PMAGY National Awards: రాష్ట్రంలోని ఏ రెండు జిల్లాలు పీఎంఏజీవై అవార్డుకు ఎంపికయ్యాయి?
ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దేశంలోని మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటికి ఎంపికైన మూడింటిలో రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానివే. ఇందులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ విషయాలను సెప్టెంబర్ 8న కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
2015లోనే అమల్లోకి తెచ్చినప్పటికీ..
ఎక్కువగా ఎస్సీ జనాభా ఉండే గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎంఏజీవైను అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 530 జిల్లాల పరిధిలో 19,172 గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ పథకం అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా 11 జిల్లాల పరిధిలోని 501 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచే ఈ పథకం అమల్లోకి తెచ్చినప్పటికీ.. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే ఏపీలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎంఏజీవై అవార్డుకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా
ఎందుకు: ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు...