Skip to main content

Inspirational Story: అచ్చంగా స్టూడెంట్‌ నంబర్‌ 1 సినిమా స్టోరీనే.... జైలులో ఉండి చదువుకుంటూ ఏకంగా గోల్డ్‌ మెడ్‌ల్‌ సాధించాడు.. ఎలాగంటే

స్టూడెంట్‌ నంబర్‌ 1 సినిమా చూశారా. అందులో హీరో జూ.ఎన్టీఆర్‌ చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే తాను కలలు కన్న లా ను ఎలా అయినా పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉంటాడు.

హీరో సంకల్పానికి జైలు అధికారులు కూడా సహకారం అందివ్వడంతో లా పూర్తి చేసి, తన తండ్రి కేసునే వాదించి.. చివరికి గెలుస్తాడు. ఇది అంతా సినిమా స్టోరీ....

కానీ, ఇలాంటి ఘటనే అస్సాం రాజధాని గౌహతిలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల కిందట జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఓ విద్యార్థి నాయకుడు అరెస్టయ్యాడు. జైలులో ఉన్నా తన చదువును కొనసాగించాలని ఫిక్స్‌ అవుతాడు. అలా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఎంఏ పూర్తి చేశాడు. ఎంఏ పూర్తి చేయడమే కాదు.. యూనివర్సిటీ పరిధిలో అత్యధిక మార్కులు సాధించి ఏకంగా గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఎవరా విద్యార్థి..? ఏంటా పేలుళ్లు..? తెలుసుకుందామా..!
గవర్నరు చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌
పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఓ విద్యార్థి నాయకుడు ఎం.ఏలో అగ్రస్థానంలో నిలిచి గవర్నరు నుంచి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. అతడు జైల్లో ఉంటూనే పరీక్ష రాసి ఈ ఘనత సా«ధించాడు. 2019లో అస్సాంలోని గౌహతిలో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో సంజీవ్‌ తాలుక్‌దార్‌ అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. గౌహతి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న అతడు ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ సోషియాలజీ కోర్సు చేశాడు. 
71 శాతంతో ఫస్ట్‌ ప్లేస్‌లో...
ఇటీవల రాసిన పరీక్షల్లో 71 శాతం మార్కులతో తొలి స్థానంలో నిలిచి సత్తా చాటాడు. ఆ రాష్ట్ర గవర్నరు జగదీశ్‌ ముఖి చేతులమీదుగా గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. ఈ సందర్భంగా జైలు అధికారులు మాట్లాడుతూ సంజీవ్‌ మొదటి నుంచి కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉత్సాహం చూపించేవాడని, అలా పట్టుదలతో చదివి గోల్డ్‌ మెడల్‌ సాధించడం గొప్పవిషయమన్నారు.
ఎంఫిల్‌ చదివే సమయంలో....
సంజీవ్‌ సోదరి డాలీ మాట్లాడుతూ బాంబ్‌ బ్లాస్ట్‌ ఘటన జరిగిన సమయంలో తన సోదరుడు గౌహతి యూనివర్సిటీ ఎంఫిల్‌ చదివేవాడని చెప్పారు. జైలులో ఉండడంతో చదువు కంటిన్యూ చేయలేకపోయాడని.. కానీ, ఇలా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చదివి గోల్డ్‌ మెడల్‌ సాధించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే బాంబు పేలుళ్ల ఘటనలో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తికి బెయిల్‌ మంజూరైందని.. తన సోదరుడి బెయిల్‌ పిటిషన్‌ గౌహతి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపింది.

Published date : 04 Feb 2023 01:27PM

Photo Stories