Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 9th కరెంట్ అఫైర్స్
COP27: UAE, ఇండోనేషియా ఆధ్వర్యంలో మాంగ్రూవ్ అలయెన్స్ ఫర్ క్లైమేట్(ఎంఏసీ)ని ప్రారంభం
భూతాపం, ప్రకృతి విపత్తులు, ఉత్పాతాలు.. వీటికి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగించడం, పర్యావరణాన్ని నాశనం చేయడమే కారణం. ఈ పాపం సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలదేనని పేద దేశాలు ఘోషిస్తున్నాయి. శిలాజ ఇంధనాలను అధికంగా ఉపయోగించే దేశాల కారణంగా తాము బాధితులుగా మారాల్సి వస్తోందని వాపోతున్నాయి. బడా దేశాలు, కార్పొరేట్ సంస్థలు నష్ట పరిహారం చెల్లించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్‌లో జరుగుతున్న కాప్–27లో పలుదేశాల నాయకులు ఈ డిమాండ్‌కు మద్దతుగా గళం విప్పుతున్నారు. విపత్తుల్లో నష్టపోతున్న పేద దేశాలకు న్యాయం చేయాలని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్‌వెరియా అన్నారు.
శిలాజ ఇంధన కంపెనీలు నిత్యం 3 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జిస్తున్నాయని ఆంటిగ్వా బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌనీ చెప్పారు. అందులో కొంత సొమ్మును పేద దేశాలకు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూగోళాన్ని మండించి, సొమ్ము చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన కంపెనీలు తమ లాభాల నుంచి గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ చెల్లించాలన్నారు. మానవ నాగరికతను బలిపెట్టి లాభాలు పిండుకోవడం సరైంది కాదన్నారు. నష్టపరిహారం కోసం అవసరమైతే అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు. పెద్ద దేశాల నేతలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రతిఏటా కాప్‌కు సదస్సుకు హాజరై, ఘనంగా ప్రకటనలు ఇచ్చి వెళ్లిపోతున్నారని తప్పు ఆచరణలో ఏమీ చేయడం లేదని గాస్టన్ బ్రౌనీ ఆరోపించారు. వాతావరణ లక్ష్యాలను సాధించాలంటే చిన్న దేశాలపై విధించిన చట్టవిరుద్ధమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మాంగాగ్వే పేర్కొన్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 8th కరెంట్ అఫైర్స్
మడ అడవుల సంరక్షణలో సహకరిస్తాం
మడ అడవుల పునరుద్ధరణలో భారత్ నైపుణ్యం సాధించిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు. పర్యావరణానికి అత్యంత కీలకమైన మడ అడవుల సంరక్షణ కోసం గత ఐదు దశాబ్దాలుగా కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. కాప్–27 సందర్భంగా యూఏఈ, ఇండోనేషియా ఆధ్వర్యంలో మాంగ్రూవ్ అలయెన్స్ ఫర్ క్లైమేట్(ఎంఏసీ)ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, కాపాడుకోవడం ఈ కూటమి లక్ష్యం. ఈ సందర్భంగా భూపేంద్ర మాట్లాడారు. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించడానికి మడ అడవుల సంరక్షణ అత్యంత కీలకమని సూచించారు. కర్బన ఉద్గారాల నిర్మూలన ఇలాంటి అడవులతో సాధ్యమవుతుందన్నారు. అండమాన్, సుందర్బన్స్, గుజరాత్ తీర ప్రాంతంలో మడ అడువుల విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు.
Also read: Weekly Current Affairs (International) Bitbank: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022లో భారతదేశం ర్యాంక్ ఎంత?
G-20 : భారత్ నాయకత్వం.. G-20 లోగో, థీమ్, వెబ్‌సైట్ ఆవిష్కరణ..
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాలతో కూడిన గ్రూప్–20(జి–20)కి నాయకత్వం వహించనుండడం భారత్‌కు గర్వకారణమని ప్రధాని మోదీ చెప్పారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాల వేళ ఇది మనకు దక్కిన గొప్ప అవకాశామని అన్నారు. జి–20కి భారత నాయకత్వానికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను మోదీ ఆవిష్కరించారు. 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో కూడిన ఈ గ్రూప్‌నకు ప్రస్తుతం ఇండోనేషియా నాయకత్వం వహిస్తోంది.
Also read: Weekly Current Affairs (National) Bitbank: 3వ ప్రపంచ కూచిపూడి నాట్యోత్సవం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
డిసెంబర్ 1వ తేదీ నుంచి నాయకత్వ బాధ్యతలను భారత్ స్వీకరించనుంది. దేశ అభివృద్ధి ప్రయాణాన్ని మోదీ ప్రస్తావించారు. స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వాలు, ప్రజలు తమ వంతు పాత్ర పోషించారని చెప్పారు. ప్రజాస్వామ్యం అనేది ఒక సంస్కృతిగా రూపుదిద్దుకుంటే సంఘర్షణలకు తావు ఉండదన్న నిజాన్ని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు. దేశ సౌభాగ్యానికి అభివృద్ధి, పర్యావరణం (ప్రగతి, ప్రకృతి) కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. జి–20కి నేతృత్వం వహించే అవకాశం లభించడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. లోగో, థీమ్, వెబ్‌సైట్ మన ప్రాధాన్యతలను, సందేశాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 7th కరెంట్ అఫైర్స్
15, 16న బాలీలో శిఖరాగ్ర సదస్సు
జి–20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్(యూకే), అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జి–20 శిఖరాగ్ర సదస్సు ఇండోనేషియాలోని బాలీలో ఈ నెల 15, 16వ తేదీల్లో జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
Vikram-S: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ కంపెనీ
న్యూఢిల్లీ: భారత్‌లో అంతరిక్ష ప్రయోగాల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. దేశంలో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ ప్రయోగాన్ని వచ్చేవారమే చేపట్టబోతున్నారు. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నవంబర్ 12–16 తేదీల మధ్య ఈ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మొత్తం ప్రయోగానికి ‘ప్రారంభ్ మిషన్’ అని నామకరణం చేశారు. విక్రమ్–ఎస్ రాకెట్‌ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను అభివృద్ధి చేసి, ప్రయోగిస్తుండడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. విక్రమ్–ఎస్ రాకెట్ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇందులో విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్ సైతం ఉంది. స్పేస్ కిడ్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని తయారు చేశారు.
Also read: Black hole: సూర్యుని కంటే 10 రెట్లు పెద్దదైన ఈ కృష్ణబిలం
‘ఇన్–స్పేస్’ క్లియరెన్స్
దేశంలో అంతరిక్ష సాంకేతికరంగ నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఇన్–స్పేస్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ప్రైవేట్ విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగానికి ఇన్–స్పేస్ నుంచి ఇప్పటికే క్లియరెన్స్ లభించింది. ప్రారంభ్ మిషన్‌ను ఆరంభిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ తేదీని ఖరారు చేస్తామని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్‌కుమార్ చందన వెల్లడించారు. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి.
Marsపై అడుగిడేందుకు.. మనకు రక్షణ కవచం
అంతరిక్ష ప్రయోగాలు అంటేనే ఎంతో క్లిష్టమైనవి. అందులోనూ మనుషులు స్పేస్‌లోకి వెళ్లే ప్రయోగాలు మరింత రిస్క్. పెద్ద ఎత్తున రక్షణ ఏర్పాట్లు ఉండాలి. ఏ చిన్న లోపమున్నా భారీ ప్రమాదం తప్పదు. పైగా మార్స్‌పైకి మనుషులను పంపేందుకు నాసా ప్రయత్నింస్తోంది. ఇలాంటి సమయంలో స్పేస్ షిప్‌లు.. మార్స్‌పై దిగేప్పుడు పుట్టే వేడిని తట్టుకోవడానికి, మెల్లగా ల్యాండ్ కావడానికి వీలయ్యే రక్షణ ఏర్పాట్లు కావాలి. ఈ క్రమంలోనే నాసా ఫ్లయింగ్ సాసర్‌లా కనిపించే ఓ ప్రత్యేక ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను రూపొందించింది. బుధవారం దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఈ హీట్ షీల్డ్ ఏంటి, దాని ప్రాధాన్యత, భవిష్యత్తులో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
Also read: Chief Justice: వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా వీడ్కోలు సభలో సీజేఐ యు.యు.లలిత్
వాతావరణం ఘర్షణ నుంచి..
అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లు, వ్యోమనౌకలు గంటకు 25 వేల కి.మీ.కిపైగా వేగంతో ప్రయాణిస్తుంటాయి. తిరిగి భూవాతావరణంలోకి వచ్చేప్పుడూ అంతే వేగంతో ప్రవేశిస్తాయి. ఈ సమయంలో వాతావరణ ఘర్షణ వల్ల వాటి ఉపరితలంపై వేల డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత పుడుతుంది. దీనిని తట్టుకునేందుకు రాకెట్లు, స్పేస్ షిప్‌ల ఉపరితలంపై హీట్ షీల్డ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సిరామిక్ టైల్స్ వాడతారు.
మార్స్‌పైకి వెళ్లాలంటే..
భూమితోపాటు అంగారకుడు (మార్స్), శుక్రుడు (వీనస్) వంటి గ్రహాలపైనా వాతావరణం ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరిన వ్యోమనౌకలు మార్స్‌పై దిగాలంటే దాని వాతావరణం ఘర్షణను ఎదుర్కోవాలి. అదే సమయంలో సున్నితంగా ల్యాండింగ్ కావడం కోసం వేగాన్ని త్వరగా తగ్గించుకోవాలి. ఇప్పటివరకు చంద్రుడు, మార్స్‌పైకి రోవర్లను పంపినప్పుడు ల్యాండింగ్ కోసం ప్యారాచూట్లను వాడారు. చిన్నవైన రోవర్లకు అవి సరిపోయాయి. కానీ మానవసహిత ప్రయోగాలకు వాడే వ్యోమనౌకలు భారీగా ఉంటాయి. ఈ క్రమంలో వేడిని ఎదుర్కోవడం, వేగాన్ని తగ్గించుకోవడానికి పరిష్కారంగా నాసా శాస్త్రవేత్తలు ‘లో ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాన్ ఇన్‌ఫ్లాటబుల్ డీసెలరేటర్ (లోఫ్టిడ్)’ ప్రయోగాన్ని చేపట్టారు. ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్ అంటే.. మొదట చిన్నగా ఉండి, కావాలనుకున్నప్పుడు గాలితో ఉబ్బి, పెద్దగా విస్తరించే ఉష్ణ రక్షక కవచం అని చెప్పుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
వ్యోమనౌకకు ముందు భాగాన ఈ ప్రత్యేక పరికరాన్ని అమర్చుతారు. మార్స్‌పైగానీ, భూవాతావరణంలోకిగానీ వ్యోమనౌక ప్రవేశించినప్పుడు ఇది విచ్చుకుంటుంది. వ్యోమనౌక ముందు గొడుగులా ఏర్పడుతుంది. దీనివల్ల వాతావరణం నేరుగా వ్యోమనౌకను తాకకుండా ఈ హీట్‌షీల్డ్ అడ్డుకుంటుంది. ఇది సుమారు 20 అడుగుల వెడల్పుతో ఉండటంతో వాతావరణం ఒత్తిడికి వ్యోమనౌక వేగం కూడా తగ్గుతుంది. వేగం బాగా తగ్గాక చివరన ప్యారాచూట్‌ను వినియోగిస్తారు. దీనితో సున్నితంగా ల్యాండింగ్ అవుతుంది.
ప్రయోగాత్మకంగా..
సోమవారం అమెరికాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అట్లాస్–వి రాకెట్ ద్వారా మరో ఉపగ్రహంతోపాటు ‘లోఫ్టిడ్’ను ప్రయోగించనున్నారు. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లాక దీనిని భూమివైపు వదిలేస్తుంది. సుమారు గంటకు 35వేల కిలోమీటర్ల వేగంతో అది భూమివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. తర్వాత ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? ఒత్తిడి ఎంత పడుతోంది? ఎంతమేర ఉష్ణోగ్రత పుడుతోందన్న వివరాలను పరిశీలించేందుకు ఇందులో ప్రత్యేకమైన సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ డేటా ఆధారంగా ‘లోఫ్టిడ్’కు తుదిరూపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం కేవలం హీట్‌షీల్డ్‌ను మాత్రమే ప్రయోగిస్తున్నారు. విజయవంతమైతే వ్యోమనౌకలకు అమర్చి పంపుతారు. భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి చేసే అన్ని రకాల ప్రయోగాల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 5th కరెంట్ అఫైర్స్
కొలంబియా ప్రమాదమే ఉదాహరణ
2003లో నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ అంతర్జాతీయ అంతరిక్షం (ఐఎస్‌ఎస్) నుంచి తిరిగి వస్తూ పేలిపోయింది. అందులో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా సహా ఏడుగురు వ్యోమగాములు మృతిచెందారు. ఈ ప్రమాదానికి కారణం స్పేస్ షటిల్ ఎడమవైపు రెక్కపై ఉన్న హీట్ షీల్డ్ కొంతమేర దెబ్బతినడమే. అంతకుముందు స్పేస్ షటిల్ అంతరిక్షంలోకి వెళ్తున్న సమయంలోనే.. దానికి అనుబంధంగా ఉన్న రాకెట్ ట్యాంక్ ఇన్సులేటింగ్ ఫోమ్ చిన్న ముక్క విడిపోయి స్పేస్ షటిల్ రెక్కపై ఉన్న హీట్ షీల్డ్‌కు తగిలింది. హీట్ షీల్డ్‌గా అమర్చిన టైల్స్‌లో పగులు వచి్చంది.
చిన్న పగులుతో.. పెద్ద ప్రమాదం
కొలంబియా షటిల్ భూమికి తిరిగివచ్చేప్పుడు ధ్వని వేగానికి 20 రెట్లకుపైగా వేగంతో.. అంటే సుమారు గంటకు 25 వేల కిలోమీటర్లకుపైగా వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో 1,500 సెంటీగ్రేడ్‌లకుపైగా వేడి పుట్టింది. కానీ షీట్ షీల్డ్ టైల్స్‌లో పగులు కారణంగా ఆ వేడి లోపలి భాగానికి చేరి.. రెక్కలోని భాగాలు దెబ్బతినడం మొదలైంది. కాసేపటికే స్పేస్ షటిల్ పేలి ముక్కలైపోయింది. హీట్ షీల్డ్‌లో చిన్న పగులు ఉన్నా ఇంత ఘోరమైన ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలోనే నాసా శాస్త్రవేత్తలు.. ఇతర గ్రహాలపై దిగేప్పుడు స్పేస్ షిప్‌లకు హీట్ షీల్డ్‌గా ఉండేందుకు, అదే సమయంలో వేగాన్ని తగ్గించి సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు తోడ్పడే ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను అభివృద్ధి చేస్తున్నారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Badminton World Federation: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో లక్ష్య సేన్
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు పురోగతి సాధించి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు.
మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఐదో ర్యాంక్‌లో ఉంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్‌కు చేరుకోగా... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఐదు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌లో నిలిచింది.
Women's Tennis Association : విజేత గార్సియా .
టెక్సాస్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ క్రీడాకారిణి కరోలినా గార్సియా చాంపియన్‌గా అవతరించింది. నవంబర్ 8న జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ గార్సియా 7–6 (7/4), 6–4తో ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా (బెలారస్)పై గెలిచింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో అమెలీ మౌరెస్మో (2005లో) తర్వాత సింగిల్స్ టైటిల్ గెలిచిన రెండో ఫ్రాన్స్ క్రీడాకారిణిగా గార్సియా గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన గార్సియాకు 15 లక్షల 70 వేల డాలర్ల (రూ. 12 కోట్ల 76 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1,375 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా విజయంతో గార్సియా, సబలెంకా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాల చొప్పున మెరుగుపర్చుకొని వరుసగా నాలుగు, ఐదు ర్యాంక్‌ల్లో నిలిచారు.
Global Investor Summit 2022: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్–2023
సాక్షి, అమరావతి : వాస్తవ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 3, 4 తేదీల్లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు– 2023ను నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభం కారణంగా రెండేళ్ల నుంచి ఎటువంటి పెట్టుబడుల సమావేశాలు నిర్వహించలేకపోయామని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహిస్తున్న తొలి సదస్సు విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్–2023 వివరాలను తెలియజేయడానికి నవంబర్ 8న ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు భిన్నంగా ఈ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.
గత ప్రభుత్వంలో రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని, కానీ వాస్తవ రూపంలోకి వచ్చింది రూ.40,000 కోట్లే అని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి లక్ష్యాలు లేకుండా, వాస్తవంగా రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు సంబంధించి మాత్రమే ఒప్పందం చేసుకుంటామన్నారు. అంతకుముందు సీఎం క్యాంపు కార్యాలయంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 లోగోను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు.