Skip to main content

Top Current Affairs: అమెరికాలో మ‌రో బ్యాంకు మూత‌

వివిధ పోటీ ప‌రీక్ష‌ల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌తీ రోజు రాష్ట్రీయ‌, జాతీయ‌, అంత‌ర్జాతీయ‌, క్రీడలు త‌దిత‌ర అంశాల‌పై క‌రెంట్ అఫైర్స్‌ను అంద‌జేస్తోంది. ఏప్రిల్ 28వ తేదీ టాప్ టెన్ క‌రెంట్ అఫైర్స్ మీకోసం...

1. విడాకులకు సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పరస్పర సమ్మతితో విడాకులు కోరుకునే దంపతులు హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం ఆరు నెలల దాకా వేచి చూడాల్సిన అవసరం లేదని సోమవారం తీర్పును ప్రకటించింది. విఫలమైన వివాహాలను రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని 142(1) అధికరణం కింద తమకు విశేషాధికారం ఉందని స్పష్టంచేసింది. విడాకుల కోసం మొదటిసారి కోర్టుకు వచ్చిన దంపతులు ఆరు నెలల నుంచి 18 నెలల్లోగా దానిని ఉపసంహరించుకోకుండా రెండోసారి కూడా వస్తే విడాకులు మంజూరు చేయవచ్చని హిందూ వివాహ చట్టంలోని 13-బి సెక్షన్‌ చెబుతోందని పేర్కొంది.
2. దిల్లీలో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. మే నెలాఖరులో దీనిని ప్రారంభించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారిక తేదీని త్వరలోనే ప్రకటించే అవ‌కాశం ఉంది.
3. ఉత్తరప్రదేశ్‌ బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హతవేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ను కిడ్నాప్‌ చేసి హత్యచేసిన కేసులో అఫ్జల్‌ను దోషిగా తేల్చిన ఘాజిపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఎంపీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించింది. 
ఈ క్రమంలోనే ఆయనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం వెల్లడించింది. అఫ్జల్‌ అన్సారీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఘాజీపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు.
4. అమెరికాకు చెందిన ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్ మూత పడింది. కాలిఫోర్నియా రెగ్యులేటరీ ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఈ బ్యాంక్‌ను మూసివేసింది. దివాళాతో ప్రముఖ పెట్టుబడుల సంస్థ జేపీ మోర్గాన్‌ ఛేజ్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పెట్టుబడుల సంస్థ (జేపీ మోర్గాన్‌) డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ లేని డిపాజిట్లు,  ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌కు చెందిన ఎక్కువ మొత్తం ఆస్తులకు బాధ్యత వహిస్తున్నట్లు తెలిపింది. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ కొనుగోలు, డిపాజిటర్ల బాధ్యతతో పాటు ఇతర అంశాలపై మధ్యవర్తిగా కాలిఫోర్నియా రెగ్యులేటరీ ఫెడరల్‌ డిపాజిట్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ను నియమించింది. 
5.  భారత మహిళా స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లలో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు దూరం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక కోసం ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సెలెక్షన్‌ట్రయల్స్‌ టోర్నీలో సైనా నెహ్వాల్‌ పాల్గొనడంలేదు. ‘ఫిట్‌నెస్‌ సంబంధిత సమస్యల కారణంగా సైనా ట్రయల్స్‌లో బరిలోకి దిగడంలేదు. సైనాతోపాటు పురుషుల డబుల్స్‌ జోడీ కుశాల్‌ రాజ్, ప్రకాశ్‌ రాజ్‌ కూడా ట్రయల్స్‌ టోర్నీ నుంచి వైదొలిగారు’ అని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కార్యదర్శి సంజయ్‌ మిశ్రా తెలిపారు. 
6. హరిత హైడ్రోజన్‌ ఇంధనాన్ని పర్యావరణహిత పద్ధతిలో ఉత్పత్తి చేసే ఒక ఉత్ప్రేరకాన్ని గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మిథైల్‌ ఆల్కహాల్‌ నుంచి దీన్ని తయారుచేస్తారు. ఈ ప్రక్రియలో ఫార్మిక్‌ ఆమ్లం కూడా ఉత్పత్తి కావడం విశేషం. శుద్ధ ఇంధనమైన హైడ్రోజన్‌ను ప్రస్తుతం విద్యుత్‌రసాయన పద్ధతిలో నీటిని విడగొట్టడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే.. ఆల్కహాల్‌ వంటి రసాయనాల ద్వారా కూడా తయారుచేస్తారు. రెండో విధానంలో ఎక్కువగా మిథైల్‌ ఆల్కహాల్‌ను ఉపయోగిస్తుంటారు. 
7. వంద నగరాలను అత్యాధునికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌(ఎస్‌సీఎం) కార్యక్రమానికి గడువును పెంచుతూ కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్‌తో ముగియనున్న గడువును వచ్చే ఏడాది జూన్‌ వరకూ పెంచింది. 
8.  క్వాడ్ కూటమిని విస్తరించే ఉద్దేశం లేదని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరీన్ జీన్-పియర్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గత రెండేళ్ల నుంచి దేశాధినేతల స్థాయిలో క్వాడ్‌ సదస్సులు నిర్వహించే సంప్రదాయం ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఈ ఏడాది మే 24న క్వాడ్‌ దేశాధినేతల స్థాయి మూడో సదస్సు సిడ్నీలో జరగనుంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు.
9. అనుమానిత ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ అబూ హుస్సేన్‌ అల్‌ ఖురాషి సిరియాలో మృతి చెందినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ప్రకటించారు. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ ఇంటిలిజెన్స్‌ నిర్వహించిన ఆపరేషన్‌లో హతమయ్యినట్లు పేర్కొన్నారు. తీవ్రవాద సంస్థలపై ఎలాంటి వివక్ష లేకుండా టర్కీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎర్గోగాన్ అన్నారు. 2013లో డేష్/ఐసిస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన మొదటి దేశాలలో టర్కీ ఒకటి. ఇంటిలిజెన్స్‌ ఏజెంట్లు స్థానిక మిలటరీ పోలీసుల సాయంతో సిరియాలో ఆఫ్రిన్‌ వాయవ్య ప్రాంతంలో జిండిరెస్‌లోని ఒక జోన్‌ని మూసివేసి ఈ ఆపరేషన్‌ చేపట్టారు.
10.  ఆసియా కప్‌ను వాయిదా వేసే ప్రతిపాదనేదీ లేదని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) వర్గాలు తెలిపాయి. ఆసియా కప్‌ను వాయిదా వేసి, అదే సమయంలో పాక్‌ను తప్పించి మరో టోర్నీని దుబాయ్‌లో ఆడించే అవకాశాలు ఉన్నాయని మీడియాలో వచ్చిన కథనాలు నేపథ్యంలో ఏసీసీ వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి. ఆసియాకప్‌ను వాయిదా వేయాలన్నా, రద్దు చేయాలన్నా ఏసీసీ ముందు ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశం నిర్వహించాలి. సభ్య దేశాలకు ఇప్పటివరకు అలాంటి సమాచారమేమీ లేదు.. అని ఓ ఏసీసీ అధికారి చెప్పాడు. షెడ్యూలు ప్రకారం ఆసియా కప్‌ పాకిస్థాన్‌లో జరగాల్సివుంది. కానీ పాక్‌ వెళ్లేందుకు భారత్‌ నిరాకరిస్తోంది.

Published date : 02 May 2023 07:28PM

Photo Stories