Global South Summit: ‘గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు’.. సోషల్ ఇంపాక్ట్ ఫండ్’కు 25 మిలియన్ డాలర్లు!
ఆహార, ఇంధన భద్రత విషయంలో సంక్షోభాలను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేద్దామని గ్లోబల్ సౌత్ దేశాలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చేతులు కలుపుదామని సూచించారు.
ఆగస్టు 17వ తేదీ వర్చువల్‌గా నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ‘సోషల్ ఇంపాక్ట్ ఫండ్’కు 25 మిలియన్ డాలర్లు అందజేయబోతున్నట్లు ప్రకటించారు. పరస్పర వాణిజ్యం, సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడమే లక్ష్యంగా తమ శక్తిసామర్థ్యాలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు.
ఐకమత్యంతోనే మన బలం..
కోవిడ్–19 మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా బయటపడలేదని, ఇంతలో యుద్ధాలు ముంచుకొచ్చాయని మోదీ విచారం వ్యక్తంచేశారు. అబివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వాతావరణ మార్పులు, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఇంధన భద్రత వంటి సవాళ్లు ఇప్పటికే ఉండగా, టెక్నాలజీకి సంబంధించి కొత్తగా ఆర్థిక, సామాజిక సవాళ్లు మొదలయ్యాయని తెలిపారు.
PM Narendra Modi: ఘనంగా జరిగిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
గత శతాబ్దంలో ఏర్పాటైన పాలనా వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు ఈ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించలేకపోతున్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒక్కటి కావాలన్నారు. ఒకే గళం వినిపించాలని, ఒకరికొకరు తోడుగా నిలవాలని సూచించారు. ఒకరి అనుభవాలను మరొకరు పాఠాలు నేర్చుకోవాలన్నారు. మన ఐకమత్యంలోనే మన బలం దాగి ఉందన్నారు. ఈ ఐకమత్య బలంతో నూతన దశలో ప్రయాణం సాగించాలని పిలుపునిచ్చారు.
‘గ్లోబల్ డెవలప్‌మెంట్ కాంపాక్ట్’..
గ్లోబల్ సౌత్ దేశాల ప్రగతి కోసం మానవ కేంద్రీకృత ‘గ్లోబల్ డెవలప్‌మెంట్ కాంపాక్ట్’ ఏర్పాటు చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. భారతదేశ అభివృద్ధి యాత్ర, అభివృద్ధి భాగస్వామ్య అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని వ్యాపారం–వాణిజ్యంతోపాటు సాంకేతికతను పంచుకోవడానికి, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని వెల్లడించారు. భాగస్వామ్య దేశాల సమతుల, సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలపై మరింత అప్పుల భారం పడకుండా ఇలాంటి చర్యలు అవసరమని పేర్కొన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి 2.5 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయబోతున్నామని మోదీ ప్రకటించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంఘర్షణలు, ఉద్రిక్తతలకు పరిష్కార మార్గాలు సమగ్ర ప్రపంచాభివృద్ధి, సుస్థిర పాలనలోనే ఉన్నాయని తేల్చిచెప్పారు.
Railway Projects: ఎనిమిది కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్.. తెలుగు రాష్ట్రాల్లో..