Skip to main content

మార్చి 2020 ద్వైపాక్షిక సంబంధాలు

మ్యూజియంగా అంబేడ్కర్ నివాసం
Current Affairs
భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ బ్రిటన్ ఉత్తర లండన్‌లో నివసించిన ఇంటిని మ్యూజియంగా కొనసాగించడానికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. నివాస ప్రాంతానికి సంబంధించిన ప్లానింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణతో ఆ ఇంటిని మూసివేయాలని తొలుత బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ భారత్ చేసిన అపీలును తాజాగా ఆమోదించింది. అంబేడ్కర్ నివాసాన్ని సందర్శకుల కోసం తెరిచి ఉంచాలని నిర్ణయించింది. 1921-22లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విద్యను అభ్యసించిన సమయంలో అంబేడ్కర్ ఇక్కడ నివాసం ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మ్యూజియంగా లండన్‌లోని అంబేడ్కర్ నివాసం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : బ్రిటన్ ప్రభుత్వం

యూకే, ఈయూ, టర్కీ ప్రయాణికులపై నిషేధం
యూరోపియన్ యూనియన్, బ్రిటన్, టర్కీ నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌లో ప్రవేశించడంపై 2020, మార్చి 31 వరకూ నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 18 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. కోవిడ్-19 (కరోనా వైరస్) విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 16న ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు మార్చి 16 నుంచి దేశ అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా అన్ని రకాల ప్రయాణికుల రాకపోకలను నిషేధించారు.
కొత్త టోల్‌ఫ్రీ నంబర్
కోవిడ్‌కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కేంద్రప్రభుత్వం మార్చి 16 నుంచి కొత్త టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకూ ఉన్న 011- 23978046తోపాటు 1075 నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా కోవిడ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ncov2019 @gmail. comకు ఈ మెయిల్ చేయడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూకే, ఈయూ, టర్కీ ప్రయాణికులపై నిషేధం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : భారత్
ఎందుకు : కోవిడ్-19 (కరోనా వైరస్) విజృంభిస్తున్న నేపథ్యంలో

ప్రధాని మోదీ బెల్జియం పర్యటన వాయిదా
Current Affairs భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మార్చి 5న వెల్లడించింది. కోవిడ్19(కరోనా వైరస్) విజృంభణ కారణంగా ప్రధాని పర్యటన వాయిదా పడినట్లు తెలిపింది. భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సు ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి 13న బెల్జియం రాజధాని నగరం బ్రసెల్స్‌లో జరగవలసి ఉంది. ఈ సదస్సులో మోదీ పాల్గొనాల్సి ఉండగా... ఆయన పర్యటన వాయిదా పడింది. దీంతో ఇరు వర్గాలకూ కుదిరే మరో సమయంలో భేటీ జరుగనుంది. మార్చి 4న బ్రసెల్స్‌లో కొత్తగా 10 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బెల్జియంలో ఈ కేసుల సంఖ్య 23కు పెరిగింది.
భారత్‌లో 30 కోవిడ్ కేసులు
ఇటలీకి చెందిన పర్యాటకులతో సహా మార్చి 4వ నాటికి భారత్‌లో 29 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. 28,529 మందిని వైద్యపరిశీలనలో ఉంచినట్టు వెల్లడించారు. ఇటీవలే ఇరాన్‌లో పర్యటించి వచ్చిన ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయి్యంది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని మోదీ బెల్జియం పర్యటన వాయిదా
ఎప్పుడు : మార్చి 5
ఎందుకు : కోవిడ్19(కరోనా వైరస్) విజృంభణ కారణంగా

బీఎఫ్‌ఐ నేపాల్‌తో జేఎన్‌ఐబీఎఫ్ ఒప్పందం
నేపాల్‌కి చెందిన బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేపాల్(బీఎఫ్‌ఐఎన్)తో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (జేఎన్‌ఐబీఎఫ్) సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు సంస్థలు బ్యాంకింగ్ శిక్షణలో పరస్పర సహకారం అందించుకుంటాయి. అలాగే భారత్, నేపాల్‌లలో బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి సంయుక్తంగా సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఒప్పంద పత్రాలపై జేఎన్‌ఐబీఎఫ్ డెరైక్టర్ శ్రీకుమార్ నీల్ లోహిత్, బీఎఫ్‌ఐఎన్ ఎండీ బినోద్ ఆత్రేయ సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేపాల్(బీఎఫ్‌ఐఎన్)తో ఒప్పందం
ఎప్పుడు :
ఎవరు : హైదరాబాద్‌లోని జేఎన్‌ఐబీఎఫ్
ఎందుకు : బ్యాంకింగ్ శిక్షణలో పరస్పర సహకారం కోసం

భారత్‌లో యూఎస్‌ఐడీఎఫ్‌సీ కార్యాలయం
Current Affairs
భారత్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి యునెటైడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (యూఎస్‌ఐడీఎఫ్‌సీ) కార్యాలయాన్ని భారత్‌లో ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంకా ట్రంప్ వెల్లడించారు. ఆర్థికపరమైన సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఈ కార్యాలయం పనిచేస్తుందన్నారు.
భారత్‌తో బలపడిన బంధం
భారత్ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో యూఎస్‌ఐడీఎఫ్‌సీ కార్యాలయం ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : అమెరికా ప్రభుత్వం
ఎక్కడ : భారత్
ఎందుకు : భారత్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి

నమస్తే ట్రంప్ టీవీ వీక్షకులు 4.60 కోట్లు
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఫిబ్రవరి 24వ తేదీన అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్‌సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు పేర్కొంది. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా 1.25 లక్షల మంది హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి ట్రంప్, మోదీ ప్రసంగించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నమస్తే ట్రంప్ కార్యక్రమం టీవీ వీక్షకులు 4.60 కోట్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్‌సీ)
ఎక్కడ : మొతెరా క్రికెట్ స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్

యూకే విద్యార్థి వీసాల్లో భారత్‌కు తొలిస్థానం
బ్రిటన్ విద్యార్థి వీసా పొందిన విదేశీయుల్లో భారతీయులు తొలిస్థానంలో నిలిచారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్‌ఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. ఓఎన్‌ఎస్ తాజాగా వెలువరించిన గణాంకాల ప్రకారం 2019లో 37,500 మంది భారతీయ విద్యార్థులకు టయర్-4(విద్యార్థి) వీసాలు దక్కాయి. 8 ఏళ్లతో పోలిస్తే ఇదే అత్యధికం. వృత్తి నిపుణులకిచ్చే టయర్-2 వీసాల్లో సగం భారతీయులకే దక్కాయి. ఈ విభాగంలో భారతీయులు 57వేల వీసాలతో టాప్‌లో నిలిచారు. 2019 ఏడాది ఏడాది 5.15 లక్షల మంది భారతీయులకు పర్యాటక వీసా ఇచ్చినట్లు తెలిపింది. అంతకు ముందుతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువని వివరించింది. మొత్తమ్మీద భారతీయుల వీసా దరఖాస్తులను 95 శాతం వరకు ఆమోదించినట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూకే విద్యార్థి వీసాల్లో భారత్‌కు తొలిస్థానం
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్‌ఎస్)

6 అపాచీ, 24 రోమియో హెలికాప్టర్ల కొనుగోలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఫిబ్రవరి 25న ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో కీలక ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మోదీ, ట్రంప్ కూడా పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ‘అంతర్గత భద్రత, రక్షణ, ఇంధనం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు’ అనే ఐదు ప్రధాన రంగాల్లో సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి. చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య ముఖ్యమైన రక్షణ ఒప్పందంతో పాటు ఇంధన, ఆరోగ్య రంగాల్లో మూడు ఒప్పందాలు కుదిరాయి.
ఒప్పందం: 1
మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఇరు దేశాల ఆరోగ్య శాఖల మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. భారత్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్‌‌స స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మధ్య వైద్య ఉత్పత్తుల రక్షణకి సంబంధించి ఎంఓయూపై సంతకాలు జరిగాయి.
ఒప్పందం: 2
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎగ్జాన్ మొబిల్ ఇండియా ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్, చార్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌ల మధ్య సహకారానికి సంబంధించి ఒక లెటర్ ఆఫ్ కోఆపరేషన్‌పై సంతకాలు జరిగాయి.
ఒప్పందం: 3
మోదీతో చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. 300 కోట్ల డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, 260 కోట్ల డాలర్ల విలువైన 24 ఎంహెచ్ -60 రోమియో హెలికాప్టర్లను భారతీయ నౌకాదళం కోసం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. అలాగే, 80 కోట్ల డాలర్ల విలువైన ఆరు ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లను ఆర్మీ అవసరాల కోసం ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది. సముద్రం అడుగున దాగున్న జలాంతర్గాములను సైతం గుర్తించి దాడి చేయగలగడం రోమియో సత్తా కాగా.. లేజర్ల పర్యవేక్షణలో గుళ్ల వర్షం కురిపించగలగడం అపాచీ ప్రత్యేకత.
అపాచీ ఏహెచ్-64ఈ విశేషాలు
  • తయారీ సంస్థ: బోయింగ్ సంస్థ
  • ప్రయాణించగలిగే సిబ్బంది సంఖ్య: 2
  • పొడవు: 17.7 మీటర్లు; ఎత్తు: 5 మీటర్లు; రోటర్ వ్యాసం: 14.6
  • ఒట్టి హెలికాప్టర్ బరువు: 5170 కిలోలు
  • ఆయుధాలన్నీ ఎక్కించిన తరువాత బరువు: 10,439 కిలోలు
  • నిలువుగా పైకి ఎగబాకే వేగం నిమిషానికి: 2,000 అడుగులు
  • ఇంజిన్ల సంఖ్య: 2 (జనరల్ ఎలక్ట్రిక్ టీ-700 టర్బోషాఫ్ట్)
  • గరిష్ట వేగం: 284 కి.మీ
  • ఆయుధ సంపత్తి: 30 మిల్లీమీటర్ల ఫిరంగి గుళ్లు (1200 రౌండ్లు)
  • క్షిపణుల్లో రకాలు : 16 ట్యాంకు విధ్వంసక క్షిపణులు
  • ఏఐఎం 92 స్ట్రింగర్ మిస్ట్రాల్, క్షిపణులు నాలుగు చొప్పున బిగించుకోవచ్చు. లేదంటే రెండు ఏఐఎం-9 సైడ్ విండర్ క్షిపణులు ఉపయోగించుకోవచ్చు.
  • ఏజీఎం-122 సైడ్ ఆర్మ్ యాంటీ రేడియేషన్ క్షిపణులు రెండు చొప్పున ఏర్పాటు చేసుకోవచ్చు. లేజర్లు, పరారుణ కాంతుల సాయంతో లక్ష్యాలను గుర్తించవచ్చు. ఏ లక్ష్యాలపై గురిపెట్టాలో కూడా నిర్ణయించవచ్చు.
ఎంహెచ్60 రోమియో విశేషాలు
  • తయారీ సంస్థ: లాక్‌హీడ్ మార్టిన్
  • పరిధి: 834 కి.మీ
  • ఎత్తు: 5.1 మీటర్ల్లు; పొడవు: 19.76 మీటర్లు; వెడల్పు: 16.35 మీటర్లు
  • పైకి ఎగబాక గలిగే వేగం సెకనుకు: 8.38 మీటర్లు
  • బరువు దాదాపుగా: 10,350 కిలోలు
  • జలాంతర్గాములను గుర్తించగలదు వెతుకులాట, రక్షణ వంటి కార్యకలాపాలకూ వాడుకోవచ్చు.
  • అత్యాధునిక యుద్ధ వ్యవస్థలన్నీ దీని సొంతం. ఒక్కసారి నింగికి ఎగిరితే 3.30 గంటల సమయం యుద్ధంలో పాల్గొనగలదు.
  • ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లు అందుబాటులోకి వస్తే...భారత నావికాదళంలోని వెస్ట్‌ల్యాండ్ సీకింగ్ హెలికాప్టర్లు (బ్రిటన్ తయారీ)ల వాడకం ఆగిపోతుంది. దశాబ్దాలుగా సేవలందిస్తున్న సీ కింగ్ నిర్వహణ వ్యయం తడిసి మోపెడు అవుతూండటం దీనికి ఒక కారణం.

. కొరియా, జపాన్ వీసా నిలిపివేత: భారత్
కోవిడ్ 19(కరోనా వైరస్) బారిన పడిన దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. దక్షిణ కొరియా, జపాన్ దేశాల నుంచి వచ్చే వారి వీసాలను ఫిబ్రవరి 28 నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 13 మంది ఈ వ్యాధితో మరణిస్తే, కేసులు 2 వేలు దాటిపోయాయి. జపాన్ షిప్‌లో ఉన్న ప్రయాణికుల్లో కూడా చాలా మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు 57 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించింది. ఇటలీ, ఇరాన్‌లో కూడా కేసులు భారీగా పెరిగాయి.
జెనీవా ఆటో షో రద్దు
కోవిడ్-19 వైరస్(కరోనా) నేపథ్యంలో ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలను నిషేధించినట్లు స్విస్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న నిషేధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు 1,000 మందికి మించిన జనసమూహాలు ఉండ కూడదని వెల్లడించింది. దీంతో 2020, మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో రద్దు అయి్యంది. ఇప్పటికే 15 కేసులను స్విస్ ప్రభుత్వం గుర్తించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణ కొరియా, జపాన్ దేశీయుల వీసా నిలిపివేత
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : భారత్
ఎందుకు : కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో
Published date : 10 Apr 2020 07:56PM

Photo Stories