ఆ సబ్జెక్టులు లేకున్నా ఇంజనీరింగ్‌లో చేరవచ్చన్న ఏఐసీటీఈ.. ఆ నిబంధనలను ఈసారి అమలు చేయబోం..: ఉన్నత విద్యా మండలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మార్గదర్శకాలను 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.
కరోనా నేపథ్యంలో విద్యార్థులను ఒత్తిడికి గురిచేసే ఎలాంటి మార్పులను, సంస్కరణలను అమలు చేయబోమని చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఏఐసీటీఈ దాదాపు 15 రకాల సబ్జెక్టులను పేర్కొందని, రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌లో ఐదారు రకాల బ్రాంచీలే (గ్రూపులు) ఉన్నాయని, వాటిల్లో ఏఐసీటీఈ పేర్కొన్న సబ్జెక్టులు పెద్దగా లేవని పేర్కొన్నారు. మంగళవారం తనను కలసిన మీడియాతో పాపిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కూడిన ఎంపీసీ బ్రాంచీ ఉందని, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల కోసం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కూడిన బైపీసీ బ్రాంచీ ఉందని వివరించారు. ఏఐసీటీఈ ఇటీవల జారీ చేసిన కాలేజీల అనుమతుల మార్గదర్శకాల్లో.. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎల్రక్టానిక్స్/ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్‌ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల్లో ఏవేనీ మూడు సబ్జెక్టులను చదివి ఉంటే చాలని పేర్కొందని వెల్లడించారు. వారు నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులేనని తెలిపిందని, మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులే ప్రధానంగా ఉన్నాయని, మిగతా సబ్జెక్టులేవీ లేవని వివరించారు. సబ్జెక్టు అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/ యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని ఏఐసీటీఈ పేర్కొన్న నేపథ్యంలో తాము ఈసారి వాటిని అమలు చేయబోమని వివరించారు. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉందని, ఈ పరిస్థితుల్లో మార్పులు చేస్తే విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని వివరించారు. పైగా ఇప్పటికే ఎంసెట్ పరీక్ష తేదీలను ప్రకటించామని పేర్కొన్నారు. ఈసారి ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 100 శాతం సిలబస్, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకొని ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏఐసీటీఈ మార్గదర్శకాలను అమలు చేయాల నుకుంటే నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.
Published date : 17 Mar 2021 03:16PM