నీట్ సహా వివిధ పరీక్షల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు
కరోనా లక్షణాలు లేని వారినే పరీక్ష హాల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేని విద్యార్థులు, సిబ్బందినే పరీక్షా హాలులోకి అనుమతించాలని ఆదేశించింది. విద్యార్థుల్లో ఎవరికై నా కరోనా లక్షణాలు ఉంటే సమీప ఆరోగ్య కేంద్రానికి పంపాలని, వారు వేరే విధానం ద్వారా పరీక్షలు రాసేలా చూడాలని సూచించింది. ఒకవేళ లక్షణాలు బయటపడిన తర్వాత కూడా వారు పరీక్ష రాస్తామంటే ప్రత్యేక ఐసోలేషన్ గదిలో పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రెగ్యులర్ కోర్సుల విద్యార్థుల్లో ఎవరికై నా లక్షణాలుంటే వారు కోలుకున్నాక మళ్లీ పరీక్ష రాయడానికి ఏర్పాట్లు చేయాలని కోరింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడే విద్యార్థులు వారి ఆరోగ్య పరిస్థితిపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, అలా ఇవ్వని వారిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని, ఆ జోన్లలోని సిబ్బంది, విద్యార్థులను కూడా పరీక్ష కేంద్రాలకు రానీయకూడదని ఆదేశించింది. అలాంటి విద్యార్థులకు ఇతరత్రా పద్ధతుల ద్వారా పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని లేదంటే మరోసారి పరీక్షలు నిర్వహించేలా సన్నాహాలు చేయాలని సూచించింది.
మరికొన్ని మార్గదర్శకాలు...
- మాస్క్‌లు ఉపయోగిస్తేనే సిబ్బంది, విద్యార్థులను పరీక్ష ప్రాంగణంలోకి అనుమతిస్తారు. మాస్క్‌ను పరీక్ష అయిపోయేంత
- వరకు ధరించాలి.
- వయసు పైబడిన ఉద్యోగులు, సిబ్బంది, గర్భిణులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్న వారిని పరీక్ష విధుల్లో నియమించకూడదు.
- విద్యార్థుల మధ్య భౌతికదూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేయాలి.
- పరీక్ష కేంద్రాల వద్ద జనం గుమిగూడకుండా దశలవారీగా పరీక్షలు నిర్వహించాలి.
- పరీక్ష కేంద్రాల్లో మాస్క్‌లు, శానిటైజర్ల వంటి వాటిని సమకూర్చుకోవాలి.
- కరోనా నిబంధనలను విద్యార్థులకు చెప్పాలి. జాగ్రత్తలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.
- పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు అందరినీ థర్మల్ స్క్రీన్ చేయాలి.
- తనిఖీ చేసే సిబ్బంది తప్పనిసరిగా త్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్, గ్లోవ్‌స ధరించాలి.
- గదిలో ఏసీలు 24-30 డిగ్రీల మధ్యే ఉండేలా చూడాలి. అందరూ ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలి.
- పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చే వాహనాలను ముందే శానిటైజ్ చేయాలి.
- పరీక్ష కేంద్రంలో బ్యాగులు, పుస్తకాలు, మొబైల్ ఫోన్లను అనుమతించకూడదు.
- అనారోగ్యానికి గురైతే తీసుకెళ్లేలా వీల్‌చైర్ సదుపాయం కల్పించాలి.
- విద్యార్థులకు ప్రశ్న, జవాబు పత్రాల పంపిణీకి ముందు ఇన్విజిలేటర్లు చేతులను శానిటైజ్ చేసుకోవాలి. వాటిని తిరిగి ఇన్విజిలేటర్లకు అప్పగించే ముందు విద్యార్థులు కూడా శానిటైజ్ చేసుకోవాలి.
- ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరిగితే పరికరాలను సంబంధిత ద్రావణంతో తుడవాలి.