Skip to main content

మున్సిపల్ పాఠశాలల్లోని 1450స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి: పురపాలక శాఖ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు బాగా పెరుగుతుండటంతో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడంపై పురపాలక శాఖ దృష్టి సారించింది.
ప్రధానంగా మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండేలా కార్యాచరణ రూపొందించింది. విద్యార్థుల చేరికల నిష్పత్తిని దృష్టిలో ఉంచుకుని సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్‌జీటీ) కంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకే అధిక ప్రాధాన్యమివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం 1,450 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,115 మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రాథమికోన్నత పాఠశాలలు 160, ఉన్నత పాఠశాలలు 311కాగా తక్కినవన్నీ ప్రాథమిక పాఠశాలలు. ఈ పాఠశాలలన్నింటిలో ప్రస్తుతం 3.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గతం కంటే భిన్నంగా 2019-20 విద్యా సంవత్సరంలో మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు 15 శాతం పెరిగాయి. అంతకుముందు మూడేళ్లపాటు మున్సిపల్ పాఠశాలల్లో పెరుగుదల సగటున 5 శాతం మాత్రమే కావడం గమనార్హం. కానీ ఈ ఏడాది 10 శాతం అదనంగా అంటే 15 శాతం పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఒక్క ఏడాదిలోనే 40 వేల మంది చేరిక
ఈ ఒక్క ఏడాదే దాదాపు 40 వేల మంది విద్యార్థులు మున్సిపల్ పాఠశాలల్లో చేరడం విశేషం. ప్రాథమిక విద్య ప్రైవేటు పాఠశాలల్లో పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఉన్నత పాఠశాలకు వచ్చేసరికి మున్సిపల్ పాఠశాలలవైపు మొగ్గుచూపుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సన్నాహాలు చేపట్టింది. మున్సిపల్ పాఠశాలల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో పురపాలక శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థుల చేరికలు ఎక్కువగా ఉంటాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో మరోసారి భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో నివేదిక సమర్పించాలని యోచిస్తున్నారు. ఇప్పటికి సమర్పించిన జాబితాకు మరో 150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కలిపి 1,600 పోస్టుల వరకు భర్తీ చేయాలని నివేదించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్‌జీటీ, భాషా పండిట్ పోస్టుల భర్తీపై కూడా ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైతే మరోసారి ప్రభుత్వానికి నివేదించాలని భావిస్తున్నారు.
Published date : 12 Feb 2020 04:03PM

Photo Stories