Skip to main content

మార్చి 2021 ద్వైపాక్షిక సంబంధాలు

బంగబంధుకు గాంధీ శాంతి బహుమతి ప్రదానం
Current Affairs
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 26న బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా చేరుకున్నారు. భారత్‌లో కరోనా మహమ్మారి బయటపడ్డాక మోదీ మరో దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఢాకాలోని నేషనల్‌ పరేడ్‌ స్క్వేర్‌లో బంగ్లా 50వ స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు బంగబంధు శత జయంతి వేడుకల్లో అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్, ప్రధానమంత్రి షేక్‌ హసీనాతోపాటు మోదీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర పోరాటంలో భారత సైన్యం పోషించిన పాత్రను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. బంగ్లాదేశ్‌ అమర వీరుల రక్తం, భారత సైనికుల రక్తం కలిసి పారుతున్నాయని చెప్పారు.
బంగబంధుకు గాంధీ శాంతి బహుమతి
బంగబంధు, బంగ్లాదేశ్‌ జాతిపిత, దివంగత షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి బహుమతి–2020ని ఆయన కుమార్తెలు షేక్‌ రెహానా, షేక్‌ హసీనాకు ప్రధాని మోదీ అందజేశారు. అనంతరం ఢాకాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావర్‌లోని జాతీయ అమరవీరుల స్మారకం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

2021 వాతావరణ సదస్సులో పాల్గొనాలని మోదీకి ఆహ్వానం
అమెరికా ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 22వ తేదీన ఎర్త్‌ డే సందర్భంగా జరగనున్న వాతావరణ సదస్సు–2021 జరగనుంది. వర్చువల్‌ విధానంలో జరిగే సదస్సుకు హాజరుకావాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 40 మంది దేశాధినేతలు పాల్గొననున్నారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న ప్రపంచ దేశాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించడం ఈ సదస్సు కీలక ఉద్దేశం. 2021, నవంబర్‌లో గ్లాస్గోలో జరగనున్న యునైటెడ్‌ నేషన్స్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ కాన్ఫరెన్స్‌ (సీవోపీ26)కు ఈ సదస్సు కీలకంగా మారనుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌
ఎందుకు : ఏప్రిల్‌ 22వ తేదీన ఎర్త్‌ డే సందర్భంగా జరగనున్న వాతావరణ సదస్సు–2021లో పాల్గొనాలని

ముజిబుర్‌ మాసోలియంను సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేత
బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. మార్చి 27న బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, కనెక్టివిటీ, వాణిజ్యం, ఇంధనం, ఆరోగ్య రంగం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బేటీ సందర్భంగా హసీనాకు 12 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులకు సంబంధించిన ఒక బాక్సును మోదీ బహూకరించారు.
తీస్తా ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం: మోదీ
తీస్తా నదీ జలాల పంపకంపై బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. ఫెని నదీ జలాల పంపిణీ ముసాయిదాను రూపొందించాలని హసీనాను కోరారు. సిక్కిం(భారత్‌)లో ప్రారంభమయ్యే తీస్తా నది పశ్చిమబెంగాల్‌ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో ప్రవేశించడానికి ముందు బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. తీస్తా నదీ జలాల పంపకంపై 2011లో కుదిరిన ఒప్పందం పశ్చిమబెంగాల్‌ సీఎం మమత అభ్యంతరాలతో అమలు కాకుండా నిలిచిపోయింది. భారత్, బంగ్లా దేశాలు 56 నదుల జలాలను పంచుకుంటున్నాయి.
ఏకైక విదేశీ ప్రభుత్వ నేత...
రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ.. తుంగిపరాలోని బంగబంధు, బంగ్లాదేశ్‌ జాతిపిత, దివంగత షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ మాసోలియాన్ని సందర్శించి నివాళులర్పించారు. దీంతో ముజిబుర్‌ మాసోలియంను సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేతగా మోదీ నిలిచారు. గోపాల్‌గంజ్‌ (బంగ్లాదేశ్‌)లోని ఒరకండిలో మతువా వర్గం హిందువుల ఆరాధ్యుడు హరిచంద్‌ ఠాకూర్‌ ఆలయాన్ని, 16వ శతాబ్దం నాటి జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని(బంగ్లాదేశ్‌) కూడా మోదీ సందర్శించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ముజిబుర్‌ మాసోలియంను సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేత?
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : తుంగిపరా, బంగ్లాదేశ్‌
ఎందుకు : రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా

ఏ దేశ సైన్యానికి లక్ష డోసుల కరోనా టీకాలను భారత్‌ అందజేసింది?
భారత సైన్యం పొరుగు దేశం నేపాల్‌ సైన్యానికి మార్చి 30న లక్ష డోసుల కరోనా టీకాలను అందజేసింది. నేపాల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకొనే ప్రయత్నంలో భాగంగానే భారత సైన్యం ఔదార్యం ప్రదర్శించింది. నేపాల్‌ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో భారత ఆర్మీ అధికారులు నేపాల్‌ సైనికాధికారులకు లక్ష డోసులను అందజేశారు. ఈ టీకా డోసులను భారత్‌లోనే తయారు చేశారు. భారత్‌ గతంలోనే నేపాల్‌కు 10 లక్షల డోసుల కరోనా టీకాలను ఇచ్చింది. చైనా తాజాగా 8 లక్షల డోసులను నేపాల్‌కు బహుమతిగా ఇచ్చింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : నేపాల్‌ సైన్యానికి లక్ష డోసుల కరోనా టీకాలను భారత్‌ అందజేసింది
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : భారత్‌
ఎక్కడ : త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, ఖాట్మాండు, నేపాల్‌
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకొనే ప్రయత్నంలో భాగంగా

ఇంధన రంగంలో పటిష్ట భాగస్వామ్యం: భారత్‌–అమెరికా
ఇంధన రంగంలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ట పరచుకోవాలని భారత్‌–అమెరికాలు నిర్ణయించాయి. ప్రత్యేకించి పర్యావరణ సానుకూల, పునరుత్పాదక ఇంధన రంగంపై తమ బంధాన్ని మరింత బలపరచుకోవాలని రెండు దేశాలూ భావిస్తున్నట్లు మార్చి 30న అధికారిక ప్రకటన వెలువడింది. భారత్‌ చమురు వ్యవహారాల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌... అమెరికా ఇంధన శాఖ మంత్రి జెన్నిఫర్‌ గ్రాన్హోమ్‌తో జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
ఇరాన్, టర్కీ విదేశీ మంత్రులతో జైశంకర్‌ భేటీ
హార్ట్‌ ఆఫ్‌ ఏషియా సదస్సులో పాల్గొనేందుకు తజికిస్థాన్‌లో పర్యటిస్తున్న భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌... మార్చి 29న ఆ దేశ రాజధాని దుషాంబేలో ఇరాన్, టర్కీ విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావెద్‌ జరీఫ్‌తో చాబహార్‌ పోర్టు ప్రాజెక్టు, ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు.

భారత్, అమెరికా రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
Current Affairs
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ అస్టిన్‌ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో మార్చి 20న జరిగిన ఈ సమావేశంలో భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాల నేతలు తీర్మానించారు. భారత సైన్యం, అమెరికాకు చెందిన ఇండో–పసిఫిక్‌ కమాండ్, సెంట్రల్‌ కమాండ్, ఆఫ్రికా కమాండ్‌ మధ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాజ్‌నాథ్‌ తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సాగిస్తున్న ఆగడాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయన్నారు.
30 ప్రిడేటర్‌ డ్రోన్లు కొనుగోలు
త్రివిధ దళాల అవసరాల కోసం అమెరికా నుంచి 3 బిలియన్‌ డాలర్ల విలువైన 30 మల్టీ–మిషన్‌ ఆర్మ్‌డ్‌ ప్రిడేటర్‌ డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత్‌ నిర్ణయించింది. మీడియం–ఆల్టిట్యూడ్‌ లాండ్‌ ఎండ్యురెన్స్‌ (ఎంఏఎల్‌ఈ) ప్రిడేటర్‌–బి డ్రోన్లుగా పిలిచే ఈ డ్రోన్లు ఏకంగా 35 గంటలపాటు గాలిలో సంచరించగలవు. భూమిపై, సముద్రంపై ఉన్న లక్ష్యాలను వేటాడే సామర్థ్యం వీటి సొంతం. దీనిపై రాజ్‌నాథ్, లాయిడ్‌ చర్చించినట్లు సమాచారం.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత్, అమెరికా రక్షణ మంత్రుల సమావేశం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : రాజ్‌నాథ్‌ సింగ్, లాయిడ్‌ అస్టిన్‌
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : రక్షణ సంబంధాలపై చర్చలు జరిపేందుకు

ఏ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు?
Current Affairs
ఒకప్పటి తూర్పు పాకిస్తాన్‌.. ఇప్పటి బంగ్లాదేశ్‌ మార్చి 26వ తేదీన 50వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. మార్చి 17న బంగ్లాదేశ్‌ జాతిపిత షేక్‌ ముజీబుర్‌ రెహ్మన్‌ జయంతి. ఈ నేపథ్యంలో మార్చి 17 నుంచి 27 వరకూ దేశమంతటా గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు హాజరుకావాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బంగ్లా ప్రభుత్వం ఆహ్వానించింది.
మోదీతో పాటు...
బంగ్లా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మోదీతో పాటు నేపాల్‌ అధ్యక్షుడు బిద్యాదేవి, శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్స, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్, భూటాన్‌ అధినేత త్సెరింగ్‌ వేడుకలకు హాజరు కానున్నారు. వారు వేర్వేరు తేదీల్లో స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొంటారని బంగ్లా ప్రభుత్వం పేర్కొంది. మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మార్చి 26న బంగ్లాదేశ్‌కు చేరుకుంటారు. ప్రధాన స్వాతంత్య్ర వేడుకల్లో పాలుపంచుకుంటారు.

ఏప్రిల్‌లో భారత్‌కి బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ రాక..ఎందుకంటే ?
బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ చివరి వారంలో భారత్‌ పర్యటనకు రానున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకి వచ్చాక (బ్రెగ్జిట్‌) యూకే అధినేత చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదేనని ప్రధాని కార్యాలయం మార్చి 15వ తేదీన వెల్లడించింది. ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో బ్రిటన్‌కి గల వాణిజ్య అవకాశాలపై బోరిస్‌ జాన్సన్‌ ఈ పర్యటనలో దృష్టి సారిస్తారని తెలిపింది. ఈ ఏడాది జనవరి 26న భారత్‌ గణతంత్ర వేడుకలకు బోరిస్‌ జాన్సన్‌ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండేది. అయితే బ్రిటన్‌లో కోవిడ్‌–19 సంక్షోభ పరిస్థితులు నేపథ్యంలో ఆయన తన పర్యటనని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. బ్రెగ్జిట్‌ తర్వాత అంతర్జాతీయ సమాజంలో గ్లోబల్‌ బ్రిటన్‌ ఎజెండాను అమలు చేయడం కోసం రక్షణ, విదేశాంగ విధానాలను సమీక్షించడం కోసం బోరిస్‌ జాన్సన్‌ మిత్ర దేశాలతో సంప్రదింపులు జరపనున్నారు. అందులో భాగంగానే ఆయన ఏప్రిల్‌ చివరి వారంలో భారత్‌కు రానున్నట్టుగా డౌనింగ్‌ స్ట్రీట్‌ తెలిపింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఏప్రిల్‌లో భారత్‌ పర్యటన
ఎప్పుడు : ఏప్రిల్‌ చివరి వారంలో
ఎవరు : బోరిస్‌ జాన్సన్‌
ఎక్కడ : భారత్‌
ఎందుకు : అంతర్జాతీయ సమాజంలో గ్లోబల్‌ బ్రిటన్‌ ఎజెండాను అమలు చేయడం కోసం రక్షణ, విదేశాంగ విధానాలను సమీక్షించడం కోసం..

మైత్రి సేతు బ్రిడ్జిను ఏ రెండు దేశాల మధ్య నిర్మించారు
Current Affairs
భారత్‌–బంగ్లాదేశ్‌లను కలుపుతూ ఫెని నదిపై నిర్మించిన ‘‘మైత్రి సేతు’’ బ్రిడ్జి ప్రారంభమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 9న ఈ బ్రిడ్జిని వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించి, ప్రసంగించారు. ఉభయ దేశాల మధ్య అనుసంధానత పెరగడం వల్ల స్నేహంతో పాటు వ్యాపారమూ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ నౌకాశ్రయాన్ని ఈశాన్య రాష్ట్రాలకు నదీ మార్గం ద్వారా కలిపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఫెని నదిపై...
త్రిపురలోని సబ్రూం, బంగ్లాదేశ్‌లోని రాంఘర్‌లను కలుపుతూ ఫెని నదిపై మైత్రి సేతు బ్రిడ్జిని నిర్మించారు. రూ.133 కోట్ల నిధులతో భారత్‌కు చెందిన జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈ వంతెనను నిర్మించింది. వంతెన పొడవు: 1.9 కి.మీ.
గీతా శ్లోకాలపై వ్యాఖ్యానాలు...
గీతా శ్లోకాలపై 21 మంది ప్రముఖ పండితులు రాసిన వ్యాఖ్యానాల సంకలనాన్ని ప్రధాని మోదీ మార్చి 8న ఆవిష్కరించారు. ఈ సంకలనాన్ని జమ్మూకశ్మీర్‌కు చెందిన కురువృద్ధ కాంగ్రెస్‌ నేత కరణ్‌ సింగ్‌ చైర్మన్‌గా ఉన్న ధర్మార్థ ట్రస్టీ ప్రచురించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మైత్రి సేతు బ్రిడ్జి ప్రారంభం
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : త్రిపురలోని సబ్రూం, బంగ్లాదేశ్‌లోని రాంఘర్‌ల మధ్య అనుసంధానం పెంచేందుకు

ఏ కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్‌కు భారత్‌ కరోనా టీకాలు పంపనుంది?
భారత్‌లో తయారైన కరోనా టీకాలు త్వరలో పాకిస్తాన్‌కు పంపిణీ కానున్నాయి. పుణేలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న ‘‘కోవిషీల్డ్‌’’ టీకా 4.5 కోట్ల డోసుల్ని పాకిస్తాన్‌కు భారత్‌ పంపనుంది. నిరుపేద దేశాలకు కూడా వ్యాక్సిన్‌ అందించాలన్న ఉద్దేశంతో ఐక్య రాజ్యసమితి చేపట్టిన యునైటెడ్‌ గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యూ నిజేషన్‌ (గవి) కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్‌కు మేడిన్‌ ఇండియా టీకాను భారత్‌ సరఫరా చేయనుంది.
65 దేశాలకు...
ఇప్పటికే భారత్‌ 65 దేశాలకు కరోనా టీకా పంపిణీ చేస్తోంది. గ్లోబల్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా కొన్ని దేశాలకు ఉచితంగా ఇస్తుంటే, మరికొన్ని దేశాల నుంచి డబ్బులు తీసుకొని పంపిస్తోంది. సార్క్‌ దేశాల్లో ఇప్పటివరకు పాకిస్తాన్‌ ఒక్కటే భారత్‌ నుంచి కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ను తీసుకోలేదు.
సార్క్‌ – దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య
సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీజినల్‌ కోఆపరేషన్‌(సార్క్‌– SAARC) 1985 డిసెంబర్‌ 8న ఏర్పాటైంది. మొత్తం 8 దేశాలు (భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్థాన్‌) దీనిలో సభ్యులుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం నేపాల్‌ రాజధాని ఖాట్మాండ్‌లో ఉంది. దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారానికి, సామాజిక ప్రగతి, సాంస్కృతికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ కూటమి పనిచేస్తోంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌కు కరోనా టీకాలు పంపనున్న దేశం
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : భారత్‌
ఎందుకు : యునైటెడ్‌ గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యూ నిజేషన్‌ (గవి) కార్యక్రమంలో భాగంగా

భారత్, పాక్‌ మధ్య కాల్పుల విరమణ
Current Affairs
భారత్, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత స్థాపన కోసం ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించాయి. ఇరు దేశాల మ«ధ్యనున్న కాల్పుల విరమణ ఒప్పందాలన్నీ కచ్చితంగా అమలు చేయాలని అంగీకారానికి వచ్చాయి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో) స్థాయిలో చర్చలు ఫలప్రదమయ్యాయి. డీజీఎంవో లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ పరమజిత్‌ సింగ్‌ పంఘ, పాక్‌ జనరల్‌ నుమాన్‌ జకారియాల మధ్య రెండు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిగాక ఇరుదేశాలు ఫిబ్రవరి 25న ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. భారత్, పాక్‌ మధ్య 2020 ఏడాదిలో రికార్డు స్థాయిలో 4,645 కాల్పులు విరమణ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత్, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : భారత్, పాకిస్తాన్‌
ఎందుకు : భారత్, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత స్థాపన కోసం

ఏ రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య హాట్‌లైన్‌ ఏర్పాటు కానుంది?
భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తాజాగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీతో ఫోన్‌లో 75 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య హాట్‌లైన్‌ ఏర్పాటు చేయడానికి ఇరువురు అంగీకరించారు. హాట్‌లైన్‌ ఏర్పాటు చేసుకొని, ఇకపై తరచూ మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలంటే సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనడం అత్యవసరమని జైశంకర్‌ పేర్కొన్నారు.
సిరియాపై అమెరికా వైమానిక దాడులు
సిరియా దేశంలో ఇరాన్‌ మద్దతు కలిగిన ఇరాక్‌ మిలిటెంట్‌ గ్రూపు స్థావరాలపై ఫిబ్రవరి 26న అమెరికా వైమానిక దాడులు చేసింది. ఫిబ్రవరి మొదట్లో ఇరాక్‌లో అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన రాకెట్‌ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులకు దిగినట్టుగా అమెరికా వెల్లడించింది. దాడుల్లో ఉగ్ర స్థావరాల ధ్వంసంతోపాటు 22 మంది మరణించారని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ చెబుతోంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఏ రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య హాట్‌లైన్‌ ఏర్పాటు కానుంది?
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : భారత్, చైనా
ఎందుకు : ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపేందుకు

భారత ఫార్మా కంపెనీలపై చైనా హ్యాకర్ల దాడి
కోవిడ్‌–19కి టీకా తయారు చేస్తున్న రెండు భారత ఫార్మా కంపెనీలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని సైబర్‌ నిఘా సంస్థ ‘సైఫర్మా’ వెల్లడించింది. ‘ఏపీటీ 10’, ‘స్టోన్‌ పాండా’ అనే పేర్లున్న ఆ హ్యాకింగ్‌ బృందానికి చైనా ప్రభుత్వం మద్దతుందని మార్చి 1న తెలిపింది. భారత్‌ బయోటెక్, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలకు చెందిన ఐటీ వ్యవస్థల్లో, పంపిణీ చైన్‌లో లొసుగులను హ్యాకర్లు గుర్తించారని వివరించింది. కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో చైనా బృందం ఈ హ్యాకింగ్‌కు పాల్పడుతోందని పేర్కొంది. సైఫర్మా సంస్థకు సింగపూర్, టోక్యోల్లో కార్యాలయాలు ఉన్నాయి.
పవర్‌ గ్రిడ్‌ వ్యవస్థపై కూడా...
భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో భారత్‌లో కీలకమైన పవర్‌ గ్రిడ్‌ వ్యవస్థను మాల్‌వేర్‌తో చైనా హ్యాకర్ల బృందం ‘రెడ్‌ఎకో’ లక్ష్యంగా చేసుకుందని అమెరికాకు చెందిన రికార్డెడ్‌ ఫ్యూచర్‌ సంస్థ తెలిపింది. 2020, అక్టోబర్‌ 12న ముంబైలో అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత ఫార్మా కంపెనీలపై చైనా హ్యాకర్ల దాడి
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : సైఫర్మా
ఎందుకు : కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో

పునరుత్పాదక ఇంధన ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం
పునరుత్పాదక ఇంధన సహకారం కోసం ప్రాన్స్‌తో 2021, జనవరిలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మార్చి 3న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉభయులకూ లబ్ధిదాయకమైన రీతిలో, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ప్రాతిపదికన పునరుత్పాదక ఇంధన రంగంలో సహకరించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.
ఫ్రాన్స్‌ రాజధాని: పారిస్‌; కరెన్సీ: యూరో, సిఎఫ్‌ఎ ఫ్రాంక్‌
ఫ్రాన్స్‌ ప్రస్తుత అధ్యక్షుడు: ఇమ్మానుయెల్‌ మాక్రాన్‌
ఫ్రాన్స్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: జీన్‌ కాస్టెక్స్‌
ఫ్రాన్స్‌ అధ్యక్ష భవనం పేరు: ఎలీసీ ప్యాలెస్‌
ఫిజీతో ఎంవోయూ...
వ్యవసాయ రంగంలో సహకారం, శిక్షణల నిమిత్తం ఫిజీ దేశంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రెండు దేశాలకు చెందిన ప్రభుత్వ రంగాల మధ్య సంయుక్త భాగస్వామ్యానికీ ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
ఫిజి రాజధాని: సువా; కరెన్సీ: ఫిజియన్‌ డాలర్‌
ఫిజి ప్రస్తుత అధ్యక్షుడు: జార్జి కొన్రోట్‌
ఫిజి ప్రస్తుత ప్రధానమంత్రి: ఫ్రాంక్‌ బైనీమారామ

Published date : 27 Mar 2021 05:43PM

Photo Stories