సెప్టెంబర్‌లో హెచ్‌సీయూ 2020-21 ప్రవేశ పరీక్షలు
Sakshi Education
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ పోస్టుగ్రాడ్యుయేట్, రీసెర్చ్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశపరీక్షల నిర్వహణకు సిద్ధమైంది.
సెప్టెంబర్ 24-26 తేదీల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు బుధవారం హెచ్‌సీయూ వైస్‌చాన్స్ లర్ ప్రొఫెసర్ పొదిలె అప్పారావు వెల్లడించారు. జేఈఈల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హెచ్‌సీయూ ఈ నూతన షెడ్యూల్‌తో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది 62,583 మంది ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణ అనంతరం ఇతర ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలో కొత్త విద్యార్థుల కోసం తరగతులను ప్రారంభించాలని హెచ్‌సీయూ భావిస్తోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాచ్‌లలో సుమారు 2వేల మంది పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు గురువారం నుంచి ఆన్‌లైన్‌లో తరగతులను ప్రారంభిస్తామన్నారు. మరోవైపు ఆన్‌లైన్ సెమిస్టర్ కోసం హెచ్‌సీయూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ విభాగాల వద్ద ఐసీటీ మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా ఉపయోగించగల ఒక అభ్యాస నిర్వహణ వ్యవస్థ (ఎల్‌ఎంఎస్)ను ఏర్పాటు చేశామన్నారు.
Published date : 20 Aug 2020 02:04PM