Skip to main content

జేఈఈ మెయిన్స్ కు కరోనా ఆంక్షలు.. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పాటించాల్సిందే!

సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ నిర్వహణకు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ పలు జాగ్రత్తలు చేపడుతోంది.

కోవిడ్-19 నేపథ్యంలో ప్రతి అభ్యర్థి నిర్ణీత నిబంధనలు పాటించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రతి అభ్యర్థికి జారీచేసిన అడ్మిట్ కార్డుతో పాటు, పరీక్షల సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలు అందించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఆన్‌లైన్(కంప్యూటరాధారితంగా)లో జరిగే ఈ పరీక్షలకు 8,58,273 మంది హాజరుకానున్నారు. ఏపీ నుంచి 45 వేల మంది వరకూ పరీక్షలు రాయనున్నట్టు అంచనా.

పరీక్షల సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలు- సూచనలు

  • పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు అందుబాటులో శానిటైజర్లు
  • నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు.
  • అడ్మిట్‌కార్డులోని బార్‌కోడ్ రీడర్‌లను ప్రవేశద్వారాల వద్ద ఉంచుతారు. రీడ్ చేసిన వెంటనే అభ్యర్థుల ల్యాబ్ నంబర్‌ను తెలియచేస్తుంది.
  • గుంపులుగా కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి.
  • అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ ఇస్తారు. అప్పటి వరకూ ధరించిన మాస్క్‌ను తీసేసి కొత్త మాస్క్ ధరించాలి.
  • శారీరక ఉష్ణోగ్రతలను థర్మోగన్స్ ద్వారా పరీక్షించాక లోపలికి అనుమతిస్తారు.
  • పరీక్ష పూర్తయ్యాక ఇన్విజిలేటర్ చెప్పే వరకూ సీటు నుంచి లేవరాదు.
  • అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి.
  • ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్‌కార్డులోని కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ (అండర్‌టేకింగ్)లో వివరాలు నమోదు చేయాలి.
  • దానిపై ఫొటో అంటించి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలిముద్ర కూడా వేయాలి.
  • బీఆర్క్ అభ్యర్థులు డ్రాయింగ్ టెస్ట్ కోసం జామెంట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్ లేదా క్రేయాన్స్ తెచ్చుకోవాలి.
  • డ్రాయింగ్ షీట్లో నీటి రంగు వినియోగానికి అభ్యర్థులకు అనుమతి లేదు.
  • ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా వ్యక్తిగత వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
  • అటెండెన్స్ షీటులో అతికించేందుకు అదనపు పాస్‌పోర్టు ఫొటో తేవాలి.
  • ప్రతి షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు సీటింగ్ ఏరియా కీబోర్డ్, మౌస్, వెబ్‌క్యామ్, డెస్క్, కుర్చీ, మానిటర్ని పూర్తిగా శుభ్రపరుస్తారు.
  • ఇందుకోసం అభ్యర్థులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు.
  • రఫ్ వర్క్ కోసం ప్రతి సీటు వద్ద ఏ4 సైజ్ తెల్లకాగితాలు ఐదు అందుబాటులో ఉంటాయి. కావాల్సి వస్తే అదనంగా ఇస్తారు.
  • అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను వాటి పైభాగంలో రాయాలి. పరీక్ష గది నుంచి బయటకు వెళ్లేముందు నిర్ణీత డ్రాప్ బాక్స్‌లో వాటిని వేయాలి
  • సరిగా నింపిన అడ్మిట్ కార్డును కూడా డ్రాప్ బాక్స్‌లో వేయాలి.
Published date : 24 Aug 2020 02:10PM

Photo Stories