Skip to main content

ChatGPT: మనసుతో ఆలోచించండి... హృదయంతో ఆశ్వాదించండి... ప్యాకేజీ కోసం ఉద్యోగం చేయొద్దు

శాస్త్ర, సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత జనరేషన్‌లో విద్యార్థులు తమ స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని రాంగోపాల్‌రావు సూచించారు.
V Ramgopal Rao IIT Delhi Professor

ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్‌, మాజీ డైరెక్టర్ రాంగోపాల్‌ రావు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్ర సాంకేతికతలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ ఇప్పటివరకు మనకు గూగుల్‌ మాత్రమే తెలుసు. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా గూగుల్‌నే సంప్రదించేవాళ్లం. ప్రస్తుతం ఆ స్థానాన్ని ChatGPT భర్తీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

గత కొద్ది రోజులుగా నేను ChatGPT వాడుతున్నా. ఇది ఓ అద్భుతమని చెప్పొచ్చు. మనిషి చేయాల్సిన, చేసే పనులను కూడా చాట్‌జీపీటీ చేసేస్తోంది. ఈ తరుణంలో విద్యార్థులు మరింతగా రాటుదేలాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ చాలా అప్‌డేటెడ్‌. గూగుల్‌ మ్యాప్స్‌ ఉపయోగించే డ్రైవర్‌ను పెట్టుకుంటే ఎలాగ ఇబ్బంది పడాల్సి వస్తుందో... చాట్‌జీపీటీ వాడడం రాకపోయినా అలాగే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మన ఉత్పాదకత మరింత పెరగడానికి శాస్త్ర, సాంకేతికను ఉపయోగించుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లేకుంటే ఏ కంపెనీ కూడా మిమ్మల్ని (విద్యార్థులను) నియమించుకోవడానికి ఇష్టపడవు’’ అని ఆయన పేర్కొన్నారు.

Also Read: What is Google's Bard, ChatGPT Rival?

నిరంతర అభ్యాసంతో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి
నిరంతర అభ్యాసంతో పాటు నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాంగోపాల్‌రావు పేర్కొన్నారు. ‘‘వివిధ సంస్కృతులు, ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మాట్లాడితే చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. విద్యార్థులు ఎప్పుడూ నిస్సారంగా, నిత్తేజంగా ఉండకూడదు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. సౌంకర్యవంతంగా ఉంటేనే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.

అలాగే మనసుతో ఆలోచించడం నేర్చుకోవడంతో పాటు.. కోరికలను హృదయం ద్వారా, విజయాలను మనస్సు ద్వారా ఆశ్వాదించండి. కేవలం ప్యాకేజీ కోసం ఉద్యోగాలు చేయొద్దు. ఉద్యోగం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒక జట్టులో నువ్‌ ఒక సభ్యునిగా కాదు.. నీవు ఉంటేనే జట్టు.. అనేలా ఎదగాలి’’ అని ఆయన విద్యార్థులకు సూచించారు.

Published date : 08 Feb 2023 05:35PM

Photo Stories