Asha Parekh : ఆషా పరేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ఈమె నిజజీవితంలో..
సీనియర్ నటి ఆశా పరేఖ్‌ను 2020 ఏడాదికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఆమెను 1992లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేసిన ఆశా పరేఖ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె సుమారు 95 చిత్రాలలో నటించారు. 1998-2001 వరకు సీబీఎఫ్‌సీ ఛైర్ పర్సన్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన జరిగే 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అవార్డుతో సత్కరిస్తాం' అని అన్నారు. హేమా మాలిని, పూనమ్ ధిల్లాన్, టీఎస్ నాగభరణ, ఉదిత్ నారాయణ్, ఆశా భోంస్లేలతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ ఆమె పేరును నామినేట్ చేసింది.
కుటుంబ నేపథ్యం :
ఆశా 1942 అక్టోబరు 2న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. తన తల్లి ప్రోత్సాహంతో ఆశా బాల్యంలోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. అది కాస్తా నటనపై ఆసక్తి పెంచింది.
బాల నటీగా..
1952లో తెరకెక్కిన ‘మా’ అనే హిందీ చిత్రంలో ఆమె బాల నటిగా తెరంగేట్రం చేశారు. ‘ఆస్మాన్’, ‘ధోబి డాక్టర్’, ‘శ్రీ చైతన్య మహాప్రభు’, ‘బాప్ బేటీ’ తదితర చిత్రాల్లో బాల నటిగా సందడి చేసింది
కథానాయికగా మాత్రం..
‘దిల్ దేకే దేఖో’ (1959) అనే సినిమాతో కథానాయికగా మారారు. నటిగా తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు రావటంతో ఆశా వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఒక్కో ఏడాది గరిష్ఠంగా ఆమె ఆరు చిత్రాల్లో నటించేవారు. ‘ఘరానా’, ‘జిద్దీ’, ‘లవ్ ఇన్ టోక్యో’, ‘తీస్రీ మంజిల్’, ‘ఫిర్ ఓహి దిల్ లయ హూన్’, ‘భరోసా’ లాంటి పలు సూపర్‌హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా..
బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉండే, అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా ఆశా 1960 దశకంలో నిలిచారు. 1995లో వచ్చిన ‘ఆందోళన్’.. నటిగా ఆమెకు చివరి సినిమా. 1999లో వచ్చిన ‘సర్ ఆంఖో పర్’ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆశా ఆ తర్వాత నటనకు దూరమయ్యారు. ఈమె 1998 నుంచి 2001 మధ్య కాలంలో సెన్సార్ బోర్డ్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.