Powerlifting: పథకంతో పని చేసింది.. పతకాలు సాధించింది
కోయంబత్తూరులోని కునియముత్తూరు దగ్గరల్లో ఉన్న రామానుజం నగర్‌లో నలభై ఏళ్ల మాసిలామణికి దర్శిని, ధరణి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దకూతురుకు పెళ్లి అయి అత్తారింట్లో ఉంటోంది. మాసిలామణి భర్త రమేశ్ కూలిపనులు చేస్తుంటే మాసిలామణి రెండు ఇళ్లలో పనిచేస్తూ ఇద్దరూ కలిసి కుటుంబాన్ని లాక్కొస్తున్నారు. ఇళ్లల్లో పనిచేస్తున్నప్పటికీ ఆమె పనితీరు, నిజాయితీ కారణంగా ఆమె పని చేసే ఇంటి యజమానులు మాసిలామణిని సొంతమనిషిలా చూసుకునేవారు. ఆమె కుటుంబం ఉండడానికి అద్దె లేకుండా ఇంటిని కూడా ఇచ్చారు ఒక ఇంటి యజమాని. ఎంతో దయార్ద్ర హృదయం కలిగిన ఈ యజమాని ఓ రోజు... ‘‘మాసిలామణి నువ్వు కాస్త లావుగా ఉన్నావు. వ్యాయామం చేస్తే అధిక బరువు తగ్గడమేగాక, మరింత ఆరోగ్యంగా తయారవుతావు. నాకు తెలిసిన ఒక జిమ్ ఉంది, అక్కడికి వెళ్లు’’ అని చెప్పారు.
Also read: Jindal Group: సావిత్రీ జిందాల్ ఆసియాలోకెల్లా సంపన్నురాలు
ఆ యజమానికి తెలిసిన జిమ్ ఓనర్ సి. శివకుమార్... పవర్ లిఫ్టింగ్‌లో ఏసియన్ గోల్డ్‌మెడల్ సాధించిన వ్యక్తి. జిమ్ నిర్వహించడంతోపాటు, ట్రైనర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇంటి యజమాని సలహాతో మాసిలామణి శివకుమార్ జిమ్‌లో చేరింది. కొద్దిరోజుల్లోనే జిమ్‌లో చేసే వ్యాయామం నచ్చడంతో తన కూతురు ధరణిని కూడా జిమ్‌లో చేర్పించింది. తల్లీకూతుళ్లిద్దరూ ఎంతో ఉత్సాహంగా జిమ్‌లో ఉన్న బరువైన పరికరాలను సునాయాసంగా ఎత్తుతూ వ్యాయామం చేసేవారు. దీంతో మాసిలామణి బరువు తగ్గడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. వర్కవుట్స్‌లో మొదటి నుంచి వీరిద్దరి పట్టుదలను, దీక్షని గమనిస్తోన్న శివకుమార్ ‘‘మీకు పవర్‌లిఫ్టింగ్ ఎలా చేయాలో నేను ఉచితంగా నేర్పిస్తాను. మీరు చక్కగా నేర్చుకోండి చాలు’’ అని చెప్పారు. ఆ రోజు నుంచి ఇద్దరూ పవర్ లిఫ్టింగ్ సాధన చేయడం ప్రారంభించారు.
Also read: Inspiring Story: అక్షరమే ఆమె ఆరోగ్య బలం... 82 ఏళ్ల వయసులో తొలి పుస్తకం
కోచింగ్ ఫ్రీగా దొరికినప్పటికీ...
కోచింగ్ ఉచితంగా అందుతున్నప్పటికీ బలమైన ఆహారం తీసుకునే స్తోమత వారికి లేదు. అయినా ఏ మాత్రం నిరాశపడలేదు. కఠోరదీక్షతో సాధన చేసేవారు. ఇలా చక్కగా శిక్షణ తీసుకున్న తల్లీ కూతుళ్లిద్దరూ గతనెలలో తిరుచ్చిలో జరిగిన ‘తమిళనాడు పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్’ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. మాసిలామణి 63 కేజీల విభాగంలో 77.5 కేజీల బరువుని అవలీలగా ఎత్తి స్వర్ణపతకం గెలుచుకుంది. 17 ఏళ్ల ధరణి 47 కేజీల విభాగంలో 72.5 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకం దక్కించుకుంది.
పేదరికం నుంచి పవర్ లిఫ్టింగ్‌లో తమ సత్తా చాటిన ఈ తల్లీకూతుళ్లు సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు చెన్నైలో జరగనున్న తమిళనాడు పవర్‌లిఫ్టి్టంగ్ అసోసియేషన్ పోటీలలో పతకాలు గెలుచుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు.
Also read: Padma Shri Awardee: పోరాటమే chutni devi ‘మంత్రం’
నవ్విన వాళ్లే అభినందిస్తున్నారు
జిమ్‌లో చేరిన తొలినాళ్లలో అంతా మమ్మల్ని చూసి నవ్వారు. కొంతమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు పనులు చేసేవాళ్లకు జిమ్‌లు అవసరమా? అని అవహేళనగా మాట్లాడారు. పవర్ లిఫ్టింగ్ గురించి తెలిసినప్పుడు ఈ వయసులో ఇలాంటి పనులు అవసరమా? ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? అని ఈసడించారు. ఇప్పుడు మేమేంటో నిరూపించాం. దీంతో అప్పుడు నవ్విన వారంతా అభినందిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తాం.
Also read: Professor Santhamma Inspiring Story: 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో... ప్రొఫెసర్ శాంతమ్మ!
– మాసిలామణి