Skip to main content

సెప్టెంబర్ 2019 ద్వైపాక్షిక సంబంధాలు

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
Current Affairs ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 26న జరిగిన ఈ సమావేశంలో ప్రాంతీయ పరిస్థితులు, ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఇరాన్, అమెరికాల మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ఈ భేటీ జరగడం విశేషం. ఇటీవలి కాలం వరకు ఇరాక్, సౌదీ అరేబియాల తరువాత ఇరాన్ నుంచే భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటూ ఉండేది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా

కర్తార్‌పూర్ కారిడార్‌కు మన్మోహన్ సింగ్
భారత్, పాకిస్తాన్ మధ్య ఒక మైలురాయిగా భావించే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి సెప్టెంబర్ 30న వెల్లడించారు.
సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్‌ను భారత్‌లోని డేరా బాబా నానక్ మందిరంతో కర్తార్‌పూర్ కారిడార్ కలుపుతుంది. దీంతో భారత్‌లో సిక్కు యాత్రికులు వీసా అనుమతులు లేకుండా దర్బార్ సాహిబ్ సందర్శించవచ్చును. సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్ 550వ జయంతి నవంబర్12న ఉన్న నేపథ్యంలో నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించాలని పాక్ నిర్ణయించింది.

భారత్‌కే నిజాం నిధులు: యూకే హైకోర్టు
1948 నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో డిపాజిట్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుకు చెందిన 35 మిలియన్ పౌండ్ల (రూ. 306.5 కోట్లు)పై దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్‌కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు అక్టోబర్ 2న తీర్పునిచ్చింది. అవి భారత్‌కు, నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది.
1948లో ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1,007,940 పౌండ్ల(ప్రస్తుత విలువ ప్రకారం సుమారు రూ.8.82 కోట్ల పైచిలుకు) మొత్తాన్ని బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోని పాకిస్తాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ చేశారు. ఇప్పటికి అవి వడ్డీతో కలిపి దాదాపు 35 మిలియన్ పౌండ్ల(రూ. 306.5 కోట్లు)కు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు... ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’ అని తాజగా తీర్పును వెలువరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు, నిజాం వారసులకే నిజాం నిధులు
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్

మంగోలియాలో బుద్ధుని విగ్రహావిష్కరణ
Current Affairs
మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో ఏర్పాటుచేసిన బుద్ధుని బంగారు విగ్రహాన్ని మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్‌మాగీన్ బట్టూగ్లాతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలో సెప్టెంబర్ 20న నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉలాన్‌బాటర్‌లోని గందన్ ఆరామంలో ఈ బంగారు బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. బట్టూగ్లా 5 రోజుల భారత్ నిమిత్తం న్యూఢిల్లీ వచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బుద్ధుని బంగారు విగ్రహావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్‌మాగీన్ బట్టూగ్లాతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గందన్ ఆరామం, ఉలాన్‌బాటర్, మంగోలియా

హౌడీ మోదీ కార్యక్రమంలో ప్రధాని మోదీ
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో గల ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో సెప్టెంబర్ 22న నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 50 వేల మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. వీరినుద్దేశించి మోదీ, ట్రంప్ ప్రసంగించారు.
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
  • ఈ కార్యక్రమం పేరు ‘హౌడీ మోదీ’ అని పెట్టారు. హౌ డు యు డూ మోదీ? అని. మోదీ ఒంటరిగా ఒక శూన్యం.. ఒక సామాన్య వ్యక్తి.. 130 కోట్ల భారతీయుల ఆదేశాలు పాటిస్తున్న సాధారణ వ్యక్తి. అయినా మీరు హౌడీ మోదీ అంటుంటే నాకొకటే అనిపిస్తోంది. నా జవాబు ఒకటే.. భారత్‌లో అంతా బావుంది(భారత్ మే సబ్ అచ్చాహై).
  • ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రావడం మనకెంతో గర్వకారణం. ఆయన రాక భారతీయ అమెరికన్ల సామర్థ్యానికి ప్రశంస.
  • మేం అధికారంలోకి వచ్చిన తరువాత గత 60 ఏళ్లలో సాధించలేనివెన్నో సాధించాం. న్యూ ఇండియా లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. డేటా భారత్‌లోనే అత్యంత చవక. డిజిటల్ ఇండియాగా భారత్‌ను తీసుకువెళ్తున్నాం.
  • కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు 21వ శతాబ్దంలో అభివృద్ధి పథంలో సాగేందుకు భారత్, అమెరికాలు కలసి సాగాల్సి ఉంది. 2, 3 రోజుల్లో ట్రంప్‌తో చర్చలు జరపనున్నాం.
  • జమ్మూకశ్మీర్ ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తున్న ఆర్టికల్ 370కి వీడ్కోలు పలికాం. అక్కడి ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేశాం.
  • ఉగ్రవాదంపై, దానికి మద్దతిచ్చే వారిపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి ట్రంప్ నేతృత్వం వహించాలి.
ట్రంప్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
  • కరడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తాం.
  • భారత్, అమెరికాకు సరిహద్దు భద్రతే అత్యంత కీలకం.
  • భారత్-అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసే దిశగా త్వరలో పలు రక్షణ ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయి.
  • అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర మరువలేనిది. తమ సంస్కృతిని, విలువలను వారు మరింత సుసంపన్నం చేస్తున్నారు.వారు అమెరికన్లుగా ఉండడం తమకు గర్వకారణం.
  • మోదీ అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలతో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడతారు.
  • భారత్, అమెరికాలో అవినీతి, ఆశ్రీత పక్షపాతాన్ని నిర్మూలించడంలో ఎన్నడూ లేనంతగా ప్రగతి సాధిస్తున్నారన్నారు.
  • టెక్సాస్‌లో తయారీ రంగంలో 70 వేల కొత్త ఉద్యోగాలు కల్పించాం.
మోదీకి హ్యూస్టన్ తాళాలు
మోదీ రాక సందర్భంగా హ్యూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ వినూత్న స్వాగతం పలికారు. ఆ నగర తాళాలను మోదీకి బహూకరించారు. చాలా కాలంగా కొనసాగుతున్న భారత-హ్యూస్టన్ సంబంధాల నేపథ్యంలో గౌరవార్థం దీన్ని అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హౌడీ మోదీ కార్యక్రమం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : ఎన్‌ఆర్‌జీ స్టేడియం, హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా

అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 24న జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... భారత్- అమెరికాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి త్వరలోనే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారంలో భారత్, పాక్ ప్రధానులిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ విషయమై మోదీ స్పందిస్తూ.. పాక్‌తో చర్చలు జరపాలంటే ముందుగా ఆ దేశం నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా మోదీ ఆయనకు హౌడీ మోదీ కార్యక్రమం ఫొటోను బహూకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా

పీవోకేలో భారీ భూకంపం
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సెప్టెంబర్ 24న భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా 26 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు. ఇస్లామాబాద్‌తోపాటు ఉత్తర ప్రాంతంలోని పలు నగరాల్లో భూమి కంపించింది. పంజాబ్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతం జీలం కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే, దీని తీవ్రత 7.1 వరకు ఉందని పాక్ సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ ఛౌదరి అన్నారు. భూకంప కేంద్రం పీవోకేలోని న్యూ మీర్పూర్ సమీపంలో ఉందని అమెరికా పేర్కొంది.
ఉత్తర భారతంలోనూ అలజడి
ఉత్తర భారతంలోని ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, హరియాణాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత 6.3గా ఉందని అధికారులు ప్రకటించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారీ భూకంపం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎక్కడ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)

హౌడీ మోదీ కార్యక్రమానికి ట్రంప్
Current Affairs భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 16న అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అమెరికాలోని టెక్సాస్‌లో గల హ్యూస్టన్‌లో సెప్టెంబర్ 22న హౌడీ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారతీయ సంతతి ప్రముఖులు సుమారు 50వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎక్కడ : హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా

ఎన్‌జేఈడీఏతో ఎన్‌ఆర్‌డీసీ ఒప్పందం
నూతన ఆవిష్కరణలకు సంబంధించి న్యూజెర్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌జేఈడీఏ), రోవన్ యూనివర్శిటీలతో నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఆర్‌డీసీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సెప్టెంబర్ 17న ఢిల్లీలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డంటన్ మర్ఫీ సమక్షంలో ఎన్‌ఆర్‌డీసీ సీఎండీ డాక్టర్ హెచ్.పురుషోత్తం, ఎన్‌జేఈడీఏ సీఈవో టిమ్ సలివాన్, రోవన్ వర్శిటీ వైస్ ప్రెసిడెంట్ బీనా సుకుమారన్ ఎంవోయూపై సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌జేఈడీఏ, రోవన్ యూనివర్శిటీలతో ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఆర్‌డీసీ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : నూతన ఆవిష్కరణలకు సంబంధించి

భారత్-పాక్ ప్రధానులతో భేటీ అవుతా: ట్రంప్
భారత్, పాకిస్తాన్‌ల ప్రధాన మంత్రులతో త్వరలోనే భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 17న ప్రకటించారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాను ఎంతో ప్రయత్నించాన్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో సెప్టెంబర్ 22న జరిగే ‘హౌడీ.. మోదీ’ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ పాల్గొననున్నారు. అయితే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ట్రంప్ ఎక్కడ.. ఎప్పుడు కలుస్తారనే విషయాన్ని అమెరికా వెల్లడించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-పాక్ ప్రధానులతో భేటీ అవుతా
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి నిరాకరణ
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ అనుమతి నిరాకరించింది. గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సెప్టెంబర్ 7న తెలిపారు. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి కోవింద్ సెప్టెంబర్ 9 నుంచి ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఉగ్రవాదంతో దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానానికి పాక్ అనుమతి నిరాకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : పాకిస్తాన్

సింగపూర్ సదస్సులో ఏపీ మంత్రి బుగ్గన
సింగపూర్‌లో సెప్టెంబర్ 9న నిర్వహించిన ‘ఇండియా- సింగపూర్ ది నెక్స్ట్ ఫేజ్’ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగించారు. నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని ఏపీ సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. 2034కు బలమైన ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికోసం వివిధ అంశాల ప్రాతిపదికగా సమగ్రాభివృద్ధి వ్యూహాన్ని అమలు చేస్తున్నామని బుగ్గన విశదీకరించారు. పరస్పర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతి బాటలో కలసి రావాలని విజ్ఞప్తి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా- సింగపూర్ ది నెక్స్ట్ ఫేజ్ సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : సింగపూర్

క్రాస్‌బోర్డర్ పెట్రోలియం పైప్‌లైన్ ప్రారంభం
దక్షిణాసియాలోనే తొలి క్రాస్ బోర్డర్ పెట్రోలియం పైప్‌లైన్ భారత్, నేపాల్ మధ్య సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. బిహార్‌లోని మోతిహారి-నేపాల్‌లోని అమ్లేఖ్ గంజ్‌ల మధ్య నిర్మించిన ఈ పెట్రో పైప్‌లైన్‌ను నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. సుమారు 69 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేసిన ఈ పైప్‌లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్లు వెచ్చించింది. ఈ పైప్‌లైన్ ద్వారా నేపాల్‌కు ఏటా సుమారు 20 లక్షల టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు అందనున్నాయి. 1973లోకుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటివరకూ వీటిని ట్రక్కుల ద్వారా నేపాల్‌కు తరలించేది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రాస్‌బోర్డర్ పెట్రోలియం పైప్‌లైన్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బిహార్‌లోని మోతిహారి-నేపాల్‌లోని అమ్లేఖ్ గంజ్‌ల మధ్య
ఎందుకు : నేపాల్‌కు పేట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేసేందుకు

జాధవ్‌ను కలిసేందుకు అనుమతించిన పాక్
Current Affairs ఇస్లామాబాద్: మరణశిక్ష పడి పాక్ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)ను దౌత్యాధికారులు కలుసుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. ‘కుల్‌భూషణ్ జాధవ్‌ను సెప్టెంబర్ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి మొహ మ్మద్ ఫైసల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై చర్చలు జరిగిన ఆరు నెలల తర్వాత పాక్ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు అనుమతించిన పాక్
ఎప్పుడు: సెప్టెంబర్ 2, 2019
ఎవరు: కుల్‌భూషణ్ జాధవ్
ఎక్కడ: పాకిస్థాన్

యూటీఏతో ప్రెసిడెన్సీ వర్సిటీ ఎంవోయూ
అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్టన్(యూటీఏ)తో బెంగళూరుకు చెందిన ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం, యూటీఏతో కలిసి ఐదేళ్ల కాలానికి బీటెక్, ఎంఎస్ ప్రోగ్రామ్‌లను అందించనుంది. దీనిప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి మూడేళ్లు ప్రెసిడెన్సీ వర్సిటీలో చదవాలి. నాలుగో ఏడాది అమెరికాలోని యూటీఏలో అండర్ గ్రాడ్యుయేట్ నాన్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు ఎన్‌రోల్ అవుతారు. ఇది విజయవంతంగా పూర్తిచేస్తే అమెరికాలో రెండేళ్లపాటు ఎంఎస్ కోర్స్ పూర్తి చేయవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్టన్(యూటీఏ)తో ఎంవోయూ
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : బెంగళూరుకు చెందిన ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం

భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో మోదీ
రష్యాలోని వ్లాడివోస్టోక్ నగరంలో సెప్టెంబర్ 4న నిర్వహించిన ‘భారత్-రష్యా 20వ వార్షిక సదస్సు’లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు రక్షణ, అంతరిక్షం, నౌకాయానం, ఇంధనం, సహజవాయువు, పెట్రోలియం, వాణిజ్యం సహా 15 రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
జెవెజ్‌డా నౌకానిర్మాణ కేంద్రం సందర్శన
భారత్-రష్యాలు తమ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయని ఈ సదస్సు సందర్భంగా మోదీ తెలిపారు. పుతిన్ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య వాణిజ్యం 17 శాతం వృద్ధి చెంది 11 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. భారత్-యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు వ్లాడివోస్టోక్‌లోని జెవెజ్‌డా నౌకానిర్మాణ కేంద్రాన్ని సందర్శించారు.
చెన్నై-వ్లాడివోస్టోక్ నౌకామార్గం..
ప్రధాని మోదీ-పుతిన్‌ల నేతృత్వంలో ఇరుదేశాల ప్రతినిధి బృందాల భేటీ అనంతరం భారత్, రష్యాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ....‘తమిళనాడు రాజధాని చెన్నై నుంచి వ్లాడివోస్టోక్ వరకూ పూర్తిస్థాయి నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్-రష్యాల మధ్య రూ.79,247 కోట్లు(11 బిలియన్ డాలర్లు)గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి రూ.2.16 లక్షల కోట్లకు చేర్చాలని మోదీ-పుతిన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.
గగన్‌యాన్‌కు రష్యా సహకారం..
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో పాల్గొనే వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇవ్వనుందని మోదీ ప్రకటించారు. ఇందుకోసం ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ సన్నిహితంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
Published date : 25 Sep 2019 04:00PM

Photo Stories