Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జులై 9th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu July 9th 2022
Current Affairs in Telugu July 9th 2022


GMRకు కౌలనాము ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ 

ఇండోనేషియాలోని మెడాన్‌లో ఉన్న కౌలనాము అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను అంకసపుర అవియాసి ప్రారంభించింది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్, ఇండోనే షియా ప్రభుత్వ సంస్థ పీటీ అంకసపుర–2 సంయుక్త భాగస్వామ్య కంపెనీయే అంకసపుర అవియాసి. ఈ జాయింట్ వెంచర్ లో జీఎంఆర్‌కు 49% వాటా ఉంది. 25 ఏళ్లపాటు నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులను చేపడుతుంది.  

Also read: Indian Air Force: భారత వాయుసేనలో తండ్రీ తనయ రికార్డ్‌

జీఎంఆర్‌ నిర్వహణలో ఆగ్నే యాసియాలో ఇది రెండవ విమానాశ్రయ ప్రాజెక్టు. మొదటిది ఫిలిప్పీన్స్ లోని మాక్టాన్ కెబు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (MCIA). ఇదే సంస్థ ఫిలిప్పీన్స్ లోని కార్ల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను ఇటీవలే పూర్తి చేసింది. గ్రీస్ లోని క్రెటెలో త్వరలో నూతన ఎయిర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతలూ చేపట్టనుంది.  


Telecom అదానీ గ్రూప్ - స్పెక్ట్రం వేలానికి దరఖాస్తు 

టెలికం రంగంలో దిగ్గజాలు అంబానీ, మిట్టల్‌ను ఢీకొనేందుకు అదానీ కూడా సిద్ధమవుతున్నారు. త్వరలో కేంద్రం నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడం ద్వారా టెలికంలోకి ఎంట్రీ ఇవ్వాలని పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ గ్రూప్‌ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా స్పెక్ట్రం వేలానికి దరఖాస్తు కూడా చేసుకున్నట్లు పేర్కొన్నాయి. స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు జూలై 8నతో ముగిసింది. దీనికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి. జియో (ముకేష్‌ అంబానీ), ఎయిర్‌టెల్‌ (సునీల్‌ మిట్టల్‌), వొడాఫోన్‌ ఐడియాతో పాటు నాలుగో సంస్థగా అదానీ గ్రూప్‌ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దరఖాస్తుదారుల పేర్లను జూలై 12న ప్రకటించనున్నారు. 

Also read: GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్‌

అదానీ గ్రూప్‌ ఇటీవలే నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఎన్‌ఎల్‌డీ), ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఐఎల్‌డీ) లైసెన్సులు కూడా తీసుకుంది. 

వివిధ బ్యాండ్లలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలం జులై 26న ప్రారంభం కానుంది. గుజరాత్‌కే చెందిన అంబానీ, అదానీ .. భారీ వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించినా ఇప్పటివరకూ ప్రత్యక్షంగా ఒకే రంగంలో పోటీ పడలేదు. అంబానీ ఆయిల్, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్‌లో విస్తరించగా.. అదానీ మాత్రం పోర్టులు, బొగ్గు, ఏవియేషన్‌ వంటి రంగాలపై దృష్టి పెట్టారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పరిస్థితి మారుతోంది. పెట్రోకెమికల్స్‌ విభాగంలోకి ప్రవేశించే దిశగా అదానీ ఇటీవలే ఒక అనుబంధ సంస్థ ఏర్పాటు చేశారు. పునరుత్పాదక విద్యుత్‌ విభాగంలో అంబానీ, అదానీ పోటాపోటీగా పెట్టుబడులు ప్రకటిస్తున్నారు. 

Also read: Top New Technology Trends 2022

Rajya Sabha సభ్యులుగా 27 మంది ప్రమాణం 

రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 57 మందిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్‌ గోయెల్‌ సహా 27 మంది సభ్యులు జూలై 8న ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామంటూ వారితో ప్రమాణం చేయించారు. 10 రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు తెలుగు తదితర 9 భాషల్లో ప్రమాణం చేశారు. కొత్తగా ఎన్నికైన 57 మందిలో నలుగురు ఇప్పటికే ప్రమాణం చేశారు. మిగతా వారు వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రమాణం చేయనున్నారు. ఇంకా ప్రమాణం చేయని కొత్త సభ్యులు కూడా 18వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పష్టతనిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో విజేతల పేర్లను నోటిఫికేషన్‌లో ప్రకటించిన నాటి నుంచి వారిని సభ్యులుగానే పరిగణిస్తామన్నారు. సభా కార్యక్రమాలు, కమిటీల సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రం ప్రమాణం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తాజాగా ప్రమాణం చేసిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్, వివేక్‌ కె.తన్‌ఖా, ముకుల్‌ వాస్నిక్‌తోపాటు బీజేపీ నుంచి సురేంద్ర సింగ్‌ నాగర్, కె.లక్ష్మణ్, లక్ష్మీకాంత్‌ వాజ్‌పేయి తదితర 18 మంది ఉన్నారు.  

also read: Rajya Sabhaకు పీటీ ఉష, ఇళయరాజా, వీరేంద్ర హెగ్గడే, విజయేంద్ర ప్రసాద్‌

Chukka Ramaiahకు జీవిత సాఫల్య పురస్కారం 

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు తెలంగాణ వేదిక్‌ మ్యాథ్స్‌ ఫోరం ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందచేశారు. జూలై 8న శ్రీత్యాగరాయ గాన సభలోని కళా దీక్షితులు కళావేదికపై  తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ తదితరులు అవార్డును అందచేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్‌ మాట్లాడుతూ చుక్కా రామయ్య గణితశాస్త్రానికే ప్రతిరూపం లాంటి వారని, ఆయన తెలుగు రాష్ట్రాలలో ఐఐటీని ఇంటింటికీ తీసుకెళ్లారని కొనియాడారు. అవార్డుల స్థాయి కన్నా ఎత్తుకు ఎదిగిన రామయ్య నుంచి లెక్కలు మాత్రమే కాదు..జీవితం సక్రమంగా నడిచే లెక్కలు కూడా నేర్చుకోవాలన్నారు. త్వరిత గణిత విధానంలో రికార్డు సాధించిన సాయి కిరణ్‌ సారథ్యంలో ఉన్నత ప్రతిభ చూపిన చంద్రయ్య, నరసింహారావులకు గణిత రత్న అవార్డు బహూకరించారు. బాల సాహిత్య రచయిత చొక్కాపు రమణ అధ్యక్షత వహించారు.

Also read: First in India: Science & Technology

Telangana: లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ నవీన్‌ రావు

తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ నవీన్‌ రావు నియమితులయ్యారు. హైకోర్టు సూచనల మేరకు గవర్నర్‌ ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం జూలై 8న ఉత్తర్వులు వెలువరించింది. గతంలో లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానంలో జస్టిస్‌ నవీన్‌ రావును నియమించారు. 

Also read: All About Rakesh Jhunjhunwala!

ADMP: తెలంగాణ వ్యవసాయ డేటా నిర్వహణ విధానం - 2022


 

రాష్ట్రంలోని రైతుల హక్కులను పరిరక్షిస్తూనే వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ డేటా నిర్వహణ విధానం –2022 (ADMP –2022) ముసాయిదాను జూలై 8న విడుదల చేసింది. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. జీఎస్‌డీపీలో సుమారు 15 శాతం మేర వ్యవసాయ రంగం నుంచే సమకూరుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని (డేటా) సమర్ధవంతంగా వినిగించుకునేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక భాగస్వామ్యంతో రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ విభాగం ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఈ పాలసీని రూపొందించింది. ముసాయిదాలోని అంశాలపై వ్యక్తులు లేదా సంస్థలు తమ సూచనలు, ఆక్షేపణలు ఈ నెల 6వ తేదీలోగా నిర్ణీత ఫార్మాట్‌లో సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచించింది.

also read: AWS Learning Plan
 
డేటా వనరులే అత్యంత కీలకం
సాగునీటి వసతుల కల్పన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిటీ, కొత్త రకాల పంటల సాగును ప్రోత్సహించడం వంటి బహుముఖ విధానాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా కృత్రిమ మేథస్సు (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్, డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు వంటి ఆధునిక టెక్నాలజీ ద్వారా డిజిటల్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి రైతులకు వ్యవసాయం లాభదాయకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీ వినియోగంలో వ్యవసాయంతో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం కీలకం. ఈ నేపథ్యంలో వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించడం, క్రోడీకరించడం, ఇతరులకు పంపిణీ చేయడం, డేటాను వినియోగానికి వీలుగా మార్చడం తదితరాల కోసం ఏడీఎంపీ 2022 దోహద పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

also read: 9 Habits of Profoundly Influential...

వ్యవసాయ శాఖ కమిషనర్‌  నేతృత్వంలో కమిటీ
వ్యవసాయ, అనుబంధ రంగాల సమాచారం సేకరణ, క్రోడీకరణ, పంపిణీ తదితరాల కోసం అధికారుల అంతర్గత కమిటీ (ఐడీసీ) ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌ అధ్యక్షుడిగా వ్యవహరించే ఈ కమిటీలో నీటిపారుదల, ప్రణాళిక, వ్యవసాయ, సహకారం, భూ పరిపాలన, స్టేట్‌ రిమోట్‌ అప్లికేషన్‌ సెంటర్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. 

also read: Top 10 Indian Colleges in The World 2023

సమాచారం..సేవలు
ఈ పాలసీ ద్వారా వ్యవసాయ పరపతి, బీమా, వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, నీటి నిర్వహణ, తెగుళ్లు, వాటి నివారణ, పంట దిగుబడి, భూ రికార్డులు, భూమి హద్దులు, భూసారం, వాతావరణం, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, మార్కెటింగ్‌కు సంబంధించిన సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. రైతులకు రుణాలు అందేలా చూడటం, పంటలు, వ్యవసాయ యంత్రాలకు బీమా వర్తింపు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, కోల్డ్‌ స్టోరేజీ వసతులు, డిజిటల్‌ మార్కెట్ల ద్వారా విక్రయాలు, ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయ పరిశోధనలు, ఆధునిక టెక్నాలజీ ద్వారా కొత్త ఆవిష్కరణలు, వ్యవసాయ విద్యకు అవసరమైన డేటా తదితరాలు ఈ పాలసీ ద్వారా సాధ్యమవుతాయి.

Also read: Telangana History Important Bitbank 

Shinzo Abe జపాన్‌ మాజీ ప్రధానిషింజో అబే హత్య

జపాన్ మాజీ ప్రధానమంత్రి షింబో అబె (67) దుండగుడి కాల్పుల్లో  బలయ్యారు. పశ్చిమ జపాన్‌లోని నరాలో జూలై 8న ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా దుండగుడు తుపాకీతో వెనుక నుంచి కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన షింజో అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న తెత్సుయా యమగామీ(41) అనే వ్యక్తిని పోలీసులు ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పరిపాలనాదక్షుడిగా, శక్తివంతమైన నాయకుడిగా పేరుగాంచిన షింజో అబే హత్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివిధ దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. భూగోళంపై అత్యంత భద్రత కలిగిన దేశంగా గుర్తింపు పొందడంతోపాటు కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలు అమల్లో ఉన్న జపాన్‌లో మాజీ ప్రధానమంత్రి హత్యకు గురికావడం ప్రపంచమంతటా చర్చనీయాంశంగా మారింది.  

Also read: Hurun Richest Self Made Women

హేయమైన చర్య.. రాక్షసకాండ  
షింజోను హత్య చేయడం హేయమైన చర్య, రాక్షసకాండ అని జపాన్ ప్రధాని పుమియో కిషిదా అభివర్ణించారు. ఈ దారుణాన్ని ఖండించడానికి పరుషమైన పదాలు వాడాల్సి వస్తోందన్నారు. 

నిందితుడి ఇంట్లో ఆయుధాలు
జపాన్‌ పార్లమెంట్‌ ఎగువసభకు ఆదివారం (జూలై 10న) ఎన్నికలు జరుగనున్నాయి. లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థుల విజయం కోసం షింజో అబే కొన్ని రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీలో సీవాకై అనే  వర్గానికి ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. షింజోపై కాల్పులు జరిపినట్లు భావిస్తున్న తెత్సుయా యమగామీ ఇంట్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అతడు జపాన్‌ నావికాదళంలో 2002 నుంచి 2005 దాకా పనిచేసినట్లు తేలింది.

Also read: the worlds 10 most powerful people

అంతర్జాతీయ రాజకీయాలపై చెరగని ముద్ర 
షింజో అబె. జీవితమంతా రాజకీయాల్లోనే గడిపిన నేత. అత్యంత ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా జపాన్‌కు సైనికంగా, ఆర్థికంగా నూతన దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రపంచ రాజకీయాలపైనా చెరగని ముద్ర వేశారు. జపాన్‌లోని శక్తిమంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టారాయన. అబె తాత నొబుసుకే కిషి జపాన్‌ ప్రధానిగా పని చేశారు. మరో తాత ఎయ్‌సాకు సాతో కూడా ఎనిమిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. అనంతర కాలంలో జపాన్‌ను అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఆయన రికార్డునే అబె అధిగమించడం విశేషం. 

Also read: wealthiest historical persons

అబెనామిక్స్‌తో ఆర్థిక చికిత్స 
అబె 1954 సెప్టెంబర్ 21న టోక్యోలో జన్మించారు. తండ్రి షింటారో అబె విదేశాంగ మంత్రిగా పని చేశారు. టోక్యోలోని సెయ్‌కీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాక అబె అమెరికా వెళ్లి సౌత్‌ కాలిఫోర్నియా వర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. కొంతకాలం కోబే స్టీల్‌లో పని చేసి 1982లో విదేశాంగ శాఖలో చేరారు. తర్వాత యమగూచి స్థానం నుంచి ఎల్డీపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. 2005లో జునిచిరో కొయిజుమి ప్రభుత్వంలో చీఫ్‌ కేబినెట్‌ సెక్రెటరీ అయ్యారు. 2006లో 52వ ఏట తొలిసారి ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కునిగా రికార్డు సృష్టించారు. కానీ అనారోగ్యం వేధించడంతో ఏడాదికే తప్పుకోవాల్సి వచ్చింది. దేశంలో ఐదేళ్ల రాజకీయ అస్థిరత అనంతరం 2012లో రెండోసారి ప్రధాని అయ్యారు. 2020 ఆగస్టు దాకా కొనసాగారు. పాలనలో తనదైన మార్కు చూపించారు. ఏకంగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. అబెనామిక్స్‌ పేరుతో పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సమర్థ విధానాల ద్వారా ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. తిరుగులేని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిపెట్టారు. ఆగర్భ శత్రువైన చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. ప్రపంచ దేశాధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సైనికపరంగా కూడా జపాన్‌ను అత్యంత బలోపేతం చేయాలని చివరిదాకా తపించారు. జపాన్‌ జాతీయవాదానికి పోస్టర్‌ బోయ్‌గా నిలిచి యువతలో క్రేజ్‌ సంపాదించుకున్నారు. అత్యంత బలోపేతమైన సైన్యాన్ని కేవలం ఆత్మరక్షణకే పరిమితం చేస్తూ అంతర్జాతీయ సంఘర్షణల్లో జోక్యం చేసుకోవడాన్ని నిషేధిస్తున్న దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. దీన్ని చైనా, కొరియాలనే గాక స్వదేశంలోని సంప్రదాయవాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషించేలా జపాన్‌ను తీర్చిదిద్దాలని తపించారు.

Also read: top quotes by swami vivekananda

భారత్‌కు ప్రియమిత్రుడు 
భారత్‌తో అబెకు ప్రత్యేక అనుబంధముంది. ముఖ్యంగా ప్రధాని మోదీతో ఆయన గట్టి స్నేహ బంధం ఏర్పరచుకున్నారు. కుర్తా పైజా ధరించి, నుదుట తిలకం, చేతిలో హారతి పళ్లెంతో 2015లో కాశీలోని ప్రఖ్యాత దశాశ్వమేధ ఘాట్‌ వద్ద మోదీతో పాటు ఆయన గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. భారతీయ వస్త్రధారణతో మోదీతో కలిసి అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమం దాకా రోడ్‌షోలో పాల్గొని అలరించారు. తద్వారా భారత్‌కు ఆత్మీయ మిత్రుడయ్యారు. అబె హయాంలో భారత్‌తో జపాన్‌ ఆర్థిక బంధం కూడా ఎంతో బలోపేతమైంది. 2021లో దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో అబెను కేంద్రం గౌరవించింది.

Published date : 09 Jul 2022 03:59PM

Photo Stories