోలో హెల్త్ సిటీకి ‘బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ’
4) హైదరాబాద్ గోల్ఫ్ కోర్సుకు ఉత్తమ పర్యాటక గోల్ఫ్ కోర్స్
ఆంధ్రప్రదేశ్‌కు అవార్డులు
1) ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు
2) ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్ ‘సీసైడ్’కు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఇంగ్లిష్ అవార్డు
3) ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్స్ ‘సీసైడ్’ (రష్యన్), హ్యాండ్‌క్రాఫ్టెడ్ ( స్పానిష్, జర్మన్)కు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ అవార్డు
4) విజయవాడలోని ‘ది గేట్‌వే హోటల్’కు బెస్ట్ ఫైవ్‌స్టార్ హోటల్ అవార్డు
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 27th కరెంట్ అఫైర్స్
ISL Competitions లో TS కి 3 అవార్డులు
తెలంగాణ రాష్ట్రంలోని మరో మూడు పట్టణాలకు స్వచ్ఛత అవార్డులు దక్కాయి. ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్‌ఎల్) పోటీల్లో రాష్ట్రంలోని పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణాలు ఈ అవార్డులు సాధించాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా రాష్ట్రానికి సమాచారం ఇచ్చారు. సెప్టెంబర్ 17న ఐఎస్‌ఎల్ పోటీని నిర్వహించగా, దేశంలోని 1,850 పట్టణాలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో తెలంగాణకు మూడు అవార్డులు రాగా, ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ కింద వచ్చిన 16 అవార్డులతో కలిపి రాష్ట్రానికి మొత్తం 19 అవార్డులు దక్కినట్లయింది. ఐఎస్‌ఎల్ పోటీల్లో భాగంగా అన్ని పట్టణాలు తాము చేపట్టిన ఫ్లాగ్ రన్, పరిశుభ్రంగా మార్చిన ప్రదేశాలు, చారిత్రక, జియోగ్రాఫికల్ ప్రదేశాలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించారు.
మూడు కేటగిరీల్లో అవార్డులు
జనాభా ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా జరిగిన పోటీలో 15వేల లోపు జనాభా గల పట్టణాల కేటగిరీలో అలంపూర్ అవార్డుకు ఎంపికైంది. 25 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల ఎంపికయ్యాయి. ఈ మూడు పట్టణాలకు సెప్టెంబర్ 30న ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డులు పొందిన పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పురపాలికలకు మంత్రి కె.తారకరామారావు అభినందనలు తెలిపారు.
Also read: TS లోని 16 పురపాలికలకు Swach Sarveskhan Awards
Adani Group Investments : 10 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లు
వివిధ రంగాల్లో విస్తరించిన దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 8,10,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ప్రధానంగా పునరుత్పాదక విద్యుత్, డిజిటల్ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ పెట్టుబడుల్లో సింహభాగం (దాదాపు 70 శాతం) వాటా పునరుత్పాదక విద్యుత్‌పైనే ఉండనుంది. సింగపూర్‌లో జరిగిన ఫోర్బ్స్ గ్లోబల్ సీఈవో సదస్సులో పాల్గొన్న సందర్భంగా అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాలు తెలిపారు. ‘గ్రూప్ స్థాయిలో వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టబోతున్నాం. ప్రస్తుతం మాకు 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ పోర్ట్‌ఫోలియో ఉంది. హైబ్రిడ్ విధానంలో దీన్ని మరో 45 గిగావాట్ల మేర పెంచుకోనున్నాం. ఇందుకోసం సింగపూర్‌తో విస్తీర్ణంతో పోలిస్తే 1.4 రెట్లు అధికంగా 1,00,000 హెక్టార్ల స్థలాన్ని వినియోగించుకోబోతున్నాం. అలాగే 3 గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాం. హరిత హైడ్రోజన్‌ను తక్కువ వ్యయాలతో ఉత్పత్తి చేయడమనేది మా లక్ష్యం‘ అని అదానీ పేర్కొన్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 26th కరెంట్ అఫైర్స్
NASA DART Mission విజయవంతం
అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. ఇందుకోసం 10 నెలల క్రితం ప్రయోగించిన 570 కిలోల ఉపగ్రహం లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమోర్ఫస్ అనే బుల్లి గ్రహశకలాన్ని ముందుగా నిర్దేశించిన మేరకు సెప్టెంబర్ 27న తెల్లవారుజామున గంటకు 22,530 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. అన్ని అంచనాలనూ అధిగమిస్తూ ప్రయోగం దిగ్విజయంగా ముగిసిందని నాసా ప్రకటించింది.
Also read: Planet Jupiter : భూమికి అతి సమీపానికి
అంతరిక్షంలో అతి చిన్న శకలాన్ని కూడా అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టేలా ఉపగ్రహాలను సంధించగలమని రుజువైందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్టేటర్ థామస్ జుర్బచెన్ అన్నారు. కెనైటిక్ ఇంపాక్ట్ టెక్నిక్ సాయంతో జరిగిన ఈ ప్రయోగం భూగోళ పరిరక్షణలో అతి పెద్ద ముందడుగని నాసా అడ్మిని్రస్టేటర్ బిల్ నెల్సన్ చెప్పారు.
ప్రభావం తేలేందుకు మరికాస్త సమయం
డిడిమోస్ అనే మరో చిన్న గ్రహశకలం చుట్టూ డైమోర్ఫస్ తిరుగుతోంది. దాని వేగాన్ని తగ్గించడం ద్వారా కక్ష్యలో కొద్దిపాటి మార్పు తీసుకురావడం ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం. అది నెరవేరిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి శక్తిమంతమైన టెలిస్కోప్‌ల ద్వారా నాసా బృందం డైమోర్పస్‌ను కొద్ది వారాల పాటు నిరంతరం గమనిస్తుంది. డార్ట్‌క్రాఫ్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్య కనీసం ఒక్క శాతం కుంచించుకుపోతుందని అంచనా వేస్తోంది. ఆ లెక్కన డిడిమోస్ చుట్టూ అది పరిభ్రమించే సమయం 10 నిమిషాల దాకా తగ్గాలి. డిడిమోస్ జోలికి వెళ్లకుండా డైమోర్ఫస్‌ను మాత్రమే అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టడం మామూలు విజయం కాదని థామస్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక డ్రాకో నావిగేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
నియో... డార్ట్ వారసుడు
డార్ట్ ప్రయోగం సఫలమవడంతో భూమికి అంతరిక్ష ముప్పును పసిగట్టి నివారించే ప్రయోగాల పరంపరలో తదుపరి దశకు నాసా తెర తీస్తోంది. డార్ట్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా నియర్ అర్త్ ఆబ్జెక్ట్ (నియో) సర్వేయర్ పేరుతో రెండో దశ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్‌ను రూపొందిస్తోంది. దీన్ని త్వరలో పట్టాలపైకి ఎక్కించనున్నట్టు నాసా ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ ప్రకటించారు. భూమికి సమీపంలో ఉన్న ప్రమాదకర గ్రహశకలాలను కనిపెట్టి వాటితో భవిష్యత్తులో ముప్పు రాకుండా ముందే జాగ్రత్త పడటం దీని లక్ష్యమన్నారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
Julan Goswami కెరీర్ 5వ ర్యాంక్ తో ముగింపు
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు పేస్ బౌలర్ జులన్ గోస్వామి తన కెరీర్‌ను ఐదో ర్యాంక్‌తో ముగించింది. సెప్టెంబర్ 27న విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో 39 ఏళ్ల జులన్ బౌలర్ల విభాగంలో 698 పాయింట్లతో తన ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదో ర్యాంక్‌లో... స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌లో నిలిచారు.
Also read: Women Cricket : ముగిసిన జులన్ గోస్వామి కెరీర్
World Cadet Chess లో శుభి, చార్వీలకు స్వర్ణాలు
జార్జియాలోని బాతూమిలో జరుగుతున్న ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.సెప్టెంబర్ 27న ముగిసిన ఈ టోర్నీలో అండర్–12 బాలికల విభాగంలో శుభి గుప్తా... అండర్–8 బాలికల విభాగంలో చార్వీ విజేతలుగా నిలిచారు. ఘాజియాబాద్‌కు చెందిన శుభి గుప్తా నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. బెంగళూరుకు చెందిన చార్వీ నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సంహిత పుంగవనం 7.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. అండర్–8 ఓపెన్ కేటగిరీలో సఫిన్ సఫరుల్లాఖాన్ కాంస్య పతకం గెలిచాడు. కేరళకు చెందిన సఫిన్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేశాడు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP