Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 15th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu October 15th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu October 15th 2022
Current Affairs in Telugu October 15th 2022

Xi Jinping: జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం! 

జన చైనా అధినేతగా షీ జిన్‌పింగ్‌(69)ను వరుసగా మూడోసారి ఎన్నుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది. మరో ఐదేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగడం ఖాయమే. 

’పదేళ్ల పదవీ కాలం’ విధానానికి మంగళం  
చైనాలో ’పదేళ్ల పదవీ కాలం’ అనే నిబంధనకు కాలం చెల్లబోతోంది. ఇన్నాళ్లూ ’రెండు పర్యాయాలు.. ఒక్కోటి ఐదేళ్లు’ అనే విధానం కఠినంగా అమలయ్యింది. అంటే ఒక అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో కొనసాగడానికి వీల్లేదు. ఏకైక రాజకీయ పార్టీ ఉన్న చైనాలో ఏక వ్యక్తి ఆధిపత్యం అరాచకానికి దారితీస్తుందన్న అంచనాతో ఈ విధానం ప్రవేశపెట్టారు. మావో జెడాంగ్‌ మినహా జిన్‌పింగ్‌ కంటే ముందు అధికారంలో ఉన్న అధ్యక్షులంతా దీనికి కట్టుబడి ఉన్నారు. మావో జెడాంగ్‌ 1976 దాకా అధికారంలో కొనసాగారు. పాలనలో తన బ్రాండ్‌ అయిన ’జెడాంగ్‌ ఆలోచన’ను అమలు చేశారు. పెట్టుబడిదారులపై కఠిన ఆంక్షలు విధించారు. సాంస్కృతిక విప్లవం వంటి ప్రయోగాలు చేశారు. జెడాంగ్‌ పాలనలో చైనా దాదాపు దివాలా దశకు చేరుకుంది. అనంతరం సర్వోన్నత నాయకుడిగా పేరుగాంచిన డెంగ్‌ జియావోపింగ్‌ అధికారంలోకి వచ్చారు. మావో విధానాలకు మంగళం పాడుతూ తనదైన ఆర్థిక విధానాలకు తెరతీశారు. ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు. ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉంటే దేశానికి ముప్పేనన్న అంచనాతో ’పదేళ్ల పదవీ కాలాన్ని, 68 ఏళ్ల వయోపరిమితిని’ ప్రవేశపెట్టారు. 1982లో జరిగిన సీపీసీ 12వ జాతీయ సదస్సులో వీటికి ఆమోదం లభించింది. ఆ తర్వాత జియాంగ్‌ జెమిన్, హూ జింటావో అధికారంలోకి వచ్చారు. వారి హయాంలోనే చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 

Also read: Iran: 'స్పేస్‌టగ్‌'ను ప్రయోగించిన ఇరాన్‌

‘నూతన మావో’ జిన్‌పింగ్‌  
1953 జూన్‌ 15న జన్మించిన షీ జిన్‌పింగ్‌ 2008 నుంచి 2013 వరకూ హూ జింటావో హయాంలో చైనా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అటు పిమ్మట సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌(సీఎంసీ) చైర్మన్‌గా మారారు. 2013 మార్చి 14న ‘పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’ 7వ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి నిరాటంకంగా కురీ్చని అధిరోహిస్తున్నారు. సైన్యం, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా జిన్‌పింగ్‌ నియంత్రణలోకి వచ్చాయి. మూడున్నర దశాబ్దాల తర్వాత ‘వన్‌ లీడర్‌’ పాలన మొదలయ్యింది. పదేళ్ల పదవీ కాలం నిబంధన ప్రకారం 2023లో ఆయన పాలన ముగిసిపోవాలి. కానీ, ‘నూతన మావో’ కావాలన్నది జిన్‌పింగ్‌ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఆయన సాధించినట్లేనని చెప్పుకోవచ్చు.   

 • జిన్‌పింగ్‌ మరింత శక్తివంతమైన నాయకుడిగా అవతరించబోతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పదేళ్లలో అధికారాన్ని జిన్‌పింగ్‌ కేంద్రీకృతం చేశారు. పారీ్టపై, ప్రభుత్వంపై పట్టు సాధించారు. మాజీ అధినేతలతో పోలిస్తే ఎక్కువ అధికారాలను అనుభవిస్తున్నారు.  
 • జిన్‌పింగ్‌కు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి జోంగ్‌షున్‌ జైలుపాలయ్యారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న యువత గ్రామాల్లో రైతులతో కలిసి జీవించాలని మావో ఆదేశించడంతో 1969లో జిన్‌పింగ్‌ షాన్‌షీ ప్రావిన్స్‌లోని ఓ మారుమూల పల్లెకు చేరుకున్నారు. అక్కడ ఓ గుడిసెలోనే ఆరేళ్లపాటు జీవనం సాగింది.   
 • పల్లె జీవితం తర్వాత జిన్‌పింగ్‌ బీజింగ్‌లోని తిసింగ్‌హువా యూనివర్సిటీలో చేరారు. స్కాలర్‌íÙప్‌తో చదువుకున్నారు. తర్వాత చైనా రక్షణశాఖలో మూడేళ్లపాటు పనిచేశారు. 1985లో ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని షియామెన్‌ నగర ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం నాటికి ఆదే పావిన్స్‌ గవర్నర్‌గా ఎదిగారు. ఆ తర్వాత సౌత్‌ ఆఫ్‌ బీజింగ్‌ కౌంటీ కమ్యూనిస్ట్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 
 • 2002లో జెజీయాంగ్‌ ప్రావిన్స్‌లో పార్టీ చీఫ్‌గా, 2007లో షాంఘైలో పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో శక్తివంతమైన స్టాడింగ్‌ కమిటీలో సభ్యుడిగా చేరారు.  
 • చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ పేరును ప్రతిపాదిస్తూ 2012లో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించారు.   
 • తైవాన్‌ విషయంలో అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. తైవాన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ చైనాలో కలిపేసుకుంటామని జిన్‌పింగ్‌ చెబుతున్నారు.   
 • చైనాలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, మీడియాపై ఆంక్షలు సర్వసాధారణంగా మారాయి.   
 • హాంకాంగ్‌లో శాంతియుత నిరసనలను కఠినంగా అణచివేశారు.  
 • జిన్‌పింగ్‌ అమల్లోకి తీసుకొచి్చన ‘జీరో–కోవిడ్‌’ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్లు కాదు, స్వేచ్ఛ కావాలంటూ జనం నినదిస్తున్నారు.            

– నేషనల్‌ డెస్క్, సాక్షి

Ukraine: ఖేర్సన్‌పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్‌

 

రష్యా ఆక్రమిత ఖేర్సన్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ తిరిగి పట్టు బిగిస్తోంది. ఖేర్సన్‌ను ఉక్రెయిన్‌ మిలటరీ పాక్షికంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నిరంతరాయంగా ఆ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ పరిణామాలతో ఖేర్సన్‌ ప్రాంతానికి చీఫ్‌గా నియమితుడైన వ్లాదిమర్‌ సాల్దో ఆ ప్రాంతం నుంచి రష్యాకు ఎవరైనా వెళ్లిపోతామంటే వారికి ఉచితంగా వసతి సదుపాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చట్టవిరుద్ధంగా ఖేర్సన్‌సహా నాలుగు ప్రాంతాలను తమ భూభాగంలో కలిపేసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఖేర్సన్‌ ప్రాంతంలోని ప్రజల ప్రాణాలను రక్షించడానికి రష్యన్‌ ప్రాంతాలైన రోస్తోవ్, క్రానోడర్, స్ట్రావోపోల్, క్రిమియాకు తరలిస్తామని చెప్పారు. యుద్ధ సమయంలో అనాథమైన వేలాది మంది పిల్లల్ని రష్యాకు బలవంతంగా తరలిస్తోందని, ఇలా చేయడం యుద్ధ నేరాల కిందకే వస్తుందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

Also read: Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై క్షిపణుల మోత

FCI: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యం నిల్వలు ఏడాదిలో భారీగా తగ్గాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సెంట్రల్‌ ఫూల్‌ కింద సేకరించి పెట్టిన గోధుమ, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు అక్టోబర్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం 2017లో బియ్యం, గోధుమల మొత్తం నిల్వలు 4.33 కోట్ల మెట్రిక్‌ టన్నుల కనిష్టానికి పడిపోగా, ప్రస్తుతం అదేరీతిన నిల్వలు 5.11 కోట్ల మెట్రిక్‌ టన్నులకు పడిపోయింది. గత ఏడాది నిల్వలు 8.16 కోట్లతో పోల్చినా 37 శాతం నిల్వలు తగ్గడం, ఇందులో ముఖ్యంగా గోధుమల నిల్వలు ఏకంగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది.  

బ్రిటన్‌ కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమీ హంట్‌

 

లండన్‌ : బ్రిటన్‌ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్‌పై ప్రభుత్వం వేటు వేసింది. క్వాసీని పదవి నుంచి ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ తొలగించారు. గత నెలలో క్వాసీ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. దీంతో క్వాసీని ఆర్థిక మంత్రిగా తప్పించి ఆయన స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారు. కరోనా, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో క్షీణించిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పన్నుల్లో భారీగా కోత విధిస్తూ క్వాసీ రూపొందించిన మినీ బడ్జెట్‌ బెడిసికొట్టింది. దేశ ఖజానాకు ఇతర ఆదాయ మార్గాల ను చూపించకుండా దాదాపుగా 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహా యింపులనిస్తూ బడ్జెట్‌ను రూపొందించడంతో స్టాక్‌ మార్కెట్లు కుప్ప కూలాయి. ప్రధానికి క్వాసీ  సన్నిహితుడు కావడంతో గత కొద్ది రోజులుగా లిజ్‌ మినీ బడ్జెట్‌ను సమర్థిస్తూ వచ్చారు. అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో క్వాసీని తప్పించాల్సి వచ్చింది. క్వాసీని తప్పించినందుకు లిజ్‌ ట్రస్‌ ఆయనకు రాసిన లేఖలో సారీ చెప్పడమే కాకుండా దీర్ఘకాలంలో ఈ బడ్జెట్‌ దేశానికి మంచి చేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన జెరెమీ హంట్‌ ప్రధాని పదవికి గతంలో పోటీ పడ్డారు. ఇలాంటి సమయంలో ఆర్థికమంత్రి పదవిని చేపట్టడం హంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది.  

Also read: King Charles III: ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’గా కేట్‌ మిడిల్టన్‌

Old Age Home : సిద్దిపేటలో ప్రభుత్వ వృద్ధాశ్రమం 

సిద్దిపేటజోన్‌: అందరూ ఉండి ఏకాకులుగా మారిన వారు కొందరైతే.. విధి వక్రించి ఒంటరి జీవనం గడిపే వారు మరికొందరు. వృద్ధాప్యంలో తోడూనీడా లేకుండా ఒక భరోసా కోసం ఎదురుచూసే వారికి, అభాగ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సుమారు కోటి రూపాయల నిధులతో రాష్ట్రంలో ఒక మోడల్‌గా ఈ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట పరిధిలోని మిట్టపల్లి గ్రామ శివార్లలో సుమారు ఎకరం స్థలంలో దీన్ని నిర్మించేందుకు స్థల పరిశీలన పూర్తి చేశారు. త్వరలో మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. 

Also read: Quiz of The Day (October 15, 2022): కేన్సర్‌కు కారణమయ్యే భార లోహం ఏది?

IIIT Hyderabad: వైఫై బదులు వై–సన్‌..

 

రాయదుర్గం: ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ మరింత సాంకేతికతను సమకూర్చుకుంది. సిలికాన్‌ ల్యాబ్స్‌ అనే సంస్థతో కలసి క్యాంపస్‌వ్యాప్తంగా వైఫైకన్నా మెరుగ్గా పనిచేసే వైర్‌లెస్‌ స్మార్ట్‌ యుటిలిటీ నెట్‌వర్క్‌ (వై–సన్‌)ను తాజాగా ఏర్పాటు చేసుకుంది. స్మార్ట్‌ నగరాలు, ఇంటర్నెట్‌ ఆధారిత సేవలపై సాగిస్తున్న విస్తృత ప్రయోగాల్లో భాగంగా క్యాంపస్‌లోని స్మార్ట్‌సిటీ లివింగ్‌ ల్యాబ్‌ను వై–సన్‌ ద్వారా అనుసంధానించింది. ఈ తరహా సాంకేతికతను వినియోగించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. వైఫైకన్నా తక్కువ వేగంతోనే వై–సన్‌ ద్వారా సమాచార మార్పిడి జరిగినా దీని పరిధి, నిరంతర అనుసంధానత వైఫైకన్నా ఎక్కువే కావడం ఇందులోని ప్రత్యేకత.

Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 14th కరెంట్‌ అఫైర్స్‌

Wholesale Price Index (WPI): సెప్టెంబర్లో టోకు ద్రవ్యోల్బణం కూల్‌ 

 

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 18 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. 10.7 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే టోకు బాస్కెట్‌లోకి వస్తువుల ధర 10.7 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నప్పటికీ, 18 నెలల నుంచి రెండంకెల పైన కొనసాగుతోంది. సమీక్షా నెల్లో తయారీ, ఆహారం, ఇంధన ధరలు కొంత దిగివ చ్చాయి. డబ్లు్యపీఐ నెలవారీ తగ్గుదలకు ప్రధానంగా కమోడిటీ ధరలలో నియంత్రణ అని నిపుణులు పేర్కొంటున్నారు. కమోడిటీ ధరలు తగ్గుతాయన్న ధోరణి కూడా వ్యవస్థలో ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు   రికవరీ ఊపందుకోవడం  కూడా సానుకూల అంశమని వారు విశ్లేషిస్తున్నారు.  గణాంకాల్లో

Also read: Retail inflation: సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.41%

కీలక విభాగాలు ఇలా... 

 • ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 11.03 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 12.37 శాతం. అయితే కూరగాయల ధరలు మాత్రం 39.66 శాతం పెరిగాయి. ఆగస్టులో ఈ స్పీడ్‌ 22.29 శాతం. ఆయిల్‌ సీడ్స్‌ ద్రవ్యోల్బణం 16.55% తగ్గింది.  
 • ఇంధనం, విద్యుత్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 32.61 శాతం ఉంటే, ఆగస్టులో ఈ రేటు 33.67 శాతంగా ఉంది.  
 • ఇక సూచీలో మెజారిటీ వెయిటేజ్‌ ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 6.34 శాతంగా ఉంది.  

టోకు ద్రవ్యోల్బణం ఇలా
నెల                   శాతం 
2022 జనవరి     12.96 
ఫిబ్రవరి             13.11 
మార్చి               14.55 
ఏప్రిల్‌     15.08 
మే    15.88 
జూన్‌     15.18 
జూలై     13.93  
ఆగస్టు     12.41 
సెప్టెంబర్     10.70 

ISSF World Championship 2022:18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్‌ రుద్రాంక్ష్ 

కైరో: విశ్వ వేదికగా మరోసారి భారత షూటర్‌ గురి అదిరింది. ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌ ‘పసిడి’ ఖాతా తెరిచింది. అక్టోబర్ 14న  జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల రుద్రాంక్ష్ బాలాసాహెబ్‌ పాటిల్‌ స్వర్ణ పతకంతో మెరిశాడు. ఈ ప్రదర్శనతో రుద్రాంక్ష్  2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. 
అంతకుముందు 114 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్  633.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. 
భారత్‌కే చెందిన అంకుశ్‌ కిరణ్‌ జాదవ్‌ 630.6 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. టాప్‌–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్‌ మ్యాచ్‌కు అర్హత సాధించారు.
 ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో సొలాజో 262.7 పాయింట్లతో, రుద్రాంక్ష్  261.9 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన స్వర్ణ పతక పోరుకు అర్హత పొందారు.

Also read: World Championship Shooting: భారత్‌ ఖాతాలో కాంస్యం

అంకుశ్‌ 154.2 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 
ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో 261.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన చైనా షూటర్‌ లిహావో షెంగ్‌ కాంస్య పతకం దక్కించుకున్నాడు. 

 • అభినవ్‌ బింద్రా తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ షూటర్‌గా రుద్రాంక్ష్  గుర్తింపు పొందాడు. 
 • అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో భారత్‌ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా రుద్రాంక్ష్ రికార్డు నెలకొల్పాడు. 
 • గత ఏడాది పెరూలో జరిగిన జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రుద్రాంక్ష్  రజతం నెగ్గగా.. ఈ ఏడాది జర్మనీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించాడు. ఈ సంవత్సరమే సీనియర్‌ జట్టులోకి వచ్చిన రుద్రాంక్ష్ రెండు ప్రపంచకప్‌లలో పాల్గొన్నా పతకం సాధించలేకపోయాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిసి స్వర్ణంతోపాటు ఒలింపిక్స్‌కు అర్హత పొంది ఔరా అనిపించాడు.  

ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆరో భారతీయ షూటర్‌ రుద్రాంక్ష్. 
గతంలో   అభినవ్‌ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), మానవ్‌జిత్‌ సంధూ (2006; ట్రాప్‌), తేజస్విని సావంత్‌ (2010; 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌), అంకుర్‌ మిట్టల్‌ (2018; డబుల్‌ ట్రాప్‌), ఓంప్రకాశ్‌ (2018; 50 మీటర్ల పిస్టల్‌) ఈ ఘనత సాధించారు.  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 15 Oct 2022 03:36PM

Photo Stories