India-Nordic Summit 2022: రెండో ఇండియా–నార్డిక్ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్‌హగెన్‌లో మే 4న రెండో ఇండియా–నార్డిక్ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు íఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్, ఐస్‌ల్యాండ్ ప్రధాని కాట్రిన్ జాకబ్స్‌డాటిర్, స్వీడన్ ప్రధాని మాగ్డలినా ఆండర్సన్, నార్వే ప్రధాని జోనాస్ గాహ్ర్‌స్టోర్, డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌లు పాల్గొన్నారు. సదస్సులో ఉక్రెయిన్–రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగతున్న సంక్షోభం, సామాన్య ప్రజల అగచాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సంస్కరణలు చేపట్టాలని కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోనూ సంస్కరణలు అవసరమన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని, అందుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నార్డిక్ దేశాల అధినేతలు ఉద్ఘాటించారు.
నార్డిక్ దేశాధినేతలతో వేర్వేరుగా సమావేశం
ప్రధాని మోదీ కోపెన్‌హగెన్ వేదికగా నార్వే, స్వీడన్, ఐస్‌లాండ్, ఫిన్‌ల్యాండ్ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్–ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్ దేశాల పెట్టుబడిదారులను ప్రధాని మోదీ ఈ సందర్భంగా కోరారు.
- ప్రధాని మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్ గాహ్ర్‌స్టోర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తొలిభేటీ ఇదే కావడం విశేషం. బ్లూ ఎకానమీ, క్లీన్ ఎనర్జీ, స్పేస్ హెల్త్‌కేర్ తదితర కీలక అంశాలపై జోనాస్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్ చేశారు. భారత్ ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్ పాలసీలో నార్వే ఒక మూలస్తంభం అని కొనియాడారు.
- స్వీడన్ ప్రధానమంత్రి మాగ్డలినా ఆండర్సన్, ఐస్‌ల్యాండ్ ప్రధానమంత్రి కాట్రిన్ జాకబ్స్‌డాటిర్, ఫిన్‌లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్‌తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు దేశాల ప్రధానులతో సంతృప్తికరమైన చర్చలు జరిగినట్లు మోదీ వెల్లడించారు.
పారిస్‌లో మాక్రాన్‌తో భేటీ
ప్రధాని మోదీ మే 04న ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు. European Commission: ప్రధాని మోదీతో ఈసీ చీఫ్ ఉర్సులా ఎక్కడ భేటీ అయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెండో ఇండియా–నార్డిక్ సదస్సు నిర్వహణ
ఎప్పుడు : మే 04
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, íఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్, ఐస్‌ల్యాండ్ ప్రధాని కాట్రిన్ జాకబ్స్‌డాటిర్, స్వీడన్ ప్రధాని మాగ్డలినా ఆండర్సన్, నార్వే ప్రధాని జోనాస్ గాహ్ర్‌స్టోర్, డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్
ఎక్కడ : కోపెన్‌హగెన్, డెన్మార్క్
ఎందుకు : ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్