Skip to main content

Amazon Jobs 2023 : పండగ గుడ్‌న్యూస్‌.. 2.5 లక్షల కొత్త‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌తి ఏటా పండ‌గ స‌మ‌యంలో ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ‌లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌ను నియమించుకుంటున్న విష‌యం తెల్సిందే.
amazon jobs recruitment 2023 news in telugu,
amazon jobs recruitment 2023

ఇప్పుడు తాజా ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌(Amazon) పండుగ సీజన్‌ కోసం యూఎస్‌లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. కస్టమర్లకు ఉత్పత్తులు కొనుగోలు చేసిన మరుసటి రోజే డెలివరీని అందించే లక్ష్యంతో అమెజాన్‌ హాలిడే షాపింగ్ సీజన్ కోసం 2,50,000 యూఎస్‌ వర్కర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించింది. ఇది గత రెండేళ్లలో నియమించుకున్న ఉద్యోగుల సంఖ్య కంటే 67 శాతం ఎక్కువ.

హాలిడే సీజన్‌ కోసం అమెజాన్‌ దూకుడుగా వెళ్తుంటే మరోవైపు యూఎస్‌లోని ఇతర రిటైలర్‌ల ప్రణాళికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 2023 సంవత్సరంలో అమ్మకాలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో తమ స్టోర్లు, వేర్‌హౌస్‌లలో నియామకాలను తగ్గించినట్లు రాయిటర్స్‌ కథనం పేర్కొంది. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ సంవత్సరం హాలిడే అమ్మకాలు గత సంవత్సరం కంటే సగానికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

amazon jobs recruitment 2023 telugu news

అమెరికన్‌ రిటైల్‌ సంస్థ ‘టార్గెట్‌’ అంచనా ప్రకారం, అమెజాన్ హాలిడే షాపింగ్ సీజన్ కోసం 1,00,000 మంది ఉద్యోగులను నియమించుకుంటోంది. టార్గెట్‌ సంస్థ కూడా అక్టోబర్‌లో కస్టమర్ల​కు డిస్కౌంట్‌లను అందించాలని ప్లాన్ చేస్తోంది. కాగా మరో యూఎస్‌ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇంకా హాలిడే హైరింగ్ ప్లాన్‌లను ప్రకటించలేదు. 2022లో ఈ కంపెనీ 40,000 మంది సీజనల్‌ వర్కర్లను నియమించుకున్నట్లు రాయిటర్స్ నివేదించింది.

సేమ్‌ డే డెలివరీల దిశగా అమెజాన్‌ ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్‌లో 50 కొత్త ఫిల్‌ఫుల్‌మెంట్ సెంటర్‌లు, డెలివరీ స్టేషన్‌లు ఏర్పాటు చేసింది. అక్టోబర్ 10-11 తేదీల్లో ‘ఫాల్ ప్రైమ్’ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్‌ నుంచి భారీ నియామక ప్రణాళిక రావడం గమనార్హం. అమెజాన్‌ నియమించుకునే కొత్త సీజనల్‌ వర్కర్లను ఆర్డర్‌ల ఎంపిక, క్రమబద్ధీకరణ, ప్యాకింగ్‌, షిపింగ్‌ పనులకు వినియోగిస్తారు. వీరికి ఎంపిక చేసిన ప్రదేశాలలో 1,000 నుంచి 3,000 డాలర్లు సైన్-ఆన్ బోనస్‌గా చెల్లించనున్నారు. సీజనల్‌ వర్కర్లకు వారి పని, లొకేషన్‌ను బట్టీ సగటున గంటకు 17 నుంచి 28 డాలర్లు చెల్లించనున్నట్లు అమెజాన్ పేర్కొంది.

Published date : 22 Sep 2023 08:57AM

Photo Stories