నవంబర్ 2020 ద్వైపాక్షిక సంబంధాలు
లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెట్టెల్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. నవంబర్ 19న వర్చువల్ విధానంలో జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాల బలపేతం, ఆర్థికం, వాణిజ్యం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం ఆర్థిక రంగంలో పరస్పర సహకారాన్ని మెరుగుపర్చుకునేందుకు వీలుగా ఇరు దేశాలు మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను విస్తరించుకునే అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించాయి. రెండు దశాబ్దాల విరామం తర్వాత భారత్-లక్సెంబర్గ్ ద్వైపాక్షిక సదస్సు జరిగింది.
లక్సెంబర్గ్ రాజధాని: లక్సెంబర్గ్ సిటీ ; కరెన్సీ: యూరో
సందర్భం: ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాను అమల్లోకి తెచ్చిన తొలి దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్-లక్సెంబర్గ్ ద్వైపాక్షిక సదస్సు
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్సెంబర్గ్ ప్రధాని జేవియర్ బెట్టెల్
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలపేతం, ఆర్థికం, వాణిజ్యం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు
రూపే కార్డు రెండో దశను ప్రధాని మోదీ ఏ దేశంలో ప్రారంభించారు?
భూటాన్‌లో రూపే కార్డు రెండో దశ ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ నవంబర్ 20న వర్చువల్ విధానం ద్వారా రూపే కార్డు రెండో దశను ప్రారంభించారు. దీంతో భూటాన్‌లోని కార్డుదారులు భారత్‌లోని రూపే నెట్‌వర్క్‌ను వినియోగించుకోవచ్చు. 2019, ఆగస్టులో ప్రధాని మోదీ భూటాన్ పర్యటన సమయంలో రూపే కార్డు మొదటి దశను ప్రారంభించారు.
ఫేస్-1: రూపే కార్డు ఫేస్-1 కింద భారత సందర్శకులు భూటాన్‌లోని ఏటీఎం నెట్‌వర్క్‌ల్లో రూపే కార్డులను వినియోగించుకోవచ్చు.
ఫేస్-2: ఫేస్-2 కింద భూటాన్ పర్యాటకులు భారత్‌లోని రూపే నెట్‌వర్క్‌ను వినియోగించుకోవచ్చు.
భూటాన్ రాజధాని: థింపూ; కరెన్సీ: గుల్ ట్రమ్ (Ngultrum)
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూటాన్లో రూపే కార్డు రెండో దశ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : భూటాన్ పర్యాటకులు భారత్‌లోని రూపే నెట్‌వర్క్‌ను వినియోగించుకొనేందుకు
ఇప్పటివరకు భారత్‌లో నిషేధానికి గురైన చైనా యాప్‌ల సంఖ్య?
సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో 43 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. అలీబాబా గ్రూప్‌కి చెందిన ఈ కామర్స్ యాప్ అలీ ఎక్స్‌ప్రెస్ సహా కొన్ని డేటింగ్ యాప్‌లపై నిషేధం విధిస్తూ నవంబర్ 24న ఉత్వర్వులు జారీ చేసింది. ఈ యాప్‌లు దేశ సార్వభౌమత్వానికి, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా ఉన్నందున కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
మూడు దఫాలుగా...
ఇప్పటివరకు మూడు దఫాలుగా చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. 2020, జూన్ 29న తొలిసారిగా 59 యాప్‌లపై నిషేధం విధించింది. ఆ తర్వాత 2020, జూలై 27న మరో 47 యాప్‌లపై నిషేధం విధించింది. 2020, సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను నిషేధించింది. తాజాగా 43 యాప్‌లతో మొత్తం నిషేధం విధించిన యాప్‌ల సంఖ్య 267కి చేరుకుంది.
తాజాగా నిషేధానికి గురైన 43 యాప్‌లు...
- అలీ సప్లయర్స్ మొబైల్ యాప్
- అలీబాబా వర్క్ బెంచ్
- అలీ ఎక్స్‌ప్రెస్- స్మార్టర్ షాపింగ్ బెటర్ లివింగ్
- కాంక్విస్టా ఆన్‌లైన్
- అలీ పే క్యాషియర్
- లాలామూవ్ ఇండియా - డెలివరీ యాప్
- డ్రైవ్ విత్ లాలామూవ్ ఇండియా
- స్నాక్ వీడియో
- క్యామ్ కార్డ్ -బిజినెస్ కార్డు రీడర్
- క్యామ్‌కార్డ్ - బీసీఆర్ (వెస్టర్న్)
- సోల్ - ఫాలో ది సోల్ టు ఫైండ్ యూ
- చైనీస్ సోషల్
- డేట్ ఇన్ ఆసియా
- విడేట్
- ఫ్రీడేటింగ్ యాప్
- అడోర్ యాప్
- ట్రూలీ చైనీస్
- ట్రూలీ ఆసియాన్
- చైనా లవ్
- డేట్‌మైయాజ్
- ఆసియాన్ డేట్
- ఫ్లర్ట్‌విష్
- గైస్ ఓన్లీ డేటింగ్
- ట్యుబిట్
- వివర్క్ చైనా
- ఫస్ట్ లవ్ లివ్
- రేలా
- క్యాషియర్ వాలెట్
- మ్యాంగో టీవీ
- ఎంజీటీవీ-హునాన్ టీవీ
- వుయ్‌టీవీ-టీవీ వెర్షన్
- వుయ్‌టీవీ-సిడ్రామా
- వుయ్‌టీవీ లైట్
- లక్కీ లైవ్
- తావోబావో లైవ్
- డింగ్ టాక్
- ఐడెంటిటీ వీ
- ఐల్యాండ్ 2
- బాక్స్ స్టార్
- హీరోస్ ఎవాల్వ్
- హ్యాపీ ఫిష్
- జెల్లిపాప్ మ్యాచ్
- మంచికన్ మ్యాజ్
17వ భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు
17వ భారత్-ఆసియాన్ వర్చువల్ శిఖరాగ్ర సదస్సు నవంబర్ 12న ప్రారంభమైంది. వివిధ కీలక రంగాల్లో సహకారం కోసం ప్రవేశపెట్టిన నూతన ఆసియాన్-ఇండియా కార్యాచరణ ప్రణాళిక 2021-2025ను శిఖరాగ్ర సదస్సులో నేతలు స్వాగతించారు. కోవిడ్ ఆసియాన్ రెస్పాన్స్ ఫండ్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసియాన్ దేశాలతో భారత్ అనుసంధానం కోసం లైన్ ఆఫ్ క్రెడిట్ కింద బిలియన్ డాలర్లు అందజేయనున్నట్లు తెలిపారు.
మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు
ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఇండియా యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా ఆసియాన్‌తో తమ బంధం నానాటికీ బలపడుతోందని మోదీ చెపోపారు. చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్-ఆసియాన్ మధ్య వ్యూహాత్మక బంధం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.
ఆసియాన్ సభ్యదేశాలు...
ఆగ్నేయాసియాలోని పది దేశాల కూటమే ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్). 1967 ఆగస్టు 8న ఆసియాన్‌ను ఏర్పాటు చేశారు. ఇండోనేసియాలోని జకార్తాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఆసియాన్‌లో పది సభ్యదేశాలు ఉన్నాయి. అవి..
- ఇండోనేసియా
- థాయిలాండ్
- సింగపూర్
- ఫిలిప్పైన్స్
- మలేసియా
- వియత్నాం
- బ్రూనై
- కాంబోడియా
- మయన్మార్
- లావోస్
క్విక్ రివ్యూ:
ఏమిటి : 17వ భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఆన్‌లైన్‌లో
ఎందుకు : వివిధ కీలక రంగాల్లో భారత్-ఆసియాన్ దేశాల మధ్య సహకారం కోసం
భారత భద్రతా బలగాలు, పౌరులపై పాకిస్తాన్ కాల్పులు
పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో నవంబర్ 13న సరిహద్దుల వెంట పలు చోట్ల భారత భద్రత బలగాలు, పౌరులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు జవాన్లు, ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు. చనిపోయిన వారిలో బీఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాకేశ్ దోవల్, నలుగురు ఆర్మీ జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు. భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో 8 మంది పాక్ జవాన్లు చనిపోయారు. దాదాపు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాక్ ఆర్మీ స్థావరాలు, ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాద చొరబాటు స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి.
నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంట ఉడి, దావర్, కేరన్, నౌగమ్, గురెజ్ సహా పలు సెక్టార్లలలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్‌ఎఫ్ ఎస్‌ఐ రాకేశ్ దోవల్ ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కు చెందినవారు. 2004లో బీఎస్‌ఎఫ్‌లో చేరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత భద్రత బలగాలు, పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : పాకిస్తాన్
ఎక్కడ : జమ్మూకశ్మీర్
భారతీయ చేపల ప్యాకెట్లపై కరోనా: చైనా
భారత్ సహా వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చేపల ప్యాకెట్లపై కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు చైనా అధికారులు ప్రకటించారు. భారత్, రష్యా, అర్జెంటీనా తదితర దేశాల నుంచి వచ్చిన ఈ ప్యాకెట్లను పరీక్షించగా వాటిపై కరోనా ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందని నవంబర్ 19న గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. భారత్ నుంచి దిగుమతి అయిన ప్యాకెట్లపై వైరస్ ఆనవాళ్లు ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఇది రెండోసారి.
స్మార్ట్ సైనిక శిబిరాలు...
వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేయడానికి వీలుగా స్మార్ట్ శిబిరాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చలిని తట్టుకోవడానికి శిబిరాల్లో హీటర్లు, 24 గంటలు వేడి నీళ్ల సదుపాయం, విద్యుత్, బెడ్లు, కబోర్డులు ఇలా అన్ని సదుపాయాలను ఈ శిబిరాల్లో ఏర్పాటు చేశారు. చైనా కూడా భారత్‌లోని లద్దాక్ సరిహద్దుల్లో ఆధునిక సదుపాయాలతో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసింది.
భారత్, చైనా మధ్య ఎనిమిదో దఫా మిలటరీ చర్చలు ఎక్కడ జరిగాయి?
తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ఇరుదేశాల మిలటరీ అధికారుల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని చూశుల్ సెక్టార్‌లో నవంబర్ 6న ఎనిమిదో దఫా చర్చలు జరిగాయి. ఈ చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని అధికారులు తెలిపారు. ఎనిమిదో దఫా చర్చల్లో భారత బృందానికి 14 కార్ప్స్ కమాండర్ ఇటీవల బాధ్యతలు లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్, చైనా ప్రతినిధులకు దక్షిణ జిన్‌జియాంగ్ మిలటరీ డిస్టిక్ట్ ్రమేజర్ జనరల్ లియూ లిన్ సారథ్యం వహించారు. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకోవాల్సిందేనని చైనాకు భారత్ ఈ చర్చల సందర్భంగా తేల్చిచెప్పింది.
తొలి సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లు...
మహారాష్ట్రలోని రెడ్ బర్డ్ ఫ్లైట్ అకాడెమీ మొత్తం 15 మందికి డ్రోన్ పైలట్ శిక్షణనిచ్చింది. వీరంతా దేశంలోని తొలి సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లుగా నిలిచారు. ప్రజా సంరక్షణ, జర్నలిజం, ఫిల్మ్‌మేకింగ్, నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రెస్టారెంట్ బిజినెస్‌లలో డ్రోన్ పైలట్లకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని రెడ్ బర్డ్ ఫ్లైట్ అకాడెమీ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా, భారత్ ఎనిమిదో విడత మిలటరీ చర్చలు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్, జనరల్ లియూ లిన్
ఎక్కడ : చూశుల్ సెక్టార్, తూర్పు లద్దాఖ్, భారత్
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం
పుల్వామా దాడి మా విజయం: పాకిస్తాన్ ప్రభుత్వం
పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనీ, ఆ ఘటన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విజయమని ఆ దేశ మంత్రి ఒకరు ప్రకటించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో అక్టోబర్ 29న జరిగిన చర్చ సందర్భంగా పాకిస్తాన్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవద్‌చౌధరి ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘భారత్‌ను వారి దేశంలోనే గట్టి దెబ్బ తీశాం. పుల్వామా విజయం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో మన జాతి సాధించిన విజయం. ఈ విజయంలో మీరు, మేము, మనందరమూభాగస్వాములమే’’ అని అన్నారు.
అభినందన్ పేరు వింటే వణుకు...
పుల్వామా దాడి ఘటన అనంతరం పాక్‌చెరలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలకు సాక్షాత్తూ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా వెన్నులో వణుకు పుట్టింది. ‘‘బాజ్వా కాళ్లు వణికాయి, నుదుటంతాచెమటలు పట్టాయి, పాక్‌చెరలో ఉన్న అభినందన్ ను విడుదల చేయకపోతే భారత్ ఎక్కడ దాడికి దిగుతుందోనని ఆయన నిలువెల్లా వణికిపోయారు’’ అని పాకిస్తాన్ ఎంపీ, పాక్‌ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) నాయకుడు సర్దార్ అయాజ్ సాధిక్ అక్టోబర్ 29న పార్లమెంటులో వెల్లడించారు.
భారతదేశ సరిహద్దుల్లో చైనా కొత్త రైల్వేలైన్
సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. మరోవైపు భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి సిద్ధమైంది. సిచువాన్-టిబెట్ రైల్వే మార్గంలో భాగంగా నైరుతి సిచువాన్ ప్రావిన్స్ లోని యాన్ నుంచి టిబెన్‌లోని లింజీ వరకు ఈ కొత్త లైన్ నిర్మిస్తారు. ఇది సరిగ్గా అరుణాచల్ సరిహద్దు నుంచే వెళ్లనుంది.
చెంగ్డూలో మొదలు...
ఈ రైల్వే లైన్‌లో రెండు సొరంగాలు, ఒక బ్రిడ్జి, ఒక విద్యుత్ సరఫరా ప్రాజెక్టు తదితరాలు నిర్మిస్తారు. నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నాయి. సిచువాన్-టిబెట్ రైల్వే లైన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో మొదలవుతుంది. లాసాలో ముగుస్తుంది. ఈ రైల్వేలైన్‌తో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది.