టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్- 2020 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి శుక్రవారం ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ కోర్సులకు రాష్ట్రవ్యాప్తంగా 30,262 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 21,559 మంది పరీక్షలకు హాజరు కాగా, అందులో 16,572 మంది అర్హత సాధించారు. పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 76.87 శాతం మంది అర్హత పొందారు. మూడు/ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు సంబంధించి రాష్ట్రంలో 34 కాలేజీల్లో 5,249 సీట్లు ఉన్నాయి. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు సంబంధించి 21 కాలేజీల్లో 3,909 సీట్లు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి 13 కాలేజీల్లో 1,340 సీట్లు ఉన్నాయి. ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు సంబంధించి 14 కాలేజీల్లో 620 సీట్లు ఉన్నాయి.
Check TS LAWCET 2020 results here
డిగ్రీ ఫలితాల తర్వాతే కౌన్సెలింగ్..
లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు విడుదలైనా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలకు మరికొంత సమయం పట్టనుంది. డిగ్రీ ఫైనలియర్ సెమిస్టర్ పరీక్షలతోపాటు బ్యాక్‌లాగ్ పరీక్షలు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. వాటి ఫలితాలు ప్రకటించాకే లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంసెట్‌లో ఇంటర్ బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల్లో కనీస మార్కులతో పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులోనూ మినిమం మార్కుల అంశాన్ని పరిశీలించాలని ఉన్నత విద్యామండలి ప్రభుత్వాన్ని కోరనుంది.
సెట్‌లవారీగా పరీక్ష రాసిన, అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య ...
కోర్సు | దరఖాస్తు | హాజరు | అర్హత | శాతం |
లాసెట్ (3 సం.) | 21,896 | 15,398 | 12,103 | 78.60 |
లాసెట్(5 సం.) | 5,677 | 3,973 | 2,477 | 62.35 |
పీజీఎల్‌సెట్ (2 సం.) | 2,686 | 2,188 | 1,992 | 91.04 |