Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 7th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu November 7th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu November 7th 2022
Current Affairs in Telugu November 7th 2022

COP27: వాతావరణ మార్పులు, దుష్పరిణామాలపై చర్చలు  

ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, ఆహారం, ఇంధన కొరత వంటి ప్రతికూల పరిణామాల నడుమ భాగస్వామ్యపక్షాల సదస్సు (కాప్‌–27) నవంబర్ 6న ప్రారంభమయ్యింది. ఈజిప్ట్‌లోని ఎర్ర సముద్ర తీరప్రాంత నగరం షెర్మ్‌–ఎల్‌–షేక్‌ ఇందుకు వేదికగా మారింది. ప్రపంచదేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. వాతావరణ మార్పులు, దుష్పరిణామాలు, నియంత్రణ చర్యలు, గత ఒప్పందాల అమలు తీరుపై రెండు రోజులపాటు విస్తృతంగా చర్చించనున్నారు. కాప్‌–27లో భాగంగా ఈ నెల 7, 8న జరిగే సమావేశాలకు పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. వాతావరణ మార్పుల నియంత్రణే లక్ష్యంగా గతంలో కాప్‌ సదస్సులు జరిగాయి. అయితే, ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. అగ్రదేశాల సహాయ నిరాకరణే ఇందుకు కారణం. తాజా సదస్సులో ఏం తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.  

Also read: Global Investors' Meet 2022: ప్రపంచం ఆశలన్నీ భారత్‌పైనే జీఐ సదస్సులో మోదీ వ్యాఖ్యలు

తరానికి ఒకసారి వచ్చే అవకాశం  
వాతావరణ మార్పులు భూగోళంపై సమస్త జీవజాలానికి విసురుతున్న పెను సవాళ్లపై ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ చైర్మన్‌ హోయిసంగ్‌ లీ ఆందోళన వ్యక్తం చేశారు. కాప్‌–27లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. భూతాపాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సన్నద్ధం కావాలని, హరితగృహ(గ్రీన్‌ హౌజ్‌) వాయువుల ఉద్గారాన్ని తక్షణమే తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. మన జీవితాలను, మన భూగ్రహాన్ని కాపాడుకొనేందుకు తరానికి ఒకసారి వచ్చే అవకాశం ఇదేనని చెప్పారు.  

Also read: UNSC: ఉగ్ర ‘టూల్‌కిట్‌’లో సోషల్‌ మీడియా

ఇంకెన్ని హెచ్చరికలు కావాలి?  
గత ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్‌ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ప్రపంచదేశాలు చెప్పుకోదగ్గ పురోగతి సాధించాయని కాప్‌–26 అధ్యక్షుడు, బ్రిటిష్‌ రాజకీయవేత్త అలోక్‌ శర్మ తెలిపారు. కర్బన ఉద్గారాల నియంత్రణపై మరిన్ని లక్ష్యాలను ఏర్పర్చుకోవడం, 2015 పారిస్‌ ఒప్పందంలోని నిబంధనలను ఖరారు చేయడం, బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించుకోవడం వంటివి ఈ లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు (2.7 ఫారన్‌హీట్‌) పరిమితం చేయాలన్న ఆశయాన్ని కొనసాగించాలని కోరారు. పారిస్‌ ఒప్పందంలో ఇదే అత్యంత కీలక లక్ష్యమని గుర్తుచేశారు. ఉష్ణోగ్రత పెరుగుదలను కచ్చితంగా నియంత్రించాలని, దీన్ని పారిశ్రామిక విప్లపం నాటికంటే ముందున్న ఉష్ణోగ్రతకు తీసుకురావాలన్నారు. అయితే, ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలకు కొన్ని బడా దేశాలు తూట్లు పొడుస్తున్నాయని అలోక్‌ శర్మ తీవ్రంగా ఆక్షేపించారు.


Also read: Web 3.0: వెబ్‌ 3.0పై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు


ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దండయాత్ర వల్ల అంతర్జాతీయంగా సంక్షోభాలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. పలు దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని వాపోయారు. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ అంశాలపై దృష్టి పెట్టేలా సామర్థ్యం పెంచుకోవాలన్నారు. మాటలు కట్టిబెట్టి కార్యాచరణలోకి దిగాలన్నారు. ప్రపంచ దేశాల అధినేతలకు ప్రపంచ నుంచి ఇంకా ఎన్ని మేల్కొల్పులు, హెచ్చరికలు అవసరం? అని అలోక్‌ శర్మ ప్రశ్నించారు. సదస్సులో యూఎన్‌ క్లైమేట్‌ చీఫ్‌ సైమన్‌ స్టియిల్‌ మాట్లాడారు. పారిస్‌ ఒప్పందంలోని లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నామని ఆతిథ్య దేశమైన ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రి సమేహ్‌ షౌక్రీ చెప్పారు. కాప్‌–27 అధ్యక్షుడిగా షౌక్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ప్రతిజ్ఞల దశ నుంచి క్షేత్రస్థాయిలో కార్యాచరణ దిశగా ముందుకెళ్లాలని ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సిస్సీ   పిలుపునిచ్చారు.  

Also read: One Nation One Uniform : పోలీసులకి ఒకే యూనిఫాం ఉండాలి : మోదీ

2015–2022.. ఎనిమిదేళ్లు అత్యంత వేడి 
న్యూఢిల్లీ: పారిశ్రామిక విప్లవం (1850–1900) కంటే ముందునాటి సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉండనుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఫలితంగా 2015 నుంచి 2022 దాకా.. ఎనిమిదేళ్లు ‘అత్యంత వేడి’ సంవత్సరాలుగా రికార్డుకెక్కుతాయని తెలియజేసింది. ఈజిప్ట్ లో జరుగుతున్న కాప్‌–27 సదస్సు సందర్భంగా నవంబర్ 6న ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 1993 నుంచి ఇప్పటిదాకా సముద్ర నీటి మట్టం రేటు రెండింతలు పెరిగిందని వెల్లడించింది. 2022 సంవత్సరం ఐదు లేదా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులో చేరుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది.   

Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 5th కరెంట్‌ అఫైర్స్‌


Hockey Pro League 2022-23:‘షూటౌట్‌’లో స్పెయిన్‌పై భారత్‌ విజయం

భువనేశ్వర్‌: ప్రొ హాకీ లీగ్‌ 2022–2023 సీజన్‌లో భారత జట్టు మూడో విజయం నమోదు చేసింది. స్పెయిన్‌ జట్టుతో నవంబర్ 6న జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ‘షూటౌట్‌’లో 3–1తో గెలిచింది. నిర్ణిత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ (12వ, 32వ ని.లో) సాధించగా... స్పెయిన్‌ జట్టుకు మిరాలెస్‌ (43వ ని.లో), అమత్‌ పెరె (55వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ‘షూటౌట్‌’లో భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్, రాజ్‌కుమార్‌ పాల్, అభిషేక్‌... స్పెయిన్‌ తరఫున గెరార్డ్‌ క్లాప్స్‌ సఫలమయ్యారు. స్పెయిన్‌ ప్లేయర్లు మెనిని, వియోలోంగా, మిరాలెస్‌ షాట్‌లను భారత గోల్‌కీపర్‌ కృషన్‌ బహదూర్‌ పాఠక్‌ నిలువరించాడు. తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో భారత్‌ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.   

Also read: Chengdu Korea: భారత పురుషుల స్క్వాష్‌ జట్టు ఆసియాలో తొలిసారి స్వర్ణం సాధించింది

BWF Para Badminton World: ప్రమోద్‌ భగత్‌కు స్వర్ణం 

ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ టైటిల్‌ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌ ఎస్‌యు5 విభాగంలో మనీషా రామదాస్‌ విజేతగా అవతరించింది. టోక్యోలో నవంబర్ 6న జరిగిన ఫైనల్స్‌లో ప్రమోద్‌ భగత్‌ 21–19, 21–19తో భారత్‌కే చెందిన నితీశ్‌ను ఓడించాడు. మనీషా 21–15, 21–15తో మామికో టొయోడా (జపాన్‌)పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో ప్రమోద్‌ భగత్‌–మనోజ్‌ సర్కార్‌ జంట ఫైనల్లో ఓడి రజతం సాధించింది. 

Also read: Pro Hockey League:భారత్‌ ఘనవిజయం

Asian UK Business Man – 2022: వెంకటరమణకు ప్రతిష్టాత్మక అవార్డు

పారిశ్రామిక దిగ్గజం, సీఎమ్మార్‌ సంస్థల అధినేత, ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు మావూరి వెంకట రమణకు ప్రతిష్టాత్మక ఏషియన్‌ యూకే బిజినెస్‌ మ్యాన్‌–2022 అవార్డు లభించింది. 

Black hole: సూర్యుని కంటే 10 రెట్లు పెద్దదైన ఈ కృష్ణబిలం

భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఓ భారీ కృష్ణబిలాన్ని తాజాగా గుర్తించారు. ఇప్పటిదాకా భూమికి అతి సమీపంలో ఉన్న కృష్ణబిలం కంటే ఇది ఏకంగా మూడింతలు దగ్గరగా ఉంది! సూర్యుని కంటే 10 రెట్లు పెద్దదైన ఈ కృష్ణబిలం భూమికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఒఫికస్‌ నక్షత్ర మండలంలో ఉంది. పాలపుంతలో నిద్రాణంగా ఉన్న కృష్ణబిలాన్ని కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారి కూడా కావడం విశేషం. కృష్ణబిలాలు ఏర్పడే క్రమాన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Korea: రంగంలోకి యూఎస్‌ సూపర్‌సోనిక్‌ బాంబర్లు

సియోల్‌: వరుస క్షిపణి పరీక్షలతో ఉద్రిక్తతలు పెంచుతున్న ఉత్తరకొరియాకు అమెరికా హెచ్చరికలు పంపింది. దక్షిణకొరియాలో జరుపుతున్న సంయుక్త సైనిక విన్యాసాల చివరి రోజు నవంబర్ 5న అధునాతన సూపర్‌సోనిక్‌ బాంబర్‌ బీ–1బీ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. 2017 డిసెంబర్‌ తర్వాత వీటిని విమానాలను కొరియా ద్వీపకల్ప విన్యాసాల్లో వాడటం ఇదే తొలిసారి. వారం వ్యవధిలో ఉత్తర కొరియా పరీక్షల పేరిట ఏకంగా 30కి పైగా క్షిపణులు ప్రయోగించడంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అందుకే ఈసారి విన్యాసాల్లో ఎఫ్‌–35 అగ్రశ్రేణి యుద్ధవిమానంసహా దాదాపు 240 యుద్ధ విమానాలతో తమ సత్తా ఏమిటో ఉత్తరకొరియాకు చూపే ప్రయత్నంచేశాయి. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అగ్రదేశాల మధ్య బేధాభిప్రాయలు పొడచూపడంతో ఇదే అదనుగా భావించి ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలను ఒక్కసారిగా పెంచేసింది. నవంబర్ 5న సైతం నాలుగు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. విన్యాసాల పేరిట తమ భూభాగాల దురాక్రమణకు ప్రయత్నిస్తే శక్తివంతమైన సమాధానం ఇస్తామని అమెరికా, దక్షిణకొరియాలనుద్దేశిస్తూ ఉ.కొరియా హెచ్చరించింది. 

Also read: Korea: ఉభయ కొరియాల మధ్య... ఉద్రిక్తతలు మరింత తీవ్రం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 07 Nov 2022 02:27PM

Photo Stories