Skip to main content

ఏప్రిల్ 2021 ద్వైపాక్షిక సంబంధాలు

ఐసీఏఐ, సీఏఏఎన్‌జెడ్‌ ఒప్పందానికి కేబినెట్‌ ఒప్పందం
Current Affairs
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆస్ట్రేలియా అండ్‌ న్యూజిలాండ్‌ (సీఏఏఎన్‌జెడ్‌) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) కేంద్ర కేబినెట్‌ ఏప్రిల్‌ 20న ఆమోదం తెలిపింది. సభ్యుల అర్హతలకు సంబంధించి రెండు సంస్థలూ పరస్పరం గుర్తింపునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. భారతీయ చార్టర్డ్‌ అకౌంటెంట్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, భారత్‌కు రెమిటెన్సులు పెరిగేందుకు కూడా ఈ ఒప్పందం తోడ్పడగలదు. మరోవైపు ఐసీఏఐ, సర్టిఫైడ్‌ ప్రాక్టీసింగ్‌ అకౌంటెంట్‌ ఆస్ట్రేలియా మధ్య ఒప్పందానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఐసీఏఐ, సీఏఏఎన్‌జెడ్‌ మధ్య కుదిరిన ఎంవోయూకి ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు : కేంద్ర కేబినెట్‌
ఎందుకు : పరస్పర సహాకారం, భారత సీఏలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, భారత్‌కు రెమిటెన్సులు పెరిగేందుకు...

భారత్‌ను కరెన్సీ మానిప్యులేటర్‌ వాచ్‌లిస్ట్‌లో చేర్చిన దేశం?
బారత్‌ కరెన్సీకి సంబంధించి అమెరికా ఆర్థిక శాఖ కీలక చర్య తీసుకుంది. భారత్‌ను ‘‘కరెన్సీ మానిప్యులేటర్‌ వాచ్‌లిస్ట్‌’’లో చేర్చింది. రూపాయి మారకపు విలువను స్థిరంగా ఉంచడానికి పరిమితి 2 శాతానికి (స్థూల దేశీయోత్పత్తిలో) మించి 5 శాతం మేర డాలర్లను భారత్‌ కొనుగోలు చేసిందని ఏప్రిల్‌ 20న అమెరికా తెలిపింది. తద్వారా తమ దేశంతో వాణిజ్యలోటు నిర్వహణకు యత్నిస్తోందని సూచించింది. మహమ్మారి విజృంభన తర్వాత భారత్‌ను అమెరికా ‘కరెన్సీ మానిప్యులేటర్‌ వాచ్‌లిస్ట్‌’లో చేర్చడం ఇది రెండవసారి. కాగా, అమెరికా చర్యను భారత్‌ తోసిపుచ్చింది.
మరో 10 దేశాలూ...
కరెన్సీకి సంబంధించి భారత్‌తో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, మెక్సికోలను కరెన్సీ మానిప్యులేటర్‌ వాచ్‌లిస్ట్‌లో ఉంచుతున్నట్లు అమెరికా ఆర్థికశాఖ తెలిపింది. ఈ పది దేశాల్లో ఐర్లాండ్, మెక్సికో మినహా మిగిలిన దేశాలన్నీ 2020 డిసెంబర్‌లో ప్రకటించిన జాబితాలోనూ ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత్‌ను కరెన్సీ మానిప్యులేటర్‌ వాచ్‌లిస్ట్‌లో చేర్చిన దేశం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు : అమెరికా
ఎందుకు : రూపాయి మారకపు విలువను స్థిరంగా ఉంచడానికి పరిమితి 2 శాతానికి మించి 5 శాతం మేర డాలర్లను భారత్‌ కొనుగోలు చేసిందని...

అనుమతి లేకుండా భారత జలాల్లోకి వచ్చిన క్షిపణి విధ్వంసక నౌక?
Current Affairs
భారతదేశం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే... లక్షద్వీప్‌ సమీపంలోని భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ ఆపరేషన్‌(ఎఫ్‌ఓఎన్‌ఓపీ)’ను నిర్వహించామని ఏప్రిల్‌ 7న అమెరికా ప్రకటించింది. క్షిపణి విధ్వంసక నౌక ‘‘జాన్‌ పాల్‌ జోన్స్‌’’ భారతీయ జలాల్లో ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ ఆపరేషన్‌లో పాల్గొందని తెలిపింది. తద్వారా ఆ జలాల పరిధిపై భారతదేశం పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశామని పేర్కొంది. లక్షద్వీప్‌కు పశ్చిమంగా 130 నాటికల్‌ మైళ్ల దూరంలో, భారత ఈఈజెడ్‌ పరిధిలో ఎఫ్‌ఓఎన్‌ఓపీ నిర్వహించామని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్‌ ప్రకటించింది.
తీవ్రంగా స్పందించిన భారత్‌...
పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి మలక్కా సంధి వరకు అమెరికా నిర్వహించిన ఎఫ్‌ఓఎన్‌ఓపీపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. దేశాల ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలు(ఈఈజెడ్‌), కాంటినెంటల్‌ జోన్‌ల పరిధిలో ఇతర దేశాలు.. అనుమతి లేకుండా కార్యకలాపాలు చేపట్టడం, ముఖ్యంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు వినియోగించడం ‘యూఎన్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ది లా ఆఫ్‌ ది సీ’కి వ్యతిరేకమని పేర్కొంది. భారతీయ ఈఈజెడ్‌ పరిధిలో ఇతర దేశాలు మిలటరీ ఆపరేషన్లు నిర్వహించాలంటే తమ అనుమతి తప్పనిసరి అన్న భారత వాదనను అమెరికా కొట్టివేస్తోంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అనుమతి లేకుండా భారత జలాల్లోకి వచ్చిన క్షిపణి విధ్వంసక నౌక?
ఎప్పుడు : ఏప్రిల్‌ 7
ఎవరు : జాన్‌ పాల్‌ జోన్స్‌(అమెరికా)
ఎక్కడ : లక్షద్వీప్‌ సమీపం, భారత జలాలు
ఎందుకు : ఈఈజెడ్‌ జలాల పరిధిపై భారతదేశం పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేసేందుకు

ఒపెక్‌ కూటమి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
Current Affairs
చమురు విషయంలో సౌదీ అరేబియా పెత్తనానికి చెక్‌ చెప్పే దిశగా భారత్‌ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా క్రూడాయిల్‌ కొనుగోళ్ల కోసం ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని ఏప్రిల్‌ 2న ప్రభుత్వ రంగ రిఫైనరీలను ఆదేశించింది. మధ్యప్రాచ్య ప్రాంతం కాకుండా ఇతరత్రా దేశాల నుంచి కూడా చమురు కొనుగోళ్లు జరిపే అవకాశాలను అన్వేషించాలని సూచించింది. చమురు ఉత్పత్తి కోత విషయంలో సౌదీ అరేబియాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. చమురు అవసరాల కోసం భారత్‌ దిగుమతులపైనే ఆధారపడుతోంది. 85 శాతం పైగా చమురును దిగుమతి చేసుకుంటోంది.
సౌదీతో వివాదం ఇదే..
చమురు ధరలు 2021, ఫిబ్రవరిలో పెరగడం మొదలైనప్పడు... కరోనా నేపథ్యంలో 2020 ఏడాదిలో అమలు చేసిన నియంత్రణలను సడలించుకుని ఉత్పత్తి పెంచడం ద్వారా రేట్లు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలంటూ సౌదీను భారత్‌ కోరింది. దీన్ని సౌదీ పట్టించుకోలేదు. పైగా రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కున్న చమురును వాడుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చింది.

ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌(ఒపెక్‌-OPEC)...
ప్రపంచంలో పెట్రోలియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనెజులా 1960లో ఇరాక్‌లో ఒపెక్‌ కూటమిగా ఏర్పడ్డాయి. పెట్రోలియం ఉత్పత్తి విధి విధానాలు, సరఫరా, ధరల నియంత్రణలో ఏకీకరణ సాధించడం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. దీని ప్రధాన కార్యాలయంను మొదట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఏర్పాటు చేశారు. ఐదేళ్ల తర్వాత ఆస్ట్రియా రాజధాని వియన్నాకు మార్చారు. ప్రస్తుతం ఈ కూటమి సభ్యదేశాల సంఖ్య 13. ప్రపంచంలోని మొత్తం చమురు ఉత్పత్తిలో 1/3 వ వంతు ఈ దేశాల్లోనే జరుగుతుంది. ప్రస్తుతం ఒపెక్‌ ప్రధాన కార్యదర్శిగా మహ్మద్‌ సనుసి బర్కిండో వ్యవహరిస్తున్నారు.
ఒపెక్‌ కూటిమిలోని ప్రస్తుత సభ్యదేశాలు(13):
  1. అల్జీరియా
  2. అంగోలా
  3. ఈక్వటోరియల్‌ గినియా
  4. గబాన్‌
  5. ఇరాన్‌
  6. ఇరాక్‌
  7. కువైట్‌
  8. లిబియా
  9. నైజీరియా
  10. రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో
  11. సౌదీ అరేబియా
  12. యూఏఈ
  13. వెనిజులా

భారత్‌తో వాణిజ్యం ఇప్పట్లో లేనట్టే: ఇమ్రాన్‌ ఖాన్‌
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించలేమని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు. భారత్‌ నుంచి పత్తి, చక్కెర దిగుమతులు చేసుకోవాలంటూ ఎకనామిక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ(ఈసీసీ) చేసిన సిఫారసుల అమలును వాయిదావేశారు. కేబినెట్‌ సహచరులతో చర్చించాక ఇమ్రాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాన్‌ పత్రిక తెలిపింది. పాక్‌ ఆర్థిక, వాణిజ్య రంగాలను బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్న ఈసీసీ కొన్ని వేల ప్రతిపాదనలు పరిశీలించాక భారత్‌ నుంచి పత్తి, దుస్తులు, చక్కెర దిగుమతి చేసుకోవాలంటూ సిఫారసులు చేసింది.
పాకిస్తాన్‌...
రాజధాని: ఇస్లామాబాద్‌; కరెన్సీ: పాకిస్తానీ రూపి
పాకిస్తాన్‌ ప్రస్తుత అధ్యక్షుడు: ఆరీఫ్‌ అల్వీ
పాకిస్తాన్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: ఇమ్రాన్‌ ఖాన్‌
Published date : 16 Apr 2021 05:22PM

Photo Stories