Skip to main content

పరీక్షలకు దీక్షతో సన్నద్ధం కావాలి

జూన్‌లో విద్యాసంవత్సరం మొదలైంది. సిలబస్ చెప్పడంకూడా దాదాపు ఓ కొలిక్కి వచ్చే ఉంటుంది.
ఇక పరీక్షల సమయం ఆసన్నమవుతోంది. ఇప్పుడు సిలబస్ చదువుకునే దశలో విద్యార్థులు ఉండకూడదు. పునశ్చరణ దశలోనే ఉండితీరాలి. ఈ దశలో ఉన్నవారికే అత్యధిక మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంకా చదువుకునే దశలోనే ఉంటే వారిని బాగు చేయడం ఎవరికీ సాధ్యం కాని పనే. పరీక్షల సమయం దగ్గరకు వచ్చింది కనుక వీలైనంత త్వరగా నిద్ర లేవాలి. తెల్లవారిందాకా నిద్రపోతే ఇక విద్యార్థుల జీవితం కూడా తెల్లారిపోయినట్టే. సూర్యోదయానికి ముందే నిద్రలేచి రోజుకో సబ్జెక్టు చదువుకోవాలి. ఇప్పుడు ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచే అలవాటు ఉంటే దానిని మొదట అరగంట తగ్గించుకోండి. కొద్దిరోజులపాటు 5.30 గంటలకు లేవడం మొదలుపెట్టండి. మరికొన్నాళ్ల తర్వాత 5 గంటలకు నిద్రలేచి చదువుకోండి. ఆ తర్వాత దానిని 4 గంటలకు లేవండి. అయితే అంత తొందరగా నిద్ర లేవాలంటే ఆలస్యంగా పడుకుంటే సాధ్యం కాదు కదా. అందువల్ల రాత్రి 9 గంటలకల్లా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. వేకువజామున నిద్ర లేచినపుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణం చల్లగా హాయిగా ఉంటుంది. ఆ సమయంలో ఏది చదివినా అది మెదడులో నిక్షిప్తమైపోతుంది. చదవడం పూర్తయ్యాక పుస్తకం మూసేసి మననం చేసుకోవాలి. ఇక పరీక్షల్లో రాణించాలన్నా, మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా చదువుకోవడం ఒక్కటే మార్గం కాదు. దీనితోపాటు కో-కర్రిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా పాల్గొనాలి.
Published date : 29 Jan 2020 04:10PM

Photo Stories