Top 10 Current Affairs: కేరళలో తొలిరోజే ఆగిన వందేభారత్
1. సూడాన్‌లో అంతర్యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కావేరి శరవేగంగా జరుగుతోంది. సూడాన్‌లో చిక్కుకొన్న భారతీయులందరినీ స్వదేశానికి తరలిస్తామని విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా హామీ ఇచ్చారు. సూడాన్‌లో 3500 మంది భారతీయులు, 1000 మంది భారత సంతతి వ్యక్తులు చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 1700 మందికి పైగా భారతీయులు సూడాన్ నుంచి బయటపడ్డారు.
2. కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన తొలిరోజే.. వందేభారత్ రైలు నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలతో కాసర్‌గోడ్ వెళ్లాల్సిన సెమీ హైస్పీడ్ రైలు కన్నూర్ రైల్వేస్టేషనులో నిలిచిపోయింది. మంగళవారం ఉదయం తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్‌కు బయలుదేరిన రైలుకు మార్గమధ్యంలో ఎగ్జిక్యూటివ్ బోగీలోని ఏసీ గ్రిల్‌లో నీరు కారుతున్నట్లు అధికారులు గుర్తించి మరమ్మతులు చేశారు.
3. శస్త్ర చికిత్సలు, తీవ్రమైన గాయాలతో సహా అత్యవసర కేసుల్లో వైద్య సేవలు అందించే ఎంబీబీఎస్ డాక్టర్లతో సమాన వేతనాలకు ఆయుర్వేద వైద్యులు అర్హులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శవ పరీక్షల(పోస్ట్‌మార్టం)ను అలోపతి వైద్యులే నిర్వహిస్తారని జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది. ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న వైద్యులతో సమానంగా ఆయుర్వేదం ప్రాక్టీషనర్లనూ పరిగణించాలంటూ 2012లో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం కొట్టేసింది.
4. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీటో వినియోగం కేవలం రాజకీయ ప్రయోజనాల కోణంలోనే జరుగుతున్నాయని.. నైతిక బాధ్యతతో కాదని భారత్ ఉద్ఘాటించింది.
వీటో ఇనిషియేటివ్ తీర్మానానికి ఏడాదైన సందర్భంగా ‘యూజ్ ఆఫ్ వీటో’పై ఐరాస సాధారణ సభలో జరిగిన ప్లీనరీలో భారత కౌన్సిలర్ ప్రతీక్ మథూర్ ఈ విషయంపై ప్రసంగించారు.
5. భారత్–కొరియా ద్వైపాక్షిక వాణిజ్యం 2022లో 17 శాతం పెరిగి 27.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2021లో ఈ విలువ 23.7 బిలియన్ డాలర్లని కొరియా– ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కేఓటీఆర్‌ఏ) పేర్కొంది. భారత్‌కు కొరియా ఎగుమతులు 2022లో 21% పెరిగి 18.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతులు 10.5% ఎగసి 8.9 బిలియన్ డాలర్లకు చేరాయి. 2023 భారత్–కొరియా ఇండస్ట్రీ భాగస్వామ్య కార్యక్రమంలో దేశంలో కొరియా రిపబ్లి క్ రాయబారి చాంగ్ జియో–బుక్ ఈ విషయాల ను తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగాల్లో ఇరుదేశాలు పరస్ప రం సహకరించుకుంటున్నట్లు వెల్లడించారు.
6. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ భాగస్వాములుగా ఉన్న క్వాడ్ సదస్సు మే 24న జరగనుండగా.. ఈ సదస్సుకు తొలిసారిగా ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్, జపాన్ ప్రధాని పుమియో కిషిదాతోపాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొనే అవకాశముంది.
క్వాడ్ కూటమి 2021 సెప్టెంబరు 24న వాషింగ్టన్‌లో తొలిసారి భేటీ అయ్యింది. గతేడాది మేలో జరిగిన రెండో సదస్సుకు జపాన్ ఆతిథ్యమిచ్చింది.
7. జపాన్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ ఐస్పేస్ ప్రయోగించిన ల్యాండర్ మంగళవారం చంద్రునిపై దిగే క్రమంలో కుప్పకూలినట్టు సమాచారం. చంద్రుని ఉపరితలానికి కేవలం 10 మీటర్ల దూరంలో ఉండగా దానితో సంబంధాలు తెగిపోయాయి. 6 గంటలకు పైగా విఫలయత్నం చేసిన అనంతరం, చివరి అంకంలో ల్యాండర్ చంద్రున్ని ఢీకొట్టి కుప్పకూలిందని ఐస్పేస్ ప్రకటించింది.
ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై ల్యాండర్‌ను దించిన తొలి ప్రైవేట్ కంపెనీగా అది చరిత్రకెక్కేది. ఇంతటితో కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నిస్తామని దాని సీఈఓ హకమడ ప్రకటించారు.
8. భారత సంతతికి చెందిన వ్యక్తి తంగరాజు సుప్పయ్య(46)ను సింగపూర్ అధికారులు ఉరి తీశారు. కాగా, తంగరాజు.. సింగపూర్‌కు కేజీ గంజాయిని అక్రమంగా తరలించారనే కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో, ఉరిశిక్షను అధికారులు అమలు చేశారు.
సింగపూర్‌కు కిలోకిపైగా గంజాయిని రవాణా చేసేందుకు తంగరాజు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల్లో తంగరాజు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో, తంగరాజుకు అక్టోబర్ 9, 2018లో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున చాంగి జైలులో తంగరాజు సుప్పయ్యను ఉరి తీశారు.
9. ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై జూన్ 26న తుది విచారణ చేపడుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 26కి వాయిదా వేసింది.
10. పక్షులకు, జంతువులకు ఏదైన సమస్య వస్తే మనుషుల మాదిరి ఆస్పత్రులకు వెళ్లడం, చికిత్స చేయించుకోవడం వంటివి ఉండవు. ప్రత్యేకంగా పెంచుకుంటేనో లేక పార్క్‌లో ఉంటేనో వాటి సంరక్షకులు వాటి బాగోగులు గమనించి వెటర్నరీ ఆస్పత్రులకు తీసుకువెళ్లడం జరుగుతోంది. వాటికి మహా అయితే ట్రీట్‌మెంట్ చేసి పంపిచేస్తారు గానీ స్కానింగ్‌లు వంటి ఉండవు.
కానీ తొలిసారిగా ఒక పక్షి ఎంఆర్‌ఐ స్కాన్ చేయించుకుంది. ఇలాంటి స్కానింగ్ చేయించుకున్న తొలి పక్షిగా నిలిచింది. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌లోని అడ్వెంచర్ పార్క్‌లో ఉంటున్న చకా అనే పెంగ్విన్ పక్షి నిలబడటం, కదలికలకు సంబదించిన సమస్యలు ఎదుర్కొంటోంది. దీంతో చకా అనే పెంగ్విన్‌కి ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు.