Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సీనియర్ జర్నలిస్ట్ వ్యాక్యలు..! ఇవి
మునుపు చెప్పిన దానినే మళ్లీ చెప్పడంతో ప్రారంభిస్తాను. ఒక సంక్లిష్టమైన ముగింపును అర్థం చేసుకోడానికి అత్యుత్తమమైన మార్గం ఏమిటంటే స్పష్టత అవసరమయ్యే అంశాలను లేవనెత్తే ప్రశ్నలకు రూపకల్పన చేసుకోవడం. చీకటి సొరంగంలో చిన్న కాంతిరేఖను కనుగొనడం వంటిది ఇది. అందువలన నన్ను కశ్మీర్‌పై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల వైపు వెళ్లనివ్వండి.
‘రద్దు’ అని అంతా అంటున్న ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నేను విషయాన్ని ప్రారంభిస్తాను. రద్దును సమర్థించడాన్ని అలా ఉంచితే – ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి వీలుగా కశ్మీర్ ‘రాజ్యాంగ సభ’ను కశ్మీర్ ‘రాష్ట్ర శాసన సభ’ అనే అర్థంలోకి తెచ్చేందుకు వెసులుబాటును కల్పించే ఆర్టికల్ 367ను కేంద్రం వాడుకుంది. మళ్ళీ ఈ 367 సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమ విరుద్ధంగా 272వ రాజ్యాంగ ఉత్తర్వు (కాన్‌స్టిట్యూషనల్ ఆర్డర్)ను ఆసరా చేసుకుంది. ఇది అధికార అతిక్రమణేనని బెంచిలోని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న ఈ మార్గం చట్ట విరుద్ధమైనది కనుక రద్దు చెల్లుబాటు అవదని నిజానికి కోర్టు తీర్పు ఇవ్వవలసింది. కానీ అలా ఇవ్వలేదు. బదులుగా, క్లాజ్ 3ని ఉపయోగించి ఆర్టికల్ 370ని రద్దు చేయవచ్చని పేర్కొనడం ద్వారా కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థించింది. దీనర్థం... ప్రభుత్వం తప్పుగా చేసింది కానీ, మరోలా చేసి ఉంటే తప్పేమీ అయివుండేది కాదని కోర్టు తీర్పు ఇవ్వడం. అంటే ప్రభుత్వాన్ని సమర్థించడం.
ఇది నాకు ప్రభుత్వం నోటిలో న్యాయస్థానమే వాదనలు పెట్టినట్లుగా అనిపించింది. అయితే అవి ప్రభుత్వ వాదనలు కావు. దీనిపై కపిల్ సిబాల్, ‘‘ఆర్టికల్ 370పై ప్రభుత్వ స్వీయ అవగాహనకు, కోర్టు తీర్పునకు కొద్దిగానైనా పొంతన లేదు. సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇవ్వడం సరైన విధానమేనా?’’ అని ట్వీట్ చేశారు. ఆర్టికల్ 367లో రాజ్యాంగ ఉత్తర్వు 272 ద్వారా ప్రవేశపెట్టిన క్లాజు 3 ప్రకారం, కశ్మీర్ రాజ్యాంగ సభను రద్దు చేయొచ్చన్న వాదన కూడా... ‘కశ్మీర్ రాజ్యాంగ’ సభ రద్దు అవడం అంటే ‘కశ్మీర్ అసెంబ్లీ’కి ఉండే సిఫారసు అధికారం ఉనికిలో లేకుండా పోవడం మాత్రమే అనే వాదనపై ఆధారపడి ఉంటుంది.
అంతే తప్ప రద్దుకు భారత రాష్ట్రపతికి ఉన్న అధికారంపై – సిఫారసు చేసేందుకైనా, చేయకుండా ఉండేందుకైనా – అది ఎలాంటి ప్రభావమూ చూపదు. ఈ వాదన ఆమోదయోగ్యమైనదా లేక వివాదాస్పదమైనదా?ఇప్పుడిక ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు...అంటే, జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కుదించేందుకు...కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నదా లేదా అని నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయానికి వద్దాం. కోర్టు రెండు వాదన లపై ఆధారపడింది.
ఒకటి: ‘‘ఆర్టికల్ 356 అమలులో ఉన్న సమయంలో రాష్ట్రపతి తీసుకున్న ఏ నిర్ణయాలపైన అయినా వచ్చే దావాల విచారణకు కోర్టు కొలువు తీరవలసిన అవసరం ఉంటుందని మేము భావించడం లేదు. ఎందుకంటే రాష్ట్రం తరఫున రాష్ట్రపతి, పార్ల మెంటు తీసుకున్న ప్రతి చర్య కూడా సవాలుకు అనువుగా ఉంటే
కష్టం. అప్పుడిక రాష్ట్రపతి పాలనలో తీసుకున్న ప్రతి చర్యతోనూ విభేదించే ప్రతి వ్యక్తినీ ఇది ఎలాంటి అడ్డంకులూ లేకుండా కోర్టు వరకు రానిస్తుంది’’ అని! రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రాజ్యంగబద్ధమేనా, కాదా అని నిర్ధారించేందుకు నిరాకరించిన కోర్టు అందుకు చూపించిన ఈ కారణం న్యాయబద్ధమైనదేనా?
కోర్టు చూపించిన రెండవ కారణం – ఆర్టికల్ 3 కింద రాష్ట్ర శాసనసభ సిఫారసులు అమలుకు బద్ధతను కలిగి లేవు. అందులో సందేహం లేదు. అయినప్పటికీ రాజ్యాంగం ప్రకారం అదొక ప్రక్రియ. సిఫారసులకు బద్ధమై ఉండే అవసరం లేనంత మాత్రాన కోర్టు తన నిర్ణయం చెప్పడానికి నిరాకరించవచ్చునా? ఇప్పుడు, పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగబద్ధమైనదా, కాదా అని నిర్ధారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన పర్యవసానంగా జరిగేది ఒకటేమిటంటే... ఇదే పద్ధతిలో మరికొన్ని పునర్వ్యవస్థీకరణలు జరగవచ్చు. ప్రభుత్వం బెంగాల్, కేరళ, తమిళనాడులలో రాష్ట్రపతి పాలనను ప్రకటించి, అసెంబ్లీ అధికారాలను పార్లమెంటుకు బదిలీ చేసి, ఆ తర్వాత – రాష్ట్రాన్ని రద్దు చేయాలా, లేక కేంద్రపాలిత ప్రాంతంగా రాష్ట్ర స్థాయిని తగ్గించాలా అన్న దానిని పార్లమెంటులో నిర్ణయించవచ్చు. ఈ విధానం, మున్ముందు ఒక ఆనవాయితీగా స్థిరపడిపోతుంది.
రెండో పర్యవసానం... బహుశా మరింత ముఖ్యమైనది. సమాఖ్య భావన (ఫెడరలిజం) అనేది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగం అని కదా అలోక్ ప్రసన్న కుమార్ అంటారు. దాని అర్థం దాన్ని పార్లమెంటు సవరించలేదని! అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అధికారాన్ని పార్లమెంటరీ అధికారంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిం చింది. దీనివల్ల పార్లమెంటు అధికారానికీ, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ ప్రాముఖ్యతకూ మధ్య ఇప్పుడు మనకు ఘర్షణ తలెత్తడం కనిపించదా? ‘ది హిందూ’ మరింత విస్తృతమైన అంశాన్ని వెల్లడించింది.
‘‘ఒక రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభ తరఫున ఎటువంటి చర్యనైనా – శాసనపరమైనవి, తిరుగులేని పరిణా మాలకు తావిచ్చేవి – ఏవైనా గానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చుననే ఒక సహేతుకం కాని తీర్మానాన్ని సుప్రీంకోర్టు తీర్పు సూచిస్తోంది’’ అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. దీని పైనే అర్ఘ్యా సేన్‌గుప్తా మాట్లాడుతూ, ‘‘ఇది భారతదేశ సమాఖ్యతత్వ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన పరిణామాలతో ముడివడి ఉన్న రాజ్యాంగపరమైన ప్రశ్న’’ అన్నారు. అంటే... కోర్టు తన తాజా తీర్పుతో సమస్యల తుట్టెను కదిలించినట్లయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే కశ్మీర్ తీర్పుల గురించి నేనేమనుకుంటున్నానో నాకు తెలుస్తుంది. కానీ ఆ సమాధానాలను ఎవరు అందిస్తారు?
- కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్