Skip to main content

సచివాలయ పరీక్షల కీ ఉపసంహరణ: ఏపీపీఎస్‌సీ

‘కీ’లో ఒక సెట్ జవాబులు వేరొక సెట్ జవాబులుగా పేర్కొన్నట్టు గుర్తించిన అధికారులు.
సాక్షి, అమరావతి: ప్రకటించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ప్రాథమిక కీని సాంకేతిక కారణాలతో అధికారులు తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నెల 26న విడుదల చేసిన ప్రాథమిక కీలో ఒక సెట్‌కు సంబంధించిన జవాబులను వేరొక సెట్ జవాబులుగా పేర్కొనట్టు అధికారుల దృష్టికి రావడంతో జరిగిన తప్పును సరిదిద్దుకునే చర్యలు చేపట్టారు. ఇలా పేర్కొనడం ద్వారా ‘కీ’లో 80 శాతం ప్రశ్నలకు సంబంధించి జవాబులు మారిపోయాయి. దీంతో ఈ సమాచారాన్ని రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు తెలియజేస్తూ ప్రాథమిక కీని అధికారికంగా విడుదల చేసిన గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో అధికారులు ఒక నోట్‌ను ఉంచారు.

‘సెప్టెంబర్ 26న ప్రచురించిన ప్రారంభ కీని సాంకేతిక కారణాల వల్ల ఏపీపీఎస్‌సీ కార్యదర్శి ఉపసంహరించుకున్నారు. త్వరలోనే కీ మళ్లీ అప్‌లోడ్ చేస్తారు. అభ్యంతరాలు లేవనెత్తడానికి తదుపరి మూడు రోజుల సమయం ఉంటుంది. అభ్యర్థులకు జరిగిన అసౌకర్యానికి ఏపీపీఎస్‌సీ కార్యదర్శి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బుధవారం కొత్తగా ప్రాథమిక కీని విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.
Published date : 30 Sep 2020 12:46PM

Photo Stories